ఉయ్యాలా...జంపాలా..!

ఉయ్యాల... ఆ పేరు వింటే చాలు... గుండెగూటిలోని ఊసులన్నీ నిద్రలేస్తాయి... గతకాలపు జ్ఞాపకాల్లో మనసును ఊయలలూపుతాయి... అందుకేనేమో... ‘కొమ్మ ఉయ్యాల... కోన జంపాల... అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాల...’ అంటూ ఊయలమీద మనసు పారేసుకున్నాడో సినీ కవి.

Updated : 02 Apr 2023 03:32 IST

ఉయ్యాలా...జంపాలా..!

ఉయ్యాల... ఆ పేరు వింటే చాలు... గుండెగూటిలోని ఊసులన్నీ నిద్రలేస్తాయి... గతకాలపు జ్ఞాపకాల్లో మనసును ఊయలలూపుతాయి... అందుకేనేమో... ‘కొమ్మ ఉయ్యాల... కోన జంపాల... అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాల...’ అంటూ ఊయలమీద మనసు పారేసుకున్నాడో సినీ కవి. అవును మరి... అమ్మఒడిని మించిన హాయి ఇంకెక్కడ దొరుకుతుందీ అన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఉయ్యాల. ఆనాటి నుంచి నేటి వరకూ అది ఎన్నెన్నో రూపాల్లో నట్టింట్లో అలంకరణ వస్తువై మరీ మనిషిని ఆనందడోలికల్లో ఊపుతోంది... బారసాల మొదలుకుని పెళ్లి వేడుకల వరకూ ఉయ్యాలే వేదికై ఊగుతోంది!

ఎం త బాగుంటుంది అమ్మ ఒడి... వెచ్చగా హాయిగా... పొత్తిళ్లలోని పాపాయికి అదే తొలి ఉయ్యాల. ఇరవయ్యొకటో రోజున బారసాల వేడుకలో వేసే చీర ఉయ్యాల అచ్చం అమ్మ ఒడినే తలపిస్తూ... అవునుమరి, అదీ అమ్మదే... ‘లాలి ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల ఊగేటి మా పాప తూగుటుయ్యాల’ అంటూ అమ్మ పాటలో ఊయలలూగిన పాపాయి పెరుగుతూనూ ఊయల్ని వదలదు. ‘ఆకాశవీధిలోకెగురు ఉయ్యాల’ అంటూ తాడు ఉయ్యాలతో ఆటలాడుతుంది. తోటిపిల్లలలో పోటీపడుతుంది. వేసవి సెలవులొస్తే మరీనూ... ఉయ్యాలే ఉయ్యాలా... పల్లెకెళ్లినా పట్నవాసానికొచ్చినా... ఇంటి వసారాలోనో పెరటి చెట్టుకో ఊయల కట్టాల్సిందే... ఊగాల్సిందే!

ఇంట్లో లేకపోతే పార్కుకి పోదాం పదమంటుంది. అందుకేమరి... ఊయలలేని ఉద్యానవనాలే ఉండవు. పెద్దయినా ఊయలబల్ల వదలదు గారాలపట్టి. అమ్మచేతి గోరుముద్దలైనా కంప్యూటర్‌ చదువైనా వాట్సాప్‌ చాటింగులైనా ఇన్‌స్టా రీల్సైనా... అన్నీ అక్కడే. అలనాటి రాధాకృష్ణుల ప్రేమటుయ్యాలనూ కార్పొరేట్‌ కొలువునూ కలలు కంటూనే పెళ్లికి తయారవుతుంది. మెహందీకయినా హల్దీ వేడుకకైనా పూలతో అలంకరించిన ఉయ్యాల్లోనే ఫొటోషూట్‌లంటోంది. పుట్టినింటినీ మెట్టినింటినీ విడిచి అమెరికా ఫ్లైటెక్కినా ఉయ్యాలని మరిచిపోదు. అందుకే అక్కడా కుర్చీ లేదా స్టాండ్‌ ఉయ్యాల్లోనో ఊగుతూ తూగుతూ ‘ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ...’ అంటూ సంసార జీవనాన్నీ వృత్తి జీవితాన్నీ ఆనందపుటుయ్యాలగా మార్చుకుంటుంది. అమ్మగా మారి తన ఒడినే ఉయ్యాల చేస్తుంది.

భక్తి ఉయ్యాల!

ఒక్క అమ్మాయిలనేముందీ... అప్పుడైనా ఇప్పుడైనా అందరికీ ఉయ్యాల ఇష్టమే... ఊయలమంచం లేందే కవిత్వం రాదన్నాడు అల్లసాని పెద్దన.

‘ఎంకి వూగెను కొమ్మ వుయ్యాల చంద్రవంక వూగెను బొమ్మ వుయ్యాల’ అంటూ వయ్యారి ఎంకిని నండూరి సుతారంగా ఊపితే, ‘కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై ఉండె వుయ్యాల’ అంటూ అన్నమయ్య తన పదాలతోనే శేషశాయిని ఊయలలూపాడు. అంటే... ఉయ్యాలంటే ఆ దేవుళ్లకీ ఇష్టమే మరి. కాబట్టే సుప్రసిద్ధ దేవాలయాలన్నింటా ఉయ్యాల సేవతో వాళ్లను నిద్రపుచ్చుతుంటారు. ఇంట్లో చేసుకునే పండుగలూ వేడుకల్లోనూ దేవీదేవతల ప్రతిమల్ని ఊయల్లో ఉంచి సేవ చేసే భక్తులకీ కొదవ లేదు. అందుకే అంటారు... ‘భక్తికయినా రక్తికయినా ఉయ్యాలే’ అని.

ఎన్ని రకాలో!

ఎప్పుడు ఎలా మొదలైనప్పటికీ పౌరాణిక కథల్లో ఎక్కువగా కనిపించే ఉయ్యాల మాత్రం రాధామాధవులదే. నందనవనంలో వాళ్ల వలపుతలపులతో అల్లుకున్న తీగ ఉయ్యాలలు నేటికీ పల్లెనాట కనిపిస్తుంటాయి. దృఢమైన తీగల్ని చెట్ల కొమ్మలకు పాకించి ఆటల్లో భాగంగా పిల్లలు ఊగుతుంటారు.

ఆపై ఉయ్యాల ఎన్నో రూపాల్నీ మరెన్నో అందాల్నీ సంతరించుకుని గృహాలంకరణలోనూ భాగమైంది. ఒకప్పుడు చిన్నదైనా పెద్దదైనా ఉయ్యాల చాలామంది ఇళ్లలో నాలుగు గొలుసుల మధ్య ఉన్న బల్లలానే కనిపించేది. దాన్నే ఓ సోఫాలా చేయించుకుని కుషన్లు వేసుకుని లివింగ్‌రూముకి కొత్త అందాన్ని తీసుకొస్తున్నారిప్పుడు. కొందరైతే రోజ్‌వుడ్‌, టేక్‌వుడ్‌లతోనూ దాన్నో అద్భుత కళాఖండంలానూ చేయించుకుంటున్నారు. సంఖేడా ఉయ్యాలలైతే రంగురంగుల్లో గుండ్రని కర్రతో ఎంతో అందంగా కనిపిస్తాయి. సంపన్నులైతే లానుల్లో బాల్కనీల్లో... గూడుల్లా పంజరాల్లా బెంచీల్లా మంచాల్లా... ఇలా ఎన్నో రకాల ఉయ్యాలలు.

... మొత్తమ్మీద చెక్కతో ఐరన్‌తో చేసినవీ... వెదురు, జనపనారలతో అల్లినవీ... కేను కుర్చీ రూపంలోనో బల్లగానో ఉయ్యాల హాల్లో వేలాడుతోంది. అన్ని రకాల ఊయలలు అన్నిచోట్లా లేకున్నా పసివాళ్ల ఊయల మాత్రం అంతటా కనిపిస్తుంది. వీళ్లు ఓ పట్టాన అమ్మఒడిని వీడరు. ఆ వెచ్చదనం కోసమే చీర ఉయ్యాలను ఇష్టపడతారు. అందుకే... పాతకాలపు ఉయ్యాల మంచాలతోపాటు గతకాలపు స్ప్రింగు ఉయ్యాలలూ సురక్షితమైన బెల్టు ఉయ్యాలలు... ఇలా ఎన్నో రకాలు మార్కెట్లో ఉన్నాయి.

ఆరోగ్యానికీ ఉయ్యాల!

ఉయ్యాల పిల్లలకు కేవలం ఆనందాన్నే కాదు, మానసిక సమస్యల్ని తగ్గించి ఆరోగ్యాన్నీ పెంచుతుంది అంటున్నారు నిపుణులు. వాళ్లలో మోటార్‌ స్కిల్స్‌ను పెంచుతుంది. తాళ్లను గట్టిగా పట్టుకోవడంవల్ల చేతుల్ని బలంగా ఉపయోగించడం తెలుస్తుంది. వివిధ భాగాలమధ్య సమన్వయం ఏర్పడుతుంది. కండరాల పెరుగుదలకీ తోడ్పడుతుంది. అందుకే బుద్ధిమాంద్యం, ఏడీహెచ్‌డీ పిల్లలకోసం సెన్సర్‌ స్వింగ్స్‌ పేరుతో థెరపీ ఉయ్యాలలూ వస్తున్నాయిప్పుడు. ఆటల్లో భాగంగా ఊగడంవల్ల మెదడు పెరుగుదలా బాగుంటుంది. శరీరంమీదా పట్టు వస్తుంది. అంతేనా... గట్టిగా నాలుగైదుసార్లు ఊపితే చిన్నారులు త్వరగానూ నిద్రపోతారు. పాపాయికి చుట్టుపక్కలున్నవాటిని గమనించడమూ అలవాటవుతుంది. ఊగడం వల్ల పిల్లల్లో ఎండార్ఫిన్లు విడుదలై చురుకుదనాన్ని కలిగిస్తాయి.

నిజానికి ఊయల ఒత్తిడినీ ఆందోళననీ తగ్గించి మనసునీ శరీరాన్నీ ఆనందంగా ఆరోగ్యంగా ఉంచేందుకే కాదట... బరువు కూడా తగ్గొచ్చన్నది ఫిట్‌నెస్‌ నిపుణుల మాట. లావుగా ఉన్నవాళ్లు రోజూ ఓ అరగంటసేపు ఉయ్యాలూగితే క్యాలరీలు తగ్గి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారట. వర్కవుట్ల కన్నా ఇది ఎంతో హాయినీ అందిస్తుంది. ఓ గంటసేపు ఊయలూగితే 200 క్యాలరీలు కరుగుతాయట. ముఖ్యంగా పొట్ట దగ్గరున్న కండరాలకీ ఇది మంచి వ్యాయామం. అదీ బల్లమీద కూర్చుని ఓ కాలును ముందుకి మరో కాలుని వెనక్కి పెట్టి తాడును మోచేతికి ఆన్చి కొద్దిగా వెనక్కి వెళ్లి ముంజేతులతో తోస్తూ ఊగాలి. దీనివల్ల శరీర కండరాలన్నింటిమీదా ఒత్తిడిపడి, రన్నింగ్‌వల్ల కలిగే ప్రయోజనాలు కలుగుతాయట. చేతులు కూడా లావు తగ్గి చక్కని ఆకృతిలో ఉంటాయి. అందుకేనేమో... బట్టనే ఉయ్యాలగా కట్టి చేసే ఏరో యోగా అటు సెలెబ్రిటీల్నీ ఇటు సాధారణ ప్రజల్నీ కూడా ఆకట్టుకుంటోంది. అందుకే ఆహ్లాదకరమైన వాతావరణంలో ‘ఉయ్యాలా జంపాలా...’ అని పాడుకుంటూ ఊగుతుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. దాన్నిమించిన ఆరోగ్యం ఇంకేముంటుందీ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..