చెంపదెబ్బ అయినా... నేరమే!

చిలకా గోరింకల్లా ఉన్నారు... ఈడూజోడూ కుదిరి, అన్యోన్యంగా కన్పించే జంటల్ని చూడగానే అన్పించే మాట అది. కానీ, బయట అంత ప్రేమగా కన్పించిన జంట ఇంటి నాలుగు గోడల మధ్యా అలాగే ఉంటారా అంటే- ఉండరనే చెబుతున్నాయి గణాంకాలు.

Updated : 20 Nov 2022 10:23 IST

చెంపదెబ్బ అయినా... నేరమే!

చిలకా గోరింకల్లా ఉన్నారు... ఈడూజోడూ కుదిరి, అన్యోన్యంగా కన్పించే జంటల్ని చూడగానే అన్పించే మాట అది. కానీ, బయట అంత ప్రేమగా కన్పించిన జంట ఇంటి నాలుగు గోడల మధ్యా అలాగే ఉంటారా అంటే- ఉండరనే చెబుతున్నాయి గణాంకాలు. ముప్పైశాతం చిలకలు పంజరాల్లో బందీలేనంటున్నాయి. మొగుడికి ఇష్టంలేని పలుకులు పలకలేవంటున్నాయి. కట్టుకున్న భర్తను చూసి వణికిపోయే పరిస్థితిలో మూడోవంతు మహిళలు ఉన్నారనీ దాని ఫలితం వారి ఆరోగ్యంమీదా, సంతానం మీదా పడుతోందనీ హెచ్చరిస్తున్నారు నిపుణులు. మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వచ్చే గృహహింస శిక్షార్హమైన నేరమనీ సమానత్వ సాధనకి పెద్ద అవరోధమనీ నొక్కి చెబుతున్నారు.

సాయంత్రం అవుతోందంటేనే ఒకలాంటి దిగులు ఆవహిస్తుంది. ప్రతి చిన్న శబ్దానికీ ఉలిక్కి పడుతుంటుంది. భర్త ఇంటికొచ్చే వేళవుతోందంటే చాలు వెన్నులో వణుకు మొదలవుతుంది.

అతడికి ఎప్పుడు, ఎందుకు కోపం వస్తుందో తెలియదు... వచ్చిందంటే ఇంట్లో యుద్ధమే. కూర నచ్చలేదని పళ్లెం విసిరేస్తాడు. పిలవగానే రాలేదని చెంప పగలగొడతాడు. పనిలో ఉన్నానంటే ‘నాకే ఎదురు చెబుతున్నావా’ అంటాడు. చెప్పకుండా మౌనంగా ఉంటే ‘సమాధానం చెప్పవేం అంత పొగరా...’ అని కొడతాడు. అమ్మానాన్నా ఏనాడూ తన మీద చెయ్యి వేయలేదు... అలాంటిది పెళ్లి చేసుకున్నందుకు చీటికీ మాటికీ ఇలా చెంపదెబ్బలు తినాల్సి వస్తోంది...

ఈ మగాళ్లకి ఎవరిచ్చారో భార్యని కొట్టే అధికారం... ఎవరికి చెప్పాలి ఈ బాధను... ఎన్నాళ్లు భరించాలి ఈ హింసను...దేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒక సమయంలో కట్టుకున్న భర్త గురించి ఇలా మథనపడుతున్నారట.  

* * * * * *

భర్తన్నవాడు భార్య మీద చెయ్యెత్తకూడదు. అలా ఎత్తాడే అనుకో... వాడితో ఒక్క క్షణం కూడా కలిసి ఉండాల్సిన అవసరం లేదు. అమ్మానాన్నల పరువుపోతుందనో బంధుమిత్రులు వేలెత్తి చూపుతారనో కాక నువ్వేం కోరుకుంటున్నావో ఆలోచించుకోవాలి.

నీ ఆత్మగౌరవాన్ని నువ్వే కాపాడుకోవాలి.

