హహ్హహ్హ

అప్పారావు ఇంటికొచ్చేసరికి పిల్లలు పుస్తకాలను చిందరవందరగా ఇంటినిండా పడేసి బయట ఆడుకుంటున్నారు. భార్యేమో టీవీకి కళ్లప్పగించి సీరియల్‌ చూస్తోంది. అతడు విరక్తిగా తిరిగి చెప్పులేసుకుంటూ... ‘ఈ సంసారం

Published : 06 Mar 2022 00:12 IST

హహ్హహ్హ

కూరగాయలు మర్చిపోవద్దు

అప్పారావు ఇంటికొచ్చేసరికి పిల్లలు పుస్తకాలను చిందరవందరగా ఇంటినిండా పడేసి బయట ఆడుకుంటున్నారు. భార్యేమో టీవీకి కళ్లప్పగించి సీరియల్‌ చూస్తోంది. అతడు విరక్తిగా తిరిగి చెప్పులేసుకుంటూ... ‘ఈ సంసారం ఇక నావల్ల కాదు. నేను హిమాలయాలకు పోతున్నా...’ అన్నాడు. ‘ఒకవేళ మధ్యలో మనసు మార్చుకుంటే, వచ్చేటప్పుడు కూరగాయలు తెండి...’ చెప్పింది భార్య టీవీ మీద నుంచి కళ్లు తిప్పకుండా.


అందరికీ చెప్పు

రాహుల్‌ హడావుడిగా గర్ల్‌ఫ్రెండ్‌కి ఫోన్‌ చేశాడు. ‘నా పెళ్లి కుదిరింది. ఇక, నువ్వు నన్ను మర్చిపో రాధా’ అని చెప్పాడు. అటు నుంచి ఫోనులో... ‘నేను రాధని కాదు సీతని’ కోపంగా చెప్పింది ఆ అమ్మాయి.
‘ఎవరైతే ఏంటిలే. నువ్వే ఈ మాట రాధకీ మిగిలిన వాళ్లకీ కూడా చెప్పెయ్‌’ అని ఫోను పెట్టేశాడు రాహుల్‌.


ఆఫీసుకి సన్నద్ధం

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అయిపోయింది, ఇక ఆఫీసుకు రమ్మంటున్నాయి సంస్థలన్నీ. అందుకు సన్నద్ధం కావాలని ఓ సంస్థ ఉద్యోగులందరికీ నోటీసు పంపించింది. అందులో ఇలా ఉంది.

* పగలంతా చొక్కా, ప్యాంటు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. చొక్కాకి బటన్స్‌ అన్నీ సరిగ్గా పెట్టుకోవాలి.

* గంట గంటకీ ఏదో ఒకటి నోట్లో వేసి నమలకుండా నోరు మూసుకుని పనిచేయడం అలవాటు చేసుకోవాలి.

* మీటింగ్‌ అనగానే చుట్టూ ఉన్నవాళ్లని హుష్‌ హుష్‌(ఇంట్లో పెళ్లాం పిల్లల్ని అన్నట్లు) అనడం మానుకోవాలి.

సెలూన్‌కెళ్లి జుట్టు నీట్‌గా కత్తిరించుకోవాలి. రోజూ గడ్డం గీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

* మధ్యాహ్నం భోజనం చేయగానే మంచానికి అడ్డంపడి పొట్టమీద ల్యాప్‌టాప్‌ పెట్టుకుని పనిచేసే అలవాటు మానాలి. కూర్చుని పనిచేయడం నేర్చుకోవాలి.

* గంటకోసారి టీ కాఫీలు తెచ్చివ్వడానికి ఆఫీసులో పెళ్లాం ఉండదు. మీరే వెళ్లి తెచ్చుకోవాలి. తాగిన కప్పును వెంటనే ట్రాష్‌ క్యాన్‌లో వేయాలి.

* ఆఫీసులో ఆహాలూ నెట్‌ఫ్లిక్స్‌లూ ఉండవు కాబట్టి పనిచేస్తూ సినిమాలు చూసే అలవాటు మానుకోవాలి.


ఇదీ తెలుగేగా...

రామారావు: తెలుగులో మాట్లాడమంటారు.. తెలుగులో మాట్లాడితే తెల్లమొహమేస్తారు...

వెంకట్రావ్‌: ఏమైంది??

రామారావు: ఇందాక

ఓ షాపులోకి వెళ్లి బంతిపువ్వు (మ్యారీగోల్డ్‌) బిస్కెట్లు, దాగుడు మూతల (హైడ్‌ఖీసీక్‌) బిస్కెట్లు, చెరోసగం (ఫిఫ్టీఫిఫ్టీ) బిస్కెట్లు ఉన్నాయా అని అడిగా.. షాపువాడికి అర్థంకాక పిచ్చిచూపులు
చూసి లేవని చెప్పాడు.


నువ్వు లేవుగా...

భార్య: రాత్రి మంచి కలొచ్చింది. ఊటీ వెళ్లినట్లు.

భర్త: నాక్కూడా చుట్టూ నలుగురు అందమైన అమ్మాయిలున్నట్లు కల వచ్చింది.

భార్య: వాళ్లలో నేనున్నానా?

భార్య: నువ్వు ఊటీలో ఉన్నావుగా.


విడుపు లేదు!

శిష్యుడు: గురువుగారూ, వివాహాన్ని పాణిగ్రహణం అని అన్నారేమిటండీ, ఏదో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాగా!

గురువు: వెర్రివాడా! వాటితో ఎందుకు పోల్చుతున్నావు? వాటికి కనీసం పట్టూ, విడుపూ రెండూ ఉంటాయి.

పాణిగ్రహణానికి పట్టు తప్ప విడుపు ఉండదు!


కీబోర్డ్‌

వెంగళప్ప కొత్తగా ఉద్యోగంలో చేరాడు. మొదటి రోజు సాయంత్రం టైమ్‌ అయిపోయినా ఇంటికి వెళ్లకుండా కంప్యూటర్‌తో కుస్తీ పడుతున్నాడు. బాస్‌ చూసి సంతోషించి ‘ఏం పని చేశావు ఇవాళ’ అని అడిగాడు.
‘కంప్యూటర్‌ కీబోర్డ్‌లో అక్షరాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. వాటిని పీకి వరసగా పెట్టేసరికి ఈ టైమ్‌ అయింది’ సిన్సియర్‌గా సమాధానమిచ్చాడు వెంగళప్ప.


ఇక చాలు...

లాయర్‌: విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు?

పిటిషనర్‌: నా భార్య నాతో ఉల్లిపాయలు కోయిస్తుంది. అంట్లు తోమిస్తుంది. బట్టలు ఉతికిస్తుంది...

లాయర్‌: దానికే విడాకులు తీసుకోవాలా? ఉల్లిపాయల్ని గంటసేపు ఫ్రిజ్‌లోపెట్టి తీస్తే కోసేటప్పుడు కళ్లమ్మట నీళ్లు రావు. అంట్లు తోమేముందు కాసేపు నీళ్లు జల్లి ఉంచితే తోమడం తేలికవుతుంది. బట్టల్ని ఒక గంట సర్ఫ్‌ నీటిలో నానబెడితే ఉతకడం ఈజీ...

పిటిషనర్‌: ఇక చాలు, అర్థమయింది..

లాయర్‌: నేనింకా పూర్తిగా చెప్పందే... ఏమర్థమయింది?

పిటిషనర్‌: మీ పరిస్థితి నాకంటే దారుణమని..!


అలాగా!

అవసరమున్నప్పుడు చూపించే ప్రేమా, ఫొటో తీసేటప్పుడు లోపలికి లాగే పొట్టా రెండూ ఒకటే. పనైపోయిన వెంటనే అసలు రూపం బయటపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..