బోర్డు మీద ప్రింటు దించేస్తాడు!
సైన్సు టీచర్లు బ్లాక్ బోర్డు మీద బొమ్మలు గీస్తూ పాఠాలు బోధించడం తెలిసిందే. అయితే, పాఠ్య పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా బోర్డు మీద చాక్‌పీస్‌తో గీసే టీచర్ని మాత్రం ఎక్కడా చూసి ఉండరు. తైవాన్‌లోని షూడ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అధ్యాపకుడిగా చేస్తున్న జాంగ్ క్వాన్‌బిన్ మాత్రం ఎంతో క్లిష్టమైన అనాటమీ బొమ్మల్ని కూడా నిమిషాల్లో బోర్డు మీద గీసేస్తాడు. ‘మెడికల్ విద్యార్థులకు మానవ శరీర నిర్మాణం గురించి పూర్తి అవగాహన అవసరం. అవయవాల్లోని చిన్న చిన్న భాగాలను కూడా గుర్తించగలగాలి. అందుకే, ఇలా వాళ్లకు ఆ బొమ్మల్ని వెయ్యడం కూడా రావాలి...’ అంటాడు జాంగ్. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... జాంగ్కి మొదట మెడిసిన్ మీద పెద్దగా ఆసక్తి లేదట. కానీ అతడు చేత్తో గీసిన అస్థిపంజరాల డ్రాయింగ్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ మెడికల్ కాలేజీ వాళ్లు పిలిచి, విద్యార్థులకు మానవ నిర్మాణం గురించిన డ్రాయింగ్లు నేర్పించమని ఉద్యోగం ఇచ్చారట. ఆ తర్వాత అనాటమీ గురించి చదివి, షూడ్ యూనివర్సిటీలో పాఠాలను బోధిస్తున్నాడు. అతడి ప్రతిభను గుర్తించి ప్రస్తుతం తైవాన్‌తో పాటు చైనా, జపాన్లలోని వివిధ మెడికల్ కాలేజీలు తమ విద్యార్థులకూ తరగతులు నిర్వహించమని ఆహ్వానిస్తున్నాయట.
ఏం ఆలోచన గురూ..!
అరటి పండ్లు పండాక ఎక్కువ రోజులు ఉండవు. అలా అని మనం అన్నిటినీ ఒకేసారి తినలేం. పోనీ పచ్చివాటిని తీసుకుందామా అంటే... పండే వరకూ తినడానికి ఉండదు. ఆ తర్వాత అవి కూడా ఒకేసారి పండిపోతాయి. మనసుంటే మార్గం ఉంటుంది... అన్నట్లూ దక్షిణ కొరియా వ్యాపారులు ఈ సమస్యకు కనిపెట్టిన పరిష్కారమే ‘వన్ ఏ డే’ ప్యాకింగ్. వీటిలో అరడజను అరటిపండ్లు ఉంటే అందులో రెండు పూర్తిగా పండినవీ మరో రెండు కొంచెం పండినవీ ఇంకో రెండు పచ్చివీ ఉంటాయి. కాబట్టి, అరటి పండ్లు పాడైపోతాయనే బాధ ఉండదన్నమాట. మంచి ఆలోచన కదూ..!
కరోనా తెచ్చిన అదృష్టం!
కరోనా ఎంతో మంది జీవితాల్లో చీకట్లు నింపింది. కానీ అమెరికాకు చెందిన క్రిస్టీన్ డువల్ జీవితంలోకి మాత్రం కొత్త వెలుగుల్ని తెచ్చింది. ఆమె కొవిడ్ టీకా తీసుకున్నందుకు రూ.14 కోట్ల డబ్బుని గెలుచుకుంది మరి. కరోనా బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి. అయినా కొందరు దాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఉత్సాహం నింపి వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించేందుకు అమెరికాలోని మిషిగన్‌లో గత జులై ఒకటి నుంచి ముప్ఫై వరకూ ఓ పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా లక్కీడ్రాలో ఎంపికైన వ్యక్తికి రెండు మిలియన్ డాలర్ల(రూ.14కోట్లు)ను కానుకగా ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ మొత్తాన్నీ క్రిస్టీన్ గెలుచుకుంది. ‘ఈ వ్యాక్సిన్ మా కుటుంబం మొత్తం కలల్ని తీర్చింది’ అంటూ క్రిస్టీన్ తెగ సంబరపడిపోతోందట. అదృష్టం అంటే ఇదేనేమో..!
ఎండకు... తెర!
ప్రస్తుతం స్పెయిన్‌లో వేసవి కాలం నడుస్తోంది. గత ఏడాది కూడా వేసవిలో అక్కడ ఎండలు మండిపోయాయట. దాంతో అక్కడి ‘అల్హారిన్ డె లా టొరె’ పట్టణంలో ఉండే ఎవా పచెకొ అనే ఆమె ఈసారి వేసవి రాకముందే ఓ ఆలోచనతో స్థానిక మహిళలను ఏకం చేసింది. అలా ఎవాతో సహా ఎనిమిది మంది క్రోషె నిపుణులైన మహిళలు కలసి కొన్ని నెలల పాటు కష్టపడి ఊలుతో చూడచక్కని దుప్పట్లను అల్లారు. వేసవి రాగానే వాటిని అయిదువందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దుకాణాలూ రద్దీ ఎక్కువగా ఉండే వీధుల్లో టెంటుల్లా కట్టారు. అదే ఇక్కడ కనిపిస్తున్న చిత్రం. దీనివల్ల అటు ఎండ తగలకపోవడమే కాదు, ఇటు వీధులూ అందంగా మారి పర్యటకుల్ని ఆకట్టుకుంటున్నాయట. పైగా స్థానిక సంప్రదాయ అల్లికలకూ మంచి ప్రచారం లభిస్తోంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్