పాపకు చాక్లెట్‌ నెయ్యి... బాబుకు పనీర్‌ ఘీ!

పాప జలుబు తగ్గడానికి చెంచా నెయ్యిని మాత్రమే తినిపిస్తే... బ్రెడ్డుపైన నెయ్యి రాసి బాబుకిష్టమైన చాక్లెట్‌ రుచిని తెప్పిస్తే... ఒక్క నెయ్యితోనే కూరకు కమ్మటి తాలింపు వేస్తే...

Updated : 07 Jul 2024 05:09 IST

పాప జలుబు తగ్గడానికి చెంచా నెయ్యిని మాత్రమే తినిపిస్తే... బ్రెడ్డుపైన నెయ్యి రాసి బాబుకిష్టమైన చాక్లెట్‌ రుచిని తెప్పిస్తే... ఒక్క నెయ్యితోనే కూరకు కమ్మటి తాలింపు వేస్తే... పదార్థాలకు కాస్త నెయ్యి కలిపి మసాలా ఘుమఘుమలు అద్దేస్తే... అదిరిపోదూ... అందుకే ఇప్పుడు నెయ్యి ఎన్నో రుచుల్లో దొరుకుతోంది మరి!

 ‘వేడివేడి అన్నంలో కాస్త నెయ్యేస్తే- అందులోకి ఏ కూర కలిపినా... అబ్బ అమృతమే’ అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు కొందరు. ‘పప్పులో వేసిన నెయ్యి ఘుమఘుమలు- లేని ఆకలిని పుట్టించేశాయ’ంటూ ఆ కమ్మటి రుచిని ఆస్వాదించేస్తారు మరికొందరు. పూసపూసలో నెయ్యి వెదజల్లే సువాసనలూ, మెతుకుమెతుకుకూ అది అద్దే రుచీ- అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టే బుజ్జాయికి తినిపించే మొదటి ముద్దలోనూ ఇంత నెయ్యి పడాల్సిందే. ఇలా వంటకు రుచిని తెస్తూనే, ఆరోగ్యాన్నీ అందించే నెయ్యికి మరిన్ని పదార్థాలు కలిపి సరికొత్త సువాసనలు తెస్తూ ఈ ‘ఫ్లేవర్డ్‌ ఘీ’లని సిద్ధం చేశారు తయారీదారులు. సాధారణంగా ఏదైనా దుకాణానికి వెళ్లినా, షాపింగ్‌ సైట్‌ తెరిచినా... నెయ్యీ అనగానే- గేదె, ఆవు నెయ్యిల పేర్లు మాత్రమే కనిపించేవా... కానీ ఇప్పుడు నెయ్యిల్లో ఉన్న రకాల్ని చూసి వాటిల్లో ఏది ఎంచుకోవాలబ్బా అంటూ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే... అన్ని  వెరైటీలు అందుబాటులో ఉన్నాయి.

ఎన్ని రకాలో...

వట్టి అన్నంలో చెంచా నెయ్యి వేసుకున్నా ఉప్పు రుచినీ ఇచ్చే ‘హిమాలయన్‌ సాల్ట్‌ ఘీ’, కాస్త కారాన్ని కలిపే ‘చిల్లీ ఘీ’ల దగ్గర్నుంచి తులసీ, కరివేపాకూ, జీలకర్రా, వెల్లుల్లీ, ఉల్లీ, పసుపూ, ఉసిరీ, కుంకుమ పువ్వూ, మసాలా దినుసులూ... ఇలా రకరకాల పదార్థాలతో కలిపి చేసిన నెయ్యిల వరకూ బోలెడన్ని ఉన్నాయి. ఇంకా చిన్నారులకు నచ్చేలా చాక్లెట్‌, వెనిల్లా, పనీర్‌ ఫ్లేవర్లలోనూ నెయ్యి దొరుకుతోంది. అంతేకాదు, ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యానికి మంచివని చెప్పే బ్రహ్మీ, శతావరి మొక్కల్నీ ఘీకి జత చేసి కొత్త రుచుల్ని తీసుకొచ్చారు. తాలింపు కోసం ప్రత్యేకంగా ఆవాలూ, వెల్లుల్లీ, ఎండు మిరపకాయల్ని వేసిన ‘తడ్కా ఘీ’ ఉంది.

జలుబూ, దగ్గులాంటివి వస్తే మందులకు బదులు ఇంటి చిట్కాలు పాటించేవాళ్లెందరో. ఇంట్లోనే ఉండే తులసీ, పసుపూ, జీలకర్రా... ఇలా రకరకాల పదార్థాల్ని తింటుంటారు. పెద్దవాళ్లయితే ఎలాగోలా వాటిని నోట్లో వేసుకుంటారు కానీ పిల్లలకు తినిపించడం మహాకష్టం. అలాంటప్పుడు ఈ ఫ్లేవర్డ్‌ ఘీల్ని ట్రై చేయొచ్చు. ఇంకా వంటకాల్లో విడివిడిగా నెయ్యీ, కుంకుమపువ్వూ, మసాలా దినుసుల్లాంటివి వేయకుండా ఆ రుచులతో వస్తున్న నెయ్యిని మాత్రమే వేసినా సరిపోతుంది. చిన్నారులకు బ్రెడ్డూ చపాతీల్లోకి చాక్లెట్‌ లేదా వెనిల్లా నెయ్యిని అద్ది ఇచ్చారంటే ‘యమ్మీ మమ్మీ’ అంటూ మళ్లీ మళ్లీ కావాలంటారు. మంచి కొవ్వులూ, విటమిన్లూ, పోషకాలతో ఉండే నెయ్యిని రోజూ తినేవాళ్లు ఈ భిన్న రుచుల నెయ్యినీ ఓ పట్టుపట్టాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..