Updated : 05 Sep 2021 05:03 IST

గుండెజబ్బులకి మంచినీళ్లు!

నీళ్లు ఎక్కువగా తాగేవాళ్లలో గుండె జబ్బులు, ఆకస్మిక మరణాలూ సంభవించవు అంటున్నారు యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ నిపుణులు. సాధారణంగా ఆడవాళ్లయితే రోజుకి 1.6 నుంచి 2.1 లీటర్లూ, మగవాళ్లయితే 2 నుంచి 3 లీటర్లూ తాగాలి. అయితే సీరమ్‌లోని సోడియం శాతాన్ని లెక్కించినప్పుడు- ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది కనీస పరిమాణంలో కూడా నీళ్లు తాగడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ నీళ్లు తాగేవాళ్లలో రక్తంలోని ప్లాస్మాలో సోడియం శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు.  ఏ రోజుకారోజు నీళ్లు తాగిన మోతాదుని బట్టి ప్లాస్మాలో సోడియం శాతం కూడా మారుతుందట. అయితే, దీర్ఘకాలికంగా తక్కువ నీళ్లు తాగేవారిలో సోడియం గాఢత పెరిగిపోయి గుండె పనితీరు దెబ్బతింటుందట. అంతేకాదు, మధ్య వయసులో సీరమ్‌లోని సోడియం శాతం, తాగే నీటిశాతం ఆధారంగా భవిష్యత్తులో గుండెపోటు వచ్చే ప్రమాదాన్నీ ఊహించవచ్చు అంటున్నారు నిపుణులు. తక్కువ నీళ్లు తాగేవాళ్లలో గుండెలోని ఎడమ జఠరిక గోడలు మందంగా మారుతున్నాయట. దీన్నే వెంట్రిక్యులర్‌ హైపర్‌ట్రోపీ అని పిలుస్తారు. ఇది గుండె మరణాలకు ప్రధాన సూచన అనీ, ఈ విషయమై 44-66 ఏళ్ల వయసులో ఉన్న 16 వేల మందిని ఎంపికచేసి వాళ్లను 70 నుంచి 90 వచ్చేవరకూ గమనిస్తూ వచ్చామనీ చెబుతున్నారు. ఊహించినట్లే ప్లాస్మాలో సోడియం శాతం ఎక్కువగా ఉన్నవాళ్లలో ఎడమ జఠరిక బాగం మందంగా మారడంతోపాటు గుండె మరణాలూ సంభవించాయట. దీన్నిబట్టి నీళ్లు తాగితే గుండెజబ్బుల బారిన పడకుండా ఉండొచ్చుఅని సూచిస్తున్నారు సదరు నిపుణులు.


ఒంటరిగా నిద్రపోతున్నారా?!

‘ఇంట్లో అందరూ ఊరికెళ్లారు, ఒక్కదాన్నే ఉండటంతో రాత్రంతా నిద్ర పట్టలేదు’ అనడం వింటుంటాం. అది నిజమేననీ ఒంటరితనం వల్ల నిద్ర సరిగ్గా పట్టదనీ రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం ఒకటీ రెండు రోజులని కాదు, ఒంటరిగా జీవించేవాళ్లు మిగిలినవాళ్లతో పోలిస్తే తక్కువగా నిద్రపోతున్నట్లు గుర్తించారు. దానివల్ల వాళ్లు ఎక్కువ తింటున్నట్లు తేలింది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, తమ సమాజానికి దూరంగా ఉన్న జంతువుల్లోనూ ఈ లక్షణాన్ని గమనించారు. ఇందుకోసం- డ్రోసోఫిలాకు చెందిన కీటకాన్ని మిగిలిన వాటి నుంచి వేరుచేసి విడిగా ఉంచి గమనించారట. వారం తరవాత మళ్లీ దాని మెదడుని స్కాన్‌ చేసి పరిశీలించినప్పుడు- నిద్రకీ, తిండికీ కారణమయ్యే నాడీకణాల అనుసంధానంలో మార్పులు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. కొవిడ్‌ కారణంగా ఐసొలేషన్‌లో ఉన్నవాళ్లలోనూ ఇదే రకమైన మార్పు కనిపించిందట. దీన్నిబట్టి ఒంటరితనం అనేది ఆహారం, నిద్ర అలవాట్లమీదా ప్రభావం కనబరుస్తుంది అంటున్నారు విశ్లేషకులు.


విరామం ఆనందమయం..!

సాధారణంగా వారాంతాల్లోగానీ సెలవుల్లోగానీ స్నేహితులతో కాలక్షేపం చేయడమో లేదా పుస్తకాలు చదువుకోవడమో సినిమాకెళ్లడమో టీవీ చూడడమో... ఇలా ఎవరికి నచ్చిన పని వాళ్లు చేస్తుంటారు. కానీ వాళ్లలో చాలామంది ఆ పనులు చేస్తూ కూడా తాము సమయాన్ని వృథా చేస్తున్నట్లుగా ఫీలవుతున్నారట. దాంతో వాళ్లు ఆ సెలవుని పూర్తిగా ఆనందించలేకపోతున్నారు అంటున్నారు రట్జెర్స్‌ బిజినెస్‌ స్కూల్‌కి చెందిన నిపుణులు. అయితే కొందరు మాత్రం సెలవుల్లోనూ తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని
నిర్మాణాత్మమైన పనులు చేసుకుంటున్నారు. అంటే- తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటూ తాము సమయాన్ని వృథా చేయడంలేదన్న భావనతో ఆనందంగా ఉంటున్నారట. మరికొందరు యోగా, మెడిటేషన్‌... వంటి వాటిని చేయడం ద్వారా తమ సెలవుని సద్వినియోగం చేసుకున్నామన్న ఫీలింగుతో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ వర్గాలను వదిలిపెడితే పార్టీకో, సినిమాకో వెళ్లినవాళ్లలో చాలామంది మాత్రం తమ విరామ సమయాన్ని వృథా చేస్తున్నట్లు భావించి ఆనందాన్ని మిస్సవుతున్నట్లు వాళ్ల అధ్యయనంలో తేలింది. కానీ సెలవురోజున ఎలా గడిపినా ఏ పనిచేసినా ఆనందంగా ఉండటమే ముఖ్యం. అంతేతప్ప అది వృథా అయిందని బాధపడకూడదు. ఎందుకంటే ఆనందాన్ని మించినది ఏదీ లేదు అంటున్నారు సదరు నిపుణులు.


ఇంట్లో ఫంగస్‌ చేరితే...

ర్షాకాలంలో గోడలు చెమ్మగిల్లడం సహజం. అయితే దాంతోపాటు నానుడు వర్షాల కారణంగా గది మూలల్లోనూ గాలి చొరని చీకటి ప్రదేశాల్లోనూ క్యాండిడా, ఆస్పరిజిల్లస్‌, మ్యూకర్‌... వంటి రకరకాల ఫంగస్‌ చేరుతుంది. ‘వాటివల్ల గోడలు పాడవు తున్నాయని బాధపడతారే తప్ప అది ఆరోగ్యంమీద తీవ్ర ప్రభావం కనబరుస్తుంది అన్నది గుర్తించరు’ అంటున్నారు ఆరోగ్యనిపుణులు. కేవలం గోడలనే కాదు, ఇది బూట్లూ తలుపులూ కిటికీలూ అన్నింటి మీదా చేరుతుంది. మెత్తని పొడిలా ఉండే ఈ ఫంగస్‌ల వల్ల ఆస్తమాతోపాటు ఇతరత్రా శ్వాసకోశ సంబంధ వ్యాధులూ తలెత్తుతాయి. దురద, చుండ్రు, చికాకు, రోగనిరోధకశక్తి తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఈ ఫంగస్‌ ప్రాణాలకే ప్రమాదంగానూ మారుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఫంగస్‌ ఎక్కడైనా కనిపిస్తే రసాయనాలతో అక్కడ శుభ్రం చేసి తడి రాకుండా చూసుకోవాలి. చేతులతో అస్సలు శుభ్రం చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు.


సిల్లీ పాయింట్‌

శరీరంలోకెల్లా సంక్లిష్ట నిర్మాణమైన మెదడులో అరవై శాతం కొవ్వులే.

* కాలిఫోర్నియాలోని లంకాస్టర్‌ హైవే మీద గంటకి 55 కి.మీ వేగంతో కారులో ప్రయాణిస్తే ‘విలియం టెల్‌ ఓవర్చ్‌ర్‌...’ అన్న ట్యూన్‌ వినిపిస్తుందట.

* ప్రపంచంలోనే ఖరీదైన లోహం ‘కాలిఫోర్నియం-252’. గ్రాము ధర 27మిలియన్‌ డాలర్లు(రూ.199 కోట్లు). అమెరికా, రష్యాల్లోని ల్యాబ్‌లలో తయారుచేసే ఈ రేడియో యాక్టివ్‌ లోహాన్ని పేలుడు పదార్థాలూ, ల్యాండ్‌ మైన్‌లను కనుగొనే పరికరాల్లో వాడతారు.

* మెదడులో ఎన్ని వందల కోట్ల నాడులు ఉంటాయో చెప్పడం కష్టం. ఇసుక రేణువు పరిమాణంలో ఉన్న మెదడు కణజాలంలో దాదాపు లక్ష న్యూరాన్లూ వాటిని అనుసంధానిస్తూ వంద కోట్ల పైచిలుకు నాడీతంతులూ ఉంటాయనేది ఓ అధ్యయనం.

* గడ్డ కట్టిన నీటిలో ఎక్కువ సమయం ఉండి బతికిన మనిషిగా స్వీడన్‌కి చెందిన అన్నా బాగెన్‌హామ్‌ పేరిట రికార్డు ఉంది. స్కీయింగ్‌చేస్తూ ఆమె ప్రమాదవశాత్తూ గడ్డకట్టిన సరస్సులో పడడంతో తలతో సహా సగం శరీరం ఐసులో కూరుకుపోయింది. సహాయ చర్యలు చేపట్టి బయటకు తీసేసరికి ఎనభై నిమిషాలు పట్టింది. వైద్యులు పరీక్షించి చనిపోయిందని తేల్చేశారు. కానీ మూడు గంటల తర్వాత ఆమె గుండె తిరిగి కొట్టుకోవడం మొదలు పెట్టిందట. ఆశ్చర్యపోయిన వైద్యులు బహుశా ఆమె శరీరం ఆ సమయంలో సుప్తావస్థలోకి చేరుకుని ఉంటుందని తేల్చారు.

* ఫ్రిజ్‌ ఎంత నిండుగా ఉంటే కరెంటు వినియోగం అంత తగ్గుతుందట. ఖాళీగా ఉంటే ఫ్రిజ్‌ డోర్‌ తీసిన ప్రతిసారీ అందులోకి వేడిగాలి ఎక్కువగా చొరబడి, చల్లబడటానికి ఎక్కువ కరెంటు తీసుకోవడమే ఇందుక్కారణం.

* సన్‌గ్లాసుల్ని మొదట చైనాలోని న్యాయనిర్ణేతల కోసం డిజైన్‌ చేశారట. కోర్టులో సాక్షుల్ని ప్రశ్నించేటప్పుడు జడ్జిలు తమ హావభావాలు కనిపించకుండా ఉండేందుకు వీటిని పెట్టుకునేవారు.

* సాలీడు గూడులోని దారాలకు యాంటీసెప్టిక్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయట. అందుకే, ప్రాచీన కాలంలో గ్రీసు, రోమ్‌లలో గాయాలకు ఇన్ఫెక్షన్‌ సోకకుండా సాలీడు దారాలతోనే బ్యాండేజ్‌లు తయారుచేసి, కట్టేవారట.

* స్వీడన్‌లో దాతల రక్తాన్ని ఎవరికైనా వినియోగించినప్పుడు సంబంధిత వివరాలను దాతలకు మెసేజ్‌ చేస్తారు. తాము ఇచ్చిన రక్తం సద్వినియోగం అవుతుందో లేదో తెలియక చాలామంది రక్తదానం చెయ్యడానికి వెనుకాడుతుండడంతో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారట.


మేఘం చూడ్డానికి తేలిగ్గా దూదిలా కనిపిస్తుంది. కానీ ఒక్కో మేఘం బరువూ సుమారు 5లక్షల కిలోలు ఉంటుంది.


ఆవుల అరుపుల్లోనూ యాస ఉంటుందట. ఒక్కో ప్రాంతానికి చెందిన ఆవు ఒక్కో యాసలో అరుస్తుందట.


రోజూ ఉదయాన్నే బ్రష్‌ మీద టూత్‌ పేస్టు వేసుకుంటాం కదా. దానికీ ఆంగ్లంలో ఓ పేరుంది... అదేమిటంటే ‘నడల్‌’.


అన్ని రకాల ఆహార పదార్థాల కన్నా బంగాళాదుంపల చిప్స్‌ వల్ల ఎక్కువ బరువు పెరుగుతారని హార్వర్డ్‌ నిపుణుల పరిశోధనలో తేలింది.


టూట్సీ పాప్స్‌ అనే లాలీపాప్‌ని 364 సార్లు చప్పరించవచ్చు అని లికింగ్‌ మెషీన్‌ ద్వారా లెక్కగట్టారు పర్‌డ్యూ యూనివర్సిటీ నిపుణులు.


అమెరికాలోని నెబ్రాస్కాలోని మొనొవి పట్టణంలో జనాభా ఎంతో తెలుసా... ఒకే ఒకరు. ఆమె పేరు.... ఎల్సీ ఎయిలర్‌. 87 ఏళ్ల వయసులో అక్కడ ఒంటరిగా జీవించడమే కాదు, ఆ పట్టణానికి మేయర్‌, లైబ్రేరియన్‌, బార్‌ అటెండర్‌గానూ విధులను నిర్వహిస్తోంది.


ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి సుమారు వంద కోట్ల మెట్రిక్‌ టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి లెక్కగట్టింది.


ఒకప్పటితో పోలిస్తే కవలల పుట్టుక పెరిగింది. 80లలో వెయ్యి డెలివరీలకి 9-12 మంది కవలలు పుడితే, ఇప్పుడు ఆ సంఖ్య 24కి పెరిగిందట.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని