రుచీ వాసనా స్పర్శా... ఆన్‌లైన్లోనూ సాధ్యమేనట!

ఫోను మోగుతుంది. ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి తెరమీద చూస్తాం. ఆఫీసులో కంప్యూటర్‌ తెర... ఇంటికొస్తే టెలివిజన్‌ తెర.

Updated : 11 Feb 2024 11:45 IST

ఫోను మోగుతుంది. ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి తెరమీద చూస్తాం. ఆఫీసులో కంప్యూటర్‌ తెర... ఇంటికొస్తే టెలివిజన్‌ తెర. వినోదానికీ విజ్ఞానానికీ ఉద్యోగానికే కాదు, బిల్లులూ షాపింగూ... అన్నిటికీ తెరే ఇప్పుడు మనకి ఆధారం. కాసేపు అది లేకపోతే..? చేయి విరిగినట్లుగా ఉంటుంది. కానీ, కొన్నాళ్లయితే ఇక ఆ తెరలతో పని ఉండకపోవచ్చు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ని దాటి మరో అడుగు ముందుకు తీసుకెళ్తోంది సాంకేతిక ప్రపంచం. దాన్ని ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ సెన్సెస్‌’ అంటున్నారు. కన్ను, ముక్కు, నాలుక, చెవి, స్పర్శ... ఇవి ఐదూ కలిసి మెదడునే ఇంటర్‌ఫేస్‌గా వాడుకోబోతున్నాయి... ఊహలన్నిటినీ నిజాలు చేయబోతున్నాయి. రండి... 2030కల్లా టెక్నాలజీ వినియోగదారులుగా మనం ఎలాంటి అనుభవాలను ఎదుర్కొనబోతున్నామో చూద్దాం..!

కాకరకాయ కూర కూడా ఆలుగడ్డ వేపుడు లాగా కమ్మగా ఉంటుంది.

వేదిక మీద వ్యక్తి ఏ భాషలో ప్రసంగిస్తున్నా అది మన మాతృభాషలోనే వినపడుతుంది.

సిరికో అలెక్సాకో చెప్పనవసరం లేకుండా మనం మనసులో అనుకోగానే ఆ పని జరిగిపోతుంది.

చిన్ననాటి రోజుల్ని తలచుకోగానే కళ్లలో బాల్యస్నేహితుడి రూపం కనిపించినట్లు చెవుల్లో ఆనాటి అతడి కబుర్లూ వినిపిస్తాయి. భుజం మీద అతడి చేతి స్పర్శా తెలుస్తుంది.

నిజంగా అలా జరిగితే భలే ఉంటుంది కదూ..!

పదేళ్ల క్రితం గూగుల్‌ ఒక ప్రకటన చేసింది. ‘గూగుల్‌ నోస్‌’ అనే గొప్ప సెర్చ్‌ టూల్‌ని ఆవిష్కరించామనీ దాని ద్వారా వినియోగదారులు కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్ల నుంచి వాసనలని కూడా ఆఘ్రాణించవచ్చనీ తెలిపింది. ఉదాహరణకు మల్లెపువ్వు అని గూగుల్‌ సెర్చ్‌లో టైప్‌ చేయగానే ఆ పువ్వు ఫొటో కన్పించినట్లు, ఇకనుంచీ గూగుల్‌ నోస్‌ దాని వాసన కూడా చూపిస్తుందని చెప్పింది. అందర్నీ అబ్బురపరిచిన
ఆ వార్తని తర్వాత ఏప్రిల్‌ ఫూల్‌ జోక్‌గా కొట్టిపడేసింది ఆ కంపెనీ. నిజంగా కూడా అప్పటికి అది జోకే.

అది జరిగిన ఎనిమిదేళ్లకి... దాన్ని నిజం చేసే దిశగా ప్రారంభమైన టెక్నాలజీ ప్రయాణం దాదాపుగా లక్ష్యానికి చేరువలోకి వచ్చేసిందట. దాన్నే ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ సెన్సెస్‌’ అంటున్నారు. కన్నూ ముక్కూ నాలుకా చెవీ చర్మమూ... ఈ ఐదింటినీ పంచేంద్రియాలనీ జ్ఞానేంద్రియాలనీ అంటాం. వీటివల్లే బాహ్యప్రపంచంతో మనకు అనుబంధం ఏర్పడేది. ఇప్పుడు డిజిటల్‌ ప్రపంచంతో అనుసంధానానికి కూడా అవే కీలకం కానున్నాయన్నమాట. ఈ దశాబ్దం చివరకల్లా ఆ సాంకేతికత  ఫలితాలు అందుబాటులోకి వస్తాయన్నది నిపుణుల మాట.

‘తెర’మరుగవుతుందా...

రాత్రి తొమ్మిదవుతోంది. భర్త కోసం ఎదురు చూస్తూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్నారు. అంతరంగంలో ఆలోచనలు సుళ్లు తిరుగుతుంటాయి. రోజూ పొద్దున్నే లేవడం, హడావుడిగా వంట చేయడం, పిల్లల్ని పంపడం, ఆఫీసులకు పరుగులు తీయడం, వచ్చాక హోంవర్కులూ, మళ్లీ వంటలూ భోజనాలూ... ఏమిటో ఈ జీవితం- అనిపిస్తుంది. ఈలోపల ఆయన వస్తారు. ఆలోచనలు కట్టిపెట్టి వాస్తవంలోకి వచ్చేస్తారు. గబగబా భోజనాలు కానిచ్చి మళ్లీ వంటిల్లు సర్దుకుని పొద్దుటికి కూరగాయలవీ సిద్ధం చేసుకుని అలసిపోయి పడుకుంటారు.

అలా కాకుండా... టేబుల్‌ దగ్గర కూర్చున్నప్పుడు అందంగా ఒక ఊహ... ఒక మంచి హోటల్‌లో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ చేస్తున్నట్లూ వెనకాల మంద్రంగా సంగీతం వినిపిస్తున్నట్లూ మత్తెక్కించే పూల పరిమళం గదంతా వ్యాపిస్తున్నట్లూ మీకు ఇష్టమైన ఆహారపదార్థాలు టేబుల్‌ మీద అందమైన పింగాణీ పాత్రల్లో సర్ది పెట్టినట్లూ చుట్టూ మీ మిత్రులంతా కూర్చుని కబుర్లు చెబుతున్నట్లూ ... ఊహే కదా రూపాయి ఖర్చుకాదు, కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకోవచ్చు. ఇకపైన, క్షణాల్లో అవన్నీ నిజంగా మీ ముందు సాక్షాత్కరించిన అనుభూతి కలగకపోతే చెప్పండి! ఇప్పుడంటే ఇప్పుడు కాదు కానీ 2030 తర్వాత ఈ ఊహ నిజమై తీరుతుందని టెక్నాలజీ ప్రియులు హామీ ఇస్తున్నారు.

ఈరోజుల్లో సాంకేతికత ప్రధానంగా ధ్వని, దృశ్యం... ఈ రెంటితోనే ఇంటరాక్ట్‌ అవుతోంది. ఎరిక్సన్‌ రీసెర్చ్‌ నిపుణుల అధ్యయనం ప్రకారం- 2025కల్లా అన్ని జ్ఞానేంద్రియాలతోనూ ఇది పరస్పర చర్య జరపగలుగుతుందట. 2030 నాటికి ఆలోచనలనూ డిజిటల్‌గా కమ్యూనికేట్‌ చేయగలదట. ఇప్పుడు మనం నివసిస్తున్నది 4జీ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్‌ ఫోన్‌ ‘తెరల’ కాలంలోననీ, ఎంతోకాలం ప్రజలు దీన్ని ఇష్టపడరనీ అంటోంది ఎరిక్సన్‌ చేపట్టిన ఓ అధ్యయనం. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో సగం మంది 2025 నాటికి తాము వాటిని వాడబోవడం లేదనీ తేలికైన, ఫ్యాషనబుల్‌గా ఉండే ఏఆర్‌ గ్లాసెస్‌తోనే అన్ని పనులూ చేసుకోవాలనుకుంటున్నామనీ చెప్పారట. పంచేంద్రియాలతో అనుసంధానమై పనిచేసే మరెన్నో వేరబుల్స్‌ అందుబాటులోకి వస్తాయనీ 5జీ అందుకు రంగం సిద్ధం చేస్తోందనీ అభిప్రాయపడ్డారట.  

మెదడే ఇంటర్‌ఫేస్‌

2030 నాటికి మన ఆలోచనలకు స్పందించే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందట. అప్పుడు మనిషి మెదడే ఇంటర్‌ఫేస్‌గా మారిపోతుంది. అంటే ఇప్పుడు కంప్యూటర్‌తో పనిచేయడానికి మౌస్‌, కీబోర్డు; స్మార్ట్‌ ఫోన్లకు టచ్‌ స్క్రీన్‌ లాంటివన్నీ వాడుతున్నాం. అప్పుడిక ఇవేమీ అక్కర్లేదు. కమాండ్లను మనసులో అనుకుంటే చాలు... పనులు జరిగిపోతాయి. అంతేకాదు, మన ఆలోచనలను ఇతరులతో పంచుకునే పని కూడా అదే చేసేస్తుంది. ఇప్పుడు మనం టెక్ట్స్‌ మెసేజ్‌లూ వాట్సాప్‌ చాట్‌ల ద్వారా చేస్తున్నదంతా అప్పుడు మనసులోనే చేసేయొచ్చు. అవతలి వారి సందేశాన్ని మనకి చేరవేయడం, దానికి మన సమాధానం మనసులో రూపుదిద్దుకోగానే అవతలివారి మెదడుకి పంపడం... ఆటోమేటిగ్గా జరిగిపోతుంది.  

ఇలాంటి పనులన్నీ చేయడానికి ఏఆర్‌ గ్లాసెస్‌ వస్తాయట. అవి పెట్టుకుని ‘మ్యాప్‌’ అని తలచుకుంటే చాలు కళ్లముందు గూగుల్‌ మ్యాప్‌ ప్రత్యక్షమవుతుంది. మనం ఎక్కడికెళ్లాలో మనసులో అనుకుంటే అక్కడికి దారి చూపించేస్తుంది. ఒకోసారి పరిచయస్తులు కన్పించి పలకరిస్తే వాళ్లని ఎక్కడో చూసినట్లుంటుంది కానీ ఎవరో ఎంతకీ గుర్తు రాదు. అదే ఏఆర్‌ గ్లాసెస్‌ ఉంటే వాళ్లని ఎప్పుడు ఎక్కడ కలిశారో తెలిపే సమాచారమంతా కళ్లముందు పరిచేస్తుంది. ఈలెక్కన ఇక రహస్యాలేముంటాయీ అనుకుంటున్నారా... దానికీ సమాధానం ఉంది. దొంగల బారిన పడకుండా ఇంటికి ఎలాగైతే తాళం వేస్తామో అలాగే మెదడుకీ లాక్‌, అన్‌లాక్‌ వ్యవస్థ ఉండబోతోంది కాబట్టి ప్రైవసీ మరింత పెరుగుతుందని వారు చెబుతున్నారు.  

కావాలనుకున్నవే వినిపిస్తాయి!

రోడ్డుమీద ట్రాఫిక్‌ రొద. ఇంట్లోనైనా ప్రశాంతంగా ఉందామంటే రెండిళ్లవతల ఏ పెళ్లి వేడుకలోనో డీజే మోత. పక్కింట్లో పిల్లల అల్లరి. వాటిని నియంత్రించడం మన చేతిలో లేని పని. సరే, మరో సందర్భం చూద్దాం. మనకి ఇంగ్లిష్‌ సరిగా రాదు. పొరుగింటాయన ఇంగ్లిష్‌లో ఏదో అడిగితే తడబడతాం. ఈ కష్టాలేవీ ఇక ఉండవట. ఏ శబ్దాలు మనకి వినపడాలో, ఏవి వినపడకూడదో అలాగే మన నుంచి ఇతరులకు ఏవి వినపడవచ్చో నియంత్రించుకోవడం మనచేతిలో పనేనట. ఇష్టంలేని శబ్దాలు డిస్టర్బ్‌ చేయకుండా నిరోధించడానికి మన చుట్టూ డిజిటల్‌ సౌండ్‌ బబుల్‌ ఏర్పాటు చేసుకోవచ్చట. బాగుంది కదూ ఈ ఐడియా.

స్మార్ట్‌ఫోనుతోపాటు మనకు వచ్చిన అదనపు హంగు... ఇయర్‌ ఫోన్లు. వినాలనుకున్నవాటిని ఫోనులో ఆన్‌ చేస్తే ఇవి వినిపిస్తాయి. ఇప్పుడిక వాటితో పనిలేదు. మనం ఏ భాషలో ఉన్నది పెట్టినా దాన్ని మన భాషలోకి అనువదించి చెప్పే హెడ్‌బ్యాండ్స్‌కి ఫోను కూడా అక్కర్లేదు. అవి ధ్వనులను నేరుగా మెదడుకే ట్రాన్స్‌మిట్‌ చేస్తాయట. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితోనైనా భాష సమస్య లేకుండా మాట్లాడేయవచ్చు. గొంతు పీలగానో, కీచుగానో ఉంటే అదీ సరిచేసుకోవచ్చు. అమితాబ్‌ బచ్చన్‌ గొంతులా గంభీరంగానో, చిత్ర గొంతులా మధురంగానో విన్పించేలా చేయొచ్చు. అంతా బాగానే ఉంది కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హారన్‌ వినపడకపోతే ఎలా? అందుకని అలాంటి శబ్దాలను శబ్దరూపంలో కాకుండా రంగుల రూపంలోనో, లేకపోతే శరీరం మీద వైబ్రేషన్‌ లానో వచ్చే ఏర్పాటూ చేసుకోవచ్చట. అలా మొత్తంగా ధ్వని ప్రపంచం మన ఆధీనంలో ఉంటుందన్నమాట.

జ్ఞాపకాలకు రుచీ వాసనా...

‘కాకరకాయా... బాబోయ్‌ చేదు’. ‘గుమ్మడా అదేం కూర...’ ఇలా ప్రతి కూరగాయకీ ఏదో ఒక పేరు పెట్టడం పిల్లలకు అలవాటే. వాళ్లకి నచ్చిన కూర రోజూ వండినా తింటారు. కానీ పోషకాలు అందాలంటే అన్నిరకాల కూరగాయలూ తినాలి కదా అని బాధపడే తల్లుల కష్టమూ త్వరలోనే తీరబోతోందట.

ఇప్పటివరకు మన ఆన్‌లైన్‌ అనుభవాల్లో కళ్లతో చూడడం, చెవితో వినడం మాత్రమే ఉన్నాయి కానీ రుచి చేరలేదు. ఇక ఆ కొరతా ఉండదు. నోట్లో ఒక చిన్న పరికరం పెట్టుకుంటే కాకరకాయ రుచి బెండకాయలా మారిపోతుంది. అదొక్కటే కాదు- ఏ పదార్థం తిన్నా అది తినేవారికి నచ్చిన రుచిలోకి మారిపోతుందన్నమాట. ఇంట్లో మిలెట్‌ వంటకాలు తింటూనే మల్టీ క్వీజిన్‌ రెస్టరంట్‌లో మంచి డిన్నర్‌ తింటున్నట్లు రకరకాల రుచుల్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అంతేకాదు, ఆన్‌లైన్‌లో మనం ఆర్డర్‌ పెట్టే ఆహారపదార్థాలను కూడా ఇంట్లోనుంచే డిజిటల్‌గా రుచి చూడొచ్చు. టీవీలో వంటల ప్రోగ్రామ్‌ని కళ్లతోనే కాదు, నాలుకతో రుచీ చూడొచ్చు. మధురమైన జ్ఞాపకాలకీ తీయని రుచుల్ని చేర్చవచ్చు. చిన్నప్పుడు అమ్మ నెయ్యి కరిగించి అడుగున ఉన్న గోదారి గీకి పెట్టేదనీ, అదెంతో కమ్మగా ఉండేదనీ గుర్తుచేసుకుంటాం. ఇప్పుడిక ఆ జ్ఞాపకంతో పాటు నాలుక మీదికి ఆ రుచీ వచ్చేస్తుందట. ఫలానా వారి ఇంట్లో పెళ్లి భోజనం ఎంత బాగుందో... అని తలచుకోగానే ఆనాటి రుచులు నాలుక మీద నాట్యం చేస్తాయట. రుచే కాదు, గూగుల్‌ నోస్‌తో పనిలేకుండానే ఆన్‌లైన్‌ అనుభూతులకి పరిమళాలనూ అద్దొచ్చు. సినిమా చూసేటప్పుడు అక్కడ హీరో హీరోయిన్‌ ఏ పూలతోటలోనో నృత్యం చేస్తుంటే తెరమీద వాటిని చూస్తూ ఆ పూల వాసనలని మనమూ ఆఘ్రాణించవచ్చన్నమాట.

డిజిటల్‌ స్పర్శ

తాకే తెర మీద వేలి కొసల్ని అలా ఆనించగానే ఫోన్‌ రకరకాలుగా పనిచేసి పెడుతోంది. అయితే ఈ స్పర్శ కేవలం ఫోను తెర వరకే పరిమితం. అందులో కన్పించేవాటిని స్పర్శించలేం. అంటే వేలి స్పర్శకి ఫోను స్పందిస్తోంది కానీ వేలికి ఎలాంటి అనుభూతీ ఉండదు..ఈ స్పర్శ టెక్నిక్‌ని ఇంకా బాగా ఉపయోగించుకోబోతోంది సాంకేతిక ప్రపంచం. ఇకనుంచి డిజిటల్‌గా మనం దేన్ని టచ్‌ చేసినా దాని ఆకృతిని అనుభూతి చెందేందుకు తోడ్పడే రిస్ట్‌ బ్యాండులు వచ్చేస్తాయి. వేలితో ఫోనులో ఒక ఐకాన్‌ని స్పృశించినప్పుడు దాని స్పర్శ- ఇది ఫలానా ఐకాన్‌ అని స్పష్టంగా వేలికి తెలుస్తుంది. కేవలం చేతివేళ్లే కాదు, మొత్తం శరీరం ఈ డిజిటల్‌ టచ్‌ అనుభవాన్ని పొందబోతోంది. మంచు ఫొటోని స్పృశిస్తే చల్లదనమూ, మనిషి ఫొటోని ముట్టుకుంటే చర్మం స్పర్శా... ఇలా అన్నీ తెలుస్తాయట. ఉన్నవాటిని స్పృశించి చూడడం వరకూ బాగానే ఉంది కానీ, మరికొందరు టెక్‌ ప్రియులైతే- వాతావరణంలో రాబోయే మార్పుల్నీ వర్షాన్నీ వేడిగాలుల్నీ కూడా స్పృశించ వచ్చంటున్నారు.

ఇంకా ఎన్నో..!

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. అయితే అది చేసేటప్పుడు కొంటున్న వస్తువు ఫొటోని కళ్లతో చూసి కొంటున్నాం. ఇక ముందు అలా కాదు, చేత్తో ముట్టుకుని, వాసన చూసి, తినేవి అయితే రుచి చూసి... కొనవచ్చు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ ఇక డిజిటల్‌ మాల్స్‌ అయిపోతాయి. ఇలాంటివే ఇంకా ఎన్నో...

* మనకి ఇప్పుడు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌... రెండు రకాల జీవితాలున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే భౌతిక ప్రపంచమూ వర్చువల్‌ ప్రపంచమూ. ఈ రెండిటి మధ్యా గీత చెరిగిపోతుందంటున్నారు టెక్‌ నిపుణులు. హోలోగ్రఫిక్‌ త్రీ డీ డిస్‌ప్లే అందుబాటులోకి వచ్చేస్తుందట. సెలవు పెట్టి ఏ ఊటీలోనో ఎంజాయ్‌ చేస్తున్నా ఆఫీసులో అర్జెంట్‌ మీటింగ్‌ మిస్సవకుండా హాజరవ్వచ్చు.  

* గోడలకు చెవులుంటాయనే వారు పెద్దవాళ్లు, ఇంటిగుట్టు బయటకు వెళ్లకుండా నెమ్మదిగా మాట్లాడమని హెచ్చరిస్తూ. ఏఆర్‌ గ్లాసెస్‌ పెట్టుకుంటే గోడలకి కళ్లూ ఉన్నట్లేనట. అవతల పక్క ఏముందో స్పష్టంగా చూడొచ్చట.

* సోషల్‌మీడియాలో ఫేక్‌ అకౌంట్లు ఉంటాయి. చాలావరకూ మోసాలు చేసేదీ ఇలాంటి ఫేక్‌ అకౌంట్ల వాళ్లే. ఇక ఆ బాధ ఉండదు. ఆఖరికి డేటింగ్‌ సైట్లతో సహా ఫేస్‌ ఐడీ కచ్చితంగా వెరిఫై చేశాకే ఆన్‌లైన్‌లో ఎవరితోనైనా మాట్లాడే అవకాశం వస్తుంది. ఎలాంటి ఎడిటింగూ చేయని సహజమైన ఫొటోలకే విలువ ఉంటుంది. ఫేక్‌ న్యూస్‌, ఫేక్‌ ఫొటోస్‌... అన్నీ తెరమరుగవ్వాల్సిందే.

* పర్యటక రంగం గొప్ప అనుభూతులకు తెరతీయనుంది. ఉదాహరణకు నలందా లాంటి పురావస్తు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారనుకోండి. అక్కడ కన్పించింది చూడడమే కాదు, ఆనాటి వాతావరణాన్నీ అనుభూతి చెందవచ్చు. అప్పటి వంటకాల్నీ రుచి చూడవచ్చు.

* మామూలు స్విమింగ్‌ పూల్‌లో ఈత కొడతాం కానీ ఆక్సిజనేటెడ్‌ వీఆర్‌ హెడ్‌సెట్‌ పెట్టుకుని ‘ఎనీవర్స్‌ స్విమింగ్‌ పూల్‌’లోకి దిగితే గురుత్వాకర్షణకు అందకుండా అంతరిక్షంలో తేలిపోతున్న అనుభూతి పొందవచ్చట.  

* మాల్స్‌లో డ్రాప్‌ఇన్‌ మెడికల్‌సెంటర్లు ఉంటాయి. కృత్రిమమేధ సాయంతో స్కానింగులూ ఎక్స్‌రేలూ తీసి క్షణాల్లో రిపోర్టులు ఇస్తాయివి.

* నగరాల్లో ఉండి పచ్చదనాన్నీ పార్కుల్నీ మిస్సవుతున్నామన్న బెంగ అక్కర్లేదిక. పచ్చని చెట్ల మధ్య తిరుగుతున్న అనుభూతినీ మాల్స్‌ అందిస్తాయి.

అనుభూతిని కొనుక్కోవచ్చు!

ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ సెన్సెస్‌ వాడుకలోకి వచ్చాక డేటా ప్లాన్‌ బదులు వినియోగదారులు నేరుగా అనుభవాలను కొనుక్కునే అవకాశం ఉంటుందట. అంటే ఐపీఎల్‌ చూడడానికి దాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తున్న టీవీ ఛానల్‌కి సబ్‌స్క్రిప్షన్‌ కట్టే బదులు తామూ ఆ మైదానంలో ఆటగాళ్ల పక్కనే నిలబడి బ్యాటింగ్‌, బౌలింగ్‌లను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందడానికి ఛార్జీలు చెల్లిస్తారట. 5జీ ఆ అనుభవాన్ని ఇస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మ్యూజియంకి వెళ్తే కృష్ణదేవరాయలు కూర్చున్న సింహాసనమూ ధరించిన నగలూ వాడిన ఆయుధాలూ చూస్తాం. కానీ రేపటి సందర్శకులు వాటితో తృప్తిపడరు. కృష్ణదేవరాయలు కొలువుదీరిన దృశ్యాన్ని కళ్లారా చూడడానికి ఇష్టపడతారు. అలాంటివారు ఏఆర్‌, వీఆర్‌ టెక్నాలజీతో నిజంగా ఆ కాలంలోకి వెళ్లిపోవచ్చు. సింహాసనం మీద దర్జాగా కూర్చున్న రాయల్నీ చుట్టూ కొలువుదీరిన మంత్రుల్నీ చూస్తూ అల్లసాని పెద్దన కవిత్వం వింటూ ఆ సభలోనే ఉన్న అనుభూతి పొందవచ్చు.

అదండీ సంగతి... ఇలా పంచేంద్రియాలతోనూ డిజిటల్‌ ప్రపంచంతో మమేకమయ్యే రోజు ఎంతో దూరం లేదిక!

ట్రాఫిక్‌ లేనప్పుడే ఆఫీసుకు వెళ్లొచ్చు!

ప్రస్తుతం ప్రపంచం ముందున్న భూతాపం సమస్యకి చెక్‌ పెట్టడానికీ ఆధునిక సాంకేతికతే ఆయుధం కాబోతోందంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీని అందరికన్నా ముందు అందిపుచ్చుకోవడం అంటే కొందరికి ఇష్టం. వచ్చినదాన్ని అందిపుచ్చుకోవడమే కాదు, రేపు రాబోయే మార్పుల గురించీ వారికి ఓ అంచనా ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని వేలమందిని ఎంచుకుని ఈ దశాబ్దం చివరికల్లా రానున్న మార్పులేమిటో చెప్పమని అడిగింది ఎరిక్సన్‌ సంస్థ. రాబోయే ఆ మార్పులు పర్యావరణానికీ మేలు చేసేలా ఉంటాయని వారు అభిప్రాయపడడం విశేషం.

* షాపులోకి వెళ్లి అక్కడున్న వందలాది డిజైన్లలో ఒకటి ఎంచుకోవడం ఉండదు. ఫర్నిచర్‌, వంటసామగ్రి, బొమ్మలు... ఏ వస్తువు కొనాలన్నా ఎవరికి నచ్చిన డిజైన్‌ వాళ్లు ఆర్డర్‌ ఇస్తే అది మాత్రమే తయారుచేసిస్తారు. ఉత్పత్తి దశలోనే వ్యర్థాలను నివారించడానికి ఈ విధానం. అలాగే పాతవి ఇచ్చాకే కొత్తవి కొనాలి. నూరుశాతం రీసైక్లింగ్‌ చేసేందుకే ఆ ఏర్పాటు.

* పెళ్లిళ్లూ సమావేశాలూ క్రీడాపోటీలూ లాంటివి జరిగే హాల్సన్నీ టెలిప్రెజెన్స్‌ టెక్నాలజీ కలిగి ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు ఎక్కడ నుంచి అయినా వర్చువల్‌గా ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

* ఇంటర్నెట్‌ ఆఫ్‌ సెన్సెస్‌ వాడకం వల్ల అన్నిరకాలుగా చూసి నచ్చినవే కొంటాం కాబట్టి వ్యర్థాలు గణనీయంగా తగ్గుతాయి. వర్చువల్‌ టూర్లు పెరిగి ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. పర్యావరణం మీద ఇంధన భారం తగ్గుతుంది.

* కార్యాలయాలకు కచ్చితమైన వేళలుండవు. రద్దీ తక్కువ ఉండే వేళల్లో వెళ్లిరావచ్చు. ట్రాఫిక్‌ లేనప్పుడే బయటకు వెళ్లడం వల్ల ఇంధనమూ సమయమూ కలిసివచ్చేలా కృత్రిమమేధ తోడ్పడుతుంది.

* నీటివనరులు దాదాపు కనుమరుగవుతాయి కాబట్టి నగరాల్లో భవనాలన్నీ వర్షపునీటిని సంరక్షించుకునే స్మార్ట్‌ పరికరాలను కలిగివుంటాయి. ఇప్పుడు సైబర్‌ మోసాలతో అకౌంట్ల నుంచి డబ్బుని దొంగిలించినట్లు భవిష్యత్తులో పక్కవాళ్ల నీటినీ, కరెంటునీ దొంగిలించే అవకాశాలు ఉన్నాయట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..