New Year 2023: మనసారా పలకరిద్దాం!

హ్యాపీ న్యూ ఇయర్‌..! నూతన సంవత్సర శుభాకాంక్షలు! ‘అబ్బ... అర్ధరాత్రి నుంచీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్‌ చెప్పీ చెప్పీ నోరు నొప్పి పుడుతోంది’... పైకి అనకపోయినా మనసులో అయినా... చాలామంది అనుకునే మాట ఇది.

Updated : 01 Jan 2023 11:59 IST

New Year 2023: మనసారా పలకరిద్దాం!

హ్యాపీ న్యూ ఇయర్‌..!
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
‘అబ్బ... అర్ధరాత్రి నుంచీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్‌ చెప్పీ చెప్పీ నోరు నొప్పి పుడుతోంది’... పైకి అనకపోయినా మనసులో అయినా... చాలామంది అనుకునే మాట ఇది. అలాగని చెప్పడమూ మానం... చెప్పించుకోవడమూ మానం.  కొత్త సంవత్సరం అంటేనే- అదో ఆనందం. సరికొత్త సంతోషాలేవో మూటగట్టి తెచ్చేస్తుందన్న ఆశ. అందుకే కన్పించిన ప్రతివారికీ ఉత్సాహంగా శుభాకాంక్షలు చెప్పేస్తాం. మన సంతోషాన్ని  అందరితో పంచుకుంటాం. ఈ ఒక్కరోజనే కాదు, నిత్యజీవితంలోనూ- పలకరింపు అనేది ప్రతి భాషలోనూ, సంస్కృతిలోనూ ఎంతో ముఖ్యమైన అంశం. మనిషిగా అది మనని మరో మెట్టు పైన నిలబెడుతుంది.

అది ఒక ఐస్‌ ఫ్యాక్టరీ. అక్కడ ఐస్‌ తయారుచేసి నగరంలోని దుకాణాలకు సరఫరా చేస్తారు. రోజూలాగే ఆరోజు కూడా సాయంత్రం కాగానే అక్కడ పనిచేసే వాళ్లంతా అన్నీ సర్దేసి ఇళ్లకు బయల్దేరారు. ఫ్రీజర్‌ రూమ్‌కి బాధ్యురాలైన ఒక మహిళ మాత్రం ఏదో సందేహం వచ్చి చెక్‌ చేద్దామని చివరి నిమిషంలో మరోసారి లోపలికి వెళ్లింది. ఆ సంగతి తెలియని సిబ్బంది బయట ప్రధాన స్విచ్‌ ఆఫ్‌ చేసేసరికి ఫ్రీజర్‌ రూమ్‌ తలుపు ఆటోమేటిగ్గా మూసుకుపోయింది. లైట్లు ఆఫ్‌ అయిపోయాయి. చల్లని ఆ గదిలో ఆమె బందీ అయిపోయింది. ఆమె ఎంత అరిచి పిలిచినా ఆ గదిలోనుంచి శబ్దం బయటకు రాదు. సిబ్బంది అంతా ఇళ్లకు వెళ్లిపోయారు. సమయం గడిచే కొద్దీ ఆ చల్లదనం తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప తాను అక్కడినుంచి సజీవంగా బయటపడడం అసాధ్యమనుకున్న ఆమె చేసేది లేక దేవుడిని ప్రార్థిస్తూ ఉండిపోయింది. దాదాపు ఒక గంట గడిచింది. చలికి ఒక మూల ముణగదీసుకుని కూర్చున్న ఆమె ఒళ్లంతా బిగుసుకుపోయింది. ఇంతలో చిన్న చప్పుడు... తలుపు తెరిచి లోపలికి టార్చిలైట్‌ వేసి పరికించి చూశాడు ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డు. మూలన ఉన్న ఆమెను చూడగానే ‘అయ్యో మేడమ్‌, మీరు ఇక్కడ ఉన్నారా... త్వరగా బయటకు రండి’ అంటూ ఆమెకు చేయి ఆసరా ఇచ్చి లేపి బయటకు తీసుకెళ్లాడు. తన ఫ్లాస్కులో ఉన్న వేడి వేడి టీ పోసిచ్చాడు. అవి తాగాక కాస్త తేరుకున్న ఆమె ‘అవునూ... నువ్వెందుకు ఈ టైమ్‌లో ఫ్రీజర్‌ రూమ్‌ తలుపు తెరిచావు’ అని అడిగింది.

‘మేడమ్‌... పదేళ్లుగా ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్నా. రోజూ ఉదయం, సాయంత్రం సిబ్బంది అందరికీ నమస్కారం చెబుతాను. మీరూ మరో నలుగురూ మాత్రం నవ్వుతూ నాకు ప్రతినమస్కారం చేస్తారు. ఇవాళ అందరూ వెళ్లిపోయాక తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది- మీరు రోజూ ఇంటికి వెళ్లేటప్పుడు చెప్పే ‘గుడ్‌ ఈవెనింగ్‌’ వినలేదని. పొద్దున్న మీరు రావడం గుర్తుంది. అందుకే ఎందుకైనా మంచిదని ఫ్యాక్టరీ అంతా వెతుకుతూ ఫ్రీజర్‌ రూమ్‌ దాకా వచ్చాను’ చెప్పాడు సెక్యూరిటీ గార్డు!

కొత్తా పాతా, పెద్దా చిన్నా లేకుండా కన్పించినవారందరినీ నవ్వుతూ విష్‌ చేయడం ఆమెకు చిన్నప్పుడు తండ్రి నేర్పిన అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు అద్భుతంగా మారి తన ప్రాణాన్ని కాపాడింది. అతడికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి బయలుదేరింది ఆమె.

ఎవరినైనా పలకరించడం, విష్‌ చేయడం ఎంత ముఖ్యమో వివరించడానికి కమ్యూనికేషన్‌ నిపుణులు చెప్పే కథ ఇది. విష్‌ చేయడం వల్లా, నమస్కరించిన వారికి ప్రతినమస్కారం చేయడం వల్లా పోయేదేమీ లేదు... పైసా ఖర్చవదు. కానీ లాభం మాత్రం చాలా ఉంటుంది. అన్నిసార్లూ ఐస్‌ ఫ్యాక్టరీలో మహిళకు జరిగినట్లు అద్భుతాలే జరగనక్కర్లేదు కానీ, నవ్వుతూ పలకరించేవాళ్లు అవతలి వాళ్లకు త్వరగా నచ్చుతారు. మంచి మనిషి అన్న పేరు వస్తుంది... అంటున్నారు కమ్యూనికేషన్‌ నిపుణులు. అంతేకాదు, ఈ శుభాభినందనల వెనక ఇంకా చాలా కథే ఉంది.

మనుషుల మధ్య వారధి

పలకరించడం, అభివాదం చేయడం, నమస్కరించడం, వందనాలు సమర్పించడం, మన్నించడం, కుశలప్రశ్నలు వేయడం, విష్‌ చేయడం... అన్నిటినీ ఆంగ్లంలో ‘గ్రీటింగ్‌’ అనే అంటారు. ఇద్దరు మనుషుల మధ్య పరిచయానికి తొలి అడుగు పడేది పలకరింపుతోనే. ప్రతి దేశానికీ, ప్రతి సంస్కృతికీ ప్రతి సమాజానికీ ప్రతి భాషకీ... తమదైన అభివాద సంప్రదాయం ఉంటుంది. మనం రెండు చేతులూ జోడించి నమస్కరించినట్లే కొన్నిదేశాల్లో ‘హలో’ అనో, ‘హాయ్‌’ అనో పలకరిస్తారు, కొందరు కరచాలనం చేస్తారు. కొన్ని దేశాల్లో కౌగిలించుకోవడమే పలకరించినట్లు. కొందరు మోచేతుల్నో ముక్కుల్నో తాకిస్తే మరి కొన్నిచోట్ల చేతినో నుదుటినో ముద్దాడతారు. అందుకే ఏ సంస్కృతిని అయినా అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ల పలకరింపుల్ని గమనించాలి. ఒక కొత్త భాష నేర్చుకునేటప్పుడు మొట్టమొదట నేర్పే మాట- పలకరింపే కదా. అది రోజువారీ సంభాషణలో భాగం, మనుషులు ఒకరి ఉనికిని మరొకరికి తెలిసేలా చెప్పుకునే పదం. నిండు మనసుతో స్పష్టంగా పలికే ఆ పదం ఎన్నో విషయాలను చెబుతుంది. అవతలి వ్యక్తి ఎలాంటి మూడ్‌లో ఉన్నా సరే, ఒక చిన్న పలకరింపుతో ముఖం ప్రసన్నంగా మారిపోతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధానికి వారధి వేసేది పలకరింపే. ఇది మనసుల్లో సానుకూల స్పందనలను సృష్టిస్తుంది.

అపరిచితుల్ని స్నేహితులుగా మారుస్తుంది. అందుకే చిన్నప్పుడు మాటలు నేర్చుకోవడం మొదలెట్టగానే పిల్లలకు పలకరించడం నేర్పిస్తాం. మన దేశంలో అయితే పెద్దలకు నమస్కారం చేయమని చెబుతాం కానీ విదేశాల్లో కుటుంబసభ్యులు అందరూ ‘గుడ్‌ మార్నింగ్‌’ నుంచి ‘గుడ్‌ నైట్‌’ వరకూ ఒకరినొకరు విష్‌ చేసుకుంటూనే ఉంటారు. పిల్లలకూ అదే అలవాటవుతుంది. అందుకే వాళ్లు బయటకు వచ్చినప్పుడు కూడా కొత్తవాళ్లను ఎలాంటి సంకోచం లేకుండా పలకరిస్తారు. అసలు అపరిచితుల్ని ఎందుకు పలకరించాలీ, ఇంట్లో వాళ్లకి ‘గుడ్‌మార్నింగ్‌’ చెప్పడం ఎందుకూ... అంటారు కొందరు. ఈ పలకరింపులన్నీ ఆఫీసుల్లోనే అవసరం అని భావిస్తారు. అది సరైన అభిప్రాయం కాదు. పలకరింపు... ప్రతిచోటా అవసరమే. ఎవరైనా మనని విష్‌ చేసినప్పుడు మనకెలాంటి అనుభూతి కలుగుతుందో విశ్లేషించుకుంటే మనం ఎందుకు విష్‌ చేయాలో తెలుస్తుంది.

ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌

ఇంట్లో పనులన్నీ చేసుకుని హడావుడిగా ఆఫీసుకు బయల్దేరి రద్దీగా ఉన్న బస్సెక్కుతారు. ఎవరో కాస్త పక్కకి జరిగి ‘కూర్చోండి’ అని చోటిస్తే... ఎంత హాయిగా ఉంటుంది. అలసటంతా పోయి ముఖంలోకి చిరునవ్వు రాదూ..? మెల్లగా పరిచయవాక్యాలతో మొదలెట్టి కష్టసుఖాలు పంచుకోవడం వరకూ ఆ అపరిచితురాలితో సంభాషణ సాగుతుంది. కొన్నాళ్లకి మంచి స్నేహితులైపోయినా ఆశ్చర్యం లేదు.

లేచినప్పటినుంచి తలనొప్పి వేధిస్తుంటుంది, చికాగ్గానే పనిలో పడతారు. పక్క సీటులో ఉండే జూనియర్‌ వచ్చి ‘గుడ్‌మార్నింగ్‌ సార్‌’ అంటూ ఆత్మీయంగా చేయి చాస్తే వద్దనుకున్నా ముఖంలోకి చిరునవ్వు వచ్చేస్తుంది. ‘వెరీ గుడ్‌ మార్నింగ్‌ అమ్మా’ అని బదులిస్తారు కానీ, నీరసంగా ‘ఏం గుడ్‌ మార్నింగో’ అనరు కదా. ఆ నులివెచ్చని కరస్పర్శా, ఆ గొంతులో గౌరవం... ఒకలాంటి తృప్తినిస్తాయి. ఇలాంటి ఫీల్‌ గుడ్‌ క్షణాలే మూడ్‌ని మార్చేస్తాయి. చిరాకు పరాకులన్నీ పరారయ్యేలా చేస్తాయి.

పుట్టినరోజో పెళ్లి రోజో వస్తే- కుటుంబ సభ్యులందరూ అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. బహుమతులు కొనిస్తారు. అది సహజం. కానీ అంతటితో ఊరుకుంటున్నామా... ఆఫీసులో స్వీట్లు పంచి మరీ ‘హ్యాపీ బర్త్‌డే’ చెప్పించుకుంటాం. సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టి ముక్కూ మొహం తెలియని వారందరి గ్రీటింగ్సూ లెక్కపెట్టుకుని సంతోషిస్తాం. ‘ఇంతమంది శుభాకాంక్షలు నాకు అందాయ’న్న భావన మనసుని ఉల్లాసభరితం చేస్తుంది. వారంతా మన సుఖసంతోషాలను కోరుకుంటున్నారని పొంగిపోతాం. అలాగే పండుగలప్పుడు కూడా. హ్యాపీ దసరా, హ్యాపీ సంక్రాంతి... అని ఒకరికొకరం చెప్పుకుంటూనే ఉంటాం కదా.

మంచి జరగాలని కోరుకునే మనిషి ఆశావహ మనస్తత్వమే దీనికంతటికీ కారణం.

ఫ్రెండో కొలీగో ఒక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. నవ్వుతూ ‘హలో’ చెప్పి, షేక్‌ హ్యాండ్‌ ఇస్తారు కదా. ఆ పలకరింపే ఇద్దరి మనసుల మీదా తొలి పరిచయం(ఫస్ట్‌ ఇంప్రెషన్‌) తాలూకు గట్టి ముద్రను వేస్తుంది.

ఎక్కడైనా ఉపన్యాసం ఇవ్వాలనుకోండి. మొదటి నిమిషంలో ఆ వ్యక్తి మాట్లాడినదాన్ని బట్టి అతడి ఉపన్యాసం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందా లేదా అన్నది చెప్పేయొచ్చంటారు నిపుణులు. అందుకే రాజకీయ నాయకులు ఎక్కడ ప్రసంగించినా ముందుగా పరిచయ వాక్యాలను స్థానిక భాషలోనే తీయగా మాట్లాడి ప్రేక్షకుల్ని బుట్టలో పడేసుకుంటుంటారు.

అదే మంచి మాటకున్న బలం. చిన్న చిరునవ్వును జోడించి పలికే ఒక మామూలు పదం... ఎదుటివ్యక్తి మీద చూపే ప్రభావమే గ్రీటింగ్‌కి సమాజంలో ఇంత ప్రాధాన్యాన్ని తెచ్చింది.

పలకరింపుకీ ఓ పద్ధతుంది!

రామాయణంలో ఒక సన్నివేశం ఉంటుంది. సీతను వెతుక్కుంటూ కిష్కింధ చేరిన రామలక్ష్మణులను హనుమంతుడు మొదటిసారి చూస్తాడు. తనను తాను
పరిచయం చేసుకుని వారిని అద్భుతంగా వర్ణిస్తాడు. అతడు మాట్లాడి వెళ్లిపోయాక లక్ష్మణుడితో రాముడు హనుమంతుడి వాక్పటిమ గురించి చెబుతూ ‘ఇతడు
వేదాలని ఔపోసన పట్టివుంటాడు.

వ్యాకరణశాస్త్రాన్ని పలుమార్లు సాధన చేసి ఉంటాడు. ఇంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం దొర్లలేదు. మాట్లాడుతున్నప్పుడు కళ్లూ నుదురూ కనుబొమలూ ఇంకా ఇతర అంగాలలో ఏ దోషమూ కన్పించలేదు. హావభావ ప్రకటనకు అనుగుణమైన అంగసంచలనం చేస్తూ ప్రసంగించాడు...’ అంటాడు. పలకరించడానికీ ఒక పద్ధతి ఉందని చెబుతుందీ ఘట్టం.

నిజానికి విష్‌ చేయడం అనేది కాస్త సాధన చేస్తే మంచి అలవాటుగా మారిపోతుంది. అలా అయ్యాక, ఇక, కష్టపడక్కర్లేదు. మన ప్రమేయం లేకుండా అలవోకగా నోటివెంట ‘నమస్కారం’ అన్న మాట వచ్చేస్తుంది. అయితే, గ్రీటింగ్‌ ఎటికెట్‌ గురించి నవతరం ప్రవర్తనా శాస్త్ర నిపుణులు ఏమంటారంటే...

* విష్‌ చేయడం అనేది కేవలం నోటిమాట కాకూడదు. బాడీ లాంగ్వేజ్‌లో అది ప్రతిఫలించాలి. కళ్లలోకి చూస్తూ, చిరునవ్వుతో, తెలిస్తే పేరుపెట్టి సంబోధిస్తూ, మృదువైన కంఠంతో పలకరించాలి.

అందరినీ ఒకేలా కాకుండా ఎవరికి వారే ప్రత్యేకం అన్నట్లుగా విష్‌ చేసే పద్ధతి ఉండాలి. మనస్ఫూర్తిగా నవ్వాలి. పెద్దవాళ్లను లేచి నిలబడి పలకరించాలి.

* ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఎవరు ముందు పలకరించాలీ అంటే-నిజానికి ఎవరు ముందుగా పలకరించినా తప్పులేదు. దానివల్ల ఒకరు గొప్పవారూ కారు, మరొకరు చిన్నబోవడమూ జరగదు. అయితే వయసులో చిన్నవాళ్లు పెద్దవాళ్లను ముందుగా విష్‌ చేయడమనేది మర్యాద. గదిలోకి ప్రవేశించిన వ్యక్తి అక్కడ అప్పటికే ఉన్న వారిని విష్‌ చేయాలి. అలాగే సమావేశం జరుగుతున్నప్పుడు ఆలస్యంగా వచ్చినవారు అందరికీ అభివాదం చేసి కూర్చోవడం మర్యాద.

* మీరు ఒకరితో మాట్లాడుతున్నారు. అప్పుడే పక్కన మరొకరు మీ కోసం వేచి చూస్తున్నారు. మొదటి వ్యక్తితో మాట్లాడడం అయిపోయాక ఆ వేచి చూసే వ్యక్తితో మాట్లాడొచ్చు అని అసలు రెండో వ్యక్తిని గమనించనట్టే ఉండిపోతే... అది తప్పు. ‘ఒక్క క్షణం’ అని మాట్లాడుతున్న వ్యక్తి అనుమతి తీసుకుని వేచి ఉన్న వ్యక్తిని
విష్‌ చేసి ‘నాక్కాస్త టైమివ్వండి, ఇప్పుడే మీతో మాట్లాడతాను’ అని చెప్పి మొదటి వ్యక్తితో సంభాషణ కొనసాగించవచ్చు. అప్పుడు వేచివున్న వ్యక్తికి తనను నిర్లక్ష్యం చేయలేదనీ, మీరు ఎంతో మర్యాదస్తులనీ అనిపిస్తుంది. ఒకవేళ మీరే వేచి ఉండాల్సి వస్తే మాత్రం అవతలి వ్యక్తి మీవైపు చూసేదాకా వేచి చూడాలి. వాళ్ల సంభాషణ మధ్యలో జోక్యం చేసుకుని పలకరించడం పద్ధతి కాదు.

* స్నేహితుల్నీ వయసులో చిన్నవాళ్లనీ ‘హాయ్‌’ అనో ‘ఏరా’ అనో పలకరిస్తాం. దాన్ని ఇన్‌ఫార్మల్‌ గ్రీటింగ్‌ అంటారు. అదే పై అధికారులనూ వయసులో పెద్దవారినీ విష్‌ చేస్తున్నప్పుడు ఫార్మల్‌గా గ్రీట్‌ చేయాలి. ‘గుడ్‌ మార్నింగ్‌’ అయినా ‘నమస్కారం’ అని చెప్పినా పూర్తి పదాల్ని స్పష్టంగా చెప్పాలి. చివర సర్‌, మేడమ్‌... లాంటి గౌరవ వాచకాలు వాడాలి. ఫార్మల్‌ పరిచయాల్లో అవసరమైనంత మేరకే విషయం మాట్లాడాలి.

* పలకరించారు కదా అని తొలి పరిచయంలోనే జీవిత చరిత్ర అంతా ఏకరువు పెట్టకూడదు. ‘బాగున్నారా’ అన్న ప్రశ్నకు- మనం ఎలా ఉన్నా బాగున్నామనే సమాధానం  చెప్పాలి.

* కొత్తగా పరిచయం అయినపుడు ‘హలో’ చెప్పి అలాగే వదిలేసి వెళ్లిపోకూడదు. ‘మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది, మళ్లీ కలుద్దాం’ లాంటి మాటలు చెప్పి సెలవు తీసుకోవాలి. కొందరికి సంభాషణ పొడిగించడం చేతకాదు. అలాంటప్పుడు పాశ్చాత్యులు ఎక్కువగా వాతావరణం గురించి మాట్లాడతారట. మనం ‘మీ డ్రెస్‌ బాగుంద’నో, ‘మీ హెయిర్‌ స్టైల్‌ నచ్చింద’నో చెప్పవచ్చు. ప్రశంస ఎవరికైనా సంతోషం కలిగిస్తుంది. దాంట్లోనుంచి సహజంగానే సంభాషణ పెరుగుతుంది.

అందుకే... అంత ప్రాధాన్యం

ఒకరికి మనం నమస్కారం చేస్తున్నామంటే- వారి పట్ల గౌరవాన్ని చూపుతున్నాం, వారి అహాన్ని తృప్తిపరుస్తున్నాం, వారి అవసరం అక్కడ ఉందని చాటుతున్నాం, వారి ప్రాధాన్యాన్ని పెంచుతున్నాం. అలా చేయడం వల్ల ప్రతిగా మన పట్ల ఆయా వ్యక్తుల్లో సుహృద్భావం కలుగుతుంది. అందుకే పలకరింపుకి అంత ప్రాధాన్యం. అది అవతలి వ్యక్తికి మనపై ఉన్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చేయగలదు.

ఒక దుకాణంలోకి ప్రవేశించిన తొలి పది సెకన్లలో కలిగే అనుభూతి- వినియోగదారు అక్కడ షాపింగ్‌ కొనసాగిస్తారా లేక మరో షాపుకి వెళ్లిపోతారా అన్నదాన్ని నిర్ణయిస్తుందని మార్కెటింగ్‌ నిపుణుల అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చాలామంది వ్యాపారస్తులు వినియోగదారుల్ని గుమ్మం దగ్గరే నవ్వుతూ పలకరిస్తుంటారు.

ఉద్యోగార్థుల ఎంపిక జరిగేటప్పుడూ అభ్యర్థి విష్‌ చేసే తీరును ప్రత్యేకంగా గమనిస్తారు. ఆ సమయంలో అతడి బాడీ లాంగ్వేజ్‌- అతడిలో ఏపాటి ఆత్మవిశ్వాసం ఉందో, మాటతీరు ఎలా ఉంటుందో, సమయానికి తగినట్లుగా నడచుకుంటాడా లేక అసందర్భ ప్రసంగాలు చేస్తాడా... లాంటివన్నీ చెబుతుంది. అందుకే... గ్రీటింగ్‌ అనేది చిన్న విషయం కాదు. జాగ్రత్తగా ఎదుటివాళ్లను మెప్పించేలా చెప్పాలి.

అలంకారానికే అలంకారం

‘వాక్‌భూషణం భూషణం’ అన్నారు పెద్దలు. శరీరంపైన ఎన్ని మణిమయ హారాలు ధరించినా, ఎన్ని సుగంధాలు పూసుకున్నా, ఎన్ని పూమాలలు ధరించినా... అవి మనిషికి అలంకారాలు కావు, అందాన్నివ్వవు. మరి ఏవి ఇస్తాయీ అంటే- మంచి మాటని మించిన అలంకారం లేదని భర్తృహరి సుభాషితం. అంతేకాదు...

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మిః జిహ్వాగ్రే మిత్రబంధవాః

జిహ్వాగ్రే బంధన ప్రాప్తి- జిహ్వాగ్రే మరణం ధృవం... అని కూడా పెద్దలు చెప్పారు.

నాలుక వల్లనే సంపదలు లభిస్తాయి. నాలుక(మాటతీరు) వల్లే మిత్రులూ బంధువులూ వస్తారట. అలాగే ప్రాణహానికీ నాలుకే కారణం కాగలదట. అందుకే నాలుకని మంచి మాటలకే ఉపయోగించడం అలవాటుగా చేసుకోవాలని దాని అర్థం.

మధురంగా మాట్లాడగలగడం ఒక కళ. ఆ కళని శ్రద్ధగా సాధన చేయాలి.

నిత్యజీవితంలో వాడే ప్లీజ్‌, థ్యాంక్యూ, సారీ లాంటిదే హలో లేదా నమస్తే కూడా. ఈ నాలుగు చిన్న పదాల్నీ సరిగ్గా వాడటం వస్తే మర్యాదగా మాట్లాడతారన్న పేరొస్తుంది. వారి చుట్టూ సానుకూల, స్నేహపూరిత వాతావరణం నెలకొంటుంది.


హ్యాపీ అండ్‌ ప్రాస్పరస్‌... ఎందుకంటే..!

‘విష్‌ యూ ఎ హ్యాపీ అండ్‌ ప్రాస్పరస్‌ న్యూ ఇయర్‌... కొత్త సంవత్సరం మీకు సకల సంతోషాలనూ సంపదలనూ సమకూర్చాలని కోరుకుంటున్నా...’ అనే ఈ గ్రీటింగ్‌ వెనకాల పెద్ద కథే ఉంది. చైనాలో ఎల్లో రివర్‌ వరదలకు పెట్టింది పేరు. శతాబ్దాలుగా ఆ నది వరదల వల్ల విపరీతమైన నష్టం జరిగేది. 1931లో వచ్చిన వరదల్ని గ్రేట్‌ ఫ్లడ్‌ ఆఫ్‌ చైనా అంటారు. లక్షలాది ప్రాణాలను హరించే ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి భావితరాలకు చెప్పడం అవసరమని భావించి దాన్ని పాఠ్యాంశంగా పెట్టిన అక్కడి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తుంది కానీ ప్రజలకు ఎలాంటి సామాజిక భద్రతా కల్పించదు. దాంతో ప్రజలు తమ కష్టాలు తామే పడాలి. అందుకే చిన్నప్పటినుంచీ పిల్లలకు డబ్బు విలువ నేర్పిస్తారు. తమ కొత్త సంవత్సరం శుభాకాంక్షల్లోనూ డబ్బు కావాలనే కోరుకుంటారు. అలా, మనం ఆంగ్లంలో చెప్పుకునే ‘హ్యాపీ అండ్‌ ప్రాస్పరస్‌ న్యూ ఇయర్‌’ని పొరుగు దేశమైన చైనా నుంచే అందిపుచ్చుకున్నాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు