Published : 24 Oct 2021 00:20 IST

కుక్కలకూ ఉందో పండుగ!

కొన్ని వేల ఏళ్లుగా మనిషితోపాటూ జీవించే కుక్కల్ని విశ్వాసానికి గుర్తుగా చెబుతుంటాం. అందుకే వాటి ఆ నమ్మకానికి కృతజ్ఞత చెబుతూ ‘కుకుర్‌ తిహార్‌’ పేరుతో నేపాల్లో ఏటా పండుగ జరుపుతారు. దీపావళి మరుసటి రోజు జరిగే ఈ పర్వదినాన ప్రతి ఇంట్లోనూ శునకాల కోసం ప్రత్యేకమైన వంటలు చేస్తారు. గుడ్లూ, పాలూ, మాంసం లాంటి వాటితో వాటికి విందు భోజనం తయారుచేస్తారు. ఇంట్లో, వీధుల్లో ఉండే కుక్కల్ని ఓ దగ్గరకు చేర్చి పొద్దుపొద్దున్నే స్నానం చేయించి పూలదండలతో అలంకరిస్తారు. చిన్నాపెద్దా అందరూ కలిసి వాటికి పూజ చేస్తూ చేసిన వంటల్ని తినిపిస్తారు. పురాణాల్లోనూ భైరవుడి వాహనంగా పిలిచే కుక్కల్ని ఈరోజు ఎంతో పవిత్రంగా చూడాలని నమ్ముతారట.


ఎవరి డబ్బాలు వారివే!

కేరళలోని కొలెన్‌చేరిలో ‘7 టూ 9 గ్రీన్‌స్టోర్‌’ అనే ఓ సూపర్‌ మార్కెట్‌ ఉంది. అందులోకి వెళ్లే కస్టమర్లు చాలావరకూ రకరకాల డబ్బాల్ని తీసుకుని వెళ్తారు. వాళ్లకు కావాల్సిన బియ్యమో, నూనెనో, పప్పులో... ఇలా ఏ సరకులు కొన్నా వాటిని సొంత డబ్బాల్లో ప్యాక్‌ చేయించుకుని ఇంటికి తీసుకెళ్తుంటారు. ఎందుకంటే... ఆ దుకాణంలో ప్లాస్టిక్‌కవర్ల ప్యాకింగ్‌ వస్తువులు దొరకవు మరి. స్థానికంగా ఉండే బిట్టూజాన్‌ ‘సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ కవర్ల ప్యాకింగ్‌ వల్ల చాలా నష్టం జరుగుతోంది ఎలాగైనా దీనికి పరిష్కారం చూడాలి’ అన్న ఆలోచనతో 2018లో తన తండ్రి నడిపే సూపర్‌మార్కెట్‌ని పూర్తిగా మార్చేశాడు. సరకులన్నింటినీ ప్రత్యేకమైన కంటెయినర్లలో ఉంచి వినియోగదారులు వాటిని డబ్బాల్లో తీసుకెళ్లేలా ఏర్పాటు చేశాడు. అలా సొంత డబ్బాలతో వచ్చినవారికి డిస్కౌంట్లూ ఉంటాయి. ఒకవేళ సొంత డబ్బాలు తెచ్చుకోకపోతే గాజు డబ్బాలూ, కాగితం కవర్లూ ఇస్తుంటారు. ‘ఈ సరికొత్త ప్రయోగంతో మా షాపు ద్వారా రోజుకి దాదాపు 1500 ప్లాస్టిక్‌ కవర్ల వాడకం తగ్గింది’ అంటూ ఆనందంగా చెబుతాడు జాన్‌.


ఉచితంగానే ఉండండి!

‘మీకు నచ్చినంత పే చేయండి. లేదంటే ఉచితంగానే ఉండండి’... ఇదేంటో తెలుసా... ఈమధ్య ముంబయిలోని విఖ్రొలీలో కొత్తగా ప్రారంభమైన ‘ఐబీఐఎస్‌’ అనే ఓ హోటల్‌ ఇచ్చిన సరికొత్త ఆఫర్‌. వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి వస్తున్న ప్రకటనల్లో ఇదో రకం అనుకోవచ్చు. ముందుగా బుక్‌ చేసుకున్నవాళ్లకు ఈ నెల అక్టోబర్‌ 15 నుంచి 25వరకు ఎవరైనా సరే ఒకరోజు ఉచితంగా ఉండే అవకాశం కల్పించిందీ హోటల్‌. పదిహేను అంతస్తుల్లో 249 గదులతో నిర్మించిన ఈ హోటల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో రివ్యూ తీసుకోవడానికే యాజమాన్యం ఈ వినూత్న ఆలోచన చేసిందట.


ఇది విద్యార్థుల రైల్వేస్టేషన్‌!

ఎక్కడైనా సరే, రైల్వేస్టేషన్‌కి పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకుని వెళ్లే ప్రయాణికుల్ని చూస్తుంటాం. కానీ బిహార్‌లోని సాసారామ్‌ అనే రైల్వేజంక్షన్లో మాత్రం పుస్తకాలతో బయలుదేరే విద్యార్థులు కనిపిస్తుంటారు. రోజూ పొద్దునా, సాయంత్రమూ రెండు గంటలపాటు వాళ్లంతా ఆ రైల్వే ప్లాట్‌ఫామ్స్‌ మీద పుస్తకాలు ముందరేసుకుని చదువులో మునిగిపోయుంటారు. ఒక్కో దగ్గరైతే కోచింగ్‌ సెంటర్‌ని తలపించేలా గుమిగూడిన విద్యార్థుల్నీ, టీచర్నీ చూడొచ్చు. ‘అసలు రైల్వేస్టేషన్‌కి విద్యార్థులు రావడం ఏంటీ’ అంటారా... ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు చాలా ఎక్కువట. అందుకే 2002లో కొంతమంది విద్యార్థులు ఈ స్టేషన్‌కి వచ్చి చదువుకోవడం మొదలుపెట్టారు. అది చూసి మరికొందరు రావడంతో ఇప్పుడు ఆ సంఖ్య వందల్లోకి పెరిగిపోయింది. సివిల్‌ సర్వీసెస్‌, బ్యాంక్‌ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థులూ వస్తుంటారు. విద్యుత్తు సౌకర్యంతోపాటూ సీనియర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉండటంతో ఇప్పుడు ఈ జంక్షనే ‘కోచింగ్‌ హబ్‌’గా మారిపోయింది. పట్టువదలకుండా చదువుకుంటున్న ఈ స్టూడెంట్స్‌ శ్రద్ధ చూసి వీళ్లందరికీ ప్లాట్‌ఫామ్స్‌ మీదకు రావడానికి ఈ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రత్యేకమైన పాసులూ ఇచ్చారట.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని