పరీక్షలా... భయమెందుకు?

పరీక్ష హాల్లోకి వెళ్తుంటే కాళ్లు వణుకుతాయి. లోపలికి వెళ్లి కూర్చుంటే అరచేతుల్లో చెమటలు పడుతుంటాయి. ప్రశ్నపత్రం చూడగానే బుర్రంతా బ్లాంక్‌ అయిపోతుంది.

Updated : 26 Feb 2023 12:06 IST

పరీక్షలా... భయమెందుకు?

పరీక్ష హాల్లోకి వెళ్తుంటే కాళ్లు వణుకుతాయి. లోపలికి వెళ్లి కూర్చుంటే అరచేతుల్లో చెమటలు పడుతుంటాయి. ప్రశ్నపత్రం చూడగానే బుర్రంతా బ్లాంక్‌ అయిపోతుంది. గొంతు తడారిపోతుంది... ఏ ఒక్కరిదో కాదిది. చాలామంది సమస్య. పరీక్షలు వస్తున్నాయంటే అందరికీ గుండె దడే..! అది చాలా సహజమేననీ, కొంచెం ప్రణాళికా, మరికొన్ని చిట్కాలూ పాటిస్తే పరీక్షల్ని అలవోకగా రాసేయవచ్చనీ అంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..!

ది పరీక్షల సీజన్‌. అన్ని తరగతులకీ వార్షిక పరీక్షలు అయితే పదో తరగతికీ ఇంటర్మీడియట్‌కీ బోర్డు పరీక్షలు. అవి గట్టెక్కితే ఆ తర్వాత రకరకాల ప్రవేశ పరీక్షలు. ఇప్పటి పిల్లల రేపటి భవిష్యత్తుని నిర్ణయించేది ఈ పరీక్షలే. అందుకే అందరికీ అంత టెన్షన్‌.

ఒక పక్కన చదవాల్సిన బండెడు పోర్షనూ, తోటివారు బాగా చదివేస్తున్నా రేమో, తాను అందుకోలేనేమోనన్న ఆందోళనా పిల్లల్ని వేధిస్తుంటాయి. మరోపక్క ‘బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకుంటేనే మంచి కాలేజీలో సీటు వస్తుంద’న్న పెద్దల హెచ్చరికలూ చిన్ని మనసులపై ఒత్తిడి పెంచుతుంటాయి.

వాస్తవానికి పిల్లలు ఎదుర్కొనే అసలు పరీక్ష తమకు కష్టంగా ఉండే సబ్జెక్టుకు సంబంధించిందో మరొకటో కాదు... పరీక్ష అంటే ఉండే భయం. దానివల్లనే వారు రకరకాల భౌతిక, మానసిక సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. నిద్రపట్టదు, తిండి తినరు, చీటికీ మాటికీ విసుక్కుంటారు, కంగారు పడుతుంటారు, పరీక్ష తప్పినట్టు పీడకలలు కంటుంటారు, నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటారు.

నిజానికి పరీక్షేమీ కొత్త విషయమూ కాదు, మొట్టమొదటిసారి రాస్తున్నదీ కాదు. ఎల్‌కేజీ నుంచీ పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు రాస్తూనే ఉన్నారు. ర్యాంకులూ ప్రోగ్రెస్‌ కార్డులూ చూసుకుంటూనే ఉన్నారు. కేవలం బోర్డు పరీక్ష అయినందుకే అదేదో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లుగా పిల్లలూ పెద్దలూ కూడా భావించడమూ, అతిగా ఆందోళన చెందడమూ ఈ పరిస్థితికి కారణం. పరీక్షలంటే భయం పోయి సానుకూల దృక్పథం అలవర్చుకోవాలంటే అసలు సమస్యకి మూలం ఎక్కడో తెలుసుకోవాలి. సాధారణంగా పరీక్షలకి సంబంధించి పిల్లలు ఎదుర్కొనే ప్రధాన ఇబ్బందులు- ఆందోళనా, చదివేటప్పుడు ఏకాగ్రత కుదరకపోవడమూ, జ్ఞాపకశక్తి లేకపోవడమూ. వాటి గురించి నిపుణులేం చెబుతున్నారంటే...

ఆందోళన... ఉప్పు లాంటిది!

పరీక్షల టెన్షన్‌ అనేది వంటల్లో ఉప్పు లాంటిది అంటారు ఇండియన్‌ మెమరీ కౌన్సిల్‌ అధ్యక్షులు స్క్వాడ్రన్‌ లీడర్‌ జయసింహ. ‘ఉప్పు వేయకపోతే కూరకి అసలు రుచి ఉండదు. అదే కొంచెం ఎక్కువైనా తినడానికి పనికి రాదు. అలాగే టెన్షన్‌ కూడా. కొంచెం టెన్షన్‌ ఉంటేనే పిల్లలు చదువుకుంటారు. లేకపోతే పూర్తిగా ఆటపాటల్లో లీనమై చదువును అశ్రద్ధ చేస్తారు. ఎందులోనూ రాణించలేరు.

అదే టెన్షన్‌ ఎక్కువైతే మొత్తంగా పరీక్షల్నీ చెడగొడతారు’ అంటారాయన. మనసులో టెన్షన్‌ ఎక్కువైనప్పుడే శరీరం మీద ప్రభావం కనపడుతుంది. కాళ్లు వణుకుతాయి. చేతుల్లో చెమటపడుతుంది. ప్రశ్నలన్నీ కనీవినీ ఎరగని వాటిలా కన్పిస్తాయి. చదివింది ఏదీ గుర్తు రాదు. టెన్షన్‌ వల్ల కలిగే అయోమయం అది. అందుకే దాన్ని తగిన మోతాదులో ఉంచుకోవాలంటారు జయసింహ. పిల్లలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే- పరీక్ష రాసేవారికే కాదు, టెన్షన్‌ అందరికీ ఉంటుందని. 99 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కి సెంచరీ చేయగలనా లేదా అన్న టెన్షన్‌, మంచి హిట్‌ సినిమాలు తీసిన దర్శకుడికి కొత్త సినిమా హిట్‌ అవుతుందో లేదోనన్న టెన్షన్‌... ఇలా ప్రతి రంగంలోని వారికీ టెన్షన్‌ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా దాన్ని అధిగమించే మార్గాలు వెతుక్కోవడమే- అనే ఆయన అందుకోసం విద్యార్థులకు ఒక టెక్నిక్‌ చెబుతున్నారు. అదే- విజువలైజేషన్‌. రాని ప్రశ్నలు వస్తాయేమో, మంచి మార్కులు రావేమో అని భయపడడం వల్లే కదా ఆందోళన. అలా కాకుండా- అన్నీ చదివిన ప్రశ్నలే వచ్చినట్లూ, పరీక్ష బాగా రాసినట్లూ, మంచి మార్కులు తెచ్చుకున్నట్లూ... ఊహించుకోవాలి. అప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఆటోమేటిగ్గా ఒత్తిడి తగ్గిపోతుంది. పైన చెప్పిన లక్షణాలూ తగ్గిపోతాయి. ప్రశాంతంగా పరీక్ష రాయొచ్చు. దీన్ని ఆయన ‘ఫేక్‌ ఇట్‌ బిఫోర్‌ యు మేక్‌ ఇట్‌’ అంటారు. ముందు నటించినా తర్వాత నిజంగానే సంతోషాన్ని సంపాదించుకుంటామన్న మాట. అంతేకాదు, పరీక్షకి బయల్దేరేముందు కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడమూ, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడమూ, గ్లాసుడు నీళ్లు తాగడమూ కూడా గుండెదడని తగ్గిస్తాయట. అయితే అసలు పరీక్ష హాలు దాకా రావడానికి ముందు చేయాల్సినవీ కొన్నున్నాయి.

ఏకాగ్రత కుదురుతుంది...

గంగిగోవు పాలు లాంటిదే చదువులో ఏకాగ్రత కూడా. అది లేకుండా ఎన్ని గంటలు చదివినా బుర్రకెక్కదు. అందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ వర్లు చెప్పే ఈ ఉదాహరణ చూడండి... ఇది చాలామంది పిల్లలు సరదాగా చేసే ప్రయోగమే. ఎండ ఎంత మండిపోతున్నా నేల మీద ఒక కాగితం పడేస్తే అది అలాగే ఉంటుంది. అదే ఒక భూతద్దంతో కిరణాలు దానిమీద కేంద్రీకృతం అయ్యేలా చేస్తే కాగితం క్షణాల్లో కాలిపోతుంది. ముందు కూడా అవే కిరణాలూ... అదే కాగితమూ. కానీ ఆ కిరణాల్ని భూతద్దం సాయంతో ఒకచోట కేంద్రీకరింపజేయడం వల్ల కాగితాన్ని కాల్చేసే శక్తి వచ్చింది. అలాగే మనసునీ చదువుమీద కేంద్రీకరిస్తే మంచి ఫలితాలుంటాయంటారు ఆయన.

పరీక్ష అందరికీ ఒకటే కానీ ఒక్కొక్కరూ ఒక్కోలా ఎదుర్కొంటారు. ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకునేవారికి ఏ టెన్షనూ ఉండదు. ఏడాదంతా ఆడుతూ పాడుతూ తిరిగి చివరికి ఫిబ్రవరి వచ్చేశాక... ‘అమ్మో ఇన్ని సబ్జెక్టులు ఎప్పటికి అవుతాయో...’ అని కంగారుపడే స్వభావం ఉన్నవాళ్లకు ముఖ్యంగా కావాల్సింది టైమ్‌ మేనేజ్‌మెంట్‌. ఒక టైమ్‌ టేబుల్‌ వేసుకుని దానికి కట్టుబడి కృషిచేస్తేనే చదువు గాడిలో పడుతుంది. ఎన్ని సబ్జెక్టులున్నాయో ఎంత సమయముందో చూసుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దృష్టిని మళ్లించేవి ఏవీ చుట్టూ ఉంచుకోకూడదు. పుస్తకాలన్నీ ఎదురుగా పెట్టుకుని పదినిమిషాలకో సబ్జెక్టు మారుస్తూ కంగారుపడితే మెదడు ఒత్తిడికి లోనవుతుంది. ఒక్కో సబ్జెక్టూ నిదానంగా చదువుకోవాలి. ఏదైనా ఇష్టంగా చదివితే మూడొంతుల ఒత్తిడి తగ్గిపోతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మార్కుల కోసం కాకుండా సబ్జెక్టు మీద ఇష్టాన్నీ ఆసక్తినీ పెంచుకుని చదవాలి.

పరీక్షకి మనం బాగా సిద్ధమయ్యాం... అన్న నమ్మకం రావాలంటే ‘ఏబీసీ’ సిద్ధాంతాన్ని అమలుచేయాలంటారు జయసింహ. అదేంటంటే- ఒక్కో సబ్జెక్టులోనూ ముఖ్యమైన ప్రశ్నలంటూ ఓ పాతికో ముప్పయ్యో ఉంటాయి కదా. వాటిని మూడు వర్గాలుగా విభజించాలి. అప్పటికప్పుడు పరీక్ష పెడితే రాయగలిగినవి ‘ఎ’ కేటగిరిలో వేయాలి. కొంచెం వచ్చు, ఇంకాస్త చదవాలి అనుకున్నవి ‘బి’ కేటగిరిలో వేసుకోవాలి. అసలు రావు అనుకున్నవి ‘సి’ కేటగిరి అన్నమాట. ఇప్పుడిక ‘సి’ లో ఉన్నవన్నీ ‘బి’ లోకి, ‘బి’ నుంచి అన్నీ ‘ఎ’ లోకి వచ్చేలా చదువుకోవాలన్నమాట. ఇలా చదువుకుంటే పరీక్ష హాల్లోకి కాన్ఫిడెంట్‌గా వెళ్లొచ్చు.

జ్ఞాపకం ఉండాలంటే...

కష్టపడి చదవడం ఒకెత్తు అయితే చదివిందంతా గుర్తు పెట్టుకుని పరీక్షల్లో రాయగలగడం మరోకెత్తు. అందుకు చక్కటి జ్ఞాపకశక్తి కావాలి. చాలామంది దీన్ని పుట్టుకతో వచ్చే సామర్థ్యంగా భావిస్తారు. నిజానికి జ్ఞాపకశక్తి అనేది ఒక నైపుణ్యం. సాధనతో దాన్ని మెరుగు పర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. చాలామంది చదవడం మీద పెట్టిన శ్రద్ధ అది ఎంతగా గుర్తుందో తెలుసుకోవడం మీద పెట్టడం లేదట. దాంతో తమకు ఏమి వచ్చో ఏమి రావో అన్న విషయంలో స్పష్టత లేక తమ మీద తామే నమ్మకం కోల్పోయి ఆందోళనకు గురవుతారు. చదివిన సమాచారం మెదడు పొరల్లో నిక్షిప్తమైతేనే మళ్లీ అవసరమైనప్పుడు గుర్తు వస్తుంది. బట్టీ పడితేనో లేదా ఒకే సమాధానాన్ని వందసార్లు చదివితేనో బాగా గుర్తుంటుందని అందరూ అభిప్రాయపడుతుంటారు. అది తప్పని శాస్త్రవేత్తల తాజా పరిశోధన రుజువు చేసిందనీ, చదువుకున్నదాన్ని తరచూ పునశ్చరణ చేసుకుంటూ ఉంటేనే ఎక్కువ గుర్తుంటుందనీ అప్పుడా సమాచారం మెదడులో షార్ట్‌ టర్మ్‌ మెమరీ నుంచి లాంగ్‌ టర్మ్‌ మెమరీలోకి వెళ్లి స్థిరపడుతుందనీ చెబుతారు వ్యక్తిత్వ వికాస నిపుణులు వర్లు. జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోవడానికి ఆయన చెబుతున్న చిట్కాలివి...

* ఒక పాఠం పూర్తిగా చదివాక అందులోని ముఖ్యమైన పాయింట్లన్నీ నోట్సు రాసుకోవాలి. మర్నాడు ఆ పాయింట్లన్నీ గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించాలి. వరస తప్పవచ్చు, ఒకటో రెండో మర్చిపోవచ్చు. అప్పుడు మరోసారి చదువుకుని రెండురోజుల తర్వాత మళ్లీ పరీక్షించుకోవాలి. అలా ఒక్క పాయింటు కూడా మర్చిపోకుండా ఆ పాఠం వచ్చేదాకా పునశ్చరణ చేస్తూ ఉండాలి. అప్పుడే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

* ఒక్కో సమాధానంలో చాలా పాయింట్లు ఉంటాయి. వాటిని వరసగా గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే- అందులోని ముఖ్యమైన పదాలతో ఒక వాక్యం తయారుచేసుకోవాలి. లేదా పదాల మొదటి అక్షరాలతో మరో కొత్త పదం తయారుచేసుకుని దాన్ని గుర్తుపెట్టుకుంటే పరీక్షలో దాన్ని విడమరిచి రాయడం తేలికవుతుంది. ఉదాహరణకు- సూర్యుని నుంచి ఉన్న దూరాన్ని బట్టి గ్రహాలను వరసక్రమంలో రాయమన్నారనుకోండి. ఏది ముందో ఏది తర్వాతో తెలియక తికమకపడతారు. అదే వరసగా వాటి మొదటి అక్షరాలన్నీ వచ్చేలా ఒక పదాన్ని తయారుచేసుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

* జ్ఞాపకశక్తి బాగా పనిచేయాలంటే మంచి నిద్ర చాలా అవసరం. నిద్రలోనే నేర్చుకున్న సమాచారం అంతా మెదడు పొరల్లో నిక్షిప్తమవుతుంది. మళ్లీ మర్నాడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మెదడు చురుగ్గా తయారవుతుంది.

* ఏ విషయమైనా దాని నేపథ్యంతో సహా విశ్లేషించి అర్థం చేసుకున్నది గుర్తున్నంతగా ఏమీ అర్థం చేసుకోకుండా హడావుడిగా బట్టీ పడితే గుర్తుండదట. అలాగే చదువుతున్న విషయాల్ని దేనికదే కాకుండా, వేరేవాటితో లింక్‌ చేసుకుంటూ చదవాలి. ఫలానా రాజవంశం ఫలానా శతాబ్దంలో డెబ్భయ్యేళ్లపాటు పాలించింది అని చదివేటప్పుడు ఆ రాజవంశానికి సమకాలికులెవరు, దానికి ముందూ తర్వాతా ఎవరు పాలించారూ... ఇలా విషయాన్ని విస్తరించుకుంటూ నేర్చుకుంటే బాగా గుర్తుండడమే కాదు, సమాధానాల్ని సమగ్రంగా రాయడం వీలవుతుంది.

తిండీ నిద్రా వెలుతురూ...

పరీక్షలంటే తిండీ తిప్పలూ మాని చదవడం కాదు, కడుపునిండా తిని చదివితేనే ఫలితం- అంటున్నారు నిపుణులు. మన నేర్చుకునే శక్తినీ జ్ఞాపకశక్తినీ ప్రభావితం చేసేది అవే మరి. మసక వెలుతురు జ్ఞాపక శక్తికీ ముసుగేస్తుందని మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. పట్టపగల్లాగా మంచి వెలుతురు ఉన్న చోటే చదువుకోవాలి. మసక వెలుతురులో చదువుకుంటే జ్ఞాపకశక్తి
30 శాతం తగ్గిపోతుందట. అలాగే రోజూ కనీసం ఏడు గంటల నిద్ర తప్పనిసరి అని వందలాది పరిశోధనలు నిరూపించాయి. పండ్లూ కూరగాయలూ తినడం... ప్రత్యేకించి ఆకుకూరలూ, ఎరుపూ నారింజ రంగు కూరగాయలూ, పండ్లూ తినేవారికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వారి అధ్యయనంలో తెలిసింది. కాబట్టి చదువుకోవాల్సింది ఎంతున్నా వేళకి తినాలి, సమతులాహారం తీసుకోవాలి. ప్రతి భోజనంలోనూ నిలకడగా శక్తినిచ్చే మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. భోజనానికీ భోజనానికీ మధ్య పండ్లు తినాలి.

పెద్దలు సహకరించాలి!

ఈరోజుల్లో ఎనభైలూ తొంభైలూ తెచ్చుకోవడం మామూలు విషయమైంది. తొంభై తొమ్మిది శాతం మార్కులు వచ్చినా ఆ ఒక్క శాతమూ ఎక్కడ తగ్గిందో, ఎందుకు తగ్గిందో అని దిగులుపడే తల్లిదండ్రులున్న సమాజం మనది.

తెలిసో తెలియకో పిల్లలతో పాటు పెద్దలూ పరీక్షల ఒత్తిడికి లోనవుతున్నారు. టైమ్‌ వేస్ట్‌ చేయకుండా చదువుకోమంటూ పిల్లల వెంట పడుతున్నారు. తమ స్నేహితుల పిల్లలు ఎన్ని మార్కులు తెచ్చుకుని ఎక్కడెక్కడ సీట్లు సంపాదించిందీ చెబుతున్నారు. అలా చెబితే తమ పిల్లలూ స్ఫూర్తిపొంది బాగా చదువుతారన్నది పెద్దల ఆశ. కానీ అది పరోక్షంగా పిల్లల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుని కోరుకున్న కోర్సులో చేరాలని కలలు కనాల్సిన పిల్లలు తాము పరీక్ష బాగా రాయకపోతే అమ్మానాన్నల పరువు పోతుందేమోనని భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అందుకని పెద్దలు తమ ధోరణి మార్చుకోవాలి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయంటే ఎలాంటి పిల్లలకైనా టెన్షన్‌ మొదలవుతుంది. దాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రశాంతంగా చదువుకునే పరిస్థితులు కల్పించాలి. పిల్లలు కొందరు ఒంటరిగా చదువుకోవడానికి ఇష్టపడతారు. కొందరు స్నేహితులతో కలిసి బాగా చదువుకోగలుగుతారు. వారికి ఏ సమయంలో ఎలా ఇష్టమైతే అలా చదువుకోనివ్వాలి. తరచూ ఒక కన్నేసి చూస్తూ ఎలా చదువుతున్నారో పర్యవేక్షించాలి. పిల్లల కోసం పెద్దలూ కొన్ని త్యాగాలు చేయాలంటారు డాక్టర్‌ వర్లు. చదువుకునేటప్పుడు వేరే గదిలోనే అయినా టీవీ పెడితే పిల్లల ధ్యాస మళ్లుతుంది కాబట్టి పెట్టొద్దంటారాయన.

ఐదునిమిషాల మ్యాజిక్‌

ఇవాళ్టి నుంచి ఫలానా సబ్జెక్ట్‌ చదువుకోవాలీ అనుకుంటారు. ఇప్పుడు అటూ ఇటూ కాని టైమ్‌ కదా... అన్నం తిన్నాక మొదలెడదాం, ఏకంగా ఒకేసారి రాత్రి పనులన్నీ అయిపోయాక ప్రారంభిస్తే నాన్‌ స్టాప్‌గా నాలుగు గంటలు చదవొచ్చు... ఇలా అనుకుంటారు. కానీ సరిగ్గా ఆ టైమ్‌కి అలసటతో నిద్ర వస్తుంది. రేపటినుంచి చేయొచ్చులే అనుకుని పడుకుంటారు. ఇవాళ వాయిదా పడింది రేపు పడదని గ్యారంటీ ఏమిటీ? అందుకే ఐదునిమిషాలు టైమున్నా చాలు చేయాలనుకున్న పని ప్రారంభించమని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ ఐదు నిమిషాలూ ఎంత శక్తిమంతమైనవో వారు పలు అధ్యయనాలు చేసి మరీ చెబుతున్నారు. ఎందుకంటే అసలు ప్రారంభించని పనికన్నా మొదలు పెట్టిన పనిని పూర్తిచేసే అవకాశాలు చాలా ఎక్కువ. పైగా కొద్దిగా చేసి అసంపూర్తిగా వదిలేసిన పని బాగా గుర్తుంటుంది కూడానట. చదువు విషయంలో ఇది నిజంగానే ‘ఫైవ్‌ మినిట్స్‌ మిరాకిల్‌’ అంటున్నారు శాస్త్రవేత్తలు.

చూశారుగా ఎన్ని చిట్కాలున్నాయో..! ఇంకెందుకూ ఆలస్యం... చక్కగా చదివేసి చకచకా పరీక్షలు రాసేయండి మరి! ఆల్‌ ద బెస్ట్‌!


బ్రేక్‌ తీసుకుంటున్నారా?

పరీక్షలకు నెలరోజుల ముందు నుంచే ప్రిపరేషన్‌ హాలిడేస్‌ ఇచ్చేస్తారు. దాంతో ఇంట్లో గంటల తరబడి కదలకుండా కూర్చుని చదివేయడం పిల్లలకు అలవాటే. చదువుకోండి కానీ, మధ్యలో బ్రేక్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. గంటకోసారి ఐదు నిమిషాలు విరామం తీసుకోవాలి. అది టైమ్‌ వేస్ట్‌ కాదు, చదివింది బాగా గుర్తుండడానికి అవసరమైన చర్య. అందుకని ఆ సమయంలో ఏం చేయాలంటే...

* గ్లాసు నీళ్లు తాగండి. చదువులో పడి నీళ్లు తాగడం మర్చిపోతే- రెండు శాతం నీరు తగ్గితే శరీరం అలసిపోతుంది. ఐదుశాతం తగ్గితే ఎనర్జీ లెవెల్స్‌ 20శాతం తగ్గిపోతాయి. పదిశాతం తగ్గితే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఆ పరిస్థితులేవీ రాకుండా మెదడు చురుగ్గా పనిచేయాలంటే గంటకోసారి నీళ్లు తాగాలి.

* పదిసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. ముక్కుతో గాలి పీల్చుకుని కాసేపు బిగబట్టి ఆ తర్వాత నోటితో వదలాలి. ఇలా చేయడం వల్ల కణాలన్నిటికీ ప్రాణవాయువు పుష్కలంగా అందుతుంది. శరీరమూ మెదడూ ఉత్తేజితమవుతాయి.

* కదలకుండా కూర్చుంటే అన్ని భాగాలకూ రక్తసరఫరా సరిగా ఉండదు కాబట్టి మూడు నిమిషాలు నడవడం, స్పాట్‌ జాగింగ్‌ చేయడం మంచిది.

* సౌకర్యంగా కూర్చుని వంద నుంచి ఒకటి వరకూ వెనక్కి లెక్కపెట్టాలి. ఇది మెదడుకి మంచి రిలాక్సేషన్‌. ఇలా విరామం తీసుకుంటే రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ చదువు కొనసాగించవచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..