శ్రీమంతులు మెచ్చినవీ.. నచ్చినవీ!

లక్షాధికారైన లవణమన్నమె కాని వెండి బంగారాలు మింగబోరని పెద్దల మాట. తినే తిండి ఒకటే కావచ్చు కానీ తినే స్థలం మారుతుంది, వాడే వస్తువులు మారతాయి. ఎంతైనా వారి జీవనశైలే ప్రత్యేకంగా ఉంటుంది.

Updated : 12 Jun 2022 04:10 IST

శ్రీమంతులు మెచ్చినవీ.. నచ్చినవీ!

లక్షాధికారైన లవణమన్నమె కాని వెండి బంగారాలు మింగబోరని పెద్దల మాట. తినే తిండి ఒకటే కావచ్చు కానీ తినే స్థలం మారుతుంది, వాడే వస్తువులు మారతాయి. ఎంతైనా వారి జీవనశైలే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే కోటీశ్వరుల ఇష్టాయిష్టాలనగానే అందరికీ ఒకింత ఆసక్తి. మరి మనదేశంలో కోటీశ్వరులకు ఇష్టమైనవేంటో చూద్దామా..!

ఏటా హరున్‌ సంస్థ చేపట్టే పలు సర్వేల్లో ‘ఇండియన్‌ లగ్జరీ కన్జ్యూమర్‌ సర్వే’ కూడా ఒకటి. ఇందులో వినియోగదారులుగా మన దేశంలోని సంపన్నుల అభిరుచులేమిటో తెలుస్తాయి. గతేడాది సర్వేలో ఏడుకోట్లకు పైబడి ఆస్తులున్న 350 మంది కోటీశ్వరుల అలవాట్లను పరిశీలించగా తెలిసిందేమిటంటే...

మెచ్చే కారు: సర్వేలో పాల్గొన్నవారిలో నాలుగో వంతు మూడేళ్లకోసారి కొత్త కారు కొంటారట. ఎక్కువగా ఇష్టపడే కార్లలో మొదటిస్థానం మెర్సిడెజ్‌-బెంజ్‌ది కాగా తర్వాత స్థానాల్లో రోల్స్‌రాయిస్‌, రేంజ్‌రోవర్‌లు ఉన్నాయి. స్పోర్ట్స్‌ కార్ల విషయానికి వస్తే మెజారిటీ ఓటు లాంబోర్గినికేనట.

చలో తాజ్‌: కుటుంబంతోనైనా, స్నేహితులూ, వ్యాపార భాగస్వాములతోనైనా హోటల్‌కి వెళ్లాలనుకుంటే వాళ్లు మొదట ఎంచుకుంటున్నది తాజ్‌ బ్రాండ్‌ హోటళ్లేనట. ఒబెరాయ్‌, లీలా హోటళ్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

నచ్చే నగలు: బంగారు ఆభరణాలకూ ఇవాళా రేపూ పలు బ్రాండ్లు వచ్చేశాయి. మరి వాటిల్లో ఈ సంపన్నులకు నచ్చుతున్న ఏకైక బ్రాండ్‌గా టాటా వారి ‘తనిష్క్‌’ నిలుస్తోంది.

ఇష్టమైన వాచీ: కోటీశ్వరుల్లో చాలామందికి ఇష్టమైన హాబీ వాచీల సేకరణ. 63 శాతం మంది దగ్గర కనీసం నాలుగు వాచీలు ఉన్నాయట. వారిలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నది ‘రోలెక్స్‌’నే. రెండో స్థానం ‘కార్టియె’ది కాగా మూడో స్థానంలో ‘అడెమాజ్‌ పీగే’ ఉంది.

వాడే బ్రాండ్‌: బిజినెస్‌ బ్యాగులూ హ్యాండు బ్యాగులూ చెప్పులూ బూట్లూ లాంటివి- వాడేవారి జీవనశైలికి అద్దం పడతాయి. సంపన్నులు వాడే అలాంటి వస్తువులన్నీ లగ్జరీ బ్రాండ్‌లే. లూయీ ఉటాన్‌, గుచి, బర్బెరీ... బ్రాండ్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

విమానయానం: విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తమ హోదాకు తగ్గట్లే ఎయిర్‌లైన్స్‌నీ ఎంచుకుంటున్నారు. ఎక్కువ మంది ఇష్టపడుతున్నది గల్ఫ్‌స్ట్రీమ్‌ జెట్‌ అట. బోయింగ్‌, ఎయిర్‌బస్‌లది తర్వాతి స్థానాలే.

పిల్లల చదువు: డెబ్భైశాతం సంపన్నులు తమ పిల్లల్ని పై చదువులకు విదేశాలకే పంపిస్తున్నారు. 29శాతం అమెరికాకి, 19శాతం బ్రిటన్‌కి, 12 శాతం న్యూజిలాండ్‌కి, 11శాతం జర్మనీకి... పిల్లల్ని పంపడానికి ఇష్టపడుతున్నారట.

లావాదేవీలు: సంపన్నులు కదా, పెద్దమొత్తంలో డబ్బు లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ఎలా చేస్తారూ అంటే- 36 శాతం ఈ-వ్యాలెట్లు వాడుతున్నారట. అంతకు ముందు ఏడాది 18 శాతం మాత్రమే వాటిని వాడేవారట. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే రియల్‌ ఎస్టేట్‌, స్టాక్‌ మార్కెట్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు.

నివాసం: భారతీయ సంపన్నులు ఎక్కువ మంది నివసించే నగరం ముంబయి. తర్వాత స్థానం దిల్లీది. మూడో స్థానంలో ఉన్న కోల్‌కతాలో- ముంబయిలో నివసిస్తున్నవారిలో సగం మాత్రమే ఉంటారట.


ఎర్ర తివాచీ ఎలా వచ్చిందంటే..!

చలనచిత్రోత్సవాల్లో భాగంగా ఎర్ర తివాచీ మీద అందాల తారల్ని ఫొటోలు తీయడమూ, స్వాగతిస్తున్నారని చెప్పడానికి ఎర్ర తివాచీ పరిచారనడమూ... అందరికీ తెలిసిందే. అసలు ఎర్ర తివాచీకి ఎందుకింత ప్రత్యేకత అంటే- దానికి చాలా పెద్ద కథే ఉందంటున్నారు చరిత్రకారులు.

దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం గ్రీకు పౌరాణిక నాటకంలో మొట్టమొదటిసారి ఈ ఎర్రతివాచీ ప్రస్తావన వచ్చింది. ట్రోజన్‌ యుద్ధంలో గెలిచి వచ్చిన భర్త అగమెమ్నాన్‌కి భార్య స్వాగతం చెబుతూ ఎర్రతివాచీ మీద నడిచి రమ్మంటుంది. అప్పటివరకూ అసలు ఎరుపు రంగుని దేవుళ్లకు తప్ప మనుషులు వాడేవారు కాదట. అందుకని అతడు దేవుళ్ల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని భయపడుతూనే దానిమీద నడిచాడని రాస్తాడు రచయిత. అప్పట్లో- ఒక చిన్న కీటకం నుంచి ఎర్రని రంగుని సేకరించి చేత్తో నేసిన తివాచీలకు అద్దేవారట. ఆ పద్ధతి చాలా ఖర్చూ, శ్రమలతో కూడుకున్నది కాబట్టి ఎరుపు రంగు ఎంతో కాలంపాటు రాచకుటుంబాలకే పరిమితమైంది. పారిశ్రామిక విప్లవం తర్వాత కృత్రిమ రంగులు తయారవడంతో దాన్ని అందరూ వాడడం మొదలెట్టారు. 1821లో అమెరికా అధ్యక్షుడు జేమ్స్‌ మన్రోకి మొట్ట మొదటిసారి సౌత్‌ కరోలినా రాష్ట్రంలో ప్రజలు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం చెప్పారు. ఆ తర్వాత 1902లో కొత్త రైలును ప్రారంభిస్తూ ప్రయాణికులను ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించారు అధికారులు. మరో ఇరవై ఏళ్లకల్లా అది హాలీవుడ్‌కి పాకింది. ‘రాబిన్‌హుడ్‌’ సినిమా మొదటి ప్రదర్శనకు అందులోని నటీనటులను స్వాగతిస్తూ ఎర్రతివాచీ పరిచారట. 1964లో కలర్‌ టీవీ ప్రసారాలు మొదలైనప్పటినుంచి ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో అతిథులు రెడ్‌ కార్పెట్‌ మీద నడిచి రావడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఎర్ర రంగు నేపథ్యంలో ఏ రంగు దుస్తుల అందమైనా ఇనుమడిస్తుందనే... రెడ్‌ కార్పెట్‌ ఫొటో సెషన్‌కి అంత ప్రాముఖ్యం.


మీకు తెలుసా!

చక్రం కనిపెట్టాక మానవ నాగరికత ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో మనకి తెలుసు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన చక్రం స్లొవేనియాలోని ఒక మ్యూజియంలో ఉంది. ఇరవై ఏళ్ల క్రితం తవ్వకాల్లో బయటపడిన ఆ చక్రం వయసు ఐదువేల సంవత్సరాల పైమాటేనట.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

రుతుపవనాలు ఎప్పుడు వస్తాయీ ఎలా ఉండబోతున్నాయీ అన్న ముందస్తు ప్రకటనని మన దేశంలో మొట్టమొదటిసారి 1886 జూన్‌ 4న చేశారట. హిమాలయాల్లో కురుస్తున్న మంచు లెక్కల ఆధారంగా ఈ ప్రకటన చేశారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..