నీ జీవితగమనాన్ని నువ్వే నిర్దేశించుకోవాలి... అని తల్లి కూతురికి చెబుతుంది ఇటీవల వచ్చిన ఒక సినిమాలో. భార్యల మీద భర్తల దాష్టీకం తరతరాలుగా జరుగుతున్నదే. కానీ తల్లులు ఎప్పుడూ కూతుళ్లను ఓపిక పట్టమనే చెప్పారు. వాళ్లే కాదు, బంధువులూ, పెద్దలూ, పోలీసులూ, న్యాయాధికారులూ... అందరూ మగాడన్నాక కొడతాడు, సర్దుకుపోవాలి- అని నచ్చజెబుతూనే వచ్చారు. ఎందుకంటే ఇది పురుషాధిక్య, పితృస్వామ్య సమాజం. అందరూ అందులో పుట్టి పెరిగినవారే. తండ్రులు తల్లుల్ని గౌరవించకపోవడం, అవమానించడం, దుర్భాషలాడటం, చేయి చేసుకోవడం... చూస్తూ పెరిగిన వాళ్లే. పురుషులే కాదు, ఆఖరికి బాధితులైన స్త్రీలు కూడా తమ మీద పురుషుడు
చేయెత్తడాన్ని తప్పుబట్టడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే నూటికి 84 మంది మహిళలు భర్త చేయిచేసుకోవడం సహజమేనని చెప్పారు ఓ సర్వేలో.

కానీ ప్రపంచం స్త్రీ పురుష సమానత్వం వైపు పయనిస్తోంది. గత అయిదారు దశాబ్దాల్లోనే ఈ దిశగా ఎంతో మార్పు వచ్చింది.  అన్నిరంగాల్లోనూ మహిళలు పురుషులకు దీటుగా ఎదుగుతున్నారు. ఇలాంటి సమయంలో గృహహింసలాంటివి వారి ప్రగతికి ఆటంకాలుగా పరిణమిస్తున్నాయని గుర్తించారు సామాజికవేత్తలు. హింసలేని వాతావరణంలో జీవించడం మహిళల హక్కని మహిళా సంఘాలూ ఉద్యమించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే గృహహింసని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ అన్ని దేశాలూ చట్టాలు చేశాయి. నవంబరు 25ని అంతర్జాతీయ గృహహింస వ్యతిరేక దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. స్త్రీలమీద జరుగుతున్న హింస గురించి సమాజంలో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తోంది.

సామాజిక సమస్య

స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ అన్నారు కానీ నిజానికి రోడ్డుమీద జరిగే నేరాలు పదో పన్నెండో అయితే ఇళ్లలో జరుగుతున్నవి ముప్ఫైకి పైగా. అంటే- వీధి దాకా అక్కర్లేదు, సొంతింట్లోనే ఆమెకు స్వాతంత్య్రం లేదని రుజువుచేస్తోంది నేటి సమాజం.  

‘అతను మొట్టమొదటిసారి నన్ను కొడతానన్నప్పుడు నవ్వుతూ అన్నాడనుకున్నాను. అలాంటిది అతను నిజంగానే కొట్టినప్పుడు షాక్‌ కొట్టినట్టయింది. అచేతనంగా నిలబడిపోయాను. రెండోసారి హ్యాంగర్‌తో కొట్టినప్పుడు ‘ఇలా జరగడానికి వీల్లేదు... ఇది నిజం కాదు’ అని నన్ను నేను మభ్యపెట్టుకున్నాను. మూడోసారి బెల్ట్‌తో కొడితే బకిల్‌ తగిలి ముక్కు ఎముక విరిగింది. పెళ్లిలో ఇవన్నీ ఉంటాయని ఎవరూ నాకు చెప్పలేదు... నేను మోసపోయాను’

చదువూ సంస్కారం ఉన్న కుటుంబంలో పుట్టి, వివక్ష అన్నది ఎరగకుండా పెరిగి, పెళ్లయ్యాక పదిహేనేళ్లపాటు హింసను భరించి, చివరికి బయటపడి తన, పిల్లల జీవితాలను చక్కదిద్దుకుని విజేతగా నిలిచిన ఓ మహిళ ఆత్మకథలోని మాటలివి.

చాలామంది గృహహింసని భార్యాభర్తల సమస్యగా పరిగణిస్తారు. భార్యను వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కాక భర్త ఆస్తిగా చూసే పితృస్వామ్య భావజాలమే దీనికి మూలం. స్త్రీలు కూడా అదే నమ్ముతూ ఏళ్ల తరబడి మౌనంగా భరిస్తూ వచ్చారు. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే- భర్తనీ వివాహబంధాన్నీ కుటుంబవ్యవస్థనీ ధిక్కరించినట్లుగా భావిస్తున్నారు తప్ప ఆత్మగౌరవంతో బతకడం ఆమె హక్కని గుర్తించడం లేదు. మహిళలకు చదువూ ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడమూ పురుషులపై ఆధారపడి జీవిస్తుండడమే ఈ సమస్యకి కారణం అనుకునేవారు కొంతకాలం క్రితం వరకూ. ఇప్పుడు ఇద్దరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోగా సమస్య ఇంకా పెరుగుతోంది, సమాజంపై పలుకోణాల్లో ప్రభావం చూపుతూ సామాజిక సమస్యగా మారింది. ఇంటి నాలుగు గోడల మధ్య స్త్రీ ఎదుర్కొనే హింస ఏదైనా అది గృహహింస కిందికే వస్తుంది. శారీరకంగా హింసించడం, ఆర్థికస్వేచ్ఛ లేకుండా చేయడం, ఉద్యోగం చేయనివ్వకపోవడం, అనుమానంతో నిఘావేయడం, నలుగురిలో అవమానించడం, మానసికంగా వేధించడం... అన్నీ నేరాలే.

కారణం అక్కర్లేదు..!

‘చూరు చూరూ తిరిగి చుట్టాకు నే తెస్తే పొగాకు లేదని పొడవస్తడక్కో... పొడవస్తడక్కో...

వాణ్ణి నేనేమన్నన్ననా... వాళ్లమ్మ సొమ్మేమైన తిన్ననా...’

కష్టాన్ని కూడా పాటగా కట్టి పాడుకునే పల్లె పడుచుల నోట విన్పిస్తుంటుందీ పాట. బహుశా ప్రపంచంలోని భాషలన్నిటిలోనూ గుండెకైన గాయాలను విన్పించే ఇలాంటి ఆవేదనాభరిత గేయాలు ఉండే ఉంటాయి. గృహహింస సంఘటనలు చోటుచేసుకోవడానికి ఒక కారణం అంటూ ఉండక్కర్లేదు. పురుషుల హింసాత్మక స్వభావం, బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలూ, పెరిగే క్రమంలో ఇంటినుంచీ సమాజం నుంచీ నేర్చుకున్న భావజాలం వారిని హింసకు ప్రేరేపిస్తాయి. మద్యం, మాదకద్రవ్యాల అలవాటూ; సామాజిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లూ దానికి ఆజ్యం పోస్తాయి. వీటన్నిటి నేపథ్యంలో వారికి తమ ఆవేశాన్నీ ఆక్రోశాన్నీ తీర్చుకోవడానికి నిస్సహాయురాలైన ఇల్లాలే ఎదురుగా కన్పిస్తుంది. ఏదో ఒక వంక చూపి చెయ్యెత్తుతారు. అభద్రత, ఆత్మన్యూనతలతో బాధపడే పురుషులు కూడా భార్య మీద చెయ్యెత్తడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అహాన్ని తృప్తి పరుచుకుంటారట. అతని అహం సరే, ఆమె ఆత్మగౌరవం సంగతో..?

