మంచినీళ్లు కావాలంటే... మంచుపెళ్లలు కరిగించాల్సిందే..!

‘అబ్బో ఎంత చలో’ అంటూ తుపాను ప్రభావంతో నాలుగు రోజులపాటు వీచే శీతగాలులకే గజగజలాడిపోతుంటాం.

Updated : 18 Dec 2022 12:19 IST

మంచినీళ్లు కావాలంటే... మంచుపెళ్లలు కరిగించాల్సిందే..!

‘అబ్బో ఎంత చలో’ అంటూ తుపాను ప్రభావంతో నాలుగు రోజులపాటు వీచే శీతగాలులకే గజగజలాడిపోతుంటాం. మరి, మైనస్‌ డిగ్రీల చలిలో హిమాలయ సానువుల్లో నివసించే వాళ్ల పరిస్థితి ఏమిటి? ఊహించుకుంటేనే వెన్నులోంచి వణుకొస్తోంది కదూ. కానీ  -45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ప్రపంచంలోనే రెండో నివాసిత చలి ప్రదేశంగా పేరొందిన ద్రాస్‌ పట్టణంలో ఆ చలిని తట్టుకుంటూ స్థానికులు హాయిగా జీవిస్తూ ఐస్‌ హాకీ, స్కేటింగ్‌... వంటి ఆటలతో పర్యటకుల్నీ ఆకర్షిస్తున్నారు.

చుట్టూ కొండలూ లోయలతో పారే నదీ ప్రవాహంతో చూడముచ్చటగా ఉంటుంది ద్రాస్‌. సముద్రమట్టానికి సుమారు 10,990 అడుగుల ఎత్తులో ఉన్న ఓ చిన్న కొండ పట్టణం ఇది. కార్గిల్‌కీ జోజిలాపాస్‌కీ మధ్య ఉన్న ఎన్‌హెచ్‌-వన్‌ రహదారిలో ఉంటుంది. 1999నాటి కార్గిల్‌ యుద్ధం కారణంగానూ, లద్ధాఖ్‌కి ప్రవేశద్వారం కావడంతోనూ ట్రెక్కింగ్‌ ప్రియుల్నీ ద్రాస్‌ ఆకర్షిస్తోంది. పైగా ఐస్‌ హాకీ, స్కేటింగ్‌... వంటి క్రీడల్ని ప్రోత్సహించడంతో అక్కడకు వెళ్లేవాళ్ల సంఖ్యా పెరిగింది.

ద్రాస్‌... చిన్న ఊరు. చెక్కలతోనూ ఇటుకలతోనూ మట్టితోనూ కట్టిన ఇళ్లూ దుకాణాలూ రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి. ఈ ఊరి అసలు పేరు హెమ్‌-బాబ్స్‌... అంటే మంచు నేల అని అర్థం. చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రత మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌. కానీ చాలాసార్లు ఇది మైనస్‌ 30 నుంచి 45 డిగ్రీలకు పడిపోతుంటుంది. 1995లో- రష్యాలోని వ్యోమ్యకాన్‌లో మాదిరిగా -60 సెల్సియస్‌ డిగ్రీలు నమోదు కావడం విశేషం. అక్టోబర్‌ నుంచి మే మధ్య వరకూ చలికాలమే. నవంబరు-డిసెంబరు నెలల్లో చలి తీవ్రత ఎక్కువ. అక్కడ నివసించే ప్రజలు మాత్రం ఆ చలికీ మంచు తుపానులకీ ఏమాత్రం భయపడరు సరికదా... ఆ కాలాన్నీ హాయిగా గడిపేస్తారు.

ఎవరు వీళ్లు?

ఇండో-ఆర్యన్లయిన షినా, టిబెటన్‌ ప్రాంతానికి చెందిన బాల్టి తెగల ప్రజలు ద్రాస్‌లో నివసిస్తున్నారు. వీళ్లు దృఢంగా ఉంటారు.ఎక్కువ శాతం ముస్లింలే. కొద్దిమంది బౌద్ధులు. కొన్ని వందల సంవత్సరాల క్రితం- ఈ ప్రాంతానికి వలస వచ్చిన షినా తెగ నేటికీ తమ సంస్కృతిని కాపాడుకుంటూ జీవిస్తున్నారు. వీళ్లు పశువుల్నీ గుర్రాల్నీ పెంచుతారు. బార్లీ, బక్‌వీట్‌ ప్రధాన పంటలు. బార్లీపిండి తోనే రొట్టెలు చేసుకుంటారు. జావ చేసుకుని మటన్‌ సూప్‌తో కలిపి తాగుతారు. ఇది చాలావరకూ చలిని తగ్గిస్తుందట. బీఫ్‌, బంగాళాదుంపల్నీ కూడా తింటుంటారు. మందపాటి ఉన్ని దుస్తులు ధరించి, నేలమాళిగలో ఉన్న వంటింట్లోనో హాల్లోనో కాలక్షేపం చేస్తుంటారు. ప్రతి ఇంటిలోనూ ఫైర్‌ ప్లేస్‌ తప్పనిసరి. మైనస్‌ 45 డిగ్రీల సెల్సియస్‌కన్నా ఉష్ణోగ్రత తక్కువకి పడిపోయినప్పుడు జీవనం కష్టమనే చెప్పాలి. జంతువులు చలి ధాటికి తట్టుకోలేక చనిపోతుంటాయి. అందుకే కాస్త డబ్బూ పరపతీ ఉన్నవాళ్లు చలికాలం వస్తుందనగానే జమ్మూ, చండీగఢ్‌, శ్రీనగర్‌లకు తరలి వెళతారు. కానీ ఎక్కువశాతం అక్కడే ఉంటారు. ప్రమాదకరమైన రహదారిగా పేరొందిన జోజిలాపాస్‌ గుండా ప్రయాణించడం ద్రాస్‌ ప్రజలకే సాధ్యం. సూదిమొన అంచుల్లో ప్రయాణిస్తున్నట్లే ఉంటుందా దారి. వణికించే చలి, మంచు తుపాన్‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే ఆ మార్గంలో ప్రయాణించాలంటే వేసవిలోనూ వీళ్ల సహాయం తప్పనిసరి.

శీతకాలంలో ద్రాస్‌తోపాటు చుట్టుపక్కలున్న గ్రామాలన్నీ మంచు ముసుగేసుకున్నట్లే ఉంటాయి. సరస్సులన్నీ గడ్డకట్టుకుపోయి, నేలంతా తెల్లని ఎడారిని తలపిస్తుంది. దారి కనిపించదు. ఉదయాన్నే మంచును పక్కకు తొలగించుకుంటూ జీవనం సాగించాల్సిందే. అందుకే చలి తీవ్రత ఎక్కువగా ఉండే- నవంబరు నెలాఖరు నుంచి జనవరి వరకూ శ్రీనగర్‌- లెహ్‌ దారిని మూసేస్తారు... పరిస్థితిని బట్టి ఏప్రిల్‌ వరకూ పొడిగిస్తుంటారు. స్కూళ్లకూ సెలవులు ఇచ్చేయడంతో చిన్నా పెద్దా అంతా ఇళ్లకే పరిమితమవుతారు. ఇళ్లలోని కమోడ్‌లూ పనిచేయవు. దాంతో బిర్రబిగుసుకుపోయే మంచులోనే కాలకృత్యాలు కానిస్తారు. కొన్నిచోట్ల మున్సిపల్‌ కుళాయిలను తిప్పే ఉంచడంతో పగలూ రాత్రీ వాటిల్లోంచి నీళ్లు వస్తూనే ఉంటాయి. ఒకసారిగానీ వాటిని బంద్‌ చేస్తే అవి బిగుసుకుపోయి వేసవి వచ్చేవరకూ తిప్పలేమట.

ఇక, నదులూ పైపులైన్లలోని నీళ్లూ గడ్డకట్టుకుపోతాయి. ఆ సమయంలో స్థానికులకు వేడినీటి కొలనుల్లోని నీరే శరణ్యం. అందుకే ఆ మంచులోనే నడుచుకుంటూ వెళ్లి ఆ నీటిని తెచ్చుకుంటారు. అలా వెళ్లలేనివాళ్లు గడ్డపారతో నదికి రంధ్రం చేసి బావిలో మాదిరిగా నీళ్లు తోడుకుంటారు. ఈమధ్య పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తోంది. కానీ ఒక్కోసారి మంచు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు- ఇంజిన్లు మొరాయించడంతో గాడిదలు, గుర్రాలమీదే పంపిణీ చేస్తుంటారు. లేని పక్షంలో ఆ మంచుపెళ్లల్నే కరిగించుకుని వాడుకుంటారు. అందుకే గ్యాస్‌స్టవ్‌లు ఉన్నా వంటింట్లో కట్టెల పొయ్యిలు రాత్రీపగలూ మండుతూనే ఉంటాయి.

జంతువుల్ని వేలాడదీసి...

బార్లీతోపాటు మాంసాహారాన్నీ ఎక్కువగా తింటారు ద్రాస్‌ ప్రజలు. అందుకే చలికాలం ప్రారంభంలోనే జడలబర్రె, మేక, గొర్రె... వంటి జంతువుల్ని చంపి, దాన్ని చర్మంతోనే ఇంట్లోని స్టోర్‌రూమ్‌లో వేలాడదీసుకుంటారు. దాన్నుంచి సరిపడా మాంసాన్ని కావాల్సినప్పుడు కోసుకుంటారు.

ఈ పద్ధతిలో కుటుంబసభ్యుల సంఖ్యను బట్టి రెండు వందల కిలోల వరకూ నిల్వ చేస్తారట. అయితే గొర్రె, మేక కన్నా జడలబర్రె మాంసమే అక్కడ చౌక. మాంసంతోపాటు దుంప కూరలూ పప్పులూ ధాన్యాలూ కూడా ఇంట్లో నిల్వ చేసుకుంటారు. వీటిని నిల్వ చేసుకునేందుకు ఫ్రిజ్‌ అవసరం ఉండదు. ఆహారం చల్లబడకుండా ఉంటుందని కుటుంబీకులంతా పొయ్యి దగ్గరే కూర్చుని తింటారు. ఇళ్లమీద ఎండుగడ్డిని కప్పడంవల్ల కొంత చలి తగ్గుతుందట.

చలికాలంలో వృద్ధులు బయటకు అడుగుపెట్టరు. కానీ ఇక్కడ పోలో ఛాంపియన్‌ షిప్‌ను నిర్వహిస్తుండటంతో కొందరు యువకులు స్కీయింగ్‌ చేస్తూ పోలో ఆడుతూ కనిపిస్తుంటారు. ద్రాస్‌ యువకులు చదువుకుంటారు కానీ తమకున్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించడానికే ఇష్టపడతారట. ఇటీవల టూరిస్టుల సంఖ్య పెరగడంతో హోమ్‌ స్టేలతోనూ కొంత ఆదాయం వస్తోందట. ద్రాస్‌ మహిళలు కష్టజీవులు. చలికాలంలో స్వెటర్లు అల్లుకుంటూ గడిపినా మిగిలిన కాలంలో వ్యవసాయ పనులకు వెళతారు.  
వేసవి రాగానే తెల్లని మంచు అదృశ్యమై లోయంతా రంగురంగుల పూలతో విచ్చుకుని దేవలోకాన్నే మరిపిస్తుంది. అందుకే ఈ చలి మమ్మల్ని ఏమాత్రం బాధించదు అంటారు స్థానికులు. మే నుంచి నవంబరు వరకూ పగలంతా ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం కాగానే చల్లని గాలులు వణికిస్తాయి. కానీ ఆ కాలంలో పచ్చని పంటలతోనూ విల్లో, అప్రికాట్‌, ఆపిల్‌ తోటలతోనూ లోయ కళకళలాడుతుంటుంది. అక్కడ ఆడే పోలో చూడ్డానికి చాలామంది వస్తుంటారు. ఇక్కడికి వచ్చే పర్యటకులతో తమ అనుభవాల్నీ స్థానిక విశేషాల్నీ కథలు కథలుగా చెబుతూ ఎంతో స్నేహంగా మెలుగుతారు ద్రాస్‌ ప్రజలు.

ద్రాస్‌ శివార్లలోని భీమ్‌పేట్‌లో ఉన్న ఓ పెద్ద రాయిని భీముడుగా భావించడంతోపాటు, దానికి రోగాల్ని నివారించే శక్తి ఉందనీ నమ్ముతారు. ఒక్క నేరం కూడా నమోదుకాని డాంగ్‌చిక్‌ అనే మోడల్‌ గ్రామం ద్రాస్‌కు పది కి.మీ. దూరంలోనే ఉంది. ఇంకా, మన్‌మన్‌ శిఖరం, ఇండో-పాక్‌ మధ్య ఉన్న నియంత్రణ రేఖ, ఐదు కి.మీ. దూరంలోని గోమ్‌చన్‌ లోయలోని గ్లేసియర్‌, అమరవీరుల స్మారకార్థం నిర్మించిన ద్రాస్‌ లేదా కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌, ద్రౌపదీ కుండ్‌, గోషన్‌లోయ... ఇలా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో. పాల తెలుపు రంగు నీళ్లకు పేరొందిన లేసర్‌ లా, వన్య ప్రాణులకు పేరొందిన చోర్‌కియాట్‌ అరణ్యం కూడా ఇక్కడే ఉన్నాయి. అందుకే శీతకాలంలో రక్తాన్ని గడ్డ కట్టించే మంచు కురిసినా, వేసవిలో పంటలు పండించుకుంటూ తమదైన జీవనాన్ని కొనసాగించే ఇండో-ఆర్యన్‌ ప్రజల కారణంగా ద్రాస్‌ పట్టణం పర్యటకుల్నీ ఆకట్టుకుంటోంది.

(‘ఈటీవీ భారత్‌’ సౌజన్యంతో)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..