ఈ ఫ్యాక్టరీల్లో... మనుషులు ఉండరు..!

వాషింగ్‌ మెషీన్‌లో బట్టలూ సర్ఫూ వేసి బటన్‌ నొక్కితే చాలు. దాని మానాన అది శుభ్రంగా ఉతికి జాడించి పిండేస్తుంది. మనకి తీరినప్పుడు తీసి ఆరేసుకోవడమే.

Updated : 05 Feb 2023 12:51 IST

ఈ ఫ్యాక్టరీల్లో... మనుషులు ఉండరు..!

వాషింగ్‌ మెషీన్‌లో బట్టలూ సర్ఫూ వేసి బటన్‌ నొక్కితే చాలు. దాని మానాన అది శుభ్రంగా ఉతికి జాడించి పిండేస్తుంది. మనకి తీరినప్పుడు తీసి ఆరేసుకోవడమే. వంటకానికి కావలసిన పదార్థాలన్నీ కుక్కర్‌లో పెట్టి స్టవ్‌ వెలిగిస్తే చాలు. పొంగిపోయిందా, మాడిపోయిందా అన్న టెన్షన్‌ లేకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే కూత వేసి మరీ ఉడికిందని చెబుతుంది. అచ్చం అలాగే... ముడి సరకుల్ని లోపలకి పంపించి యంత్రాల్ని సెట్‌ చేసి వచ్చేస్తే అవే ఆయా వస్తువుల్ని తయారుచేసేలా ఫ్యాక్టరీలు ఉంటే బాగుంటుందన్న ఆలోచన పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచీ మనిషిని వేధిస్తూనే ఉంది. అదే ఇప్పుడు ‘డార్క్‌ ఫ్యాక్టరీ’ల రూపంలో నిజమయ్యింది..! అవును... మనుషుల పర్యవేక్షణతో పనిలేని, లైట్లూ ఫ్యాన్లూ అక్కర్లేని ఫ్యాక్టరీలు వచ్చేశాయి!

మ్మాయి పుట్టినరోజు వస్తోంది... కొత్త డ్రెస్‌కి మింత్రాలో ఆర్డర్‌ పెడతారు. ఫ్రెండ్‌ మ్యారేజ్‌డే కూడా ఈ నెల్లోనే అని గుర్తొస్తుంది. మరో వెబ్‌సైట్‌కి వెళ్లి భార్యాభర్తలిద్దరికీ పనికొచ్చే మంచి బహుమతి కొని వాళ్ల అడ్రసుకి డెలివరీ పెడతారు. సరకులూ కూరగాయలూ తెచ్చుకోవడానికి టైమ్‌ సరిపోవడం లేదని వాటినీ బిగ్‌ బాస్కెట్‌లో ఆర్డర్‌ చేస్తారు. కాలేజీలో చేరిన అబ్బాయి ఫోన్‌ కావాలంటున్నాడు... అమెజాన్‌లో సేల్‌ ఉన్నప్పుడు తీసుకుంటానని హామీ ఇస్తారు. ఆఫీసులో ఆలస్యం అయింది, ఇంటికి వెళ్లి వంటచేసే ఓపిక లేదు, బయల్దేరే ముందే స్విగ్గీలో ఆర్డర్‌ పెడితే ఇంటికొచ్చేసరికి వేడి వేడి భోజనం సిద్ధంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఇప్పుడు మన నిత్యజీవితంలో భాగమైపోయింది. దానివల్ల మన పనులు ఎంత సులువయ్యాయో ఆ సంస్థల్లో పనులు అన్ని రెట్లు పెరుగుతున్నాయి. ఒక్క అమెజాన్‌లోనే రోజుకి కోటీ 60 లక్షల వస్తువులను ప్యాక్‌ చేసి ఆయా అడ్రసులకు పంపిస్తారట. అంటే గంటకు 66 వేలు. నిమిషానికి 1100. గిడ్డంగుల్లో ఉండే లక్షలాది వస్తువులనుంచి కావలసినవి వెతికి ఇంత వేగంగా ప్యాక్‌ చేసి పంపించడం మానవమాత్రులకు సాధ్యం కాదు! అయినా పని జరుగుతోందంటే- దానికి కారణం ఆటోమేషన్‌... మనుషుల ప్రమేయం లేకుండా యంత్రాలే ఎక్కువ పనిచేసేయడం. అమెజాన్‌ వేర్‌హౌసుల్లో మొబైల్‌ రోబోట్‌లు ఉంటాయి. చక్రాలున్న పెద్ద పెద్ద సూట్‌కేసుల్లా కన్పించే ఈ రోబోట్లు అట్టపెట్టెలతో నిండి ఉన్న ర్యాక్‌లను ఉన్నపళాన పైకి లేపి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లి పెడతాయి. తాము ఎంచుకున్న వ్యాపార విధానానికి ఈ రోబోట్లు తోడవడం వల్లనే ఏటా పెరుగుతూనే ఉన్న వినియోగదారుల డిమాండ్లను అమెజాన్‌ తట్టుకోగలుగుతోంది. ఒక్కో గిడ్డంగిలోనూ వందల సంఖ్యలో ఉండే రోబోట్లు రయ్యిరయ్యిన తిరుగుతూ పెద్ద పెద్ద ప్యాకేజీలను మోసుకెళ్లి సంబంధిత మనుషులకు అందిస్తాయి. మామూలుగా మనుషులు చేస్తే ఎక్కువలో ఎక్కువ గంటకు వంద వస్తువులను మాత్రమే ప్యాక్‌ చేయగలిగే వాళ్లమనీ, వీటి సాయంతో చేయడం వల్ల గంటకు 400 ప్యాకేజీలు చేయగలుగుతున్నామనీ చెబుతోంది అమెజాన్‌. ఈ రోబోట్ల కదలికల్ని కంప్యూటరే నిర్దేశిస్తుంది. పొరపాటున వాటి పరిసరాల్లోకి ఎవరైనా వెళ్తే  వాటంతటవే ఆగిపోతాయి కానీ ఢీకొనవు.

గిడ్డంగుల్లో వస్తువులను ఒక చోట నుంచి మరో చోట చేర్చడానికి పనికొచ్చే మొబైల్‌ రోబోట్లను తయారుచేయాలన్న ఆలోచన ‘కివా’ అన్న సంస్థది. ఆ పనిలో అది విజయం సాధించడం ఆలస్యం... పదేళ్ల క్రితమే ఆ కంపెనీని కొనేసింది అమెజాన్‌. ఆరోజుల్లో అది పారిశ్రామిక రంగాలవారికి ఊహకందని నిర్ణయం. దాదాపు వందేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఒకే సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న గిడ్డంగుల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పుకి శ్రీకారం చుట్టిన సంఘటన అది. ఇప్పుడు అమెజాన్‌ సంస్థ పంపిణీ కేంద్రాల్లో వేర్వేరు పనులు చేసే పన్నెండు రకాల రోబోట్లు ఐదున్నర లక్షల దాకా ఉన్నాయి. అమెజాన్‌ మనుషుల్ని ఉద్యోగాల్లోనుంచి తీసేసి రోబోట్లతో పనిచేయిస్తోందని విమర్శలు వచ్చాయి. కానీ అదే సంస్థ పది లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించింది. తాము మనుషుల బదులు సాంకేతికతని వాడడం లేదనీ, మనుషుల పని సులువుగా అవడానికి సాంకేతికత సాయం తీసుకుంటున్నామనీ చెప్పింది.

అమెజాన్‌ అనే కాదు, పెరుగుతున్న డిమాండ్‌ని తట్టుకోవడానికి ఆటోమేషన్‌ని వేగవంతం చేయడం వల్ల మొత్తంగా వేర్‌హౌస్‌ రోబోటిక్స్‌ రంగమే 2027 నాటికి రెండు లక్షల కోట్ల విలువ చేస్తుందని (ఇప్పుడున్న దానికి రెట్టింపు) నిపుణుల అంచనా. దీనివల్ల ఉత్పాదకత 200-300 శాతం పెరుగుతుందట.

ఇక, తయారీ రంగం వైపు చూస్తే... ఇంకా విస్తుపోయే విషయాలు ఉన్నాయి. అక్కడ ఏకంగా ‘లైట్స్‌ అవుట్‌ మాన్యుఫాక్చరింగ్‌’ ట్రెండింగ్‌లో ఉంది. అంటే పని అంతా మెషీన్ల మీద వదిలేసి లైట్లూ ఫ్యాన్లూ ఆఫ్‌ చేసి ఫ్యాక్టరీకి తాళం పెట్టి ఇంటికెళ్లిపోతే యంత్రాలే వస్తువుల్ని తయారుచేయాలన్న ఒకప్పటి కల... ఇప్పుడు నిజమైంది!

లైట్లు లేకుండా...మాన్యుఫాక్చరింగా?

అవును. వీటినే డార్క్‌ ఫ్యాక్టరీలనీ అంటున్నారు. మామూలుగా ఒక ఫ్యాక్టరీ ఉంటే అందులో పనిచేసే యంత్రాలకు కరెంటు కావాలి. ఆ యంత్రాలను పనిచేయించే మనుషులకు సౌకర్యాలు కావాలి. ఏసీలూ ఫ్యాన్లూ లైట్లూ ఫోన్లూ ఫర్నిచరూ... ఇలా ఉద్యోగుల కోసం చాలా మౌలిక వసతులు ఏర్పాటుచేయాలి. కానీ ఈ డార్క్‌ ఫ్యాక్టరీల్లో అసలు లైట్లే వేయక్కర్లేదు. ఏసీలూ ఫ్యాన్లూ అవసరం లేదు. షిఫ్టులూ సెలవుల గొడవ ఉండదు. ఏడాది పొడుగునా పని జరుగుతూనే ఉంటుంది. వస్తువులు తయారవుతూనే ఉంటాయి. మనం అవతలికి వెళ్తే పని ఆగిపోతుందేమోనన్న చింత ఉండదు, నాసిరకంగా తయారుచేస్తాయేమోనన్న సందేహమూ అక్కర్లేదు.

అదెలా సాధ్యం?

సృజనాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం లేనిచోట సాంకేతికతను ఎక్కువగా వాడుకుని మానవ వనరుల్ని తక్కువ వాడుకుంటే అది సాధ్యమే. ఆటోమేటిగ్గా పనిచేసే యంత్రాలూ, రోబోట్లూ ఈ ఫ్యాక్టరీల్లో ఉంటాయి. మనుషులకు అవసరమైన వసతులేవీ వాటికి అక్కర్లేదు. చేయాల్సిన పనిని కంప్యూటర్‌ ఆధారంగా ప్రోగ్రామ్‌ చేసి పెడితే చాలు, వాటి మానాన అవి అలుపూ సొలుపూ లేకుండా పనిచేస్తూనే ఉంటాయి.

అసలీ స్థాయికి పారిశ్రామిక రంగం

ఎలా వచ్చిందో తెలిస్తే డార్క్‌ ఫ్యాక్టరీల పనితీరును అర్థం చేసుకోవడం సులువవుతుంది. పద్దెనిమిదో శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని స్కూల్లో చదువుకున్నాం. అప్పటివరకూ వ్యవసాయమూ చేతివృత్తుల మీద ఆధారపడిన తయారీ రంగం యంత్రాల రాకతో ఒక్కసారిగా మారిపోయింది. 1765లో మొదలైన తొలి పారిశ్రామిక విప్లవానికి ఆధారం- బొగ్గు. కరెంటు లేని ఆరోజుల్లో బొగ్గుని కాల్చడం వల్ల వచ్చే వేడి ఇంధనంగా పనిచేసేది. స్టీమ్‌ ఇంజిన్‌ తయారీకి అదే మూలమైంది. అలా మొదలైన యంత్రాల జోరును 1870ల్లో మొదలైన రెండోదశ విప్లవం మరింత ముందుకు తీసుకెళ్లింది. కరెంటూ చమురూ గ్యాస్‌... అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పలు రకాల పరిశ్రమల విస్తరణకు దోహదం చేశాయి. 1970ల కల్లా ఎలక్ట్రానిక్స్‌, అణుశక్తి వాడుకలోకి వచ్చి పారిశ్రామిక విప్లవాన్ని మూడో దశలోకి తీసుకెళ్లాయి. 2000 సంవత్సరం తర్వాత ఇంటర్నెట్‌, డిజిటల్‌ సాంకేతికతా, పునర్వినియోగ ఇంధనాలు వినియోగంలోకి రావడంతో దీన్ని నాలుగో దశగా పరిగణిస్తున్నారు. మొదట్లో ఒక దశ నుంచి మరో దశలోకి వెళ్లడానికి వందేళ్లు పడితే ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు కూడా పట్టడం లేదు. తాజాగా డార్క్‌ ఫ్యాక్టరీలు పారిశ్రామిక రంగాన్ని మరో కీలక మలుపు తిప్పుతున్నాయి. కొంతమంది అయితే దీన్ని పారిశ్రామిక విప్లవంలో ఐదో దశ అనీ, భవిష్యత్తు అంతా డార్క్‌ ఫ్యాక్టరీలదే అనీ అంటున్నారు.

ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయా?

లేకేం... చాలానే ఉన్నాయి. చాలా కాలంగా పనిచేస్తున్నాయి కూడా.

* జపాన్‌కి చెందిన ‘ఫనుక్‌’ పారిశ్రామిక అవసరాలకు రోబోట్లను తయారు చేసే అతి పెద్ద సంస్థ. ఆ రోబోట్ల తయారీ పని అంతా రోబోట్లే చేయడం విశేషం. దాదాపు ఇరవయ్యేళ్లుగా ఈ సంస్థ అతి తక్కువ మానవవనరులతో పూర్తిగా డార్క్‌ ఫ్యాక్టరీగా దీన్ని నిర్వహిస్తోంది. నెలకు 11వేల రోబోట్లను తయారుచేస్తోంది. ఒక్కోసారి నెల రోజుల వరకూ కూడా సిబ్బంది ఎవరూ అటువైపు తొంగి అయినా చూడరట. అందుకే దాన్ని సీక్రెట్‌ ఫ్యాక్టరీ అంటుంటారు.

* ఎలక్ట్రిక్‌ రేజర్స్‌ తయారుచేసే ఫిలిప్స్‌ ఫ్యాక్టరీలో 128 రోబోట్లు ఉండగా తొమ్మిది మంది మనుషులు మాత్రమే ఆ రోబోట్లనీ, మొత్తం ఉత్పత్తి కార్యక్రమాన్నీ పర్యవేక్షిస్తారు.

* చైనాకి చెందిన ఎక్స్‌పెంగ్‌ మోటార్స్‌ ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఆటోమేషన్‌ చేసిన కంపెనీగా పేరొందింది. విద్యుత్‌ కార్లను తయారుచేసే ఈ సంస్థలో నిపుణులైన 600 మంది ఇంజినీర్ల ఆధ్వర్యంలో 264 ఇండస్ట్రియల్‌ రోబోట్లు పనిచేస్తున్నాయట. వెల్డింగ్‌, పెయింటింగ్‌, అసెంబ్లింగ్‌ లాంటి విభాగాలన్నీ నూటికి నూరుశాతం రోబోట్లతోనే నిర్వహిస్తున్నారు. గృహోపకరణాల తయారీ సంస్థ ‘గలాంజ్‌’ కూడా పూర్తిగా స్మార్ట్‌ ఫ్యాక్టరీ. అక్కడ వస్తువుల ఉత్పత్తి బాధ్యత అంతా రోబోట్లదే. మెటీరియల్‌ ఇన్‌పుట్‌, ప్రాసెసింగ్‌,
అసెంబ్లింగ్‌... అన్నీ అవే చేస్తాయి. అక్కడ సగటున ప్రతి ఏడు సెకన్లకు ఒక ఉత్పత్తి తయారై బయటకు వస్తుంది.

* కార్నింగ్‌ సంస్థ ఒకప్పుడు ఎల్‌సీడీ తెరలు తయారుచేసేది. ఐఫోన్‌ కోసం పగిలిపోని, గీతలు పడని గ్లాస్‌ తయారు చేసివ్వమని స్టీవ్‌ జాబ్స్‌ అడగడంతో ఆ రంగంలో పరిశోధన చేసి గొరిల్లా గ్లాస్‌ని తయారుచేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఆ కంపెనీకి. ఇప్పుడు ఏటా 600 కోట్ల గొరిల్లా గ్లాస్‌లను తయారుచేస్తున్న ఈ సంస్థ పూర్తిగా ఆటోమేషన్‌తోనే నడుస్తోంది.

* టెస్లా పూర్తి ఆటోమేషన్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీ విద్యుత్‌ కార్ల తయారీ విభాగంలో రెండు పెద్ద పెద్ద రోబోట్లు ఉంటాయి. మొత్తంగా కారుని సునాయాసంగా ఎత్తి పెట్టే ఈ రోబోట్లు మనుషులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేయడాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

* ఐబీఎం కంపెనీ టెక్సాస్‌లోని తమ కీబోర్డుల తయారీ విభాగాన్ని పూర్తిగా డార్క్‌ ఫ్యాక్టరీగా నిర్వహిస్తోంది. ముడిసరకుని సరఫరా చేసి తయారైన వస్తువుల్ని తీసుకెళ్లడానికి మాత్రమే మనుషులు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తారు.

దీనివల్ల లాభమేమిటి?

లాభాలు చాలానే ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గుతుంది. ఎక్కువ స్థలం అవసరం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ వస్తువుల్ని(మాస్‌ ప్రొడక్షన్‌) తయారుచేయవచ్చు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభా రెండువందల కోట్లు కూడా లేదు. ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు దాటింది. వినియోగవస్తువులకు డిమాండూ ఆ స్థాయిలోనే పెరుగుతోంది కాబట్టి ఉత్పత్తిలో వేగం ఇప్పటి అవసరం. ఈ దిశగా జరిగిన పరిశోధన ఏమంటోందంటే- పూర్తిగా ఆటోమేషన్‌ అయిన ఫ్యాక్టరీ వల్ల  ఉత్పాదకత 250 శాతం పెరుగుతుంది. మానవ తప్పిదాలూ పొరపాట్లూ 80 శాతం తగ్గిపోతాయి. మరో పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ డార్క్‌ ఫ్యాక్టరీ విధానాన్ని అందిపుచ్చుకోక తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. రోబోట్ల ధరలు తగ్గి అందుబాటులోకి రావడం, వేతనాల ఖర్చు పెరగడం... లాంటి పరిణామాలు అందుకు దోహదం చేస్తున్నాయి. రోబోట్లూ ఇతర యంత్రాలూ అలసిపోవు. ఎండా వానా చలీ లాంటి వాతావరణ పరిస్థితుల ప్రభావం వాటిమీద ఉండదు. అనారోగ్యం ప్రసక్తి అంతకన్నా ఉండదు. ఒక యంత్రానికి మరమ్మతు చేయాల్సి వస్తే దాని స్థానంలో మరోటి వెంటనే పెట్టేయడానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కచ్చితత్వంతో పనిచేస్తాయి కాబట్టి నాణ్యత పెరుగుతుంది. శ్రామికుల కొరత సమస్య ఉండదు. ప్రమాదాలు జరగవు. ముడిసరకు వృథా కాదు. వ్యర్థాలు కూడా ఎక్కువ తయారవవు. కాబట్టి పర్యావరణం మీద ఫ్యాక్టరీల దుష్ప్రభావం చాలా వరకూ తగ్గుతుంది. ఎంత పెద్ద రోబోట్లయినా పనిచేయడానికి తక్కువ శక్తి సరిపోతుంది, విద్యుచ్ఛక్తి డిమాండూ తగ్గుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లాభాలు చాలానే ఉన్నా కొన్ని సమస్యలూ లేకపోలేదు.

ఏమిటవి?

డార్క్‌ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ప్రారంభంలోనే పెట్టుబడి ఎక్కువ అవసరం అవుతుంది. కొత్తగా ప్రారంభించే ఫ్యాక్టరీ కన్నా ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీని ఆటోమేషన్‌ చేయాలంటే మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది. మానవ వనరుల నిర్వహణలోనూ చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాలకు ఢోకా ఉండదా?

కొన్ని రకాల ఉద్యోగాలు పోతే మరెన్నో రకాల కొత్త ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది అపోహేనంటారు నిపుణులు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉద్యోగార్థుల అర్హతలు మారాల్సి ఉంటుందన్నది వారి అభిప్రాయం. సాధారణంగా పరిశ్రమల్లో వస్తువుల తయారీలో ఎలాంటి నైపుణ్యమూ అక్కర్లేని, యాంత్రికంగా చేసే ఒకేలాంటి పని ఉంటుంది. కొన్ని పనులేమో భారీ యంత్రాలతో చేయాల్సి రావడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి పనులన్నిటినీ ఇప్పుడు రోబోట్లు చేస్తాయి. ఏడాది పొడుగునా నిరంతరం పనిచేయాల్సి ఉండే ఫ్యాక్టరీల్లో ఇవి బాగా ఉపయోగపడతాయి. సృజనాత్మకతా ఆలోచనా అవసరమైన చోట సిబ్బంది అవసరం ఎటూ తప్పదు కాబట్టి అదనపు నైపుణ్యాలూ సామర్థ్యాలూ ఉన్నవాళ్లకే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పూర్తిగా యంత్రాలపై ఆధారపడి పనిచేసే ఫ్యాక్టరీని నిర్వహించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులూ అవసరం. ఎంత యంత్రాలు పనిచేసినా వాటిని నియంత్రించేదీ, అవసరమైన మార్పులు చేసేదీ ఆయా సాంకేతికతల్లో నైపుణ్యం ఉన్న మనుషులే. పైగా డార్క్‌ ఫ్యాక్టరీ నిర్వహణకు పలు రకాల సాంకేతికతలు అవసరమవుతాయి. రోబోటిక్స్‌తో పాటు కృత్రిమమేధ, మెషీన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ... లాంటి ఆధునిక సాంకేతికతలన్నీ తెలిసిన నిపుణుల అవసరం పెరుగుతుంది. దీనివల్ల మొత్తంగా ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుంది.

ఎలా?

ఉత్పత్తి పెరిగినప్పుడు సంస్థల మధ్య పోటీ పెరగడం సహజం. దాంతో అవి సమర్థుల్నీ ఎక్కువ నైపుణ్యాలు ఉన్నవారినీ నియమించుకోవడానికి పోటీ పడతాయి. దాంతో అర్హులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. యువతకు ఉద్యోగాలు లభించి, తయారీ రంగం వేగం పుంజుకుంటే సహజంగానే దేశ ఆర్థిక వ్యవస్థా లాభపడుతుంది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నాయి అధ్యయనాలు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, ఉప్సలా యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు 2018లో ఒక అధ్యయనం వెలువరించారు. ‘రోబోట్స్‌ ఎట్‌ వర్క్‌’ పేరుతో వచ్చిన ఈ నివేదికలో 17 దేశాల్లో పదిహేనేళ్లపాటు రోబోట్ల వల్ల వచ్చిన మార్పుల్నీ జరిగిన అభివృద్ధినీ విశ్లేషించారు. ఆయా దేశాల్లో జీడీపీ చెప్పుకోదగ్గ మొత్తం పెరిగినట్లు వారి పరిశీలనలో తేలింది. అది కేవలం రోబోట్ల వాడకం మీద చేసిందే. డార్క్‌ ఫ్యాక్టరీలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి వీటి ప్రభావం గురించీ నిపుణులు పరిశీలిస్తూనే ఉన్నారు.  

మనదేశంలోనూ ఈ దిశగా కృషి మొదలైందంటోంది నాస్కామ్‌. బాష్‌ కంపెనీ ఇండియాలో తమకి ఉన్న 15 ఫ్యాక్టరీలనూ స్మార్ట్‌ ఫ్యాక్టరీలుగా మార్చే పనిని ఈ మధ్యే ప్రారంభించింది. జీఈ తమ మల్టీ మోడల్‌ కంపెనీలో సరఫరా, పంపిణీ వ్యవస్థల్ని డిజిటల్‌గా అనుసంధానం చేయడానికి రూ.1600 కోట్లు పెట్టుబడి పెట్టింది. కాంటినెంటల్‌ ఏజీ, గోద్రెజ్‌ లాంటి కంపెనీలూ ఇప్పటికే తమ ప్లాంట్లలో ఆటోమేషన్‌కి శ్రీకారం చుట్టాయట.

సో, త్వరలో ఫ్యాక్టరీలన్నీ మనుషులతో పనిలేకుండా చీకట్లోనే చకచకా పనిచేసి వస్తువుల్ని తయారుచేసేస్తాయనడానికి సందేహమే అక్కర్లేదన్న మాట..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..