నీరు.. గాలి నుంచి తయారు!

నీటి బిందె మోస్తూ మైళ్లకొద్దీ నడిచే ఏ మహిళో అనుకునే ఉంటుంది... పగవాళ్లకి కూడా ఈ కష్టమొద్దు, గాలిలాగే నీరు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరికేలా చెయ్యి దేవుడా అని. ఆ కోరిక ఫలించింది. ఆమెలాంటి ఎందరో మహిళల కష్టాలకు తెరదించింది.

Updated : 06 Feb 2022 04:13 IST

నీరు.. గాలి నుంచి తయారు!

నీటి బిందె మోస్తూ మైళ్లకొద్దీ నడిచే ఏ మహిళో అనుకునే ఉంటుంది... పగవాళ్లకి కూడా ఈ కష్టమొద్దు, గాలిలాగే నీరు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరికేలా చెయ్యి దేవుడా అని. ఆ కోరిక ఫలించింది. ఆమెలాంటి ఎందరో మహిళల కష్టాలకు తెరదించింది. కొన్ని దశాబ్దాల పాటు ప్రయోగాల్లో నలిగి, ఫరవాలేదు- నమ్మదగినదేనన్న గ్యారంటీ పుచ్చుకుని ఎట్టకేలకు ఇప్పుడు ప్రపంచమంతటా అందుబాటులోకి వచ్చింది... గాలి నుంచి నీరు తీసే విధానం. పరిశ్రమల్లో, ఆఫీసుల్లో, బడుల్లో, ఆఖరికి ఇళ్లలోనూ... ఇప్పుడు ‘అట్మాస్ఫెరిక్‌ వాటర్‌ జనరేటర్స్‌’ పెట్టుకోవచ్చు. స్వచ్ఛమైన నీటిని తయారుచేసుకోవచ్చు! నమ్మలేకపోతున్నారా... అయితే ఇది చూడండి మరి..!

ఫ్రిజ్‌లోనుంచి సీసా తీసి అందులోని చల్లటి నీటిని గ్లాసులో పోసి టేబుల్‌ మీద పెడితే, ఐదు నిమిషాలకల్లా ఆ గ్లాసువెలుపలి భాగమంతా చిన్న చిన్న నీటి బిందువులతో నిండి ఉండటం... మనం చాలాసార్లు చూసిన దృశ్యమే కదా. ఎలా తయారయ్యాయి ఆ నీటి బిందువులు..?

చల్లటి నీటిని పోసినందువల్ల గ్లాసు చల్లబడుతుంది. బయట వాతావరణంలో ఉన్న గాలి ఆ చల్లని గ్లాసుని తాకినప్పుడు అది ఘనీభవించి నీరుగా మారుతోంది. ఈచిరపరిచితమైన దృశ్యమూ దాని వెనక ఉన్న సైన్సు పాఠమూ ఎన్నో ప్రయోగాలకు స్ఫూర్తినిచ్చింది. గాలిని చల్లని గొట్టం గుండా పంపిస్తే నీరు తయారవుతుందన్న ఆశ కలిగించింది. ఆ ఆశే... బిందువూ బిందువూ కలిసి సింధువవుతుందన్న నానుడిని నిజం చేస్తూ ఇప్పుడు వాటర్‌ ఏటీఎంలను మన ముంగిటికి తెచ్చింది.

నీటి కరవు సమస్య ఎదుర్కొనని దేశం లేదు. పెద్ద పెద్ద నగరాలను మినహాయిస్తే, ఎంత అభివృద్ధిచెందిన దేశంలో అయినా నీటి కొరతతో బాధపడే మారుమూల ప్రాంతాలు కొన్ని తప్పకుండా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో రెండొందల కోట్లకు పైగా ప్రజలకు శుభ్రమైన తాగునీరు దొరకడం లేదు. ప్రతి పది మందిలోనూ ఒకరికి అసలు మంచినీరు అందుబాటులో లేదట. 2025 నాటికి ప్రపంచంలో నాలుగో వంతూ, 2050 నాటికి 87 దేశాలూ పూర్తిగా నీటికి మొహం వాచే పరిస్థితికి చేరుకుంటాయని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల అన్వేషణ తప్పదు కదా మరి. ఆ క్రమంలో అందుబాటులోకి వచ్చిందే ఈ కొత్త విధానం.

మనిషికి నీటిని సొంతంగా తయారుచేసుకోవాలన్న కోరిక ఇప్పటిది కాదు. నీరొక్కటీ అందుబాటులో ఉంటే మనిషి ఏ పనైనా చేయగలడు. అదే లేకపోతే శక్తియుక్తులన్నీ ఆ నీటి సంపాదనకే వెచ్చించాల్సి వస్తుంది. అందుకే మాయా, ఇన్కా... తదితర పురాతన నాగరికతల సమయంలోనే రకరకాల పద్ధతుల ద్వారా గాలినుంచి నీటిని సేకరించి అత్యవసర పరిస్థితుల్లో వాడుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆచరిత్రకు తోడు ప్రకృతీ పలు విషయాల్లో మనిషికి ప్రేరణగా నిలవడం మనకి తెలుసు. నమీబియా ఎడారిలో కనిపించే ఒక చిన్న బీటిల్‌ నీటిని తయారుచేసుకునే మొట్టమొదటి ప్రయోగాలకు స్ఫూర్తినిచ్చిందంటే నమ్మగలరా..? నల్లని ఆ బీటిల్‌ పెంకులాగా ఉండే తన చర్మాన్ని- వీచే గాలికి ఎదురుగా తెరలాగాలేపి ఒక పక్కకి వంగి నిలబడుతుందట. గాలిలోని తేమ నీటి అణువులుగా మారి దాని పెంకు మీద చుక్కలుచుక్కలుగా ఏర్పడి చివరికి అన్నీ కలిసి దాని నోట్లోకి జారేలా ఉంటుందట ఆ నిలబడే పద్ధతి. దాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు అచ్చం అలాంటి పద్ధతిలోనే గాలిలో ఉన్న తేమనుంచి నీటిని సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఊరి వెలుపల కొండవాలుల్లో పెద్ద పెద్ద ఇనుప, వెదురు తెరలు(ఫాగ్‌ నెట్స్‌) కట్టి మంచు నుంచి నీటిని సేకరించే విధానం పలు ఆఫ్రికన్‌ దేశాల్లో ఆచరణలో ఉంది. చిన్న చిన్న ఫ్యాన్లద్వారా గాలిని గొట్టంలోకి లాగి దాన్ని చల్లని పైపు లోంచి పంపుతూ తయారైన నీటిని ఒక ట్యాంకులో సేకరించడం- ఎడారి ప్రాంతాల్లో అమల్లో ఉంది.

అయితే ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా దాహం తీర్చేవి. అలా కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లేలా నీటిని తయారుచేసే యంత్రం ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది... మంచుకొండల్లో, ఎడారుల్లో, నడి సముద్రంలో - సైన్యం కాపలా కాస్తుంటుంది. పరిశోధకులు అధ్యయనాలు చేస్తుంటారు. వాళ్లకి తాగునీటిని పంపించడం కష్టమే కాదు బోలెడు ఖర్చుతో కూడుకున్నది కూడా. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తాగునీటిని సమకూర్చడం ఎంత పెద్ద పనో. ఇక నీటి కరవు ఎదుర్కొనే ప్రాంతాల సంగతి చెప్పనక్కరలేదు. ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం కనుక్కోవాలన్న ప్రయత్నమే ‘అట్మాస్ఫెరిక్‌ వాటర్‌ జనరేటర్ల (ఏడబ్ల్యూజీ)’ తయారీకి దారితీసింది.

వాటర్‌ జనరేటర్లా..?

అవును, డీజిల్‌ జనరేటర్లతో కరెంటుని తయారుచేసుకున్నట్లే కరెంటుతో పనిచేసే జనరేటర్లతో ఇప్పుడు నీటిని తయారుచేస్తున్నారు. మన చుట్టూ ఉన్న గాలే వీటికి కావలసిన ముడిసరకు. అట్మాస్ఫెరిక్‌ వాటర్‌ జనరేటర్‌(ఏడబ్ల్యూజీ)... ఫ్రిజ్‌ లాగా ఉండే పరికరం. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి వీలుగా ఉండే ఈ పరికరం ముందుగా వాతావరణంలోనుంచి గాలిని లోపలికి లాక్కుంటుంది. ఆ గాలిని నాలుగైదు దశల్లో వడపోసి మలినాలనన్నిటినీ తీసేస్తాయి లోపల ఉన్న ఫిల్టర్లు. 10 మైక్రాన్ల సైజు- అంటే అత్యంత సూక్ష్మమైన
కాలుష్య రేణువులను కూడా ఈ ఫిల్టర్లు అడ్డుకుంటాయి. అలా శుభ్రమైన గాలి కండెన్సర్‌ మీదుగా వెళ్తుంది. అందులో ఉండే చల్లటి కాయిల్స్‌ వల్ల గాలిలో ఉన్న ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ పరమాణువులు సంయోగం చెంది నీటి బిందువులు ఏర్పడతాయి. ఆ నీరంతా ఒక్కో చుక్కా చొప్పున పక్కనే ఉన్న ట్యాంకులోకి చేరుతుంది. గాలి ఆగిపోవడం అంటూ ఉండదు కాబట్టి ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ నీటిని తయారుచేస్తూనే ఉంటుంది.

అలా తయారైన నీరు కూడా మరోసారి వడపోత ప్రక్రియకు లోనవుతుంది. ఆ తర్వాత యూవీ స్టెరిలైజేషన్‌, ఓజోనైజేషన్‌ ప్రక్రియల అనంతరం అవసరమైన ఖనిజాలను కలుపుతారు. పరికరంలోపలే ఈ పనులన్నీ ముగించుకుని స్వచ్ఛమైన నీరు తాగడానికి సిద్ధంగా బయటకు వస్తుంది. ఎయిర్‌ వాటర్‌ జనరేటర్‌ యంత్రాల సామర్థ్యాన్ని బట్టి ఎంత నీరు తయారవడమన్నది ఆధారపడి ఉంటుంది.

ఎవరు తయారుచేస్తున్నారు?

దాదాపు పదేళ్లక్రితమే వీటిని మన దగ్గర వాడడం మొదలుపెట్టారు. ‘2004లో మొదటి సారి ఈ విధానం గురించి అమెరికాలో విన్నప్పుడు గాలినుంచి నీళ్లా... భలే కథ చెబుతున్నారే అంటూ నవ్వేశాం. ఆ మెషీన్లను బాగా పరిశీలించి చూశాక నిజంగానే ఆశ్చర్యపోయాం. ఆ పద్ధతి మన దేశంలో చాలా అవసరం కదా అనిపించింది. వెంటనే ఆ మెషీన్లను ఇక్కడ తయారుచేసి దిల్లీలో ‘వాటర్‌ ఆసియా ప్రదర్శన’లో పెట్టినప్పుడు ప్రజలు కళ్లింత చేసుకుని చూశారు. మాలాగా వాళ్లు నవ్వలేదు, నీళ్లు సంపాదించడం ఎంత కష్టమైన సమస్యో వారికి తెలుసు కాబట్టి మ్యాజిక్‌తో అయినాసరే నీళ్లను సృష్టించగలిగితే చాలనుకునేవారు. అందుకే నిశితంగా పరిశీలించారు. పైకి కనపడకుండా ఎక్కడినుంచైనా పైపు కనెక్షన్‌ ఉందేమోనని మెషీన్‌ చుట్టూ తిరిగి చూసి అలాంటివేమీ లేవని నిర్ధారించుకున్నాక, నిజంగానే పనిచేస్తోందని ఎంతో సంతోషించారు...’ అంటూ తొలిరోజుల్ని గుర్తుచేసుకుంటారు ‘వాటర్‌మేకర్స్‌ ఇండియా’ సంస్థని స్థాపించిన సామాజిక వ్యాపారవేత్త మెహెర్‌ భండారా. ఈ సంస్థ రోజుకు 120 నుంచి 5000 లీటర్ల వరకు రకరకాల సామర్థ్యాల్లో నీటిని ఉత్పత్తిచేసే వాటర్‌ జనరేటర్లను తయారుచేస్తోంది. విదేశాలకూ ఎగుమతి చేస్తోంది. సాధారణంగానే ఉష్ణోగ్రతలూ గాలిలో తేమా ఎక్కువగా ఉండే మన వాతావరణంలో తమ సాంకేతికత బాగా పనిచేస్తోందంటారు మెహెర్‌. ఆమె తమ సంస్థ సామాజిక బాధ్యత కింద తొలి ప్రాజెక్టుని 2009లో తూర్పుగోదావరి జిల్లా జలిముడి గ్రామంలో ఏర్పాటుచేశారు. అప్పటివరకూ రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి గోదావరి నుంచి మంచినీళ్లు తెచ్చుకునే గృహిణులు ఈ వాటర్‌ స్టేషన్‌ను చూసి ఎంతో సంతోషించారట. ఆ తర్వాత గుజరాత్‌లోని గాంధీగ్రామ్‌లో, ముంబయి రైల్వే స్టేషన్లలో... గత పన్నెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో వీరి వాటర్‌ స్టేషన్లు పనిచేస్తున్నాయి. 

ఐఐటీ మద్రాస్‌ ఇంక్యుబేటెడ్‌ కంపెనీ అయిన ‘వాయుజల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, కోల్‌కతాకి చెందిన ‘అక్వో’ కంపెనీ తయారుచేసిన పరికరాలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. ఇళ్లలో వాడకానికీ, పరిశ్రమల్లో వాడకానికీ వేర్వేరుగా వీటిని తయారుచేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఏడబ్ల్యూజీలను తయారుచేసే పరిశ్రమలున్నాయి.

ఎప్పుడూ చూడలేదే..?

మామూలు వాటర్‌ కూలర్లలాగా కనిపించడం వల్ల చాలామంది గమనించి ఉండకపోవచ్చు కానీ ఇప్పటికే పలుచోట్ల ఇవి ఉత్పత్తిచేసిన నీటిని వాడుతున్నాం. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన వాటర్‌కియోస్క్‌ రోజుకు వెయ్యిలీటర్ల మినరల్‌ వాటర్‌ని అందిస్తోంది. అమెజాన్‌- మైక్రోసాఫ్ట్‌ ఆఫీసుల్లో, అమెరికా దౌత్య కార్యాలయంలో, విశాఖ బీచ్‌లో, రామేశ్వరంలోని అబ్దుల్‌ కలాం స్మారకకేంద్రంలో, బెంగళూరు జనరల్‌ ఆస్పత్రిలో, దెహరాదూన్‌ పబ్లిక్‌ స్కూల్లో... ఇలా ఎన్నోచోట్ల ఈ వాటర్‌ జనరేటర్లు స్వచ్ఛమైన నీటిని అందిస్తూ దాహం తీరుస్తున్నాయి. కేరళ వరదలప్పుడు బురద నీటిమధ్య చిక్కుకున్న బాధితుల దాహం తీర్చింది వీటితోనే. హైదరాబాద్‌కి చెందిన మైత్రీ అక్వాటెక్‌ సంస్థ తయారుచేస్తున్న ఏడబ్ల్యూజీలకు కేంద్ర జలశక్తి మిషన్‌ గుర్తింపు లభించింది. వీటి ద్వారా తయారైన నీరు నాణ్యమైనదేనని భారత ప్రమాణాల సంస్థ(బీఐఎస్‌) కూడా నిర్ధారించింది. సైన్యంలో సిబ్బంది వినియోగం కోసం భారత్‌ ఎలక్ట్రానిక్‌ సంస్థ వీటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. మైత్రీ సంస్థ తయారుచేస్తున్న మేఘదూత్‌ ఏడబ్ల్యూజీలను మనదేశంలోనే కాక ముప్ఫైదాకా ఇతర దేశాల్లోనూ వినియోగిస్తున్నారు. రోజుకు పాతిక లీటర్ల సామర్థ్యంతో మొదలుపెట్టి కొన్ని వేల లీటర్ల నీటిని ఉత్పత్తి చేయగల మెషీన్లవరకూ మొత్తం ఐదు మోడల్స్‌లో వీటిని తయారుచేస్తున్నారు. రాను రాను వీటి అవసరం పెరుగుతుంది కాబట్టి మరికొన్ని అంకుర సంస్థలూ ఈ రంగంలోకి వస్తున్నాయి.

అంత అవసరం ఉందా..?

భూమి మీద నీటివనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. మనం వాడినకొద్దీ అవి తరిగిపోతున్నాయే కానీ తిరిగి భర్తీ కావడం లేదు. అందుకే నీటికరవు ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. ఉపరితల జలవనరులైన నదులూ చెరువుల్లాంటివేమో కలుషితాల బారిన పడుతున్నాయి. పారిశ్రామిక కాలుష్యాలూ పురుగుమందులూ రసాయన ఎరువులూ కలిసిన నీళ్లను తాగడం వల్ల వచ్చే రోగాలు నానాటికీ పెరుగుతున్నాయి. మరోపక్క భూగర్భజలాలేమో అడుగంటిపోతున్నాయి. వాటిమీద ఒత్తిడి తగ్గాలంటే ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పదు. పలు దేశాల్లో సముద్రాల్లోని ఉప్పునీటిని మంచినీటిగా మార్చుకుని ఉపయోగించుకుంటున్నారు. దీనికైనా, కలుషిత జలాలను శుద్ధిచేసి వాడుకోవడానికైనా చాలా ఖర్చవుతుంది. అందుకే అన్ని దేశాలూ ఆ పని చేయలేకపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాల్లో ఇప్పుడు నీటి సమస్య- అనారోగ్యాలకీ, కరవుకీ, వలసలకీ ప్రధాన కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో భూమి అంతటా వ్యాపించి ఉన్న గాలినుంచి కొద్దిపాటి తేమను తీసుకుని నీరుగా మార్చుకోగలగడం గొప్ప అవకాశమే కదా..! పైగా అది అయిపోతుందన్న భయమూ లేదు. అందుకే కేవలం తాగునీటి అవసరాలకే కాదు, వాటర్‌ జనరేటర్లను ఇతర అవసరాలకీ ఉపయోగిస్తున్నారు.

అదెలా..?

కెన్యాలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో జంతువుల దాహార్తిని తీర్చడానికి ఏడబ్ల్యూజీలనే వాడుతున్నారు. సౌదీలో సాగునీటికీ ఇవే ఆధారమయ్యాయి.ప్రధానంగా మైక్రో ఇరిగేషన్‌లో, వర్టికల్‌ ఫామింగ్‌లో నీరు కొద్దిగా ఉంటే సరిపోతుంది కాబట్టి వాటర్‌ జనరేటర్లు బాగా పని
కొస్తున్నాయి. గ్రీన్‌హౌసుల్లో పంటలు పండించేటప్పుడు లోపల విడుదలయ్యే గాలి వేడిగా ఉంటుంది. అందులో తేమ శాతం కూడా ఎక్కువే. దాంతో అలాంటి చోట వాటర్‌ జనరేటర్లను వాడితే పంటలకు అవసరమైన మంచినీటిని అక్కడికక్కడే తయారుచేసుకోవచ్చు. ఒమన్‌లో కొన్ని గ్రీన్‌హౌస్‌ సంస్థలు అలాగే చేస్తున్నాయి. ప్రధాన భూభాగానికి దూరంగా ఉండే చిన్న చిన్న ద్వీపాలవారికి ఒకప్పుడు ఓడల్లో తాగునీటిని రవాణా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాటర్‌ జనరేటర్లు వారిని ఆదుకుంటున్నాయి.

వాటర్‌ జనరేటర్లే కాదు, మరికొన్ని రకాలుగానూ ఇప్పుడు నీరు తయారవుతోంది. ఏసీ వాడినప్పుడు ఒక పక్కనుంచి చుక్క చుక్కగా నీరు పడడం మనకు తెలుసు. ఇప్పుడు ఇటు ఇంట్లో ఏసీగా ఉపయోగపడుతూనే నీటినీ తయారుచేసుకునే హైబ్రిడ్‌ మెషీన్ల తయారీ దిశగానూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ని ఇంధనంగా వాడేటప్పుడు కారు ఎనిమిది మైళ్లు ప్రయాణం చేస్తే ఒక లీటరు నీరు కూడా తయారవుతుంది. ఉప ఉత్పత్తిగా పరిగణించి ఇప్పటివరకూ వృథాగా పారేస్తున్న ఈ నీరు నిజానికి చాలా స్వచ్ఛమైన నీరు. అందుకే ఇప్పుడు తాగునీటిగా ఉపయోగించుకునేందుకు వీలుగా వాటిని భద్రంగా సేకరించుకునేందుకు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు.

ఏడబ్ల్యూజీలకు కరెంటు కావాలిగా?

కరెంటు అవసరమే కానీ మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇళ్లలో వాడే వాటికి నామమాత్రపు కరెంటు చాలు. దాని బదులు సౌరశక్తిని వాడుకుంటే పూర్తి పర్యావరణహితమైన విధానం అవుతుంది. పారిశ్రామిక అవసరాలకూ, గ్రామాల్లో, రైల్వే స్టేషన్లలో పెట్టడానికీ పెద్ద పెద్ద జనరేటర్లు తయారుచేస్తున్న కంపెనీలు సౌరశక్తిని వినియోగించుకునే మోడల్‌లోనే తయారుచేస్తున్నాయి. కాబట్టి యంత్రానికి అయ్యే ఖర్చు తప్ప ఇతర నిర్వహణ ఖర్చు తక్కువే. గాలిలో తేమ ఇరవై శాతానికన్నా తగ్గే అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఈ యంత్రం పనితీరుకు ఢోకా లేదు. గాలిని శుభ్రం చేసే ఫిల్టర్లను మాత్రం అప్పుడప్పుడూ మార్చుకుంటూ ఉంటే చాలు.

ఎలాంటి కాలుష్యాలూ లేని స్వచ్ఛమైన నీటినిచ్చే ఈ విధానం వల్ల ఇంకో లాభం కూడా ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీరూ ఆహారం ద్వారా అందాల్సిన అవసరమైన లవణాలూ ఖనిజాలూ అందక సూక్ష్మపోషకాల లోపంతో అనారోగ్యం పాలవుతుంటారు. అలాంటివారికి కావలసిన అదనపు పోషకాలను ఈ నీటిలో కలిపి ఇవ్వవచ్చు.

‘వాటర్‌ ఆఫ్‌ ఇండియా’ అంటూ ఒకప్పుడు మెజీషియన్లు ఒక ట్రిక్‌ చూపించేవారు. ఒక పాత్రలోనుంచి ఎన్నిసార్లు వంపినా నీళ్లు వస్తూనే ఉండేవి... అది ఇంద్రజాలం చేసిన కనికట్టు.

ఏ ముడిసరకూ అక్కర్లేకుండా ఒక యంత్రం అలా గాలిని పీల్చుకుని ఇలా నీటిని ఇవ్వడం మాత్రం నూటికి నూరుపాళ్లూ నిజం... ఇది సైన్సు మహిమ..!


ఎన్నెన్నో పద్ధతులు

గాలినుంచి నీటిని తయారుచేసుకోవడం సాధ్యమే అని తెలిశాక తమ సృజనకు పదును పెట్టి రకరకాల పరికరాలను తయారుచేస్తున్నారు శాస్త్రవేత్తలూ ఇంజినీర్లూ. వాటిల్లో కొన్ని...

* కాలిఫోర్నియాకి చెందిన సునామీ ప్రోడక్ట్స్‌ అనే కంపెనీ అచ్చం ఎయిర్‌ కండిషనర్‌లాగా పనిచేసే నీటి మెషీన్‌ని తయారుచేసింది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే తీరప్రాంతాల్లో చాలా బాగా పనిచేసే ఈ మెషీన్‌తో ఒకేసారి భవనాలకు ఏసీనీ, తాగునీటినీ సరఫరా చేయొచ్చట.  
* యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు కరెంటు లేకుండానే నీటిని ఉత్పత్తిచేసే పరికరాన్ని తయారుచేశారు. దీనిలోపల ప్రత్యేకమైన హైడ్రోజెల్‌ ఉంటుంది. అది గాలిలోని తేమని ఆకర్షించి పీల్చుకుంటుంది. దాన్ని కాస్త ఎండలో పెడితే చాలు- పీల్చుకున్న తేమ అంతా నీరుగా మారి బయటకు వచ్చేస్తుంది. అత్యంత చౌకగా నీటిని తయారుచేసే ఈ విధానాన్ని పేద దేశాల్లో తాగునీటి సరఫరాకి వినియోగిస్తున్నారు.
* వుయ్‌డ్యూ అనే కంపెనీ తయారుచేసిన పెద్ద బాక్స్‌లాంటి పరికరం ఏకంగా రోజుకు రెండువేల లీటర్ల నీటిని తయారుచేస్తూ ‘ఎక్స్‌ప్రైజ్‌’ని గెలుచుకుంది. ఈ పరికరంలోపల గడ్డి లాంటి పనికిరాని చెత్త ఏదయినా వేయాలి. దానివల్ల ఇటు నీరూ తయారవుతుంది, అటు వేసిన చెత్త సేంద్రియ ఎరువుగానూ మారుతుంది.
* ఫాంటస్‌ ఏరో బాటిల్‌ ఒకటి వెంట ఉంటే చాలు- అడవుల్లోకి, ఎడారిలోకి... ఎక్కడికెళ్లినా దాహం వేస్తే ఎలా అన్న భయం ఉండదు. నీటిని తయారుచేసే వ్యవస్థా, అది పనిచేయడానికి కావలసిన బ్యాటరీ అన్నీ ఆ చిన్ని బాటిల్‌కే అమర్చి ఉంటాయి. దాంతో సీసానే స్వయంగా నీటిని తయారుచేసుకుని ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉంటుంది. ఆస్ట్రియాకి చెందిన ఓ ఇంజినీరు తయారుచేసిన ఈ బాటిల్‌ని సాహసయాత్రికులూ మారథాన్‌ రన్నర్లూ ఉత్సాహంగా వాడేస్తున్నారట.
* సోలార్‌ పానెల్స్‌తో కరెంటు తయారుచేసుకున్నట్లే సోలార్‌ హైడ్రో పానెల్స్‌తో అటు కరెంటునీ ఇటు నీటినీ ఉత్పత్తిచేసే విధానాన్నీ అభివృద్ధి చేశారు.
* నెదర్లాండ్స్‌కి చెందిన ఓ సంస్థ గాలిమర సాయంతో కరెంటు బదులు నీటిని తయారుచేస్తోంది. భూగర్భజలాలు ఏమాత్రం లేని ఆ దేశానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.  
* క్లీన్‌వరల్డ్‌ లిమిటెడ్‌ తయారుచేసిన ఏడబ్ల్యూజీలో నీరు ఉత్పత్తవడమే కాక మన అవసరానికి తగినట్లు వేడి నీటినీ చల్లటి నీటినీ విడివిడిగా పొందవచ్చు.

- బి.ఎన్‌.జ్యోతిప్రసాద్‌, ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..