ట్రాఫిక్కుకి చిక్కదు...ఈ-చిట్టి కారు!

నగరాల్లో ఆఫీసులకి వెళ్లే సమయంలో చూస్తే... దారులన్నీ కార్లతో నిండిపోతాయి. పెద్ద పెద్ద కార్లు, అందులో ఉండేది మాత్రం ఒకరిద్దరు. వాటి కారణంగా తక్కువ దూరం వెళ్లడానికీ ఎక్కువ సమయం పడుతుంది.

Updated : 26 Feb 2023 14:50 IST

ట్రాఫిక్కుకి చిక్కదు...ఈ-చిట్టి కారు!

నగరాల్లో ఆఫీసులకి వెళ్లే సమయంలో చూస్తే... దారులన్నీ కార్లతో నిండిపోతాయి. పెద్ద పెద్ద కార్లు, అందులో ఉండేది మాత్రం ఒకరిద్దరు. వాటి కారణంగా తక్కువ దూరం వెళ్లడానికీ ఎక్కువ సమయం పడుతుంది. ఇక ముంబయి నగరంలో అయితే... ట్రాఫిక్‌ అంటే చిన్నపాటి నరకమే. అందుకే దానికో పరిష్కారం చూపాలనుకున్నాడు కల్పిత్‌ పటేల్‌.  అందులోంచి పుట్టిందే ‘ఈజ్‌-ఈ’ కారు.

ఇంజినీరింగ్‌, ఆపైన ఎంబీఏ చేసిన కల్పిత్‌... సిటీ బ్యాంకులో పనిచేసేవాడు. ముంబయిలో అతడి ఇంటి నుంచి ఆఫీసుకు 10కి.మీ. ఆ మాత్రం దూరం వెళ్లడానికే గంట పట్టేది తనకు. మొదట్నుంచీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచనతో ఉండేవాడు కల్పిత్‌. నాలుగేళ్లు సిటీ బ్యాంకులో పనిచేశాక 2016లో బయటకు వచ్చి సొంత కంపెనీ పెట్టాలనుకున్నాడు. ‘అసలు ఆటోమొబైల్‌ రంగంలో అడుగుపెట్టాలనే అనుకోలేదు. ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలనుకున్నాకే ఇటువైపు వచ్చా. కొద్దిమందితో కూడిన ఇంజినీరింగ్‌, డిజైనింగ్‌ బృందంతో పని ప్రారంభించాం. దాదాపు రెండున్నరేళ్లపాటు ప్రయత్నించాక ఓ డిజైన్‌ తీసుకురావడంలో విజయవంతమయ్యాం. నిపుణులకూ, స్నేహితులకూ దాన్ని చూపించి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాకే పూర్తిస్థాయిలో అడుగుపెట్టాం’ అంటారు కల్పిత్‌. ఇద్దరు వ్యక్తుల ప్రయాణానికి సరిపోయే చిన్న కారు తేవాలనేది కల్పిత్‌ అసలు ఉద్దేశం. అదే సమయంలో ఆయన తండ్రి అయ్యాడు. కాలుష్యాన్ని అరికట్టకపోతే పిల్లలకు మెరుగైన భవిష్యత్తు లేదని భావించాడు. అందుకే తక్కువ విద్యుచ్ఛక్తి అవసరమయ్యే ఎలక్ట్రిక్‌ కారుని తేవాలని బలంగా అనుకున్నాడు. అలా నవంబరు 2018లో ‘పీఎమ్‌వీ’ ఎలక్ట్రిక్‌ సంస్థను ప్రారంభించాడు. ‘పర్సనల్‌ మొబిలిటీ వెహికల్‌’కి సంక్షిప్త రూపమే ఈ పీఎమ్‌వీ.

ఎన్నో ప్రత్యేకతలు...

ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేకొద్దీ వారు ఉపయోగించే కారు సైజు పెరిగిపోతుంది. అమెరికాలాంటి దేశాల్లో రోడ్లు విశాలంగా ఉంటాయి. కానీ మన దగ్గర పరిస్థితి అలా కాదు. రోడ్లు చాలా ఇరుకు. రోడ్డుపైకి వచ్చే కార్లూ ఎక్కువే. కాబట్టి కారుని వీలైనంత చిన్నగా రూపొందించాలనుకున్నాడు కల్పిత్‌. అంతేకాదు, 80-90 శాతం సందర్భాల్లో కారుని ఒకరిద్దరి కోసమే తీస్తారు. అది ఎంత పెద్దదైనా. అందుకే ఇద్దరికి సరిపోయేలా కారు సైజుని తగ్గిస్తూ అన్ని సౌకర్యాలూ ఉండేలా డిజైన్‌ చేయడానికి ఎంతో శ్రమించారు. ఈజ్‌-ఈ ప్రధానంగా నగర ప్రయాణానికి ఉద్దేశించింది. ఈ కారుని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 160కి.మీ. ప్రయాణించగలదు. పార్కింగ్‌ కోసం కూడా తక్కువ స్థలం సరిపోతుంది. ఈ కారులో కాలికి పనిలేదు. స్విచాన్‌ చేసి స్టీరింగ్‌ దగ్గర నుంచే ఆపరేట్‌ చేస్తూ నడిపేయొచ్చు. డిజైన్‌, ఇంజినీరింగ్‌ అన్నీ ఇండియాలోనే తయారయ్యాయి. సాధారణ సైజు కార్లకు కి.మీ. దూరానికి 100-120 వాట్‌లు ఖర్చయితే, ఈ క్వాడ్రిసైకిల్‌ 50-70 వాట్లు మాత్రమే వినియోగించుకుంటుంది. దీని వెడల్పు కేవలం 1.1మీటర్లే. దాంతో రోడ్డుపైన ట్రాఫిక్‌ను దాటుకుంటూ సులభంగా వెళ్లగలదు. డ్రైవర్‌ వెనక సీట్లో ప్రస్తుతానికి ఒక పెద్దవారు, ఒక చిన్నారి కూర్చొనేలా డిజైన్‌ చేశారు. వెనక ఇద్దరు పెద్దవాళ్లకి సరిపోయేలా డిజైన్‌ని మెరుగుపర్చడం గురించి పరిశోధనలు చేస్తున్నారు. కంపెనీ పుణె యూనిట్‌ నుంచి ఈ జులై నాటికి ఈ కారు రోడ్డు పైకి రానుంది. ఇప్పటికే ఏడు వేల కార్లకు ఆర్డర్లు వచ్చాయని చెబుతున్నారు కల్పిత్‌. వేర్వేరు సదుపాయాలతో మూడు భిన్న మోడల్స్‌ తేనున్నారు. వాటిలో ప్రాథమిక మోడల్‌ ధర రూ.4.79 లక్షలు.

అంకుర సంస్థలకు నిధులు అందించే రియాలిటీ షో ‘షార్క్‌ ట్యాంక్‌’కి గతేడాది వెళ్లిన కల్పిత్‌ ‘పీఎమ్‌వీ’లో ఒక్క శాతం వాటాకి రూ.కోటి కావాలన్నాడు. అక్కడ పెట్టుబడిదారులు కోటి పెడతాం రెండు శాతం ఇవ్వమంటే అంగీకరించకుండా వచ్చేశాడు. తన కంపెనీ భవిష్యత్తుమీద అంత నమ్మకం కల్పిత్‌కి. ఆ నమ్మకం నిజమైతే ట్రాఫిక్‌, కాలుష్యం... ఈ రెండు ప్రధాన సమస్యలకు చెక్‌ పెట్టినట్టే.


సౌర శక్తితో నడిచే కారు...

రువు, పరిమాణం దృష్ట్యా ఈజ్‌-ఈ... క్వాడ్రిసైకిల్‌ కేటగిరీలోకి వస్తుంది. ఈ కేటగిరీలోకే వస్తుంది ‘ఇవా’. దీన్లో డ్రైవర్‌ సీట్లో ఒకరు, వెనక సీట్లో ఒక పెద్ద వ్యక్తి, ఒక చిన్నారి కూర్చోవచ్చు. ఈ కారు పైకప్పు సౌర ఫలకంతో ఉంటుంది. దీంతో కారు 10-12కి.మీ. సౌర విద్యుత్‌తో నడిచే వీలుంటుంది. అంతకు మించి వెళ్లినప్పుడు దీన్లో ఉండే బ్యాటరీ సాయపడుతుంది. దీన్లో ఏకబిగిన 250 కి.మీ. వెళ్లొచ్చు. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానున్న ఈ కారు విలువ రూ.5లక్షలు. పుణె కేంద్రంగా పనిచేసే వేవ్‌ సంస్థ ఈ కారుని తెస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..