జయజయ శుభకర వినాయకా...

భాద్రపద శుద్ధ చతుర్థి... శుభంకరుడైన వినాయకుడి జన్మ తిథి... ఆ రోజున ఊరూ వాడా ఒకటే సందడి... చిన్నా పెద్దా అందరిలో ఉత్సాహం వెల్లువెత్తుతుంది. బొజ్జ గణపయ్య విగ్రహాన్ని స్వయంగా చేసుకుని,..

Updated : 27 Aug 2022 23:36 IST

జయజయ శుభకర వినాయకా...

భాద్రపద శుద్ధ చతుర్థి... శుభంకరుడైన వినాయకుడి జన్మ తిథి... ఆ రోజున ఊరూ వాడా ఒకటే సందడి... చిన్నా పెద్దా అందరిలో ఉత్సాహం వెల్లువెత్తుతుంది. బొజ్జ గణపయ్య విగ్రహాన్ని స్వయంగా చేసుకుని, పాలవెల్లి కింద ప్రతిష్ఠించి, పత్రీపుష్పాలతో కొలిచి, కుడుములూ ఉండ్రాళ్లూ నివేదించి సంతుష్టపరుస్తారు. పలు పేర్లూ భిన్న రూపాలతో కొలిచే ఆ గణనాథుడికి దేశవ్యాప్తంగా లెక్కకుమిక్కిలి గుడులు... వాటిల్లో భక్తుల నీరాజనాలు అందుకుంటూ అధిక ప్రాచుర్యం పొందిన కొన్ని గణపతి క్షేత్రాలు...


అబద్ధాన్ని సహించని సత్యదేవుడు

చిత్తూరుజిల్లా బాహుదా నదీతీరంలో ఉన్న కాణిపాకంలో స్వయంభూగా వెలసిన బొజ్జగణపయ్యకి ఎంతో విశిష్టత ఉంది. పూర్వం విహారపురిగా పిలిచే ఈ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరు అంధత్వం, మరొకరు మూగ, ఇంకొకరు చెవిటితనంతోనూ బాధపడే ఈ ముగ్గురూ తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుని జీవించేవారు. ఓసారి వచ్చిన కరవులో నీళ్లన్నీ అడుగంటడంతో బావిని ఇంకాస్త లోతుకి తవ్వుతుండగా- గడ్డపారకి ఓ రాయి తగిలిందట. చిత్రంగా ఆ రాతి నుంచి రక్తం చిమ్మి అది ఆ ముగ్గురిమీదా పడటంతో వాళ్లకి చూపూ మాటా వినికిడీ వచ్చాయట. ఆ విషయాన్ని ఊళ్లోకి వెళ్లి అందరికీ చెప్పడంతో వాళ్లంతా వచ్చి, ఆ రాయిని వినాయకుడిగా భావించి పూజించారట. ఆ విషయం చుట్టుపక్కల గ్రామాలకీ తెలిసి జనం తండోపతండాలుగా వచ్చి కొబ్బరికాయలు కొట్టడంతో ఆ నీరు, నూతిలో నుంచి పొంగి ఒకటిన్నర ఎకరం నేలలో ప్రవహించిందట. అప్పట్లో ఒకటిన్నర ఎకరాన్ని కాణి అనేవారు. అలా ఆ ప్రాంతం కాస్తా కాణిపాకమైంది. ఆనాటి నుంచీ అక్కడ వెలసిన స్వామి కోరికలు తీర్చే వినాయకుడుగానూ సత్యప్రమాణాల దేవుడుగానూ పేరొందాడు. తప్పులు చేసినవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి, కోనేరులో స్నానం చేయిస్తే తప్పును ఒప్పుకుంటారట. అప్పటికీ చెప్పనివాళ్లని గణపయ్య శిక్షిస్తాడనే నమ్మకం బలపడింది. దాంతో ఎవరూ ఈయన ముందు అబద్ధం ఆడడానికి సాహసించరు. నిజమే చెబుతున్నాం అని నొక్కి చెప్పాలంటే ‘కాణిపాకం వినాయకుడిమీదొట్టు’ అనేస్తారు. రోజురోజుకీ పెరగడం ఈ గణపతి విగ్రహానికున్న మరో ప్రత్యేకత. అందుకు సాక్ష్యంగా యాభై ఏళ్ల క్రితం లక్ష్మమ్మ అనే భక్తురాలు చేయించిన వెండికవచం నేడు సరిపోవడం లేదు. ప్రస్తుత ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. వినాయకచవితి నుంచి 21రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకి వేల మంది భక్తులు తరలివస్తారు.


గుహలో కొలువైన స్వామి

తమిళనాడులోని శివగంగ జిల్లాలో పిళ్లైయార్‌పట్టి అనే గ్రామంలో ఉందీ ఆలయం. తమిళంలో వినాయకుడినే పిళ్లైయార్‌ అంటారు. ఏడో శతాబ్దంలో కొండను తొలిచి మరీ నిర్మించిన ఈ మందిరంలోని విఘ్నేశ్వరుని విగ్రహం ఆరడుగుల ఎత్తులో బంగారు ఆభరణాలతో అలంకరించి కడు సుందరంగా కనిపిస్తుంది. పాండ్య చక్రవర్తులు కట్టించిన ఈ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం రాయిని తొలిచినట్లుగా ఉంటుంది. అందుకే విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కుదరదు. ఇతర ఆలయాల్లోని వినాయక రూపానికి భిన్నంగా ద్విభుజుడుగానూ, కుడిచేతిలో మిఠాయిల్ని పట్టుకునీ, కుడివైపునకు వంపు తిరిగిన తొండంతోనూ దర్శనమిస్తాడిక్కడి జ్ఞానేశ్వరుడు. రంగుల్లో నిర్మించిన గోపురం, మండపాలను కుడ్యచిత్రాలతో అలంకరించిన తీరు చూపరుల్ని ఆకట్టుకుంటుంది. నూనెదీపాలు నిత్యం వెలుగుతూ గర్భగుడిలోకి కాంతిని వెదజల్లుతుంటాయి. గోడమీద చెక్కిన వినాయకుడి విగ్రహం ఎటు నుంచి చూసినా మనవైపు చూస్తున్నట్లే ఉండటం ఆలయ విశిష్టతగా చెప్పొచ్చు. స్వామి పాదాల దగ్గర కాకుండా గుడిలో ఓ పక్కగా ఉన్న మూషికం చెవిలో భక్తులు తమ కోరికలు చెబితే దాన్ని వినాయకుడికి చెప్పి తీరేలా చేస్తుందని ప్రతీతి.


సంతానాన్ని ఇచ్చే సిద్ధివినాయకుడు

‘పాశాంకుశ ధరందేవం ధ్యాయేత్‌ సిద్ధి వినాయకం!’... అంటూ కొలిచినంతనే కోరికలు తీరుస్తాడనే కాబోలు... ముంబైలోని ప్రభావతీ ప్రాంతంలో కొలువైన గణేశుడు వర సిద్ధి వినాయకుడుగా పేరొందాడు. ఈ ఆలయాన్ని తొలిగా లక్ష్మణ్‌ వితుల్‌ పాటిల్‌ అనే వ్యక్తి కట్టించాడట. చిన్న కోవెలగా ఉన్న ఈ మందిరాన్ని ఆగ్రిసమాజ్‌కు చెందిన దేవుబాయి పాటిల్‌ అనే మహిళ ఓసారి ఈ ఆలయాన్ని దర్శించుకుని మొక్కుకుంది. అప్పుడు ఆమెకో ఆలోచన వచ్చింది. తనలాగే సంతానభాగ్యంలేని వాళ్లంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నంతనే పిల్లలను ఇవ్వమని మొక్కుకుంటూ ఓ పెద్ద గుడిని కట్టిస్తేనో అనుకుంది. దాని ఫలితమే 1801లో ఆరు అంతస్తులతో వెలసిన శ్రీ సిద్ధి వినాయక ఆలయం. సిద్ధి, బుద్ధి సమేతుడై చతుర్భుజుడుగా ఉన్న ఇక్కడి వినాయకుడి విగ్రహం ఎత్తు 2.5 అడుగులు. రెండు అడుగుల పొడవున్న స్వామి తొండం కుడివైపునకు తిరిగి ఉండటం ఈ విగ్రహం విశిష్టత. పైవైపు కుడిచేతిలో కమలం, ఎడమ చేతిలో గొడ్డలి ఉంటాయి. కిందివైపు ఎడమచేతిలో తావళం, కుడిచేతిలో కుడుములతో నిండిన పాత్ర ఉంటాయి. బాలీవుడ్‌ ప్రముఖులూ అంబానీలూ తరచూ సందర్శించే ఈ ఆలయ సంపద 450 కోట్ల రూపాయల పైనే. సంకల్పబలమో కట్టించినవారి చేతి చలవోగానీ ఇక్కడి స్వామిని కొలిచిన వాళ్లందరికీ కోరికలు నెరవేరడంతో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది.


పెళ్లిళ్లు చేసే విఘ్నేశ్వరుడు

ఉత్తర కన్నడ జిల్లాలోని శరావతీ నదీతీరాన కుంజవనంలోని ‘ఇద[గుంజి’ ప్రాచీన వినాయక క్షేత్రాల్లో ఒకటి. 1500 ఏళ్ల నాటిదైన ఈ ఆలయంలో స్వామి నిలుచున్న భంగిమలో రెండు చేతులతో దర్శనమిస్తాడు. ఇక్కడి వినాయకుడిని కలియుగ కల్పతరువుగా కొలుస్తారు. అయితే స్థానికులు ఈ గణ పతి అనుమతి లేనిదే పెళ్లి ప్రయత్నాలే తలపెట్టరట. బంధి అనే జాతివాళ్లు సంబంధం కుదుర్చుకోగానే రెండు కుటుంబాలూ ఆలయానికి చేరుకుని స్వామి పాదాల చెంత రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర పెట్టిన చీటీ కింద పడితే శుభసూచకంగా భావించి పెళ్లిఏర్పాట్లు చేసుకుంటారు. ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ జారిపడితే అశుభంగా భావించి మరో సంబంధం వెతుక్కుంటారట. ఇక్కడి స్వామికి కిరీటం ఉండదు... మూషిక వాహనం కూడా కనిపించదు. పంచకజ్జాయం(ఆకుల్లో వండిన ఇడ్లీ) అనే నైవేద్యం ఈ గుడి ప్రత్యేకం. పౌరాణిక కథనం ప్రకారం- ద్వాపరయుగాంతంలో బదరికాశ్రమంలోని మునులంతా కలిసి కలియుగంలో రాబోయే అరిష్టాలను అరికట్టే నిమిత్తం కుంజవనంలో యజ్ఞయాగాదులు ప్రారంభిస్తారు. అయితే ఏదో ఒక అడ్డంకితో యాగం ముందుకు సాగడం లేదట. అప్పుడు నారదుడు విఘ్ననాయకుడిని ప్రార్థించమని చెప్పడంతో- ముందుగా గణపతినీ ఆ తరవాత త్రిమూర్తుల్నీ ఆహ్వానిస్తారు. అప్పుడు యాగం నిర్విఘ్నంగా సాగిందట. త్రిమూర్తులు కోరిన వరాలను ఇచ్చి తిరిగి వెళ్లిపోగా గణనాథుడు మాత్రం ఈ కుంజవనంలోనే కొలువయ్యాడట. ఏటా పదిలక్షలమంది సందర్శించే ఈ ఆలయం త్రేతాయుగం నాటిదనీ, నల్లని ఏకరాతి శిలతో ఉన్న ఈ విగ్రహాన్ని దేవశిల్పి చెక్కాడనీ స్వామిని గరికతో పూజించినా చాలు...సంతోషపడతాడనీ చెబుతారు.


చింతల్ని తీర్చే గణేశుడు

హిందూ పురాణాల ప్రకారం- విశ్వరక్షకుడైన విష్ణుమూర్తికి ఉన్న మరో పేరే చింతామణి. అలాగే విశ్వాన్ని రక్షించేవాడు విఘ్నేశ్వరుడు అన్న అర్థమూ ఉంది. అందుకే ఇక్కడి స్వామిని చింతామణి లేదా చింతాహరన్‌ గణేశ్‌ అంటారు. ఉజ్జయినిలోని షిప్రా నదీతీరంలో ఫతేహాబాద్‌ రైల్వేలైన్‌ సమీపంలో ఉన్న ఆలయ గర్భగుడిలో చింతామణ్‌, ఇచ్ఛమన్‌, సిద్ధి వినాయక అనే మూడు విగ్రహాలు కూర్చున్నట్లుగా కనిపిస్తాయి. ఈ రకమైన విగ్రహాలు మరెక్కడా కనిపించవు. గుడిలోని బావికో విశిష్టత ఉంది. వనవాసంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు లక్ష్మణుడు బాణం వేసి భూమిలోనుంచి గంగను తెప్పించిన ప్రదేశం ఇదేననీ, అదే కాలక్రమంలో మెట్లబావిగా రూపొందిందనీ చెబుతారు. ఆ తరవాత రాముడు చింతామణిగానూ లక్ష్మణుడు ఇచ్ఛామన్‌ రూపాలు దాల్చి సిద్ధివినాయకుడిని పూజించారనీ, అందుకే ఇక్కడ మూడు విగ్రహాలు కనిపిస్తాయనీ అంటారు. దుఃఖం నుంచి విముక్తి కలిగిస్తాడనే కారణంతో నిత్యం వేలాదిమంది భక్తులు ఇక్కడి వినాయకుడిని దర్శిస్తారు. 11, 12వ శతాబ్దాల్లో మాల్వాను పాలించిన పర్మారా వంశీకులు నిర్మించగా, ప్రస్తుత ఆలయాన్ని 250 ఏళ్లక్రితం అహల్యాబాయి పునర్నిర్మించిందట. పెళ్లయిన వెంటనే ఇక్కడి వినాయకుడిని దర్శించుకుని వెళ్లడం మాల్వా వాసులకి ఆనవాయితీగా వస్తోందట.


బాల గణపతి

తిరుచిరాపల్లిలో ఒక రాతికొండ కొనమీద ఉంటుంది ఉచ్చి పిళ్లైయార్‌ ఆలయం... దీనికే రాక్‌ఫోర్ట్‌ ఆలయంగా పేరు. ఈ ఆలయాన్ని ఏడో శతాబ్దంలోనే పల్లవులు కట్టించినప్పటికీ దీనికి మెట్లూ ఇతర వసతుల్ని విజయనగర సామ్రాజ్య కాలంలో మదురై నాయక రాజులు నిర్మించారట. రావణసంహారానంతరం- రాముడు విభీషణుడికి విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇచ్చి లంకకు చేరేవరకూ ఎక్కడా కిందపెట్టకూడదని చెబుతాడు. అది రాక్షసభూమికి చేరడం ఇష్టంలేని దేవతలు గణపతిని ప్రార్థిస్తారు. సంధ్యావందనం చేసుకునేందుకై విగ్రహాన్ని ఎక్కడుంచాలో వెతుకుతోన్న విభీషణుడికి అక్కడే తచ్చాడుతున్న బాలుడి రూపంలో ఉన్న గణేశుడు కనిపించగా- అతన్ని పిలిచి విగ్రహాన్ని ఇచ్చి తాను వచ్చేవరకూ పట్టుకునే ఉండమని చెబుతాడు. ఆ బాలుడు సరేనని చెప్పి, విభీషణుడు నీళ్లలో మునగగానే విగ్రహాన్ని కావేరీ నదీ తీరంలోని ఇసుకలో ప్రతిష్ఠిస్తాడు. అది చూసిన ఆ రాక్షస రాజు, కోపంతో ఆ బాలుణ్ణి పట్టుకునేందుకు వెంటపడగా- దగ్గరలోని రాతికొండమీదకి పరుగుదీశాడట. చివరకు విభీషణుడు ఆ బాలుణ్ణి పట్టుకుని నుదుటిమీద కొట్టాడట. అప్పుడు వినాయకుడు నిజరూపంలో సాక్షాత్కరించగా విభీషణుడు మన్నించమని కోరాడనీ, అందుకే ఆలయంలోని విగ్రహానికి నుదుటిమీద చిన్న మచ్చ కనిపిస్తుందనేది పురాణ కథనం. ఇక్కడి స్వామిని కొండకి దిగువనే ఉన్న మణి గణేశుడిని దర్శించుకునే వెళ్లాలి అంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..