ఇవి... డిజైనర్ గుడ్లు..!
పాలూ పెరుగూ ధాన్యమూ బిస్కెట్లూ... ఇలా ఆహార ఉత్పత్తులన్నీ సేంద్రియ ట్యాగ్‌తోపాటు అదనంగా విటమిన్లనీ ప్రొటీన్లనీ నింపుకుని మరీ వస్తున్నాయనేది తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి మరొకటి చేరింది. అదే కోడిగుడ్ఢు ఒమేగా-3, డి-విటమిన్, హెర్బల్, ఫ్రీ రేంజ్, వేగన్... ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన కోడిగుడ్లు ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్నాయి. అసలీ గుడ్లేంటో... వాటిల్లోని ఆ పోషకాలేంటో చూద్దామా..!
ప్రొటీన్లూ విటమిన్లూ ఖనిజాలూ కొవ్వులూ... ఇలా అన్ని రకాల పోషకాల సమాహారమే కోడిగుడ్ఢు అందుకే బలహీనంగా ఉన్నవాళ్లని రోజూ ఓ గుడ్డు తినమని చెబుతారు వైద్యులు. అయితే మనకు ఇంతవరకూ తెలిసినవి రెండే రకాల గుడ్లు... ఒకటి కృత్రిమ పద్ధతిలో పిల్లల్ని చేయించి పౌల్ట్రీలో పెంచే ఫామ్ గుడ్లూ, ఇళ్లలో స్వేచ్ఛగా తిరుగుతూ పెరిగే దేశవాళీ కోళ్లు పెట్టే నాటు గుడ్లూ. మొదటివాటితో పోలిస్తే రెండో రకం కోళ్లు పెట్టే గుడ్లలోనే అన్ని రకాల పోషకాలూ ఉంటాయి. కానీ వీటి సంఖ్య క్రమేణా తగ్గిపోతుండటంతో- ఇప్పుడు ఇతర ఆహార ఉత్పత్తుల్లానే గుడ్లలోనూ మనకు అవసరమైన పోషకాల్ని చొప్పిస్తున్నారు. అంటే- కోళ్లకు ప్రత్యేకమైన మేత వేయడం ద్వారా గుడ్డులో సహజంగా ఉండే పోషకాలతోబాటు అదనంగా మరికొన్ని విటమిన్లూ ప్రొటీన్లూ ఫ్యాటీ ఆమ్లాలూ ఉండేలా చేస్తారన్నమాట. అందుకే వీటిని ఫోర్టిఫైడ్ లేదా డిజైనర్ ఎగ్స్‌గా పిలుస్తున్నారు. గత రెండు దశాబ్దాల నుంచీ ఈ పద్ధతి వాడుకలో ఉన్నప్పటికీ ఇటీవల ఈ ఫోర్టిఫైడ్ ఎగ్స్ ఉత్పత్తి బాగా పెరిగింది. అందులో బాగంగానే సాదా, నాటు గుడ్లతోపాటు రకరకాల లేబుల్స్‌తో కూడిన ఎగ్ బాక్సులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దామా మరి...
విటమిన్ ఎగ్స్!
ఈ మధ్యకాలంలో అత్యధిక శాతం మంది డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. దాంతో ఎముకలకు సంబంధించిన సమస్యలు చిన్నవయసులోనే మొదలవుతున్నాయి. అయితే గుడ్డు తినడం ద్వారా ఆ లోపాన్ని కొంతవరకూ అధిగమించవచ్ఛు అందులో డి3, 25హైడ్రాక్సీ విటమిన్-డి3 అని రెండు డి- విటమిన్ రకాలు సహజంగానే లభిస్తాయి. అయితే ఆ రెండు పోషకాలూ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని కోళ్లకి ఇవ్వడంతో అవి పెట్టిన గుడ్డు సొనలో ఆయా విటమిన్ల శాతం పెరుగుతుందట. ఎంత అంటే- సుమారు 60 గ్రా. బరువున్న కోడిగుడ్డులో 5.2 నుంచి 7 మైక్రో గ్రా. విటమిన్-డి3 పెరిగిందట. ఇది సాధారణ గుడ్డులో ఉండే దాంతో పోలిస్తే ఆరు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ. కాబట్టి రోజువారీ అవసరమైన డి-విటమిన్‌లో 35-47 శాతం ఒక్క గుడ్డు నుంచి అందుతుంది. కేవలం ఇదొక్కటే కాదు, ఇదే పద్ధతిలో ఇతర విటమిన్లనూ చొప్పిస్తున్నారు. నిజానికి గుడ్డులో ఒక్క సి-విటమిన్ తప్ప, ఎ బి6, బి12, డి, ఇతోపాటు ఫోలేట్‌లు సహజంగానే ఉంటాయి. ఇవన్నీ కోడిలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే డి-విటమిన్లతో పాటు మిగిలినవాటి శాతం కూడా పెరిగేలా ఫోర్టిఫికేషన్ చేస్తున్నారు. అంతేకాదు, అయొడిన్, ఫ్లోరీన్, సెలీనియం, బి-కాంప్లెక్స్, కాంజుగేటడ్ లినోలిక్ ఆమ్లాలు... వంటి పోషకాల్నీ ఇలాగే చొప్పిస్తున్నారు.
గుడ్డులో రెండుసొనలు!
అప్పుడప్పుడూ మార్కెట్లో రెండు సొనలు ఉన్న గుడ్లు చూస్తుంటాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందకుండా- అంటే, చిన్న వయసు కోళ్లలో- తొలినాళ్లలో ఒకే పెంకులోకి రెండు సొనలు వెళ్లి పోతుంటాయి. పెద్ద వయసు కోళ్లలోనూ- అంటే గుడ్లు పెట్టడం చివరిదశకు వచ్చినప్పుడూ ఇలాగే జరుగుతుంటుంది. అవే ఇవి. అయితే కొన్ని అపోహలతో ఈ రెండు సొనలు ఉన్నవాటిని తినడానికి చాలామంది ఇష్టపడరు. దాంతో వీటిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి అమ్ముతుంటారు. కానీ ఒక గుడ్డులో ఉండే తెల్ల సొనతో పోలిస్తే వీటిల్లో రెండు పచ్చసొనలకి తగ్గ తెల్లసొన ఉంటుంది. కాబట్టి రెట్టింపు ప్రొటీన్ అందుతుంది. అందుకని డబుల్ యోక్ ఎగ్స్‌నీ హాయిగా తినొచ్చు!
ఒమేగా-3 గుడ్లు!
సాధారణంగా కోళ్లకు జొన్న, మొక్కజొన్న, రాగులు, గోధుమలు... ఇలా తృణ- చిరుధాన్యాల్నీ పప్పుదినుసుల్నీ వాటి ఉత్పత్తుల్నీ మేతగా వేస్తుంటారు. అయితే వీటితోపాటు అవిసె గింజల మేతని ఎక్కువగా వేసి పెంచిన కోళ్లు పెట్టినవే ఒమేగా గుడ్లు. అవిసెల్లో ఆల్ఫా-లినోలిక్ ఆమ్లం అత్యధిక శాతంలో ఉండటంతో వాటిని తిన్న కోళ్లు పెట్టే గుడ్లలోనూ అది పుష్కలంగా ఉంటుంది. ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలోకి చేరినప్పుడు- డొకొసాహెస్కానోయిక్(డిహెచ్‌ఎ), ఐకొసాపెంటానోయిక్ ఆమ్లాలుగా మారతాయి. ఈ రెండూ కూడా శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే ఒమేగా గుడ్లు హృద్రోగులకి ఆరోగ్యకరం అంటున్నారు. ఇవి గర్భిణులూ పిల్లల్లో మెదడు పెరుగుదలకీ తోడ్పడతాయి. వీటివల్ల కణజాలాల్లో ఆక్సిజన్ శాతం పెరగడంతోపాటు మెదడు పనితీరూ బాగుంటుంది. ఒమేగా నూనెలు రుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ వల్ల కలిగే నొప్పుల్ని నివారిస్తాయనీ, వ్యాధికారక ఇన్‌ఫ్లమేటరీ సమస్యల్ని తగ్గిస్తాయనీ అంటున్నారు. సాధారణ గుడ్డులో మాదిరిగానే ఒమేగా గుడ్లలోనూ ప్రొటీన్లూ క్యాలరీలూ అన్నీ యథాతథంగా ఉంటాయి. కాకపోతే సాదా గుడ్డులో సుమారు 49-60 మి.గ్రా. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటే, ఫోర్టిఫైడ్ గుడ్డులో 115-360 మి.గ్రా. ఉంటాయట. అంటే రోజువారీ అవసరమైన ఒమేగా ఆమ్లాల్లో 14-30 శాతం ఓ గుడ్డు నుంచి లభిస్తుంది అంటున్నారు నిపుణులు.
ఔషధభరిత గుడ్లు!
పోషకాలకోసం ఆయా రకమైన ఆహారపదార్థాలను కోళ్లకు మేతగా వేయడం ఒక పద్ధతి అయితే, అచ్చంగా శాకాహార ఉత్పత్తుల్ని మాత్రమే వేసి పెంచేవీ ఉన్నాయి. అవే వెజిటేరియన్ ఎగ్స్. వీటిల్లోనూ మళ్లీ రకరకాలు ఉంటున్నాయి. ఉదాహరణకు కొన్ని కోళ్లకు అచ్చంగా ధాన్యం గింజల్నీ పప్పు దినుసుల్నీ మేతగా వేస్తే, మరికొన్నింటికి ఔషధమొక్కల ఆకులూ పువ్వులూ వంటి వాటినే ఎక్కువగా వేసి పెంచుతారు. ఈ రెండో రకాన్నే హెర్బల్ ఎగ్స్‌గా పిలుస్తున్నారు. ఈ రకంగా పెంచిన కోళ్లు పెట్టే గుడ్లలో ఆలిసిన్, బెటైన్, యూజెనాల్, ల్యూటెన్, సల్ఫొరాఫేన్, టారీన్... వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. అంతేకాదు, వీటిల్లో సాధారణ గుడ్లతో పోలిస్తే కొలెస్ట్రాల్ 25 శాతం తక్కువట. అలాగే బంతి పూలూ, బ్లూ గ్రీన్ ఆల్గే వంటి వాటిని మేతగా వేయడం ద్వారా గుడ్లలో కెరొటినాయిడ్ల శాతాన్ని పెంచుతున్నారు. వీటివల్ల కంటి సమస్యలూ క్యాన్సర్లూ రాకుండా ఉంటాయట. ఇవే కాదు, ఇన్సులిన్, యాంటీబాడీల శాతాన్నీ పెంచే ఫార్మాసూటికల్, ఇమ్యునోమాడ్యులేటింగ్ డిజైనర్ ఎగ్స్‌నీ కూడా రూపొందిస్తున్నారు.
ఈ గుడ్డు... శాకాహారం!
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదైనా దాన్ని మాంసాహారంగా భావించి తిననివాళ్లూ ఉంటారు. అందుకే జంతు ఉత్పత్తుల్ని ఏమాత్రం తాకని శాకాహారుల కోసం ఇప్పుడు అచ్చంగా మొక్కల నుంచి ఉత్పత్తి అయినవాటితోనే జీరో ఎగ్, ఓగ్స్, ఓన్లీ ఎగ్, కల్చర్డ్ ఫుడ్స్, క్రాక్‌డ్... వంటి కంపెనీలు వెజ్ ఎగ్స్‌ని రూపొందిస్తున్నాయి. కాలిఫోర్నియాకి చెందిన ‘ఈట్ జస’్ట్ కంపెనీ పెసల నుంచి తీసిన ప్రొటీన్‌తో చేసిన గుడ్డు సొన అమెరికా, ఐరోపా దేశాల్లో అత్యధిక ఆదరణ పొందింది. మనదేశానికి చెందిన ‘ఎవో ఫుడ్స్’ కంపెనీ మొట్టమొదటగా కోడిగుడ్డులోని పోషకాలూ రుచీ ఉన్న లిక్విడ్ వేగన్ ఎగ్‌ని తయారుచేసింది. సెనగలు, బఠాణీలూ పెసలతో చేసిన ఈ గుడ్డు సొనతో కూరలూ ఆమ్లెట్లూ ఎగ్ రోల్స్... వంటి వంటకాలన్నీ చేసుకోవచ్ఛు వంద మిల్లీలీటర్ల సొనలో 12 గ్రా. ప్రొటీన్ ఉంటుందట. ఇది రెండు గుడ్లతో సమానం అంటున్నారు ఉత్పత్తిదారులు. పైగా ఇందులో కొలెస్ట్రాల్ ఉండదట. ఈ కంపెనీలన్నీ ఇప్పటివరకూ గుడ్డుసొనని ద్రవరూపంలోనే తీసుకొస్తే, తాజాగా ఎవో కంపెనీ అచ్చం గుడ్డులా ఉండేవాటినీ తయారుచేసింది. సింగపూర్‌కి చెందిన ఒసొమెఫుడ్, ఫ్లోట్ ఫుడ్స్ కంపెనీలు సైతం ఉడికించుకోగల వేగన్ గుడ్లని తయారుచేస్తున్నాయి. ఫంగస్ నుంచి సేకరించిన మైక్రొప్రొటీన్‌తో చేసిన ఈ గుడ్లు చూడ్డానికి అచ్చం కోడిగుడ్లనే పోలి ఉండటం విశేషం.
ఫ్రీ-రేంజ్ ఎగ్స్!
ఎవరికి వాళ్లు ఇంటి దగ్గరే పెంచుకునే దేశవాళీ కోళ్ల గురించి తెలిసిందే. ఫామ్ గుడ్లతో పోలిస్తే స్వేచ్ఛగా తిరుగుతూ పెరిగే అవి పెట్టే గుడ్లలోనే పోషకాల శాతం ఎక్కువ. అందుకే ఇప్పుడు ఫామ్స్‌లో పెంచే కోళ్లను సైతం స్వేచ్ఛగా వదులుతున్నారు. అయితే వీటిల్లో కేజ్-ఫ్రీ, ఫ్రీ- రేంజ్, పాశ్చర్ రెయిజ్డ్ ఎగ్స్ అని మూడు రకాలు. అంటే- కోళ్లను బయటకు వదలకుండా గదుల్లోనే కాస్త స్వేచ్ఛగా తిరిగేలా వదిలితే కేజ్ ఫ్రీ అనీ, గదుల బయట వరండా మాదిరిగా ఉన్న స్థలంలో కాసేపు తిరిగితే ఫ్రీ రేంజ్ అనీ, ఫామ్ బయటకు వచ్చి పచ్చికలో తిరిగేలా చేస్తే పాశ్చర్ రెయిజ్డ్ అనీ అంటున్నారు. అయితే ఈ మూడింటిలోకీ స్వేచ్ఛగా పచ్చికలో తిరిగే కోళ్లు పెట్టే గుడ్లలోనే పోషకాల శాతం ఎక్కువట. అంతేకాదు, అవి ఆనందంగా పెరుగుతాయి కాబట్టి వాటిల్లో రోగాలను తట్టుకునే శక్తీ ఉంటుంది. అందుకే వాటిని హ్యాపీ కేజ్ ఫ్రీ... వంటి లేబుల్స్‌తోనూ విక్రయిస్తున్నారు. ఫామ్ ఎగ్స్‌తో పోలిస్తే వీటిల్లో విటమిన్-డి నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం, బీటా కెరోటిన,్ యాంటీఆక్సిడెంట్ల శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లు మరో పరిశీలనలో తేలింది. ఇలా పెరిగే వాటిల్లో గుడ్ల ఉత్పత్తి కూడా ఎక్కువేనట. ఇవే కాదు, హార్మోన్, బ్యాక్టీరియా, యాంటీబయోటిక్స్ ఫ్రీ పేరుతోనూ గుడ్లను విక్రయిస్తున్నారు.చూశారుగా మరి... కోడి పెట్టే గుడ్డులోనే ఎన్ని రకాలున్నాయో!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
కవర్ స్టోరీ
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Sports News
INDw vs AUSw : కామన్వెల్త్ ఫైనల్.. ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు
-
Politics News
Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
-
Movies News
Nithiin: అభిమానుల కోసం మరో 20 ఏళ్లైనా కష్టపడతా: నితిన్
-
World News
Indain Navy: భారత జలాల్లోకి పాక్ యుద్ధనౌక.. వెనక్కి తరిమిన కోస్ట్‌గార్డ్ ‘డోర్నియర్’
-
Crime News
Crime News: మిర్యాలగూడలో కారు బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం
-
Sports News
IND vs WI : ఐదో టీ20 మ్యాచ్.. విండీస్‌కు భారత్ భారీ లక్ష్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?