వీడియోగేమ్‌లతో... ఫిజియోథెరపీ!

సాంకేతికతని సేవాబాట పట్టిస్తే... ఎన్ని అద్భుతాలు చేయొచ్చో చెప్పడానికి ఇదో ఉదాహరణ! సెరిబ్రల్‌ పాల్సీ, ఆటిజమ్‌, డౌన్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలున్నవాళ్ళ కోసం సరికొత్త వీడియోగేమ్‌ పరికరాలని అందిస్తోంది ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌.

Published : 02 Oct 2022 00:32 IST

వీడియోగేమ్‌లతో... ఫిజియోథెరపీ!

సాంకేతికతని సేవాబాట పట్టిస్తే... ఎన్ని అద్భుతాలు చేయొచ్చో చెప్పడానికి ఇదో ఉదాహరణ! సెరిబ్రల్‌ పాల్సీ, ఆటిజమ్‌, డౌన్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలున్నవాళ్ళ కోసం సరికొత్త వీడియోగేమ్‌ పరికరాలని అందిస్తోంది ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌. ఆ పరికరాల ద్వారా వాళ్లకి రోజూ అందాల్సిన ఫిజియోథెరపీ బాధల్ని మరపిస్తోంది. వాళ్ళు ఇతరులపైన ఆధారపడాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. కేవలం వీడియోగేమ్‌ల ద్వారా ఇవన్నీ సాధ్యమా అనిపిస్తోంది కదూ... వాటి వెనకున్న సాంకేతికత అలాంటిది మరి!

అబ్బాయి పేరు నిర్మల్‌ కుమార్‌. వయసు 24 ఏళ్ళే కానీ... సెరిబ్రల్‌ పాల్సీ కారణంగా చంటిపిల్లాడికున్నంత మానసిక ఎదుగుదలే ఉంటుంది. నిర్మల్‌కి ఆహారం ఎంత ముఖ్యమో... రోజూ ఫిజియోథెరపీ చేయించడమూ అంతే అవసరం. కానీ, అతనిచేత థెరపీ చేయించాలంటే తల్లిదండ్రులకి తలప్రాణం తోకకొచ్చేది. శ్రమతో కూడిన ఆ వ్యాయామాలు చేసేటప్పుడు వచ్చే నొప్పుల్ని తట్టుకోలేక నిర్మల్‌ పెద్దగా అరిచి గోలచేసేవాడు. కానీ ఆ సమస్య టీసీఎస్‌వాళ్లు అందించిన ‘వి-హ్యాబ్‌’ వీడియో గేమ్‌లతో మటుమాయమైంది. ఆ గేమ్‌ల ద్వారా నొప్పి తెలియకుండా ఓ ఆటలా వ్యాయామాల్ని చేయించడంతో... ఒకప్పుడు తల్లిదండ్రుల సాయంలేనిదే నడవలేని నిర్మల్‌ ఇప్పుడు సొంతంగా అడుగులు వేయగలుగుతున్నాడు.

ఒక్క సెరిబ్రల్‌ పాల్సీయే కాదు... ఆటిజమ్‌, డౌన్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలున్నవాళ్ళకి టీసీఎస్‌ వి-హ్యాబ్‌(వర్చువల్‌ హ్యాబిలిటేషన్‌) వీడియో గేమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దేశంలో ఉన్న పలు స్పెషల్‌ స్కూల్స్‌ ద్వారా దాదాపు వెయ్యిమంది మంది బాధితులకి వీటిని ఉచితంగా అందిస్తోంది టీసీఎస్‌ సంస్థ.

ఎలా పనిచేస్తాయంటే...
మామూలు వీడియోగేముల్లాగే ఇవి ‘ఇమ్మెర్సివ్‌’గా ఉంటాయి... అంటే, ఆ గేమ్‌ల్లో ఆడేవాళ్ళూ ఓ పాత్రగా మారతారన్నమాట!  ఓ చిన్న వాచ్‌లాంటి పరికరాన్ని చేతికి తగిలించుకుంటే... ఆడేవాళ్ళు చెయ్యెత్తితే అక్కడ వాళ్ళ పాత్రా చెయ్యెత్తుతుంది. వాళ్ళేం చేసినా అదీ చేస్తుంది. ఉదాహరణకు ఓ బీచ్‌ వాలీబాల్‌ ఆట ఉందనుకుందాం. వీడియోగేమ్‌ ఆడేవాళ్ళు తమ చేతిని నిర్ణీత స్థాయి వరకూ ఎత్తి కదిపితేనే... టీవీలో ఉన్న ఆ బాల్‌ కదులుతుంది. అలా- ఆ బాల్‌ని ఓ నిర్ణీత స్థలానికి చేరిస్తే ‘స్కోరు’పాయింట్‌ వస్తుంది! అలా బంతి స్థానాన్ని మార్చే క్రమంలో చేయిని కదపడం... ఆడేవాళ్ళ చేతులకి వ్యాయామంగా మారుతుంది. చేతులకే కాదు... కాళ్ళకీ, నడుముకీ ఇలా శరీరం మొత్తానికీ వివిధ ఆటల ద్వారా ఫిజియోథెరపీ వ్యాయామాలు చేయిస్తారు. శ్రమ అయితే అదేకానీ... వీడియో గేమ్‌ ద్వారా దాన్ని మరిచిపోయేలా చేయడమే వి-హ్యాబ్‌ గేమ్‌ల గొప్పతనం. ఈ వీడియోగేమ్‌ని టీవీలూ, కంప్యూటర్‌ల ద్వారానే కాదు... మొబైల్‌ ఆప్‌, వర్చువల్‌ రియాల్టీ పరికరాల ద్వారానూ అందిస్తున్నారు. తెర ఏదైనా దానిపైన- గేమ్‌ ఆడుతున్నవాళ్ళని పోలిన వ్యక్తి ఒకరు కనిపించడం, అతని పేరున స్కోరు పాయింట్లు వస్తుండటంతో మానసిక ఎదుగుదల లేని చిన్నారులూ ఈ వీడియో గేమ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఇలా మొదలైంది...

‘మానసిక ఎదుగుదల లోపించిన పిల్లలకి ఏదైనా సాయం చేయాలన్న ఆలోచనతో మొదట కొన్ని స్పెషల్‌ స్కూల్స్‌కి వెళ్ళాం. ఆ స్కూళ్లలో ఫిజియోథెరపీ కోసమని ప్రత్యేకమైన గదులుండేవి. ఆ గదుల బయట భయంతో నిలబడి అభంశుభం తెలియని ఆ పిల్లలు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయేది. నిజానికి చాలామంది ఆ నొప్పికి భయపడే స్పెషల్‌ స్కూల్‌కి రావడం మానుకోవడం మేం గమనించాం. టీసీఎస్‌ ద్వారా పరిష్కారం చూపాలనుకున్నాం...’ అని చెబుతారు ఆ సంస్థ చేపట్టిన వి-హ్యాబ్‌ ప్రాజెక్టుకి నేతృత్వం వహిస్తున్న రాబిన్‌ టోనీ.  ఫిజియోథెరపీకి అనుగుణంగా ఈ వీడియోగేమ్‌లని డిజైన్‌ చేసింది ఆయనే. ఈ వీడియోగేమ్‌లకి కావాల్సిన అత్యాధునిక సెన్సార్‌లను అమెరికాలోని బాక్లేస్‌ మెంటల్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ సంస్థ తమ ‘రీచ్‌’ కార్యక్రమంలో భాగంగా అందించింది. మొదట పుణెలోని స్పెషల్‌ స్కూల్స్‌లో ప్రయోగాత్మకంగా వాడి చూశారు. మంచి ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా పలు సంస్థలు వీటిని ఉపయోగిస్తున్నాయి.

టీసీఎస్‌ సంస్థ స్పెషల్‌ స్కూల్స్‌కి ఈ పరికరాల్ని తాము నేరుగా ఇవ్వడమే కాదు... కొన్ని అంకురసంస్థలకీ ఈ టెక్నాలజీని ఉచితంగా అందించి ప్రోత్సహిస్తోంది. అలా ‘పునర్జీవన్‌’ అన్న సంస్థ రూపొందించిన వీడియోగేమ్‌లని హైదరాబాద్‌కి చెందిన సెయింట్‌ మేరీస్‌ రిహ్యాబిలిటేషన్‌ సంస్థ వాడుతోంది. వీళ్ళు దీన్ని కేవలం మానసిక వికలాంగులకే కాకుండా- పక్షవాత బాధితులకీ వాడి మంచి ఫలితాలు సాధిస్తుండటమే విశేషం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు