Updated : 19 Jun 2022 04:13 IST

మీరు... ఎలాంటి నాన్న..?

ఒకప్పుడు నాన్నంటే హడల్‌... అది స్కూలు ప్రోగ్రెస్‌ రిపోర్టు చూపించడం కావచ్చు, ఎక్స్‌కర్షన్‌కి వెళ్లాలన్న కోరిక కావచ్చు, సినిమాకెళ్లి రాత్రి ఆలస్యంగా వచ్చిన సంగతే కావచ్చు... అమ్మ వెనకాల నిలబడే విషయం నాన్న ముందుకు తీసుకెళ్లేవారు..! మరి ఇప్పుడో... సగం మంది నాన్న కూచిలే..! స్కూల్లో పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌కి నాన్నే వస్తాడు. హాబీ క్లాసుకి తనే దగ్గరుండి తీసుకెళ్తాడు. పిల్లలతో కలిసి క్రికెట్‌ ఆడతాడు, సినిమాలూ చూస్తాడు..! అప్పటికీ ఇప్పటికీ నాన్న పాత్ర చాలా మారింది. కాకపోతే ఆ మార్పు భిన్నకోణాల్లో వ్యక్తమవుతోంది.

నాన్నలందరికీ పిల్లలంటే ప్రేమే. ఆ ప్రేమని వ్యక్తం చేయడంలో మాత్రం ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా. పిల్లల మీద అతి ప్రేమతో మంచీ చెడూ విచక్షణ మరిచే ధృతరాష్ట్రులూ, తాను చెప్పిందే చెయ్యాలని బిడ్డల్ని నరక యాతన పెట్టే హిరణ్యకశిపులూ, చేజేతులా బిడ్డని దూరం చేసుకుని కుమిలిపోయే దశరథులూ... అప్పుడే కాదు, ఇప్పుడూ ఉన్నారు. వాళ్లే కాదు, బిడ్డ కోరితే కొండమీది కోతినైనా తెచ్చిచ్చే డాబుసరి నాన్నలూ, పిల్లల పుట్టినరోజుని అనాథాశ్రమంలో నిర్వహించే నిరాడంబర నాన్నలూ, పిల్లల్లో ఒకడిగా కలిసిపోయి ఆడిపాడే అల్లరి నాన్నలూ, కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత గల నాన్నలూ, కనడమే తప్ప వారి పెంపకంతో తనకేమీ సంబంధం లేదనుకునే నిర్లక్ష్యపు నాన్నలూ... కూడా ఉన్నారు. ‘మై డాడీ... మై హీరో’ అని ఫాదర్స్‌ డే ప్రకటనలు చెప్పినట్లుగా- వీరంతా పిల్లలకు రోల్‌ మోడల్సేనా..? మనస్తత్వ నిపుణుల లెక్క ప్రకారం పిల్లల వ్యక్తిత్వం రూపొందడంలో 49 శాతం పాత్ర జన్యువులది కాగా మిగిలిన 51 శాతం పెంపకానిదే. తల్లి పాత్రలో తరతరాలుగా పెద్దమార్పు లేదు కానీ తండ్రి పాత్ర కాలంతో పాటు మారుతూ వచ్చింది. అందుకే పరిశోధకులు సాధారణంగా తండ్రులు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, నాన్నల స్వభావాల్లోని రకాల గురించీ, పిల్లలపై దాని ప్రభావం గురించీ విశ్లేషించారు. అందులో ప్రధానమైనవి ఏమిటంటే...

నిరంకుశులు
హిట్లర్‌ అనీ, నియంత అనీ పిల్లలు పిలుచుకునే ఈ నాన్నల్ని మనస్తత్వ శాస్త్రవేత్తలు ‘నిరంకుశులు’ అంటారు. ఇప్పటి సినిమా భాషలో చెప్పాలంటే ‘బొమ్మరిల్లు ఫాదర్‌’ అన్న మాట. ‘నా ఆట కూడా నువ్వే ఆడితే ఇక నేనెందుకు నాన్నా ఆడటం...’ అంటాడు కదా అందులో హీరో. ఆటలోనూ ఓడిపోకూడదన్న తపనతో కొడుక్కి ఆడుకునే ఆనందాన్ని కూడా ఇవ్వని నాన్న అతడు. అలాంటి వాళ్లకి పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు. పిల్లలకి ఏమీ తెలియదనీ, వాళ్లకి ఏది మంచో ఏది చెడో తమకే బాగా తెలుసనీ అనుకుంటారు. సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లల లక్ష్యాలను నిర్దేశిస్తారు. పిల్లల కోసం తామే కలలు కంటారు. ఆ కలల్ని పిల్లలు నెరవేర్చాలని ఆశిస్తారు. అందుకు విపరీతమైన క్రమశిక్షణ అమలు చేస్తారు. పిల్లలు ఎంత గొప్ప విజయం సాధించినా కనీసం అభినందించకపోగా అదీ గొప్పేనా అన్నట్లు తీసి పారేస్తారు. వారి అభిప్రాయాలకూ హక్కులకూ స్వేచ్ఛకూ ఏ మాత్రం విలువివ్వరు. చిన్నప్పుడు చదువైనా, పెద్దయ్యాక పెళ్లయినా... ప్రతి విషయంలోనూ తమ నిర్ణయమే సరైనదంటారు. విచిత్రం ఏమిటంటే- ఇదంతా పిల్లల మీద విపరీతమైన ప్రేమతోనే చేస్తారు. ఆ ప్రేమ వారిని ఇబ్బంది పెడుతోందని తెలుసుకోలేరు. ఇలాంటి తండ్రులున్న పిల్లలు ఆత్మన్యూనతకు గురవుతారు. నచ్చని పని చేయలేకా, తండ్రికి ఎదురు చెప్పలేకా సతమతమవుతారు. తమ సామర్థ్యం మీద నమ్మకాన్ని కోల్పోతారు. దాంతో జీవన నైపుణ్యాలు కొరవడతాయి. ఎందులోనూ రాణించలేరు. పిల్లల్లో మానసికాందోళన, ఒత్తిడి, కుంగుబాటు సమస్యలు పెరగడానికీ ఈ తరహా పెంపకమే కారణమని యూనివర్శిటీ ఆఫ్‌ మేరీ వాషింగ్టన్‌ పరిశోధకులు తేల్చారు.

నిమిత్తమాత్రులు
బొమ్మరిల్లు నాన్నకి పూర్తి వ్యతిరేకం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా నాన్న. ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అంటూ నిమిత్తమాత్రుల్లా వ్యవహరిస్తారు వీళ్లు. పిల్లలకు మార్గదర్శకం చేయాల్సిన బాధ్యత తమ మీద ఉందని గుర్తించరు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ల మీద వాళ్లకి నమ్మకం ఉండదు. దాంతో పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. ఇంట్లో ఒక క్రమశిక్షణా పద్ధతీ పాడూ అంటూ ఉండవు. పిల్లల పట్ల ప్రేమా, కోపం లాంటి ఉద్వేగాలేవీ ప్రదర్శించలేరు. ఊళ్లో వాళ్లందరికీ మంచోళ్లుగానే కన్పిస్తారు కానీ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి చేతకానివాళ్లుగా మిగిలిపోతారు. దాంతో గాలివాటుకు కొట్టుకుపోయినట్లు పిల్లలు ఒక లక్ష్యం లేకుండా పెరుగుతారు. సోమరుల్లా తయారవుతారు. ఇలా తండ్రి అజమాయిషీ సరిగాలేని పిల్లలు దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. చట్టవ్యతిరేక పనులకు త్వరగా ఆకర్షితులవుతారు. క్రమశిక్షణ లేని పౌరులుగా, సంఘవిద్రోహశక్తులుగా మారే అవకాశాలు ఎక్కువ. ఆడపిల్లలు పెళ్లి విషయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. మనుషుల్ని సరిగ్గా అంచనా వేయలేక, వ్యక్తిత్వం లేని యువకుల్ని ఇష్టపడే ప్రమాదం ఉంది.

పనీ... పనీ...
ఈ నాన్నలు ఇంట్లోనే ఉంటారు కానీ పిల్లల జీవితాల్లో కన్పించరు. తామూ తమ ఉద్యోగమూ తప్ప మరో విషయం పట్టదు వీరికి. కన్నబిడ్డలతోనూ అంటీ ముట్టనట్లు ఉంటారు. పిల్లల రాకతో తమ బాధ్యత పెరిగిందనీ ఎక్కువ సంపాదించాలనీ భావిస్తారు. ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు. దాంతో బిడ్డతో ఆటాపాటా మరిచి సంపాదన మీద దృష్టి పెడతారు. తండ్రిగా అదే తమ బాధ్యత అనుకుంటారు. ఇంతమంది కడుపు నింపాలి, ఫీజులు కట్టాలి, చదివించాలి... ఇదే ధ్యాస తప్ప పార్కుకి తీసుకెళ్లి ఆడుకోవాలి, స్కూల్లో పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌కెళ్లాలి- లాంటివి పట్టవు. సహోద్యోగులో స్నేహితులో అలా చేస్తున్నట్లయితే- సమయం వృథా చేస్తున్నారని వారిని చిన్నచూపు చూస్తారు. ఇంట్లో పిల్లలు ఏ కాస్త అల్లరి చేసినా అరిచేస్తారు. చెడిపోతున్నారని కోప్పడతారు. సంపాదించి తేవడం వరకే తమ బాధ్యతగా భావించే వీళ్లు- భార్య తన బాధ్యత సరిగా నిర్వహించనందునే పిల్లలు అల్లరిగా తయారయ్యారని ఆరోపిస్తారు. ఇంట్లో మిలిటరీ క్రమశిక్షణని అమలుచేసే ఇలాంటి నాన్నని పిల్లలు తప్పించుకు తిరుగుతారు. బాల్యంలో తండ్రితో గడిపిన మధురమైన జ్ఞాపకాలేవీ లేకుండా, నాన్న ప్రేమకి మొహం వాచినట్లుండే ఈ పిల్లలు మానసికంగా బేలగా తయారవుతారు. దీర్ఘకాలిక డిప్రెషన్‌కీ గురవుతారు. తాము తండ్రయ్యాక- అయితే పిల్లల్ని అతిగారాబం చేయడమో లేక తమ తండ్రిలాగే అంటీ ముట్టనట్లు ఉండడమో చేస్తారు.

అన్నీ తానై...
ఈ తరహా నాన్నలకి అనుక్షణం పిల్లల ధ్యాసే. పిల్లల మీద తమ ప్రేమని వ్యక్తం చేయడంలో మొదటివరసలో ఉంటారు. బిడ్డ పనులన్నీ తామే చేయాలనుకుంటారు. వారు నిద్రలో కదిలినా, చిన్న శబ్దం చేసినా ఏమైందోనని లేచి కూర్చుంటారు. స్కూలు ఎంపిక, చదువు, హోంవర్కులు, పరీక్షలూ... ప్రతిదీ పట్టించుకుంటారు. పిల్లలకు ఏ లోటూ లేకుండా పెంచడం తమ బాధ్యత అనుకుంటారు. పిల్లల అలవాట్లేమిటో వారికి ఏ బొమ్మలు ఇష్టమో, ఏ ఆటలు ఇష్టమో వీళ్లకి పక్కాగా తెలుసు. వాళ్ల ఫ్రెండ్స్‌ ఎవరో, వాళ్లకి ఏ టీచర్లు ఇష్టమో కూడా తెలుసుకుంటారు. పిల్లలు పరీక్షకు వెళ్తుంటే పెన్నూ హాల్‌టికెట్‌ లాంటివి సర్దిపెడతారు. వాళ్లకేం కావాలో అడగక ముందే కొనిపెడతారు. తప్పు చేసినా కోప్పడరు. వాళ్ల దారిలో ఎలాంటి అవరోధాలూ లేకుండా చూసుకుంటూ బాడీగార్డులా అనుక్షణం వెంట ఉంటారు. పిల్లల్ని సానుకూల వాతావరణంలో పెంచాలంటూ అనర్గళంగా ఉపన్యాసాలిస్తారు. భాగస్వామి అభిప్రాయానికి కూడా విలువివ్వకుండా అన్నీ తామే అయి చేసే ఇలాంటి నాన్నలు ఉన్న పిల్లలకు ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడడం అలవాటైపోతుంది. నాన్న చూసుకుంటాడులే అన్న నిర్లిప్తత వారిలో సహజంగా ఉండాల్సిన చొరవనీ ఉత్సాహాన్నీ చంపేస్తుంది. ఉదాసీనత ఆవహిస్తుంది. ఈ తరహా పెంపకం పిల్లల్ని చేజేతులా నిష్క్రియాపరుల్ని చేస్తుందంటారు నిపుణులు.

మంచి నాన్న
తన బాధ్యతలను సాధికారతతో నిర్వహించే తండ్రిని ‘బెస్ట్‌ పేరెంట్‌’ అంటారు నిపుణులు. వీళ్లు పిల్లల్ని చక్కని క్రమశిక్షణతో పెంచుతారు. పిల్లలకు ఎక్కడ ఎప్పుడు ఎంత స్వేచ్ఛనివ్వాలో, ఎక్కడ నియంత్రించాలో వీరికి బాగా తెలుసు. పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో అంతగా వారిలో సొంత వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వాతావరణాన్ని కల్పిస్తారు. విలువలు నేర్పుతారు కానీ తమ కలల్ని వాళ్లమీద రుద్దరు. సొంత నిర్ణయాలు తీసుకునేలా, తమ ఇష్టాయిష్టాల్ని నెరవేర్చుకునేలా పిల్లల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ల అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛనిస్తారు. అవసరమైన చోట అండగా నిలబడతారు. ఆడేటప్పుడు తామూ వారిలో ఒకరిగా కలిసి ఆడతారు. వాళ్లు చదువుకునేటప్పుడు సందేహాలు తీర్చే టీచరుగా మారతారు. ఇంట్లో ఏ విషయాన్నయినా మనసు విప్పి చర్చించే వాతావరణం కల్పిస్తారు ఇలాంటి నాన్నలు. దాంతో పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. వారి వ్యక్తిత్వాల్లో పరిణతి ఉంటుంది. ప్రయోగాలు చేసి నిలదొక్కుకోగల స్థైర్యం ఉంటుంది. దాంతో అన్నిరకాలుగానూ విజయం సాధించగలరు. మనస్తత్వ నిపుణులు ఇలాంటి నాన్నలకు మంచి నాన్నలన్న కితాబునిస్తున్నారు.

పరిశోధనలేమంటున్నాయీ...
ఒకప్పుడు మన సమాజంలో పిల్లల్ని కనడం పెంచడం తల్లి బాధ్యతలుగా, సంపాదించి తేవడం తండ్రి బాధ్యతగా ఉండేది. మహిళలు బయట ఉద్యోగాలు చేయడం మొదలెట్టినప్పటినుంచి క్రమంగా ఈ పద్ధతి మారుతూ వచ్చింది. అయితే తరతరాలుగా నిర్వహిస్తూ వస్తున్న బాధ్యతలు ఇప్పుడిలా మార్చుకోవడం సులభమేనా, దానివల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందీ లాంటి సందేహాలు వచ్చాయి పరిశోధకులకు. దాంతో రకరకాల అధ్యయనాలు చేశారు. పిల్లలు పెద్దలై జీవితంలో విజయం సాధించాలంటే తండ్రి పాత్ర చాలా కీలకమని ఈ పరిశోధనలన్నీ ముక్తకంఠంతో సెలవిస్తున్నాయి.

* వ్యక్తిత్వానికి సంబంధించి పెద్దయ్యాక మనిషి ఎదుర్కొనే సమస్యల్లో 90 నుంచి 95 శాతం సమస్యలకి మూలం బాల్యంలో- అదీ పిల్లలుగా తల్లిదండ్రులతో ఎదుర్కొనే అనుభవాల్లో ఉంటుందట. 

* దాదాపు 500 అధ్యయనాలను క్రోడీకరించగా తేలిందేమిటంటే- పిల్లలమీద అమ్మానాన్నా ఇద్దరి ప్రభావమూ ఉంటుంది కానీ, ఏ విషయంలోనైనా పిల్లల కోరికని తిరస్కరించినట్లయితే- దానికి నాన్న కారణమైతే ఆ ప్రభావం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందట. జీవితాంతం వారికి అది ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుందట. అందుకే పిల్లలు ఏదైనా కోరినప్పుడు ఒక్కసారే కఠినంగా ‘నో’ చెప్పకుండా సమయం తీసుకోవాలనీ, ఆ తర్వాత మెల్ల మెల్లగా దాని గురించి అవగాహన కల్పిస్తూ ఎందుకు వద్దన్నదీ అర్థమయ్యేలా చెప్పాలనీ అంటున్నారు నిపుణులు.

* నాన్నతో చక్కటి అనుబంధం కలిగిన ఆడపిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తడం అరుదట. మగపిల్లలైతే చట్టవ్యతిరేక పనులు చేయరట.

* ఏం చూస్తారో అదే నేర్చుకుంటారు పిల్లలు. తండ్రుల మాటలూ చేతలూ నడవడికా అన్నీ పిల్లలకు పాఠాలవుతున్నాయట. 

* తండ్రిగా పిల్లలతోనే కాదు, భర్తగా భార్యతో నడచుకునే తీరు కూడా పిల్లలు గమనిస్తారు. తల్లిని అవమానించే తండ్రిని కొందరు పిల్లలు ద్వేషిస్తే, కొందరేమో అనుకరిస్తారు. అందుకే మంచి నాన్న కావాలనుకునేవారు ముందు మంచి భర్తగా మారాలి- అంటారు నిపుణులు.

* రోజూ కనీసం ఒక గంటన్నా తమతో గడిపే తండ్రులు ఉన్న పిల్లలు ఎలాంటి పరిస్థితులనైనా నిబ్బరంగా ఎదుర్కోగలుగుతున్నారు.

* వ్యసనపరులైన తండ్రులు ఉన్న పిల్లలూ వ్యసనపరులయ్యే అవకాశాలు ఎక్కువ. అభద్రతతోనూ బాధపడతారు.

* పసిపిల్లలప్పటి నుంచే వారి రోజువారీ పనులన్నిటినీ పంచుకుంటున్న తండ్రులతో పిల్లలకు గట్టి అనుబంధం ఉంటోంది.

* పిల్లలు ఒకరు దుడుకుగా ఉంటే మరొకరు నిదానంగా ఉండొచ్చు. ఒకరు తెలివి గలవారైతే మరొకరు అమాయకులు కావచ్చు. ఆ తేడాని ఎత్తిచూపకుండా ఇద్దర్నీ సమానంగా చూసే తండ్రులు పిల్లలు ఆ బలహీనతని అధిగమించేందుకు తోడ్పడుతున్నారు.

* * * *

పిల్లల్లాగే నాన్నలూ ఎవరికి వాళ్లే ప్రత్యేకం. ఇన్నిరకాల నాన్నల్లో మీరే కోవకి చెందినవారైనా మిగిలిన వారిలోని మంచి లక్షణాలనీ అలవాటుచేసుకోవచ్చు. ముందుగా తండ్రులుగా మీ బలాలూ బలహీనతలూ ఏమిటో గుర్తిస్తే ఆ లోపాలను సరిదిద్దుకోవడం తేలికే... అంటున్నారు పరిశోధకులు.

తప్పటడుగులు వేసే వయసులో చేయి పట్టుకుని నడిపిస్తాం... అది- వాళ్లు పడిపోకుండా జాగ్రత్త పడడం. తప్పుటడుగులు వేస్తారని ఇరవయ్యేళ్లొచ్చినా ఆ చేయి వదలకపోవడం మూర్ఖత్వం. ఇది- వాళ్ల బతుకు వాళ్లని బతకనీయకపోవడం. ఆ తేడా తెలుసుకుని తదనుగుణంగా నడచుకునే నాన్నలందరూ మంచి నాన్నలే..!


ఉత్తమ తండ్రులు..!

ప్రపంచంలో ఎన్నో దేశాలూ మరెన్నో సంస్కృతులూ ఉన్నాయి. వీటన్నిటిలోనూ తండ్రి పాత్రకి తగినంత ప్రాధాన్యమిస్తున్న ఉత్తమ సంస్కృతి ఏదీ అన్న సందేహం వచ్చింది ‘ఫాదర్స్‌ డైరెక్ట్‌’ అనే బ్రిటిష్‌ పరిశోధనా సంస్థకి. మొత్తం 156 సంస్కృతులను పరిశీలించిన ఆ సంస్థ సెంట్రల్‌ ఆఫ్రికాలోని ‘అకా’ అనే పిగ్మీ తెగకి ‘వరల్డ్స్‌ బెస్ట్‌ డ్యాడ్స్‌’ అన్న బిరుదు ఇచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల్లో కేవలం 20 శాతమే తండ్రీ బిడ్డల అనుబంధానికి ప్రాధాన్యమిస్తున్నాయని తెలిశాక ‘అకా’ తెగవాళ్లు ఈ పరిశోధకులకు తెగ నచ్చేశారు. ఆ తెగలో తండ్రులు, తల్లితో సమానంగా బిడ్డల్ని ఎత్తుకుంటారు. రోజుల పసిబిడ్డల్ని కూడా గుండెకు హత్తుకుని ఉంచుకుంటారు. తల్లి ఎక్కడికైనా వెళ్లినప్పుడు పిల్లలు ఏడుస్తుంటే పాలు రాకపోయినా తమ రొమ్ము అందిస్తారు. పిల్లల నోట్లో పెట్టే పీక(పాసిఫయర్‌) కన్నా అది ఎన్నో రెట్లు నయమంటున్నారు పరిశోధకులు. ఆ తండ్రులు బయట పనులకు వెళ్లినా, స్నేహితుల దగ్గరికి వెళ్లినా వెంట పిల్లలు ఉండాల్సిందే. తల్లో తండ్రో ఎవరో ఒకరు పిల్లలు చేయి చాస్తే అందే దూరంలోనే ఉంటారు. ఉయ్యాల కానీ పిల్లలకోసం ప్రత్యేక మంచం కానీ వాళ్లకసలు తెలియదు. నడిచే వయసొచ్చేవరకూ ఎవరో ఒకరి ఒడిలోనే వెచ్చగా పడుకుంటారట పిల్లలు. ఆ తెగవారు పిల్లల్ని సమాజాన్ని ముందుకు నడిపించే అమూల్యమైన సంపదగా, తమ జీవితానికి లభించిన వరంగా భావిస్తారట.


ఎందుకు మారతాడంటే...

తండ్రయ్యాక పురుషుల స్వభావంలో కొన్ని రకాల మార్పులు చోటు చేసుకోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారిలోనే ఈ మార్పులు ఎక్కువగా కన్పిస్తున్నాయట.

* కొత్తగా తండ్రి అయ్యి బిడ్డని చూసుకుని మురిసిపోతున్నవారి మెదడులో కొత్త కణాలు వేగంగా వృద్ధి చెందుతాయట. దాంతో వారి జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందట. ఈ క్రమంలో మెదడు ఆకృతిలోనూ చోటుచేసుకునే స్వల్ప మార్పుల వల్ల వారి ఆలోచనాధోరణి కూడా మారుతుందట.

* పిల్లలతో గాఢమైన అనుబంధం కలిగివున్న తండ్రుల్లో హార్మోన్ల మార్పులూ జరుగుతాయట. దాంతో ఒకప్పటి దుడుకు యువకులు కూడా నెమ్మదిగా, ప్రశాంతంగా మారిపోతారని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.

* సాధారణంగా కొత్తవాళ్లతో ఎక్కువగా మాట్లాడని మొహమాటస్తులు కూడా తండ్రయ్యాక త్వరగా తోటి తండ్రులతో మాట కలుపుతారట. ఆస్పత్రుల్లో, పార్కుల్లో, పాఠశాలల్లో తండ్రుల మధ్య ఏర్పడిన పరిచయాలు జీవితకాల స్నేహాలుగా మారే అవకాశాలు ఎక్కువని మిషిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.

* పిల్లలతో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ తండ్రుల్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గి ఆక్సిటోసిన్‌ స్థాయులు పెరుగుతాయట. ఆక్సిటోసిన్‌కి లవ్‌ హార్మోన్‌ అని పేరు. అందుకే తండ్రీబిడ్డల అనుబంధం బలపడుతుందట.


నాన్న ఇచ్చే ధైర్యమే వేరు!

బ్రిటన్‌లో ఏటా పిల్లలు నర్సరీలో చేరేటప్పుడు వారికి స్కూల్లో చేరడానికి కావలసిన అర్హతలు ఉన్నాయా లేవా అని పరీక్షిస్తుంటారు. ముఖ్యంగా తమ అవసరాలను చెప్పగల భాష రావాలి. టీచర్లు నేర్పే అంశాలను అర్థం చేసుకునే శక్తీ, నేర్చుకోవాలన్న కుతూహలమూ కన్పించాలి. ఈ అధ్యయనాల్లో పరిశోధకులు గుర్తించింది ఏమిటంటే- పిల్లల్ని నెలల వయసు నుంచీ ఎత్తుకుని ఆడిస్తూ వారి పెంపకంలో ఎక్కువ సమయం గడిపిన తండ్రులు ఉన్న పిల్లలే ఎక్కువగా బడిలో చేరడానికి కావలసిన అర్హతలను కలిగి ఉంటున్నట్లు వెల్లడైంది. తండ్రులు పిల్లలతో ఎంత ఎక్కువ సమయం గడిపితే వారిలో అంతగా చురుకుదనమూ ఉత్సాహమూ పెరుగుతున్నాయట. అందుకే ‘మీ పిల్లలు బాగా చదువుకుని గొప్పవాళ్లవ్వాలని కలలు కంటున్నారా, ఆ కలలు నిజమవ్వాలంటే ముందు మీరు వారితో మమేకం కండి. ప్రేమగా పెంచండి. అప్పుడే వాళ్లు మంచి మనుషులుగా ఎదుగుతారు. జీవితంలో రాణిస్తారు’ అని అక్కడి పరిశోధకులు ముక్తకంఠంతో చెబుతున్నారు.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని