ఆస్తి మీది... బాధ్యత వారిది!

‘సొంతూరు హైదరాబాద్‌లోనే మంచి ఉద్యోగం రావడంతో చక్కటి ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడేమో విదేశానికి వెళ్లాల్సి వస్తోంది. అమ్మేద్దామంటే నష్టం వచ్చేట్లుంది. అద్దెకిద్దామంటే అవన్నీ దగ్గరుండి చూసుకోవడానికి ఎవరూలేరు.

Updated : 06 Nov 2022 12:38 IST

ఆస్తి మీది... బాధ్యత వారిది!

‘సొంతూరు హైదరాబాద్‌లోనే మంచి ఉద్యోగం రావడంతో చక్కటి ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడేమో విదేశానికి వెళ్లాల్సి వస్తోంది. అమ్మేద్దామంటే నష్టం వచ్చేట్లుంది. అద్దెకిద్దామంటే అవన్నీ దగ్గరుండి చూసుకోవడానికి ఎవరూలేరు. మరెలాగబ్బా’. ఇదే కాదు, ఇంటికి సంబంధించిన ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాయి కొన్ని ‘ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌’ సంస్థలు. ఒక్కమాటలో చెప్పాలంటే మనం లేనప్పుడు మన ఆస్తుల బాగోగులన్నీ చూసి పెడతాయన్నమాట!

పల్లెటూళ్లల్లోనైతే... అక్కడ మనం లేకపోయినా మన ఇళ్లూ పొలాలూ చూసుకోవడానికి చుట్టాలై ఉండక్కర్లేదు, తెలిసినవాళ్లైనా చూసిపెడతారు. కానీ నగరాల్లో, పట్టణాల్లో విషయం వేరు. అద్దెకు ‘టు లెట్‌’ బోర్డు పెట్టడం దగ్గర్నుంచి వాళ్లు దిగడం... బిల్ల్లులన్నీ కట్టడం... ఇంటి రిపేర్లు చేయించడం వరకూ అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. అదే ఇంటి స్థలం విషయంలో అయితే ఎవరూ ఆక్రమించకుండా ఇంకాస్త జాగ్రత్త పడుతూ కంచె వేసి, నెలకోసారైనా చూసి రావాల్సి ఉంటుంది. ఊళ్లోనే ఉండే వాళ్లకైతే పర్వాలేదు కానీ... ఉద్యోగమూ, వ్యాపారమూ అంటూ వేరే నగరానికో, ఇతర దేశానికో వెళ్లినవారి పరిస్థితి ఏంటి? వాటి బాగోగులు చూడ్డానికి సొంతవాళ్లు ఎవరూ లేకపోతే ఎలా? అలాంటివారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని కంపెనీలు ‘ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌’ అందిస్తున్నాయి. ‘సేఫ్‌కీ, హౌస్‌వైజ్‌, నోబ్రోకర్‌, నెస్ట్‌అవే...’ ఇలా ఎన్నో సంస్థలు ఆస్తుల నిర్వహణ సేవలు అందిస్తున్నాయి.

ఎలా పనిచేస్తాయంటే...

హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా... ఇలా దేశంలోని ప్రముఖ నగరాల్లో, పట్టణాల్లో సేవలందిస్తున్నాయి ఈ సంస్థలు. ఆస్తి ఏదైనా సరే... దాని పూర్తి బాధ్యత అవే తీసుకుంటాయి. నేరుగానైనా లేదంటే ఆన్‌లైన్లోనైనా మాట్లాడి మన ఇంటి వివరాలన్నీ ఇస్తే చాలు. ఇంటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ని నియమిస్తారు. ఆ వ్యక్తి... మన ఇంటిని అద్దెకివ్వడం మొదలు ఆ అద్దెకు దిగేవాళ్ల పూర్తి వివరాలన్నింటినీ పరిశీలించడం... ప్రతినెలా అద్దెల్ని వసూలు చేయడం... ఎప్పటికప్పుడు ఇంటిని చూసి రావడం...  శుభ్రం చేయించడం... రంగులు వేయడం... అవసరమైన మరమ్మతులు చేయడం... లాంటివన్నీ చూసుకుంటారు. అంతేకాదు... నెలనెలా అద్దె డబ్బులు అకౌంట్లోకి పంపడంతో పాటు మన ఇంటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా అందిస్తుంటారు. ఒకవేళ అద్దెకు దిగిన వాళ్లు అప్పటికప్పుడు ఖాళీ చేసినా... కొత్తవాళ్లను అద్దెకు తీసుకొచ్చే బాధ్యత కూడా వీళ్లదే. ఇంకా కావాలంటే ఇంటికి ఏదైనా మార్పులు అవసరమైనా నేరుగా మాట్లాడి చేయించుకోవచ్చు కూడా. ఇలా ఇళ్లతో పాటు ఖాళీ స్థలాలూ, దుకాణ సముదాయాల్లాంటి కమర్షియల్‌ భవంతుల మంచిచెడులూ చూసుకుంటారు. అందుకుగానూ ఒక్కో సంస్థవాళ్లు ఒక్కోలా 45 రోజుల నుంచి ఏడాది వరకూ ఒప్పందం చేసుకుంటారు. తమ సేవలకుగానూ ఆస్తి నిర్వహణను బట్టి నెలకు ఇంతని ఫీజుగా తీసుకుంటారు. ఆస్తుల నిర్వహణతోపాటూ వాటి అమ్మకాలూ చేసిపెడతారు. దగ్గరుండి ఆస్తులకు సంబంధించిన రకరకాల పనులు చేసి పెడుతూ, వాటి భద్రత బాధ్యత అంతా తీసుకుంటున్న ఈ సంస్థల సేవలు... ఒక ప్రాంతం నుంచి మరో నగరానికి వెళ్లిపోయినవారికీ, అద్దె ఇళ్ల బాధ్యతల్ని చూసుకోలేని పెద్ద వయసువాళ్లకీ, విదేశాల్లో స్థిరపడిపోయిన వారికీ ఎంతో ఉపయోగపడతాయి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..