ఏ స్వీటైనా... ఇట్టే చేసేలా..!

మిఠాయిలు తినడానికి బాగానే ఉంటాయి కానీ చేయడమే కష్టం. అందుకే చాలామంది త్వరగా చేయొచ్చనే ఉద్దేశంతో గులాబ్‌జామ్‌లను ఎంచుకుంటారు. కానీ ఎప్పుడూ అవే అంటే.. తినడానికే కాదు, చేయడానికీ విసుగే

Updated : 01 May 2022 06:16 IST

ఏ స్వీటైనా... ఇట్టే చేసేలా..!

మిఠాయిలు తినడానికి బాగానే ఉంటాయి కానీ చేయడమే కష్టం. అందుకే చాలామంది త్వరగా చేయొచ్చనే ఉద్దేశంతో గులాబ్‌జామ్‌లను ఎంచుకుంటారు. కానీ ఎప్పుడూ అవే అంటే.. తినడానికే కాదు, చేయడానికీ విసుగే కాబట్టి ఈసారి రస్‌మలై, కలాకంద్‌, రకరకాల హల్వాలు ప్రయత్నిస్తే సరి.. గులాబ్‌జామ్‌ మాదిరి ఇప్పుడు అవి కూడా సులువుగా చేసుకునేలా రెడీమిక్స్‌ ప్యాక్‌లలో దొరికేస్తున్నాయి మరి.

‘నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం కానీ చేయడమే రాదు’... ‘ఇంట్లో ఏ పండుగో, ఎవరిదైనా పుట్టినరోజో ఉంటే చాలు... ఏం స్వీటు చేస్తున్నావని అడుగుతారు పిల్లలు. నాకేమో అంత టైం ఉండదు సరికదా స్వీట్లు చేయడం కూడా పెద్దగా రాదు. దాంతో ఎక్కువగా పాయసంతోనే సరిపెట్టేస్తా’ అని చెబుతుంటారు కొందరు. కారణం ఏదయినా నిజంగా స్వీట్ల తయారీ అనేది కాస్త పనే. పైగా చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ అంటూ బోలెడు వస్తువుల్నీ రెడీగా పెట్టుకోవాలి. కానీ ఆ ఇబ్బందులేవీ లేకుండా, పెద్దగా శ్రమపడకుండా... నచ్చిన స్వీట్‌ను చాలా తక్కువ సమయంలోనే ఇంట్లోనే చేసుకోవాలనుకునేవారి కోసమే ఇప్పుడు ఇన్‌స్టంట్‌ స్వీట్ల తయారీ ప్యాకెట్లను తీసుకొచ్చేశారు తయారీదారులు. నిజానికి పెద్దగా స్వీట్లు చేయడం రానివారు కూడా ఎక్కువగా గులాబ్‌జామ్‌ చేస్తుంటారు. ఎందుకంటే ఆ పిండిని పాలతో కలిపి ఉండలు చుట్టుకుని నూనెలో వేయించి తరువాత పాకంలో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు గులాబ్‌జామ్‌ల మాదిరి నోరూరించే రకరకాల స్వీట్లను తేలిగ్గా చేసుకునేలా రెడీమిక్స్‌ ప్యాక్‌ల రూపంలో మార్కెట్లో కొత్తగా విడుదల చేశారు. వాటిల్లో కలాకంద్‌, బాంబేహల్వా, రబడీ, హల్వా, మూంగ్‌దాల్‌హల్వా, రసగుల్లా, రస్‌మలై, క్యారెట్‌హల్వా వంటివెన్నో ఉన్నాయి. ఇన్‌స్టంట్‌ ఖీర్‌ ఇప్పటికే మార్కెట్లో ఉంది. ఇప్పుడు దాని పక్కన మిగిలినవి చేరాయి. పైగా వీటి తయారీ కూడా తేలికే. ఉదాహరణకు మూంగ్‌దాల్‌ హల్వా తీసుకుంటే... పెసరపప్పును నానబెట్టుకుని తరువాత మెత్తగా చేసుకుని దానికి చక్కెర, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌, యాలకులపొడి వంటివెన్నో కలపాలి. దానికి బదులుగా ఇన్‌స్టంట్‌ మూంగ్‌దాల్‌ హల్వా ఎంచుకోవచ్చు. ఈ ప్యాక్‌లో పెసరపప్పు పొడి, చక్కెర, యాలకులపొడి, నెయ్యి కలిపిన మిశ్రమం వస్తుంది. ప్యాక్‌పైన రాసినట్లుగా ఆ పిండిని పాలతో కలిపి పొయ్యిమీద పెట్టాలి. ఇది దగ్గరకు అవుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి, డ్రైఫ్రూట్స్‌ వేసుకుంటే సరిపోతుంది. కలాకంద్‌ కూడా అంతే... మామూలుగా అయితే చిక్కని పాలను పొయ్యిమీద పెట్టి మరిగించి, వాటిని విరగ్గొట్టి... పనీర్‌ను వేరుచేసి మళ్లీపొయ్యిమీద పెట్టి ఇతర పదార్థాలు వేసుకుని దగ్గరకు అయ్యేవరకూ కలుపుతూ ఉండాలి. కానీ ఇన్‌స్టంట్‌ కలాకంద్‌ తయారీలో అంత శ్రమ ఉండదు. నీళ్లూ లేదా పాలల్లో ఆ పొడిని కలిపి స్టౌమీద పెట్టి కలిపి చివరకు కొద్దిగా నెయ్యివేస్తే చాలు. మిగిలిన ఇన్‌స్టంట్‌ప్యాకెట్ల తయారీ కూడా ఇంచుమించు కలాకంద్‌, మూంగ్‌దాల్‌ హల్వాలానే ఉంటుంది. అయితే.. జిలేబీ, మోతీచూర్‌ లడ్డూ వంటివాటికి మాత్రం అదనంగా పాకం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా వస్తున్న ప్యాకెట్ల రుచి కూడా దాదాపుగా మిఠాయి దుకాణాల్లో దొరికే స్వీట్లలానే ఉంటుంది కాబట్టి... నచ్చిన ప్యాకెట్‌ను ఎలాంటి సందేహం లేకుండానే ఎంచుకోవచ్చు. అదండీ సంగతి... ఈసారి పండుగ వచ్చినప్పుడూ లేదా ఇంట్లో ఏదయినా విశేషం ఉన్నప్పుడూ పాయసమో, పరమాన్నమో చేసి ఊరుకోకుండా తక్కువ సమయంలోనే వీటిని వండి ఇంటికి వచ్చే అతిథులకూ రుచి చూపించేందుకు ప్రయత్నించండి మరి.


భళారే... మల్బరీ పండు..!

మల్బరీ... పేరు వినగానే పట్టుపురుగుల పెంపకం గుర్తొస్తుంది. ఈ చెట్ల ఆకుల్ని తినే అవి గూళ్లను అల్లుకుంటాయి. వాటినుంచే పట్టుదారాల్ని తీస్తుంటారు. అయితే మల్బరీ చెట్లకు రుచికరమైన పండ్లూ ఉంటాయి. అవి అద్భుతమైన పోషకనిల్వలు అన్న అవగాహన లేక వాటిని ఎవరూ పట్టించుకోరు. కానీ మల్బరీ పండ్లు క్యాన్సర్‌ నిరోధకాలు అని తేలడంతో ఇప్పుడు ఈ చెట్లను అచ్చంగా పండ్లకోసమే పెంచుతున్నారు.

బెర్రీలు ఆరోగ్యానికి మేలుచేస్తాయనీ ముఖ్యంగా క్యాన్సర్లను అడ్డుకుంటాయనీ చెబుతుంటారు. మనదగ్గర బెర్రీ అంటే సీజన్‌లో వచ్చే స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, నేరేడు మాత్రమే గుర్తొస్తాయి. కానీ బెర్రీల్లో చాలానే రకాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాలు మనదగ్గర పెరగకపోవచ్చు, కానీ మల్బరీ మాత్రం చక్కగా పెరుగుతుంది. అయితే ఆ పండ్ల గురించి సరైన అవగాహన లేక వాటిని పెద్దగా పట్టించుకోలేదు. హిమాలయాల్లో పండే గోజి బెర్రీల్లో ఎన్ని రకాల ఔషధ గుణాలున్నాయో వీటిల్లోనూ దాదాపుగా అన్ని పోషక విలువలూ ఉంటాయి. ముఖ్యంగా మల్బరీ పండ్లలో ఐరన్‌ పుష్కలం. కాబట్టి రక్తహీనతతో బాధపడేవాళ్లకు ఇది మంచి ఔషధం. పైగా ఈ చెట్లు వేగంగా పెరుగుతాయి. బాల్కనీ కుండీల్లోనూ మిద్దె తోటలమీదా పెంచుకోవచ్చు. కాస్త పులుపుతో కూడిన తియ్యని రుచితో ఉండే ఈ పండ్లను నేరుగానూ లేదా ఎండుపండ్లుగానూ తినొచ్చు. వీటితో పండ్లరసాలూ జామ్‌లూ చేస్తుంటారు. 

ఈ పండ్లను మరిగించి టీ రూపంలోనూ తాగుతారు. పెరుగులో వేసుకునీ స్మూతీల రూపంలోనూ తింటుంటారు. అలాగే ఐస్‌క్రీమ్స్‌ తయారీలోనూ వాడుతున్నారు.

ఎన్ని లాభాలో..! 

మోరస్‌ జాతికి చెందిన మల్బరీలో చాలానే రకాలున్నాయి. మల్బరీని తెలుగులో కంబాలి పండు అంటారు. కాయలు పక్వానికి వచ్చే రంగునిబట్టి తెలుపూ, ఎరుపూ నలుపూ, నీలం, ఊదా... ఇలా అనేక రకాలు. మనదగ్గర ఎక్కువగా నలుపూ తెలుపూ రకాలే పండుతాయి.

ఇవికాకుండా నలుపూ తెలుపూ రంగుల్లో పొడవాటి కాయల్ని కాసే మోరస్‌ సెటైవా అనే మరో రకం ఉంది. అది హిమాలయ సానువుల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. తెల్లని పండ్లను కాసే చెట్లని ఎక్కువగా పట్టుపురుగులకోసం పెంచుతారు. అయితే ఆ పండ్లనూ తినొచ్చు. ఆకుల్ని పశువుల దాణాగానూ వాడుకోవచ్చు. అంతేకాదు, తెలుపురంగు మల్బరీ చెట్ల ఆకుల్నీ బెరడునీ వేళ్లనీ సంప్రదాయ వైద్యంలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు.

రకమేదయినా మల్బరీ పండ్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా క్యాన్సర్‌ కణాల పెరుగుదలని నియంత్రిస్తాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లూ ఫ్లేవనాయిడ్లూ ఆల్కలాయిడ్లూ ఫినాలిక్‌ ఆమ్లాలూ విటమిన్‌-సి... వంటి పోషకాలూ; మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, కాల్షియం, ఐరన్‌... వంటి ఖనిజాలూ విటమిన్‌-ఇ, కెలు కూడా లభిస్తాయి. ఈ పండ్ల సారాన్ని ఇంజెక్టు చేయడం ద్వారా ఎలుకల్లో రొమ్ముక్యాన్సర్‌ను నివారించినట్లు పరిశోధనల్లో తేలింది. వీటి ఔషధ గుణాలు రక్తంలో గ్లూకోజ్‌ నిల్వల్నీ కొలెస్ట్రాల్‌ నిల్వల్నీ తగ్గిస్తాయి. అందుకే ఇటీవల ఈ పండ్లు సప్లిమెంట్ల రూపంలోనూ దొరుకుతున్నాయి. ఈ ఆకుల్ని టీ రూపంలో ఇచ్చినప్పుడు కొలెస్ట్రాల్‌ తగ్గిందన్నది మరో పరిశోధన సారాంశం.

కమలా పండ్లతో పోలిస్తే మల్బరీ పండ్లలో విటమిన్‌-సి ఎక్కువ. అలాగే ప్రొటీన్‌ శాతం కూడా అధికమే. మల్బరీ పండ్లలో అధికంగా ఉండే ఫ్లేవనాయిడ్లు వయసుతోపాటు వచ్చే మెదడు, కంటి నరాల క్షీణతను నిరోధిస్తాయి. ఆల్జీమర్స్‌ని నిరోధించే అద్భుత మెడిసిన్‌ మల్బరీ అంటున్నారు పరిశోధకులు. ఇన్‌ఫ్లమేషన్‌తో బాధపడేవాళ్లకీ మల్బరీ పండ్లే మంచి ట్యాబ్లెట్లు. చిన్నవయసులోనే జుట్టు తెల్లబడుతున్నా చర్మం ముడుతలు పడుతున్నా మల్బరీ రసాన్ని తాగితే ఫలితం   ఉంటుంది. విటమిన్‌-ఎ, ఇ లోపంతో ఉన్నవాళ్లకి ఈ పండ్లను తినడంవల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గడమే కాదు, చర్మం మృదువుగా కాంతిమంతంగా మారుతుంది. కాబట్టి మల్బరీ అనగానే పట్టుపురుగులకి ఆహారంగా ఉపయోగపడే ఆకుల్నే కాదు, రుచికరమైన ఔషధఫలాల్నీ అందించే మహత్తరమైన చెట్టు అనీ; అంజీర్‌, గోజిబెర్రీలకన్నా సులభంగా పెంచుకోవచ్చనీ మర్చిపోకండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు