చర్మంలో కలిసిపోయే బ్యాండ్‌!

చర్మం పైన చిన్న గాయమైనా, తెగినా బ్యాండేజ్‌ వేస్తుంటాం.  అయితే పొరపాటున నీళ్లు తగిలితే దానికున్న జిగురుపోయి ఊడిపోతుంది. దాంతోపాటు క్రిములు కూడా గాయంలోపలికి వెళ్లిపోయి సమస్యని రెట్టింపు చేస్తాయి. ఇలాంటి సమస్యలకి

Updated : 24 Apr 2022 01:46 IST

చర్మంలో కలిసిపోయే బ్యాండ్‌!

ర్మం పైన చిన్న గాయమైనా, తెగినా బ్యాండేజ్‌ వేస్తుంటాం.  అయితే పొరపాటున నీళ్లు తగిలితే దానికున్న జిగురుపోయి ఊడిపోతుంది. దాంతోపాటు క్రిములు కూడా గాయంలోపలికి వెళ్లిపోయి సమస్యని రెట్టింపు చేస్తాయి. ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా అందుబాటులోకి వచ్చింది లిక్విడ్‌ బ్యాండేజ్‌. కాలిన చోటో, గాయంపైనో ఈ లిక్విడ్‌ని నెయిల్‌పాలిష్‌ మాదిరి వేస్తే కాసేపటికి ఆరిపోయి అట్టకట్టినట్టు అవుతుంది. అది చూడ్డానికి మైనం పొరలా కనిపిస్తుంది. నీళ్లు తగిలినా కూడా కరిగిపోని ఈ యాంటీసెప్టిక్‌ లిక్విడ్‌... వేసిన ఏడెనిమిది గంటల తరవాత గాయంలోకి చొచ్చుకుపోయి దాన్ని త్వరగా నయం చేస్తుంది. క్రిముల్నీ లోపలకి వెళ్లకుండా చూస్తుంది. దీన్ని రోజుకి రెండు సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల బ్రాండ్‌ పేర్లతో ఇది ఆన్‌లైన్‌లోనూ దొరుకుతుంది.


భలే కొవ్వొత్తులు...

కార్టూన్‌ షోలంటే పిల్లలకి ఎంతో ఇష్టం. ఈ షోల ద్వారా పరిచయం అయిన డోరేమాన్‌, చోటాభీమ్‌,  మిక్కీ మౌస్‌, స్పైడర్‌మ్యాన్‌ వంటి పలు క్యారెక్టర్లు వాళ్లతో స్నేహం చేస్తుంటాయి. అందుకే వాళ్లకి ఇష్టమని తల్లిదండ్రులు అలాంటి కాస్ట్యూమ్స్‌ని కానుకగా ఇస్తుంటారు. పుట్టినరోజు నాడు అయితే ఆ థీమ్‌తోనే కేకులూ తెప్పిస్తుంటారు. మరి వాటికి తగ్గట్టే కొవ్వొత్తులు కూడా ఉంటే బాగుంటుంది కదా. అందుకే పార్టీ క్యాండిల్స్‌ పేరుతో థీమ్డ్‌ కొవ్వొత్తులు వస్తున్నాయి. మరి మీరెంచుకున్న థీమ్‌కి తగ్గట్టు వాటిని తెచ్చి కేక్‌పైన పెట్టేస్తే మ్యాచింగ్‌గా ఉంటుంది. పిల్లలూ సంతోషిస్తారు.


ఎంత కావాలంటే అంతే...

మోసా, కట్‌లెట్‌, నూడుల్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌... వంటి పలు స్నాక్స్‌కి సాస్‌, కెచప్‌ వంటివి ఉండాల్సిందే. పిల్లలకి అవంటే ఎంతిష్టమో. అందుకే వాటిని చాలామంది కొని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే ఈ సాస్‌, కెచప్‌లను ప్లేట్‌లోకి తీసుకోవాలంటే సీసాను వంపుతూ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే ఎక్కువ పడుతుంది. అలా పడటం వల్ల మనం తినకుండా వదిలేసింది వృథా అయిపోతుంది. అలాకాకుండా... ఇప్పుడు వీటిని సీసాలోంచి తేలిగ్గా తీసుకోవడానికి సాస్‌ డిస్పెన్సర్లు దొరుకుతున్నాయి. వాటిని తెచ్చి సీసాకి అమర్చి... కావల్సినప్పుడల్లా దాన్ని నొక్కుతుంటే కొద్దికొద్దిగా ప్లేట్‌లో పడుతుంది. అంటే, మనకి ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు. దీనివల్ల వృథా కూడా ఉండదు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఈ డిస్పెన్సర్‌ను ఒక్కసారి కొంటే ఎప్పటికీ ఉపయోగించుకోవచ్చు.


సాక్సుకో బొమ్మ...

మూడు నెలలు దాటినప్పట్నుంచీ పసిపిల్లలు కాళ్లూ చేతులూ ఆడిస్తూ తెగ కేరింతలు కొడుతుంటారు. అంతేకాదు, కాళ్లనీ, చేతుల్నీ నోట్లో పెట్టుకుంటుంటారు. మరి బుజ్జాయిలు అలా చేయకుండా ఉండటానికి రంగురంగుల బొమ్మలతో ఆకట్టుకునే ఈ సరికొత్త సాక్సుల్నీ, బ్యాండ్లనీ- కాళ్లకీ చేతులకీ వేసేస్తే సరి. అలా చేయడం వల్ల చిన్నారుల దృష్టంతా రంగు రంగుల బొమ్మలపైకి మళ్లుతుంది. పైగా ఆ బొమ్మల్ని తాకినప్పుడూ చేతులతో నొక్కినప్పుడూ వచ్చే శబ్దాలకు మరింత ఉత్సాహంగా ఆడుకుంటారు. ఇలా వారి దృష్టిని మార్చి ఆటవస్తువులుగా ఒదిగిపోయే టాయ్‌ సాక్సులూ, బ్యాండ్లూ ఆన్‌లైన్‌లో పలు రంగుల్లో రకరకాల బొమ్మలతో అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..