Published : 04 Dec 2022 00:03 IST

చిన్నారులకి... కథలూ పద్యాలూ చెబుతాయి!

పెద్దవాళ్లతో సమానంగా పిల్లలకూ సెల్‌ఫోన్లూ, కెమెరాలూ, స్మార్ట్‌వాచీలూ, ట్యాబ్‌లూ... అందుబాటులో ఉన్న రోజులివి. ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా మరో స్మార్ట్‌ వస్తువూ చేరిందండోయ్‌. పద్యాల నుంచి పాటల వరకూ... కథల నుంచి కొత్త విషయాల వరకూ... ఎన్నో నేర్పించేస్తూ పిల్లల్ని ఆకట్టుకుంటున్న ఆ పరికరమే ఆడియో/మ్యూజిక్‌ ప్లేయర్‌. వయసులవారీగా దొరికేస్తూ చిన్నారుల్ని మెప్పిస్తున్న ఈ ప్లేయర్లు చేసే సందడి మామూలుగా ఉండదు తెలుసా...

పొద్దున్నే స్కూలుకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి వచ్చాక ఇరుగుపొరుగు పిల్లలతో కాసేపు ఆడుకోవడం, ఆపైన హోంవర్క్‌, ఏమీ తోచనప్పుడు ఓ కథల పుస్తకం చదువుకోవడం, పెద్దవాళ్ల దగ్గర పాటలూ, పద్యాలూ, కొత్తవిషయాలు నేర్చుకోవడం... ఇలా ఒకప్పటి పిల్లల జీవనశైలి ఓ పద్ధతి ప్రకారం సాగేది.

ఈ తరం పిల్లల జీవితం అలా లేదు. చదువు, మిగిలిన వ్యాపకాల సంగతి పక్కన పెడితే... ఏ చిన్న విషయం తెలుసుకోవాలనుకున్నా పిల్లలు స్మార్ట్‌ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు. ఒక విధంగా ఇదీ మంచిదే కానీ... అదేపనిగా ఫోన్‌తో గడపడం వల్ల కళ్లు అలసిపోవడం, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. తయారీదారులు దీన్ని గుర్తించారో ఏమో... ఇప్పుడు కేవలం పిల్లలకోసమే ఆడియో/మ్యూజిక్‌ ప్లేయర్లను తీసుకొచ్చేసి వీటితోనూ ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని చెబుతున్నారు. రకరకాల డిజైన్లూ, ఫీచర్లతో అందుబాటులో ఉండే ఈ వస్తువులు చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటున్నాయిప్పుడు.

అదే వీటి ప్రత్యేకత...

పెద్దవాళ్లకోసం వచ్చిన కారవాన్‌ రేడియో తెలుసుగా... వాళ్లకు నచ్చే పాటల్ని అందులోనే పొందుపరిచి ఇస్తారు. ఈ ఆడియోప్లేయర్లను కూడా పిల్లల అవసరాలూ, వయసుకు తగినట్లుగా డిజైన్‌ చేస్తున్నారు తయారీదారులు. అలా వస్తున్న వాటిల్లో ‘యోటో’, ‘స్టోరీ పాడ్‌’, ‘జూకీ’, ‘సారెగామా మినీ కిడ్స్‌’, ‘టోనీబాక్స్‌’, ‘అమెజాన్‌ ఎకోడాట్‌ కిడ్స్‌’, ‘టిమియో’... వంటివి కొన్ని. ఉదాహరణకు ‘యోటో’ చూడ్డానికి చిన్న రేడియోలా ఉంటుంది. దీంతోపాటు అదనంగా కొన్ని ఆడియో స్టోరీ కార్డ్స్‌ను కూడా ఇస్తారు. కావాలనుకున్న కార్డును ప్లేయర్‌లో పెడితే కథను వినేయొచ్చు. ఒకవేళ పాటలు కావాలనుకుంటే బ్లూటూత్‌ ఆప్‌ సాయంతో పెట్టుకోవచ్చు. ‘జూకీ’ కూడా ఇంచుమించు ఇలాగే పనిచేస్తుంది. దీంతోపాటు అదనంగా కొన్ని టోకెన్లు వస్తాయి. ప్రీలోడెడ్‌ స్టోరీ/సాంగ్స్‌ ఉన్న ఈ టోకెన్లను ప్లేయర్‌కు జతచేస్తే... నచ్చిన పాటలూ, కథలూ హాయిగా వినేయొచ్చు. ఇక సారెగామా మినీ కిడ్స్‌లో... కథలూ, కొత్త విషయాలతోపాటు రైమ్స్‌, చిన్నచిన్న శ్లోకాలూ ఇలా... ఎన్నో ఉంటాయి. పులి, పాండా బొమ్మల రూపంలో ఉండే ‘అమెజాన్‌ ఎకోడాట్‌ కిడ్స్‌ ప్లేయర్‌’ ద్వారా కోరిన అంశాన్ని తెలుసుకోవచ్చు. వీటన్నింటికీ కాస్త భిన్నం ‘టోనీబాక్స్‌’, ‘స్టోరీపాడ్‌’ ప్లేయర్లు. వీటితోపాటు చిన్న బొమ్మలు కూడా వస్తాయి. ఈ బొమ్మల్ని వాటిపైన పెడితే చాలు.. కథల నుంచి రైమ్స్‌ వరకూ ఎన్నో వస్తాయి. ఇవేవీ కాకుండా... సెల్‌ఫోన్‌ తరహాలో ఉండాలని కోరుకునే చిన్నారులకూ అచ్చంగా అలాంటి ప్లేయర్లే రేడియో, వాయిస్‌/వీడియో రికార్డర్‌ వంటి సదుపాయాలతో దొరుకుతున్నాయి. ఇక... చిన్న రేడియో తరహాలో ఉండే ‘టిమియో’కు అదనంగా డిస్క్‌లు వస్తాయి. కావాలనుకున్న డిస్క్‌ను ప్లేయర్‌కు జతచేసి తిప్పితే చాలు.. జంతువుల వివరాల నుంచీ పాటల వరకూ ఎన్నింటినో నేర్చుకోవచ్చు. ఈ ప్లేయర్లన్నీ దాదాపుగా యూఎస్‌బీ ఛార్జింగ్‌, బ్యాటరీతో పనిచేస్తాయి. ఒకసారి ఛార్జింగ్‌ పెట్టుకుంటే... కనీసం ఏడెనిమిది గంటలపాటు పిల్లలకు కాలక్షేపం అవుతుంది. కాబట్టి...  మీ పిల్లలకు ఏ ప్లేయర్‌ అవసరమో.. చూసేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..