Updated : 18 Sep 2022 04:28 IST

చిన్నారుల కోసం సరికొత్త జిమ్‌లు!

‘నిండా నాలుగేళ్లు లేవు... ఆ పసివాణ్ణి జిమ్‌లో చేరుస్తావా...’ అంటూ సణుగుతోంది బామ్మ. ‘ఇవి వెనకటి రోజులు కాదు బామ్మా... ఇప్పటినుంచీ వ్యాయామం నేర్పిస్తేనే రేపు చదువులోనూ ఆటల్లోనూ చురుకుగా ఆరోగ్యంగా ఉంటాడు’ అంది కీర్తి. వినడానికి కాస్త వింతగానే ఉన్నా అది నిజమే అంటున్నారు నిపుణులు... అందుకే ఇప్పుడు నగరాల్లో చిట్టిపొట్టి చిన్నారులకీ జిమ్‌లు వెలుస్తున్నాయి!

 నడక వ్చంది మొదలు... బుజ్జాయిలు క్షణం కుదురుగా ఉండరు... గిరగిరా తిరుగుతూ ఏదో ఒకటి తీస్తూ అమ్మల్నీ పరిగెత్తిస్తుంటారు. అదే పెద్ద వ్యాయామం... మళ్లీ వాళ్లకి జిమ్‌లు ఎందుకూ అనిపించడం సహజమే. కానీ.. ఇదంతా స్మార్ట్‌ఫోన్‌కి పూర్వకాలం. ఇప్పుడో...ఉద్యోగాలతో అమ్మానాన్నలు బిజీ. దాంతో ఆడుకోవడానికీ ఎవరూ లేక పిల్లలు ఓ ఫోన్‌ పట్టుకునో, టీవీ ముందో కూర్చుంటున్నారు. దీనికితోడు ఫాస్ట్‌ఫుడ్సూ సాఫ్ట్‌డ్రింకులూ ఇరుకిరుకు అపార్ట్‌మెంట్లూ హోమ్‌వర్కులతో పిల్లలకు శారీరక శ్రమే ఉండటం లేదు. కనీసం పార్కుకైనా తీసుకెళదామంటే- నగరాల్లో కాలుష్యం పెరిగిపోవడం, ఎండా వానా చలీ అన్నీ తీవ్రంగా ఉండటంతో అదీ కుదరడం లేదు. పైగా చిన్నప్పటినుంచీ వ్యాయామం చేయిస్తే పెద్దయ్యాక అదో అలవాటుగా మారుతుంది అని వైద్యులూ చెబుతున్నారు. ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్నది ఉండనే ఉంది కదా. అందుకే అమెరికా, ఐరోపా దేశాల్లో పిల్లలకోసం లిటిల్‌ జిమ్‌లూ, ప్లే జిమ్‌లూ పుట్టుకొచ్చాయి. ‘అక్కడికి వెళ్లినప్పుడు వాటిని చూసే నేనూ ప్రారంభించా’ అంటోంది కోల్‌కతాలో ‘లిటిల్‌ జిమ్‌’కి శ్రీకారం చుట్టిన మైత్రేయి కందోయ్‌. ‘పెద్దయ్యాక అన్ని ఆటలకీ పనికి వచ్చేలా వాళ్ల శరీరం ఎలా అంటే అలా వంగేలా ఇక్కడ జిమ్నాస్టిక్సూ నేర్పిస్తున్నాం’ అంటోందీమె. ఆ ఆలోచన నచ్చడంతో లిటిల్‌ జిమ్‌కి దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఫ్రాంచైజీలు వెలిశాయి. ‘మా దగ్గర నాలుగు నెలల నుంచి పన్నెండేళ్ల వయసు వరకూ ఉన్న పిల్లల్ని చేర్చుకుని, జిమ్నాస్టిక్స్‌తోపాటు రకరకాల ఆటలూ ఆడిస్తున్నామని’ అంటున్నారు హైదరాబాద్‌లోని లిటిల్‌ జిమ్‌ నిర్వాహకులైన అనీషా, నిషిత. చెన్నైకి చెందిన ‘జిమ్‌ టాడ్జ్‌’ అయితే మూడు నెలల వయసు నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు శిక్షణ ఇస్తోంది.

 

‘చిన్నప్పటినుంచీ చేసే ఈ వ్యాయామం వల్ల పిల్లలకు జీవనశైలి కారణంగా వచ్చే ఫ్యాటీ లివర్‌, ప్రీడయాబెటిక్‌, ఊబకాయం, బీపీ... వంటి సమస్యలు రావనీ, నాడులన్నీ ఉత్తేజితమై చురుగ్గానూ ఫిట్‌గానూ ఉంటారనీ’ అంటున్నారు కోల్‌కతాలోనే న్యూట్రియన్స్‌ కిడ్స్‌ ఫిట్‌నెస్‌ స్టూడియోని తెరిచిన విధి సైనీ. పైగా ఇక్కడ పిల్లలకు వర్కవుట్స్‌తోపాటు పోషకాహారం పట్ల అవగాహనా కల్పిస్తున్నారట. ఆరేడేళ్లు నిండిన చిన్నారులయితే తోటి పిల్లలతో కలిసి కసరత్తులు చేయడాన్ని ఎంతో ఆనందిస్తున్నారనీ, దీనివల్ల వాళ్లలో జ్ఞానేంద్రియాల పనితీరు మెరుగవుతుందనీ చెబుతున్నారు జిమ్‌ శిక్షకులు. కొంతమంది పిల్లలు తమ డైట్‌చార్ట్‌ని తామే రాసుకోవడం విశేషం. మొత్తమ్మీద ఈ ప్లే జిమ్‌లలో పిల్లలు పరుగులెడతారు, ఎగురుతారు, దూకుతారు, గోడలెక్కుతారు, ఆటలాడతారు... ఇలా ఎన్నో రకాలుగా వ్యాయామం చేస్తున్నారు. ఇవన్నీ వాళ్లలో ఆలోచనాశక్తినీ ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతున్నాయి. అందుకే ఈ కిడ్డీ జిమ్‌లు... తమ చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ వ్యక్తిత్వాన్నీ మెరుగుపరిచే శిక్షణ కేంద్రాలుగా భావిస్తున్నారు నేటితరం అమ్మానాన్నలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని