చిన్నారుల కోసం చిట్టిపొట్టి పందిరి!

కొత్తగా ఎన్ని రకాల మంచాలు వచ్చినా అవేవీ పందిరి మంచానికి సరిరావు. బెడ్‌రూమ్‌లో ఇతర ఫర్నిచర్‌ ఏమీ లేకున్నా అదొక్కటీ ఉంటే చాలు... పడకగదికి ఎక్కడలేని రాజసం వచ్చేస్తుంది.

Updated : 19 Oct 2022 12:10 IST

చిన్నారుల కోసం చిట్టిపొట్టి పందిరి!

కొత్తగా ఎన్ని రకాల మంచాలు వచ్చినా అవేవీ పందిరి మంచానికి సరిరావు. బెడ్‌రూమ్‌లో ఇతర ఫర్నిచర్‌ ఏమీ లేకున్నా అదొక్కటీ ఉంటే చాలు... పడకగదికి ఎక్కడలేని రాజసం వచ్చేస్తుంది. అందుకే ఆ మంచం అంటే అందరికీ అంత మక్కువ. ‘మరి ఆ మంచం పెద్దవాళ్లకేనా... మా సంగతేంటీ...’ అని వాళ్లు అడగకముందే చిన్నారులకోసం కూడా చిట్టిపొట్టి పందిరి మంచాల్ని తయారుచేసేస్తున్నారు ఉత్పత్తిదారులు.

ఇంట్లోకి బుజ్జాయి రాగానే పెద్దవాళ్లకి ఎంత సంబరమో... వాళ్లకి పెట్టే ఫుడ్డు నుంచి పడుకోబెట్టే బెడ్డు వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు అమ్మానాన్నలు. ఫెయిరీటేల్‌ కథల్లోని యువరాజూ యువరాణీల్లా ఊహించుకుంటూ వాళ్లకోసం అలాంటి దుస్తులూ యాక్సెసరీలూ కొంటుంటారు. మరి అవన్నీ కొన్నాక, మంచం మాత్రం సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుందీ... అందుకే పిల్లలకీ రాజసం ఉట్టిపడే పందిరి మంచాలు వస్తున్నాయిప్పుడు.

పెద్దవాళ్ల పందిరి మంచాల్లో మాదిరిగానే ఈ బుజ్జిగాళ్ల పందిరి మంచాల్లోనూ వెరైటీలు బోలెడు. కొన్నయితే మరీ ఎత్తులేకుండా ఏడాది రెండేళ్ల పిల్లలు కూడా ఎక్కేలానూ ఉంటున్నాయి. దాంతో వాళ్లు మంచంమీద నుంచి పడిపోతారన్న భయం ఉండదు. మరికొన్నింటిని ఇంటి పై కప్పుని పోలి ఉండేలానూ డిజైన్‌ చేస్తున్నారు. ఎలా చేసినా మంచం చుట్టూనూ, పై భాగాన్నీ కప్పేలా తెరలు ఉండటంతో పిల్లలకు ఆ మంచం తమదైన ప్రపంచంలా అనిపిస్తుంది. పైగా వాళ్లకి దాగుడుమూతల్లాంటి ఆటలంటే మహా ఇష్టం. అలా ఈ పందిరి మంచాలు వాళ్ల ఆటలకీ ఉపయోగపడతాయన్నమాట. ఐదారేళ్ల పిల్లలయితే తమదైన సృజనతో తమ మంచాల్ని తామే అందంగా రకరకాల పువ్వులూ పూసలతో అలంకరించుకుంటున్నారు. తేలికపాటి చెక్క, ప్లాస్టిక్కుతో తయారవుతున్న వీటిల్లో చాలావాటికి కింది భాగంలో అరలు వస్తున్నాయి. కొన్నింటికి ఒకటే అర ఉంటుంది. దాన్ని బయటకు లాగి మరో పరుపు వేసి ఇద్దరున్నప్పుడు బెడ్డులానూ వాడుకోవచ్చు. మంచాలకి లోపల బెడ్‌ల్యాంప్‌, పుస్తకాలు పెట్టుకునేందుకు వీలుగా చిన్నపాటి షెల్ఫులు తగిలించుకునే వెసులుబాటూ ఉంటుంది. అంతేనా... కొన్ని మంచాలు సైడ్‌, డ్రెస్సింగ్‌, రీడింగ్‌ టేబుల్‌... ఇతరత్రా ఫర్నిచర్‌తో కలిపి బెడ్‌రూమ్‌ సెట్‌గానూ ఉంటున్నాయి.

అయితే, కొత్తగా వస్తోన్న ఈ పందిరి మంచాలతోపాటు బుజ్జాయిలకోసం ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల బెడ్స్‌ ఉన్నాయి. బంక్‌ బెడ్డుల నుంచి ఎన్నో బొమ్మల రూపాల్లోనూ అవి కనువిందు చేస్తున్నాయి. అబ్బాయిలకోసం కార్లూ విమానాలూ రాకెట్లను పోలినవి వస్తే, అమ్మాయిలకోసం క్యారేజ్‌, డిస్నీ ప్రిన్సెస్‌, మిన్నీ మౌస్‌ తరహా మంచాలు చాలానే వచ్చాయి. అయితే అవన్నీ ఓపెన్‌గానే ఉండటంతో వాటికి దోమ తెరలు తగిలించడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఆ మంచాలకి పందిరీ రాడ్స్‌ అమర్చి మరీ వస్తున్నాయి. వద్దు అనుకున్నప్పుడు ఈ పందిరిని విడిగానూ తీసేయవచ్చు. సో, చిన్నారుల పడకగది ఎలా ఉండాలన్న ఛాయిస్‌ మీదే మరి..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..