గతేడాది వచ్చిన హిందీ సినిమా ‘థప్పడ్‌’ ఈ అంశాన్నే చర్చించింది. ప్రమోషన్‌తో విదేశానికి వెళ్లే అవకాశం వచ్చిందని స్నేహితులందరికీ ఇంట్లో పార్టీ ఇస్తాడు భర్త. అది జరుగుతుండగానే ఆ ప్రమోషన్‌ని తనకి కాక మరెవరో ఇచ్చేశారని ఫోన్‌ వస్తుంది. దాంతో కోపంతో ఫోనులోనే పై అధికారిని దుర్భాషలాడుతున్న భర్తను సముదాయించబోతుంది భార్య. అతడి కోపమంతా ఆమెవైపు మళ్లుతుంది, చెంప పగలగొడ్తాడు. అందరూ చూస్తారే కానీ అదేమిటని అడగరు. ఆత్మగౌరవం దెబ్బతిన్న ఆమె ‘నేను అతడి ఆస్తిని కాను, ఒక్క దెబ్బే అయినా... కొట్టే హక్కు అతడికి లేదు’ అని కచ్చితంగా చెప్పి వెళ్లిపోతుంది.

అది సినిమా. నిజ జీవితంలోనూ మహిళలందరికీ ఆ ధైర్యం ఉంటే సమస్య ఇంత తీవ్రమయ్యేది కాదేమో.

ఆస్పత్రికి 40 శాతం

దేశంలో గతేడాది నమోదైన మహిళలపై జరిగిన నేరాలు దాదాపు 4 లక్షల 30వేలు కాగా అందులో 32 శాతం గృహహింస కేసులు. ఏదో మొగుడూ పెళ్లాలు కొట్లాడుకుని కోపంలో రెండు దెబ్బలు వేస్తే ఆ మాత్రానికే కేసులూ కోర్టులూ అంటే ఎలా... అనుకోవచ్చు. అందుకే ముంబయిలోని ఒక స్వచ్ఛంద సంస్థ అసలీ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూడాలనుకుంది. నగరంలో ప్రముఖులు నివసించే ప్రాంతమైన బాంద్రాలోని భాభా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ కొన్ని రోజులపాటు కాజువాలిటీ వార్డుకి వచ్చే కేసుల్ని అధ్యయనం చేసింది. రకరకాల గాయాలతో ఆస్పత్రికి వచ్చిన మహిళల్లో నూటికి 40 మంది గృహహింస బాధితులేనని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తేల్చి చెప్పారట. ‘కాలుజారి పడ్డామనీ, బైక్‌ మీద వస్తుంటే యాక్సిడెంట్‌ అయిందనీ రకరకాల కారణాలు చెబుతారు. తల పగిలి, ఎముకలు విరిగి, పెదవులు చిట్లి, పళ్లు ఊడిపోయి, కళ్లు వాచి కనిపిస్తుంటే వాస్తవం అర్థమయ్యీ ఏమీ అనలేక చికిత్స చేసి పంపిస్తుంటాం’ అని ఆమె చెబితే విస్తుపోయారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. ఆస్పత్రికి వెళ్లేంతగా కొట్టే సంఘటనలే 40శాతం ఉంటే ఆస్పత్రికి రాలేని, పైకి కనిపించని గాయాలతో బాధపడే కేసులు ఇంకెన్ని ఉంటాయో ఊహించవచ్చు.

స్త్రీలూ సమర్థిస్తున్నారు..!

మనదేశంలో ముప్ఫై ఏళ్ల క్రితం ప్రారంభించిన కుటుంబ ఆరోగ్య సర్వేని ఇప్పటివరకూ ఐదుసార్లు నిర్వహించారు. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులతో పాటు కుటుంబ సంక్షేమం, గృహహింస తదితర విషయాల్నీ ఇందులో చేరుస్తున్నారు. 2019-2021 మధ్య జరిపిన సర్వేలో గృహహింస గురించి వెల్లడైన వాస్తవాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
* కర్ణాటక, బిహార్‌, అస్సాం, మిజోరం, తెలంగాణల్లో 30శాతానికి పైగా మహిళలు గృహహింస బాధితులేనట. ఏడేళ్ల క్రితం జరిగిన సర్వేలో కర్ణాటకలో బాధితుల శాతం 20.6 ఉండగా గతేడాది అది 44శాతానికి పెరగడం గమనార్హం. బిహార్‌లో 40, తెలంగాణలో 37, ఏపీలో 30శాతం... తాము ఏదో ఒక సందర్భంలో గృహహింసను ఎదుర్కొన్నట్లు తెలిపారు. కరోనా సమయంలో పలు ప్రాంతాల్లో ఈ హింస రెండున్నర రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
* అక్షరాస్యతకీ, ఆర్థిక స్వాతంత్య్రానికీ సంబంధం లేకుండా వర్గాలకీ ప్రాంతాలకీ అతీతంగా సమస్య పెరుగుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి.
* వీటన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించి, ఆలోచింపజేసే విషయం- స్త్రీలు సైతం ఈ చర్యను సమర్థించడం. అత్యధికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 84 శాతం మహిళలు అది పురుషుడి హక్కనీ భార్యని కొడితే తప్పులేదనీ అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో 77 శాతం అలాగే చెప్పారు. అన్నిటికన్నా తక్కువగా 15శాతంతో ఈ విషయంలో హిమాచల్‌ మిగతా రాష్ట్రాలకన్నా నయమనిపించింది.
* భర్తతో వాదించినా, ఇంటినీ పిల్లల్నీ నిర్లక్ష్యం చేసినా, భర్తకు చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్లినా, అతని లైంగిక అవసరాలు తీర్చకపోయినా, సరిగ్గా వండిపెట్టకపోయినా, అతనికి ఆమె మీద అనుమానం వచ్చినా, అత్తమామల్ని గౌరవించకపోయినా... భర్త భార్యని కొట్టవచ్చని మహిళలు పేర్కొన్నారట.
* ఐరాస పాపులేషన్‌ ఫండ్‌ నివేదిక ప్రకారం- మనదేశంలో 44 ఏళ్లలోపు మహిళల్లో గృహహింస వల్ల ప్రాణాలు కోల్పోవడమో, వైకల్యం బారిన పడడమో జరుగుతున్న వారి సంఖ్య క్యాన్సర్‌ బాధితుల సంఖ్యకన్నా ఎక్కువ.

ఎందుకు భరిస్తున్నారు...

హింసను భరిస్తూ మహిళలు మౌనంగా ఉండిపోవడానికి పలు కారణాలున్నాయి. చాలామంది మహిళలు అసలు జరిగినదాన్ని జీర్ణించుకోలేరు. ‘ఒక్కసారే కదా... మళ్లీ ఇలా జరగదు’ అనుకుంటారు. కానీ గృహహింస ఒకసారి మొదలైతే చక్రంలాగా పునరావృతం అవుతూనే ఉంటుందంటారు మానసికనిపుణులు. ఒకసారి గొడవ జరిగాక పురుషులు సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితి తేవడానికి ప్రయత్నిస్తారు. ఆమె ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుండగానే- సారీ చెప్పి కాళ్లమీద పడతారు, మరోసారి అలా జరగదని హామీ ఇస్తారు. నువ్వు లేకుండా బతకలేమంటారు. మారిపోయామన్న నమ్మకం కలిగిస్తారు. అసలే ఏమీ తోచని స్థితిలో ఉన్న ఇల్లాలు కరిగిపోతుంది. క్షమించేస్తుంది. అంతా మర్చిపోతుంది. అలా ఆమె సర్దుకుంటూ ఉన్నప్పుడు మరో సంఘటన జరుగుతుంది. ఆమె తేరుకునేలోపే వరుసగా కొన్ని సంఘటనలు జరిగేసరికి ఆమెలో ఆత్మస్థైర్యం లోపిస్తుంది. తాను ఎందుకూ పనికిరానిదాన్ని అనుకుంటుంది. అందుకే పరిష్కారమార్గాలు అన్వేషించే శక్తి ఉండదు. శారీరక గాయాలు కనబడతాయని నలుగురిలో కలవకుండా ఒంటరిగా ఉంటుంది. లోలోన కుంగిపోతున్న ఆమెను యాంగ్జైటీ, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలూ వేధిస్తాయి. పిల్లలతో సహా మహిళలు ఆత్మహత్యకు పాల్పడే ఘటనలకు నేపథ్యం అదే.

ఆలోచన మారాలి

ఈ సమస్యకి స్త్రీలో పురుషులో కాదు, వాళ్లని అలా పెంచిన పితృస్వామ్యమే కారణం- అంటారు సామాజికవేత్తలు. అందుకే ఆలోచనాధోరణిని మార్చుకోవడమే దానికి పరిష్కారం. ఆడపిల్లలూ మగపిల్లలూ సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న సమాజంలో ఉన్నాం. ఎందులోనూ ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా కాదు. సంపాదనా బాధ్యతలాగే సంసార బాధ్యతనీ కలిసి పంచుకోవాలి. పిల్లల్నీ సమానావకాశాలతో పెంచాలి... అంటారు మహిళా హక్కుల న్యాయవాది ఫ్లెవియా ఆగ్నెస్‌.

బాధితులు మౌనం వీడితే వారికి తోడ్పాటును అందించడానికి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ పోలీసు విభాగం ప్రత్యేకంగా విమెన్‌ సేఫ్టీ వింగ్‌ని ఏర్పాటుచేసింది. గృహహింసతో పాటు మహిళలపై జరిగే నేరాలు ఏవైనా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్‌, ఈ-మెయిల్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఏపీలో దిశ కేంద్రాలు, మహిళా కమిషన్‌ ఆ బాధ్యత వహిస్తున్నాయి.

గృహహింసను సహించకండి... బాధితులై కుమిలిపోకండి... చట్టం చేయూతను అందుకోండి... నిర్భయంగా ముందుకు సాగిపొండి... అంటూ మహిళలకు ధైర్యాన్నిస్తున్నాయి ఈ సంఘాలు.


వాదనలూ వాస్తవాలూ...

తమ హింసాత్మక ప్రవర్తనను సమర్థించుకునే పురుషులూ, హింసను భరిస్తూ ఆ బంధంలో కొనసాగే మహిళలూ చెప్పే ప్రధాన వాదనలేమిటో, నిపుణుల అభిప్రాయం ప్రకారం వాటి వెనకాల ఉన్న వాస్తవాలేమిటో చూద్దాం.

సంపాదిస్తున్నదీ పోషిస్తున్నదీ నేనే కాబట్టి నేను చెప్పినట్లు పడివుండాల్సిందే.

- నిజమే, కానీ పిల్లలు డబ్బుల్ని తినరు, డబ్బు మీద పడుకోరు. ఆ డబ్బుని ఆకలి తీర్చే ఆహారంగా, మెత్తటి పడకగా మార్చేది స్త్రీనే. అలసి వచ్చిన భర్తని మళ్లీ మర్నాడు ఉత్సాహంగా ఉద్యోగానికి వెళ్లేలా సేదతీర్చేదీ ఆమే. ఆమె పనులన్నిటికీ విలువ కడితే పురుషుడికన్నా ఎక్కువే సంపాదిస్తున్నట్లు. కాబట్టి తామే సంపాదిస్తున్నామన్న అహాన్ని పురుషులూ భర్తమీద ఆధారపడి బతుకుతున్నామన్న ఆత్మన్యూనతను స్త్రీలూ వదిలించుకోవాలి.

పిల్లలకు తండ్రి ప్రేమని దూరం చేయకూడదని...

ఇది పెద్ద తప్పు. ఇంట్లో జరుగుతున్న అకృత్యాలకి ప్రథమ సాక్షులు పిల్లలే. ఆ మధ్య కొన్ని సంఘటనల్లో నాలుగైదేళ్ల పసిబిడ్డలు ‘అమ్మను నాన్న ఇలా గొంతు నొక్కి చంపేశాడు’ అంటూ పోలీసులకు చెప్పారు. అంత దారుణాన్ని కళ్లతో చూసిన చిన్ని మనసు ఎంత క్షోభపడి ఉంటుంది. పిల్లలకోసం భరిస్తున్నామనే వాళ్లు పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నట్లే. నిజానికి పిల్లల కోసమే ఆ నరకం నుంచి బయటపడాలి. ఇంట్లో జరిగే హింసాత్మక సంఘటనల ప్రభావం వల్ల పిల్లలు మానసికంగా దెబ్బతింటారు. తల్లినో, తండ్రినో ద్వేషిస్తారు. హింసాత్మకంగా తయారవుతారు. పెద్దయ్యాక భాగస్వామిని హింసిస్తారు.కాబట్టి పిల్లల కోసం హింసని భరిస్తూ ఉండటం అనేది వారికి మంచి కన్నా చెడే చేస్తుంది.

పరువు పోతుంది, భర్తను వదిలేసిందంటారు...

గృహహింస బాధితులు మౌనాన్ని వీడడానికి భయపడేది పరువు గురించే. పుట్టింటికి వెళ్తే కుటుంబం పరువు పోతుందనీ, తోబుట్టువులకు సంబంధాలు రావనీ... అనుకుంటారు. తల్లిదండ్రులకు ఆర్థిక భారం అవుతామనుకుంటారు. ఆమె అభిప్రాయాలను మార్చి మేమున్నామన్న ధైర్యాన్నివ్వాల్సింది అమ్మానాన్నలే. ఆమె తేరుకునేలా చూసి భవిష్యత్తుకు ఓ ఆలంబన కల్పించాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థల సహకారమూ తీసుకోవచ్చు.

ఒంటరి స్త్రీలకు రక్షణ ఏదీ?

దీనికి సమాజం కూడా కొంతవరకు బాధ్యత వహించాలి. సూటిపోటి మాటలతో వేధించకుండా ఒంటరి మహిళల నిర్ణయాలను గౌరవించాలి. అవసరమైన చోట అండగా నిలవాలి. మహిళలు కూడా స్వావలంబన సాధించి ఆత్మవిశ్వాసంతో నిలబడితే ఒంటరితనం ఈరోజుల్లో సమస్యే కాదు.


చట్టం...అండాదండా!

మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల పోరాటం ఫలితంగా మనదేశంలో ‘గృహహింస నిరోధక చట్టం’ 2006 నుంచి అమల్లోకి వచ్చింది. అయిదు అధ్యాయాలూ 37 సెక్షన్లూ ఉన్న ఈ చట్టం పరిధిలోకి మహిళలపై కుటుంబంలో జరిగే అన్నిరకాల హింసలూ వస్తాయి. భర్తనుంచే కాక కుటుంబంలో ఎవరి నుంచి హింసను ఎదుర్కొంటున్నా దీనిద్వారా రక్షణ పొందవచ్చు. హింసకు పాల్పడినవారికి శిక్షపడేలా చేయవచ్చు. బాధితురాలు పోలీసుస్టేషన్‌, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలో న్యాయం పొందేలా రూపొందించిన ఈ చట్టం అమలుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి స్వచ్ఛంద సంస్థలనూ సంరక్షణాధికారులనూ భాగస్వాములను చేశారు. బాధితురాలు స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌, పోలీసు, స్వచ్ఛంద సంస్థ... ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదుచేసిన వారం రోజుల్లో న్యాయమూర్తి సమక్షంలో విచారణ ప్రారంభమై 60 రోజుల్లో కేసు పరిష్కారం కావాలి. కేసు నడుస్తున్న సమయంలో ఆమె భర్త ఇంట్లోనే విడిగా ఉండవచ్చు, అందుకు అవసరమైన డబ్బు భర్త నుంచి అందేలా న్యాయమూర్తి ఆదేశిస్తారు. ఆ ఆదేశాలను అమలుచేయని పక్షంలో క్రిమినల్‌ కేసు నమోదుచేయవచ్చు. అయితే ఎంతో పకడ్బందీగా రూపొందించినప్పటికీ చట్టం అమలుకు కొన్ని రాష్ట్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఆచరణలో ఆశించిన ప్రయోజనం పూర్తిగా నెరవేరడం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..