‘నా పేరు కొవిడ్‌ కాదు కోవిద్‌’

కొవిడ్‌ పేరు వింటేనే ప్రపంచమంతా వణికిపోతోంది. అలాంటిది ఓ వ్యక్తి పేరే అదయితే! నిత్యజీవితంలో ఆ పేరు పెట్టుకున్న వారికి ఎదురయ్యే అనుభవాలూ కష్టాలూ అన్నీఇన్నీ కావు. బెంగళూరుకు చెందిన ఓ ట్రావెల్‌ స్టార్టప్‌ సహవ్యవస్థాపకుడి పేరు కోవిద్‌ కపూర్‌.

Published : 30 Jan 2022 00:35 IST

‘నా పేరు కొవిడ్‌ కాదు కోవిద్‌’

కొవిడ్‌ పేరు వింటేనే ప్రపంచమంతా వణికిపోతోంది. అలాంటిది ఓ వ్యక్తి పేరే అదయితే! నిత్యజీవితంలో ఆ పేరు పెట్టుకున్న వారికి ఎదురయ్యే అనుభవాలూ కష్టాలూ అన్నీఇన్నీ కావు. బెంగళూరుకు చెందిన ఓ ట్రావెల్‌ స్టార్టప్‌ సహవ్యవస్థాపకుడి పేరు కోవిద్‌ కపూర్‌. రెండేళ్ల క్రితం కరోనా వెలుగులోకి వచ్చాక... శాస్త్రీయంగా దాని పేరును కొవిడ్‌ అని పెట్టాకా... ఆ యువకుడి కష్టాలు మొదలయ్యాయి. ఎంతలా అంటే... ట్విటర్‌ ఖాతా ప్రొఫైల్‌లో ‘నా పేరు కోవిద్‌... కానీ, నేను వైరస్‌ను కాదు’ అని మార్చుకునేంతగా. విమాన ప్రయాణాల్లో తన పేరు విని అందరూ జోకులు వేసుకుంటున్నారని... పుట్టినరోజు కేక్‌పైనా, కోవిద్‌ (kovid) అని చెబితే బేకరీ సిబ్బంది కొవిడ్‌ (covid) అని రాశారనీ నెటిజన్లతో తన అనుభవాలను పంచుకున్నాడు. హనుమాన్‌ చాలీసా ప్రకారం కోవిద్‌ అంటే పండితుడు, ప్రావీణ్యం కలిగిన వ్యక్తి అనే అర్థాలున్నాయని చెబుతున్నాడీ కొవిడ్‌ కాదు కాదు కోవిద్‌ కపూర్‌. అతడి పేరుపై మీమ్స్‌, ట్రోల్స్‌ వెల్లువెత్తుతుండటంతో  చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయాడు!


కవర్లూ కాసులు కురిపిస్తున్నాయి!

విత్వానికి కాదేదీ అనర్హం అని అంటుంటారు. సేకరణకూ కాదేదీ అనర్హం అంటారు... ఇది చదివాక. యూకేకు చెందిన ఏంజెలా క్లార్క్‌ 46 ఏళ్లుగా ప్లాస్టిక్‌ కవర్లను సేకరిస్తోంది. ఇప్పటివరకూ ఆమె దగ్గర పది వేలకుపైగా కవర్లు ఉన్నాయట. ఈ హాబీ ఎలా మొదలైందంటే - ఏంజెలాకు 11 ఏళ్ల వయసున్నప్పుడు బ్రిటిష్‌ రాణి సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు వెళ్లిందట. ఆ సమయంలో అందరూ జాతీయ జెండాతోపాటు రాణి ఫొటోలున్న కవర్లతో తమ ఇళ్లను అలంకరించుకోవడం చూసింది. తనకూ అలా చేయాలనిపించి అమ్మను అడగడంతో సరేనంది. ఇంటి కిటికీలనూ గోడలనూ కవర్లతో ముస్తాబు చేసింది. అలా కవర్లను సేకరించడం ఆమెకు హాబీగా మారింది. వాటిలో కొన్ని అరుదైనవీ ఉండటంతో వాటిని తమకిస్తే ఒక్కోదానికి రూ.20 వేలకుపైగా చెల్లిస్తామని వేలం వేసే సంస్థలు ఇప్పుడు ఆమెను అడుగుతున్నాయట. కవర్లూ కాసులు కురిపిస్తాయని ఆమె కూడా ఊహించలేదేమో!


పిల్లి విశ్వాసం

సాధారణంగా కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటారు. ఇది చదివితే పిల్లులూ ఇంతగా ప్రేమిస్తాయా అని ఆశ్చర్యపోతారు. సెర్బియాకు చెందిన మామర్‌ జుకొర్లీ అనే వ్యక్తి దగ్గర ఓ పిల్లి ఉండేది. దాన్ని ఎంతో ప్రేమగా పెంచుకునేవాడు. గత ఏడాది నవంబర్‌లో జుకొర్లీ చనిపోయాడు. అతడి అంత్యక్రియలన్నీ ముగిసిన తర్వాత బంధువులంతా ఇంటికి వెళ్లినా, పిల్లి మాత్రం సమాధి దగ్గరే ఉండిపోయింది. తరువాత అదే వస్తుందిలే అనుకొని వాళ్లూ పట్టించుకోలేదు. రెండు నెలలవుతున్నా పిల్లి ఇంటికి రాకపోవడంతో బంధువుల్లో ఒకరు వెళ్లి చూసి షాకయ్యారు. విపరీతమైన మంచు కురుస్తున్నా... ఆ పిల్లి ఇంకా యజమాని సమాధి వద్దే ఉండటం చూసి నోట మాట రాలేదు. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్టు చేయడంతో యజమానిపైన పెంపుడు పిల్లి ప్రేమకూ విశ్వాసానికీ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


బొమ్మను మనిషనుకున్నారు!

ది బర్మింగ్‌హమ్‌ హైవే. నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిని ఆనుకొని ఉన్న రెస్టరంట్‌కి వచ్చివెళ్లేవారంతా అక్కడ ఒక టేబుల్‌ వద్ద చిన్నపాపతో సహా కూర్చున్న మహిళ గురించి ఆరా తీస్తుండేవారు. దానికి ఆ రెస్టరంట్‌ యజమాని ఆమె క్యాబ్‌ కోసం ఎదురుచూస్తోందనీ, అనాథ అనీ - రకరకాలుగా చెప్పేవాడు. అది విని జాలిపడిన వాళ్లు ఆమెకు ఎంతోకొంత ఆర్థిక సాయం చేసేవారు. ఆ మార్గంలో రాత్రివేళల్లో ప్రయాణించేవారు మాత్రం ఆమెను చూసి దెయ్యమనుకొని భయపడేవారు. అలా పదేళ్లు గడిచాయి. తాజాగా ఆ మహిళ గురించి స్థానిక మీడియాలో రావడంతో... అక్కడి అధికారులు వెళ్లి రెస్టరంట్‌ యజమానితో మాట్లాడారు. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. అదేంటంటే - ఆ మహిళ అసలు మనిషే కాదట.. హోటల్‌ యజమాని ఓ ఎగ్జిబిషన్‌ నుంచి తీసుకొచ్చిన బొమ్మట. అంటే, పదేళ్ల పాటు ఒక బొమ్మని మనిషిగా నమ్మించాడన్న మాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..