Updated : 25 Sep 2022 11:13 IST

ఒక్కో అడుగూ... యూనికార్న్‌ దిశగా...

రెండేళ్లుగా వ్యాపార ప్రపంచంలో యూనికార్న్‌ కంపెనీలు సందడి చేస్తున్నాయి. వాటి సంఖ్యలో అమెరికా, చైనా తర్వాత మూడోస్థానంలో నిలుస్తోంది మనదేశం. చిన్న చిన్నగా కొన్ని లక్షల పెట్టుబడితో మొదలుపెట్టే అంకుర పరిశ్రమని తక్కువ సమయంలో వందకోట్ల డాలర్ల(దాదాపు 8వేల కోట్ల రూపాయలు) విలువైన కంపెనీగా తయారుచేయడం ఎలా సాధ్యమవుతోందీ... విదేశీ సంస్థలు వచ్చి ఈ కంపెనీల్లో కోట్ల పెట్టుబడులు ఎందుకు పెడుతున్నాయీ... వారికి ఆ భరోసా ఇస్తున్న అంశాలేమిటీ... లాంటివన్నీ తెలియాలంటే అలాంటి సంస్థల సారథుల్ని పలకరించాల్సిందే..!

ప్రపంచమంతా కొవిడ్‌ రెండో వేవ్‌తో అతలాకుతలమవుతున్న వేళ... రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాబట్టుకుని ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది యువభారతం. అన్నీ అంకురాలే... అందరూ పాతిక ముప్పై ఏళ్ల కుర్రాళ్లే. దేశ వ్యాపార రంగం కనీ వినీ ఎరగని విజయమిది.

పెద్ద పెద్ద వ్యాపారసంస్థలూ పరిశ్రమలూ మన దేశానికి కొత్త కాదు. రీటైల్‌ వ్యాపారాలూ, గొలుసు హోటళ్లూ, బ్యాంకులూ... ప్రతిష్ఠాత్మక సంస్థలెన్నో ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ వాటికి వేటికీ ఫ్లిప్‌కార్ట్‌, ఓయో, పేటీఎం లాంటి ఐడియాలు రాలేదు.

ఆధునిక సమాజపు అవసరాల్నీ అందుబాటులో ఉన్న సాంకేతికతనీ ఉపయోగించుకునే ఆ సృజనాత్మక ఐడియాలే ఈ పెట్టుబడుల వెల్లువకు పునాది వేశాయి. అలాగని, ఒక అంకుర సంస్థ రూపం దాల్చి వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే- ఐడియా ఒక్కటే సరిపోదు, ఇంకా చాలా కావాలి. వాటినన్నిటినీ సమకూర్చుకుని, సమన్వయపరచుకుని ముందుకు వెళ్లగలిగినవాళ్లే విజేతలుగా నిలుస్తున్నారు. ఔత్సాహికులకు ఆ విజేతలు చెబుతున్న అనుభవ పాఠాలేమిటో చూద్దామా..!


ఐడియాతో ప్రేమలో పడవద్దు..!

ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ ‘క్రెడ్‌’ ప్రారంభించిన రెండున్నరేళ్లకే యూనికార్న్‌ హోదా సాధించి చరిత్ర సృష్టించింది. అందులో సభ్యులుగా చేరినవారికి ఈ సంస్థ క్రెడిట్‌ కార్డు బిల్లులూ ఇంటి అద్దె లాంటి నగదు అవసరాలను తీరుస్తుంది. దాదాపు కోటిమంది సభ్యులున్న ఈ సంస్థ వ్యవస్థాపకుడు కునాల్‌ షా ఏమంటారంటే-

పరిశోధన: ఒక మంచి ఐడియా రాగానే దాంతో ప్రేమలో పడిపోతారు చాలామంది. ఉద్వేగానికి లోనై నేరుగా రంగంలోకి దిగిపోతారు. 99 శాతం విఫలమయ్యేది అందుకే. నేనలా చేయలేదు. హడావుడిగా పనిచేసి ఫెయిలవడం కన్నా సమయం తీసుకుని కట్టుదిట్టంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ముఖ్యమని తెలుసుకున్నాను. మా టీమ్‌ అంతా కలిసి నెలల తరబడి విపరీతంగా పరిశోధించాం. సాధ్యమైనంత లోతుగా ఆ రంగాన్ని అర్థం చేసుకున్నాం.

టీమ్‌: ఆలోచన ఎంత కొత్తగా ఉంటే- అది ఎంతవరకూ ఆచరణీయం అన్న ఆందోళనా అంత ఎక్కువగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగల సరైన టీమ్‌ దొరుకుతుందా అన్నది మొదటి టెన్షన్‌. అందుకే నాకు సంస్థను ప్రారంభించడానికి చాలా సమయం పట్టింది. మంచి టీమ్‌ దొరికాకే అందరం కలిసి రీసెర్చ్‌ చేసి మా ఐడియాకి మెరుగులు దిద్దుకున్నాం. వినియోగదారులకు సేవలు అందించే మాలాంటి సంస్థకి వాళ్ళ ప్రశంసలే లక్ష్యంగా పనిచేసే బృందం కావాలి కానీ వ్యవస్థాపకుడి మెప్పుకోసం పనిచేసే బృందం కాదు. అలాంటి బృందాన్నే నేను ఎంచుకున్నాను.

నిధులు కాదు: అదృష్టవశాత్తూ మాకు ఆర్థిక వనరులకు కొదవ లేదు. చాలామందిలో ఉండే మరో పొరపాటు అభిప్రాయం- ఫండింగ్‌ లభిస్తే చాలు స్టార్టప్స్‌ విజయవంతం అయినట్లేనని. అదే నిజమైతే నిధులు పొందిన స్టార్టప్స్‌ అన్నీ విజయం సాధించాలి మరి. అలా కావడం లేదుగా. మంచి ఆలోచనా, సరైన టీమ్‌, తగిన పరిశోధనా, పెట్టుబడికి చాలినంత డబ్బూ, టెక్నాలజీ... అన్నీ కుదరాలి.

బ్రేకింగ్‌ మొమెంట్‌: అన్నీ కలిసొచ్చాయని సంస్థ పెట్టాం. ప్రారంభించిన రెండు నెలలకల్లా వంద కోట్ల వ్యాపారం చేసింది. ఆ లెక్కలు చూసేసరికి గుండె ఝల్లుమంది. ఎంత సీరియస్‌ బిజినెస్‌లోకి దిగామో అర్థమైంది. అదే మాకు బ్రేకింగ్‌ మొమెంట్‌.

మార్కెటింగ్‌: మార్కెటింగ్‌కి భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నాను. మన ఉత్పత్తి ఎవరికి అవసరమో వారు మాత్రమే దాని గురించి చర్చించుకునేలా ప్రకటనలను తయారుచేశాం. మన దేశంలో ప్రతి ఇంట్లోనూ 12-20 ఏళ్ల మధ్య వయసు పిల్లలు ఉంటారు. స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా తెలిసిన ఆ పిల్లలే ఇంటికి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు. అందుకని- వారినీ, ఆ ఇంట్లో క్రెడిట్‌ కార్డు సొంతదారైన వ్యక్తినీ మెప్పించడం మా లక్ష్యం. వారిని ఉద్దేశించే ప్రకటనలు రూపొందించాం.

విజయం: మాది చాలా చిన్న సంస్థ. ఇప్పుడే ఏదో సాధించామని నేననుకోవడం లేదు. మా పెట్టుబడిదారులకు లాభాలొచ్చినప్పుడే సంస్థ విలువ పెరిగినట్లు. మొదలెట్టిన ఏడాదిన్నరకే కొవిడ్‌ వచ్చింది. ఆ సమయాన్ని గట్టెక్కడమే గొప్ప. ఇతర సంస్థల్లా ఉద్యోగాలు పీకెయ్యలేదు. మా చివరి రూపాయి వరకూ అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చాం. నిలబెట్టుకున్నాం.


దుకాణం మూసేసేవాళ్లమే!

తేడాది జులై నాటికి మోస్ట్‌ డౌన్‌లోడెడ్‌ ఆప్‌గా చరిత్ర సృష్టించింది ‘మీషో’. 2030 నాటికి 70 బిలియన్‌ డాలర్ల కంపెనీగా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్న ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌సైట్‌ ప్రస్థానం గురించి వ్యవస్థాపకులు విదిత్‌ ఆత్రే, సంజీవ్‌లు ఏమంటారంటే...

అవకాశం: మేమిద్దరం కలిసి స్టార్టప్‌ పెట్టాలనుకున్నాక ఐడియాలన్నీ లిస్టు రాసుకున్నాం. కనీసం పదికోట్ల మందికి ఉపయోగపడే పని చేయాలన్నది మా కల. ఆ దిశగా ఆలోచిస్తే అసంఘటితంగా ఉన్న చిన్న వ్యాపారాలు మా దృష్టికి వచ్చాయి. వారు ఎక్కువ చదువుకున్న వారు కాదు, చాలామంది గృహిణులు. ఆన్‌లైన్‌లోకి వచ్చే తాహతు లేనివారు. ఆ పరిస్థితి మంచి వ్యాపార అవకాశంగా కనిపించింది మాకు.

వాట్సాప్‌తో: వ్యాపారాన్ని వాట్సాప్‌ గ్రూపులతో లాంచ్‌ చేశాం. అమ్మేవాళ్లూ కొనేవాళ్లూ అందరూ ఆ గ్రూపుల్లోనే ఉండేవారు. అది సౌకర్యంగా లేకపోయినా తమ అవసరాన్ని తీర్చే ఒక వేదిక అంటూ దొరికినందుకు వాళ్లు సంతోషించేవారు. అది చూశాకే మేమేం చేయాలో తెలిసింది. బెంగళూరు అంతా తిరిగి దుకాణదారులతో వినియోగదారులతో మాట్లాడి మొదట ఒక ఫ్యాషన్‌ ఆప్‌ తయారుచేశాం. అది పూర్తిగా హైపర్‌ లోకల్‌. కానీ కొన్నాళ్లకి అర్థమైంది, ఫ్యాషన్లు చూడాలంటే ఏ మింత్రాకో వెళ్తారు కానీ మా ఆప్‌లో ఉన్న కొన్ని షాపుల్ని ఎందుకు ఎంచుకుంటారని. అలా కాదు, ఈ చిన్న చిన్న షాపులన్నిటినీ ఆన్‌లైన్‌కి తెద్దామని మరో ఏడాది దానిమీద పనిచేశాం. చివరకి మూడోసారి విజయం సాధించాం.

సవాలు: చిన్న వ్యాపారస్తులైన మా వినియోగదారులు టెక్‌సావీ కాదు. వాళ్లకుండే పరిమిత స్పీడు ఇంటర్నెట్‌ కనెక్షనూ, తక్కువ ఖరీదు ఫోన్లూ... దృష్టిలో పెట్టుకుని ఆప్‌ తయారుచేయడమంటే కత్తిమీద సామే అయింది మాకు. అలాంటిది చేయగల సాంకేతిక సిబ్బందిని ఎంచుకోవడానికి చాలానే సమయం వెచ్చించాం. ప్రారంభంలో 10-12 ఎంబీతో ఆప్‌ తయారుచేసినప్పుడు ప్రపంచంలోనే అలాంటిది లేదన్నారు. బరువు ఎక్కువైతే ఆప్‌ తీసి అవతల పడేస్తారు. అలాంటి పరిస్థితి రావద్దని ఎలాంటి సమస్యలు రాగలవో ముందే గుర్తించి పరిష్కరించుకుంటూ వచ్చాం. 

నిధులు: నిధులకోసం ఇబ్బందిపడ్డాం. గృహిణుల మీద ఆధారపడిన బిజినెస్‌, ఎప్పటికి పెరిగేనూ... అన్నారు. ప్రకటనలివ్వడానికి కూడా రూపాయి లేదు. మహిళలే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్నారు. మా దగ్గర నెల జీతానికి సరిపడా డబ్బు మాత్రమే ఉన్నప్పుడు నిధులు అందాయి. సమయానికి అవి రాకపోతే దుకాణం మూసేసేవాళ్లమే.

సక్సెస్‌ మంత్ర: మేం వచ్చేసరికి ఈ కామర్స్‌ కొత్త కాదు, అయితే అవన్నీ బ్రాండెడ్‌ కంపెనీలు. కమిషన్లు ఇవ్వగలవు. చిన్న వ్యాపారులు అలా ఇవ్వలేరు. అందుకే మొట్టమొదటిసారి జీరో కమిషన్‌ విధానం తెచ్చాం. ఇప్పుడు ఆరు లక్షల మంది మాతో ఆన్‌లైన్లో ఉన్నారు. పదికోట్ల మందిని తేవాలన్నది మా లక్ష్యం.


పొరపాట్లు చేస్తూ నేర్చుకున్నాం

పెడిక్యూర్‌ నుంచి ప్లంబింగ్‌ సేవల వరకూ, మిక్సీ నుంచి ఏసీ రిపేరు వరకూ ‘అర్బన్‌ కంపెనీ’ అందించని సేవలేదు. సంస్థ పెట్టడానికన్నా ముందు అభిరాజ్‌, వరుణ్‌ కలిసి ఒకటి, రాఘవ్‌ ఇంకొకటి స్టార్టప్‌లు పెట్టి చేతులు కాల్చుకుని బయటికి వచ్చారు. స్నేహితులు కావడంతో కష్టసుఖాలు పంచుకుని మంచి అనుభవం సంపాదించామనుకున్నారు కాబట్టే వెంటనే మరో స్టార్టప్‌ ఆలోచన చేశారు. వాళ్లేమంటారంటే...

లక్ష్యంలో స్పష్టత: ఈసారి మేం చేయబోయే పని సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపాలన్న స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్లాం. అంద]ుకని ఐదారు నెలలు దిల్లీ వీధుల వెంట తిరుగుతూ, కన్పించిన వారినల్లా ఒకే ప్రశ్న అడుగుతూ పోయాం. నగర జీవితంలో మీకు అత్యంత ఉపయోగపడే సేవ ఏదీ అని. ఒక్కొక్కళ్లూ ఒక్కో సమస్య చెప్పేవారు. వాటన్నిటినీ ఒకచోట చేరిస్తే- మాకు అర్థమైంది... అందరూ అన్నిరకాల సేవలూ ఇంటివద్దకే రావాలని కోరుకుంటున్నారని. ఇలా ఇంటివద్దే సేవల్ని అందించే సంస్థ మాదే మొదటిది. ఉత్సాహంగా ఏడాదిపాటు కష్టపడి వృత్తి నిపుణులతో ఆన్‌లైన్‌ జాబితా తయారుచేసి రంగంలోకి దిగాం.

ఊహించలేదు: పనిలోకి దిగాక కానీ మా పొరపాటు ఏమిటో తెలియలేదు. మా సంస్థ ద్వారా వెళ్లిన వ్యక్తి అందించే సేవలు బాగున్నా బాగోకపోయినా మేమే బాధ్యత వహించాలని వినియోగదారులు ఆశించారు. దాంతో కొంచెం అయోమయంలో పడ్డాం. పనివాళ్లు ఏ స్థాయి సేవలందిస్తున్నారో మాకెలా తెలుస్తుంది... అందుకే సేవల నాణ్యతలో ప్రామాణిక స్థాయి ఉండాలంటే వారందరికీ శిక్షణ కూడా మేమే ఇవ్వాలనుకున్నాం. ఇది మేము ఊహించని బాధ్యతే అయినా సత్వరం స్పందించాం. ప్రతి నగరంలోనూ ఆయా సేవల్లో శిక్షణ ఇచ్చే సంస్థల్నీ పెట్టుకున్నాం.

సవాలు: ఇప్పుడంటే అలవాటైంది కానీ కొత్తలో సేవలు అందించేవాళ్లకి ఈ పద్ధతి గురించి అవగాహన కల్పించడం చాలా కష్టమైంది. ఒక పట్టాన నమ్మేవాళ్లు కాదు. శిక్షణ ఇచ్చి వారి సేవలకు తగిన విలువ ఆపాదించేసరికి క్రమంగా బిజినెస్‌ పుంజుకుంది. తీసుకున్న ఛార్జీల్లో పనిచేసినవాళ్లకి ఎనభై శాతం, మాకు ఇరవై శాతం. ఆ ఇరవై శాతంలోనే లాభసాటిగా నడపాలన్నది మా ధ్యేయం.

మార్కెటింగ్‌: ఒక్కసారే అన్ని సేవలూ ప్రచారం చేసి జనాల్ని కంగారు పెట్టకుండా ఒక్కో సేవ చొప్పున పెంచుకుంటూ ప్రచారం చేశాం. బ్యూటీషియన్‌ లాంటి స్టాండర్డ్‌ సేవలు పదిరెట్లు బిజినెస్‌ జరుగుతుండగా, యోగా, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ లాంటి కస్టమైజ్డ్‌ సేవలకు స్పందన అంతంతమాత్రంగా ఉందని రెండేళ్లకే అర్థమైంది. దాంతో లాభసాటిగా ఉన్న వాటిమీద ఎక్కువ దృష్టి పెట్టాం. అదే కలిసొచ్చింది. మంచి వ్యాపారాన్ని మనం నిర్మిస్తే పెట్టుబడులు వాటంతటవే వస్తాయని అర్థమైంది. ఇప్పుడు మా దగ్గర 35వేల మంది ఉన్నారు. కనీసం పదిలక్షల మంది వృత్తినిపుణులకు ఉపాధి కల్పించాలన్నది మా ఆశయం.


ఏడాది క్రితం వరకూ కారు లేదు

దేశంలో టాక్సీ సర్వీసుల్లో మొదటి స్థానంలో ఉంటూనే విద్యుత్‌ వాహనాల మార్కెట్లో ప్రవేశించి అక్కడా ఆదరణ పొందుతున్న ఓలా పన్నెండేళ్ల ప్రయాణంలో దాటి వచ్చిన గతుకుల గురించి భవిష్‌ అగర్వాల్‌ ఏం చెబుతున్నారంటే...

సమయానికి తగినట్లు: మొదటి ప్రయత్నమే నాది అట్టర్‌ఫ్లాప్‌. ఓలాట్రిప్‌.కామ్‌ అని ఆన్‌లైన్‌ టూర్‌ బుకింగ్స్‌ పెట్టాను. అప్పుడు దిల్లీలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరుగుతున్నాయి. అయినా ఒక్కరు కూడా బుక్‌ చేసుకోకపోగా అందరూ ఫోన్‌ చేసి సిటీలో తిరగడానికి వాహనం కావాలనేవారు. అప్పటికి అందుబాటులో ఉన్న రేడియో క్యాబ్‌ సర్వీసులు సంఖ్య తక్కువా, ఖరీదు ఎక్కువా ఉండేవి. దాంతో నా ఐడియాని మార్చుకుని ఓలా ప్రారంభించాను.

నిధులు: పదేళ్లక్రితం ఇప్పటిలాగా స్టార్టప్‌లూ లేవు, పెట్టుబడులూ లేవు. నాకు తొలిసారి 30 లక్షలు పెట్టుబడి వచ్చింది. అదైనా ఎలా వచ్చిందని నాకిప్పటికీ ఆశ్చర్యమే. ఏడాది క్రితం వరకూ నేను కారు కొనుక్కోలేదు. ఎక్కడికెళ్లినా ఓలానే వాడేవాడిని. సాధారణ ప్రయాణికుడిలా వెళ్తూ డ్రైవర్లతో మాట్లాడేవాడిని. ఒకోసారి పోటీ సంస్థల వాహనాలూ ఉపయోగించేవాడిని. దాంతో బయట పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వీలయ్యేది.

రిస్క్‌ తప్పదు: మొదట్లో దిల్లీ, ముంబయి, బెంగళూరుల్లోనే నడిపినా తర్వాత ఒకేసారి వంద నగరాలకు సర్వీసులు విస్తరించాం. ధైర్యంచేసి అంత పెద్ద రిస్క్‌ తీసుకోవడం వల్లే ఓలా ఇతర కంపెనీలకన్నా ముందు అన్ని ప్రాంతాలకీ విస్తరించగలిగింది.

మార్పు: బిజినెస్‌ మోడల్‌ అనేది ఏదీ ఈరోజుల్లో శాశ్వతం కాదు. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా త్వరగా నిర్ణయాలు తీసుకుని మోడల్‌ మార్చుకుంటూ ముందుకెళ్లాలి. వెబ్‌సైట్‌ ప్రారంభించినప్పుడు మొదట నా ఫోన్‌ నంబర్‌ ఇచ్చాం. అందరూ దానికే ఫోన్‌ చేసి కారు బుక్‌ చేసుకునేవారు. తర్వాత ఆప్‌ తయారుచేశాం. అంచెలంచెలుగా సాంకేతికతను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాం. సాంకేతికతను స్వయంగా నిర్మించుకోవడమే మంచిదని నమ్ముతాను.

సిబ్బంది: స్టార్టప్‌లలో టైం చూసుకుంటూ పనిచేసే ఉద్యోగులు పనికిరారు. కంపెనీని తమదిగా భావించి మమేకమై పనిచేసేవాళ్లు కావాలి. అలాంటి టీమ్‌ని ఎంచుకుని కంపెనీని వాళ్ల చేతిలో పెడితే చాలు, పని అయిపోతుంది.

గెలుపోటములు: ప్రారంభించిన నాలుగేళ్లకు కానీ ఆదాయం రాలేదు. రావడం మొదలెట్టాక వెయ్యిరెట్లు గ్రోత్‌ నమోదైంది. వ్యాపారమన్నాక ఒడుదొడుకులు సహజం. సరైన సమయానికి సరైన ఉత్పత్తితో వచ్చినవారే నిలదొక్కుకుంటారు. వ్యాపారంలో రిస్క్‌ తప్పదు, రిస్క్‌ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఓడిపోకా తప్పదు. 2018లో ఫుడ్‌ బిజినెస్‌ పెట్టాం. ఫెయిలవగానే మూసేశాం. అదే విద్యుత్‌ వాహనాల రంగంలోకి ప్రవేశించి విజయం సాధించాం.


వస్తువు నాణ్యతే ప్రచారం చేస్తుంది!

మామూలు కళ్లద్దాల తయారీ సంస్థని బిలియన్‌ డాలర్‌ కంపెనీ స్థాయికి తీసుకెళ్లిన ఘనత లెన్స్‌కార్ట్‌ది. 2019లో 485 కోట్లు ఉన్న ఆదాయాన్ని 2020కి దాదాపు రెట్టింపు(964 కోట్లు) చేసి పోటీ సంస్థలకన్నా చాలా ముందున్న లెన్స్‌కార్ట్‌ని పీయూష్‌ బన్సల్‌ ఎందుకు పెట్టాడంటే...

ఐడియా: దేశంలో నలభైశాతం మందికి కళ్లద్దాలు అవసరమని అధ్యయనాలు చెబుతుంటే అందులో సగం కూడా వాటిని వాడటం లేదన్నది నన్ను ఆలోచనలో పడేసింది. కంటిచూపు సరిగ్గా ఉంటే మన సామర్థ్యం ఎన్నో రెట్లు మెరుగవుతుంది. ఆ విషయం పట్ల అవగాహన కల్పించి అద్దాల ధరల్ని అందుబాటులోకి తెస్తే అటు సమాజానికి మేలుచేస్తూనే ఇటు వ్యాపార అవకాశాన్నీ ఉపయోగించుకోవచ్చనుకున్నా.

అనుభవ పాఠం: లెన్స్‌కార్ట్‌ ప్రారంభించిన ఏడాదిన్నరకి ఇతర వ్యాపారాలు కూడా జత చేశాం. బ్యాగులూ, గడియారాలూ, ఫ్యాషన్‌ నగలూ అమ్మేవాళ్లం. వ్యాపారం బాగుంది కానీ ఒక్కసారిగా కనువిప్పు కలిగింది. ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. కళ్లద్దాలు అలా కాదు. వాటి వ్యాపారానికి ఓ ప్రయోజనం ఉంది. అలాంటి దాన్ని వదిలేసి ఇలా ప్రయోజనం లేని వ్యాపారంవైపు మళ్లడం మా విలువ మేమే తగ్గించుకున్నట్లయింది. దాంతో ఏడాది లోపలే అవన్నీ తీసేశాం.

బిజినెస్‌ మోడల్‌: మేము ఒక్క విషయం మీదే దృష్టి పెట్టాం. కొనేవాళ్లు మన ఉత్పత్తినే ఎందుకు కొంటున్నారు, కొనని వాళ్లు ఎందుకు కొనడం లేదు. ఆ ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టి వాటిని పరిష్కరించుకుంటే ఆటోమేటిగ్గా వ్యాపారం మెరుగైపోయింది. అలాగే ఎంత ఆన్‌లైన్‌ వచ్చినా షాపులకు వెళ్లి ప్రత్యక్షంగా సేల్స్‌వాళ్లతో మాట్లాడి కొనుక్కోవడానికే ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. అందుకని దేశవ్యాప్తంగా 900 స్టోర్స్‌ పెట్టడమే కాకుండా, ఆన్‌లైన్‌లో కొన్నవాళ్లకి హోమ్‌ సర్వీస్‌ మొదలెట్టాం.

సవాలు: ఒకసారి సంస్థలో టెక్నాలజీకి సంబంధించి మార్పులు చేపట్టాం. అప్పుడు పెద్ద గందరగోళమే జరిగింది. చెప్పిన టైమ్‌కి అద్దాలు తయారుచేసి ఇవ్వలేక పోవడం, ఒకరి ఆర్డర్‌ ఇంకొకరికి ఇవ్వడం లాంటివి జరిగాయి. పొరపాటు గుర్తించిన వెంటనే సరిదిద్దే ప్రయత్నం చేశాం. ఆ పని పూర్తయ్యేదాకా రాత్రింబగళ్లు షాపులోనే ఉండిపోయాం. రాత్రిళ్లు నేలమీదే పడుకునేవాళ్లం. వినియోగదారులకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుని, ఎవరికీ నష్టం కలగకుండా చూశాం. 

సిబ్బంది: ఉద్యోగుల్ని కాదు, భాగస్వాముల్ని ఎంచుకోవాలి. వారికి యజమానితో సమానంగా తపన ఉండాలి. ఉద్యోగుల్లో కేవలం ఐదుశాతం కృషి వల్ల సంస్థ మరో స్థాయికి చేరుకుంటుంది. ఆ ఐదుశాతాన్నీ గుర్తించి వెంట ఉంచుకోవాలి.

మార్కెటింగ్‌: ఏ వస్తువుకైనా నాణ్యతని మించిన ప్రచారం లేదు. రాజీపడకుండా మంచి ఉత్పత్తిని ఇస్తే పదిమందీ సంతోషించి మరో పదిమందికి చెబుతారు. నాణ్యతా ధరా ప్యాకేజీ... ఇవే చాలు మార్కెటింగ్‌కి.

విజయం: కొంతకాలం క్రితం బెంగళూరు విమానాశ్రయం సెక్యూరిటీ చెక్‌ దగ్గర నిలబడి అద్దాలు పెట్టుకున్నవాళ్లలో ఎంత మంది మావి పెట్టుకున్నారో లెక్కపెట్టాను. యాభై శాతానికి పైనే తేలింది. ఇంకేం కావాలీ...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts