Updated : 29 May 2022 02:55 IST

ఈ అలవాట్లు... విజయానికి మెట్లు!

అర్థాంతరంగా చదువాపేసి వ్యాపారంలోకి దిగి కోటీశ్వరులు అవుతారు ఒకరు... గుమాస్తాగా ఉద్యోగంలో చేరి కంపెనీ సీఈఓ స్థాయికి ఎదుగుతారు ఇంకొకరు... తండ్రి ఇచ్చిన కుటుంబ వ్యాపారాన్ని అంతర్జాతీయ సంస్థగా అభివృద్ధి చేస్తారు మరొకరు... కార్యకర్తగా కెరీర్‌ మొదలెట్టి కేంద్రమంత్రో ముఖ్యమంత్రో అయిపోతారు ఇంకొకరు... ఏమిటీ వీళ్ల విజయ రహస్యం అంటే- వారి వారి అలవాట్లే... అంటున్నారు పరిశోధకులు. పలువురి విజయ గాథల్ని అధ్యయనం చేసి వారు రూపొందించిన మంచి అలవాట్ల జాబితా ఏ వృత్తిలో ఉన్నవారికైనా అనుసరణీయమే!

కొత్తగా చేరిన శిష్యుడికి ఒక ముఖ్యమైన పాఠం చెప్పాలనుకున్నాడు గురువు.
ఎదురుగా కనిపిస్తున్న ఒక చిన్న మొక్కని పీకి తీసుకురమ్మన్నాడు. రెండు వేళ్లతో అలవోకగా పీకి తెచ్చాడు శిష్యుడు.
‘ఇంకాస్త పెద్దది తే నాయనా’ అన్నాడు. తన మోకాలి ఎత్తున్న గుబురు మొక్కని ఒంటిచేత్తో పీక్కు వచ్చాడు శిష్యుడు.

‘ఇంకా పెద్దది...’ అన్నాడు గురువు. ఈసారి తనంత ఎత్తున్న ఓ చిన్న చెట్టుని కష్టపడి శక్తినంతా ఉపయోగించి పెకిలించాడు.
అప్పుడు దూరంగా ఉన్న చెట్టుని చూపించి ‘పీకి పట్టుకురా’ అన్నాడు గురువు. దాన్ని తేరిపారజూసిన శిష్యుడు ‘అది సాధ్యం కాదండీ’ అన్నాడు.
‘ఎందుకని’ అడిగాడు గురువు

‘అది చాలా పెద్ద చెట్టు. దాని వేళ్లు భూమిలో అన్నివైపులకూ లోతుగా పాతుకుపోయి ఉంటాయి, పెకిలించడం అసాధ్యం’ చెప్పాడు శిష్యుడు.
‘ఆ చెట్టు లాగే- కొందరు మనుషులు కూడా తాము ఎంచుకున్న మార్గానికి అవసరమైన లక్షణాలను ఎన్నో ఏళ్లు కష్టపడి అలవాట్లుగా మార్చుకుంటారు. అలా ఒక్కో అలవాటూ కలిసి బలమైన వ్యక్తిత్వంగా రూపొంది వారిని గెలుపు బాటలో ఒక్కో అడుగూ ముందుకు వేయిస్తుంది. విజేతలుగా నిలబెడుతుంది’ చెప్పాడు గురువు.

వివిధ రంగాల్లో విజేతలుగా నిలుస్తున్నవారి వ్యక్తిత్వాలను పలుకోణాల్లో అధ్యయనం చేసిన మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నదీ అదే. ముఖ్యంగా ఓ డజను అలవాట్లను అలవరచుకుంటే ఎవరైనా విజయం సాధించగలరని వారు హామీ ఇస్తున్నారు. విజేతలంటే గొప్ప వ్యాపారవేత్తలో, పెద్ద కంపెనీల సీఈఓలో మాత్రమే కాదు, కోరుకున్న రంగంలో పనిచేస్తూ సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తున్నవారూ విజేతలే. మరి ఆ అలవాట్లేమిటో చూద్దామా..!

పుస్తక పఠనం
గొప్పవారందరిలోనూ ప్రముఖంగా కన్పించే అలవాటు పుస్తక పఠనం. ఎంత ఎక్కువ చదివితే అంత గొప్ప విజయం సాధిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ చిన్నప్పుడు తమ ఊరి గ్రంథాలయం నుంచి ఒక పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకున్నారట. దాని పేరు ‘వన్‌ థౌజండ్‌ వేస్‌ టు మేక్‌ థౌజండ్‌ డాలర్స్‌’(వెయ్యి డాలర్లు సంపాదించడానికి వెయ్యి మార్గాలు). డబ్బు సంపాదనకి ఆ పుస్తకమే తనకి స్ఫూర్తినిచ్చిందనే ఆయన- రోజులో ఎక్కువ భాగం చదువుతూనే గడుపుతారట. ఆఫీసులో కూర్చుని బిజినెస్‌ మ్యాగజైన్లూ, కంపెనీల వార్షిక నివేదికలూ, వాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన వ్యవహారాలూ చదివి లోతుగా అధ్యయనం చేసేవారు కాబట్టే పెట్టుబడుల రంగంలో రారాజుగా పేరొందారాయన. ఇంటికొచ్చాక కూడా వార్తాపత్రికలూ పుస్తకాలూ చదువుతూనే ఉంటారట. ఒకసారి యూనివర్సిటీలో విద్యార్థులు ‘మీ విజయ రహస్యమేమిటీ’ అని అడిగితే చేతిలోని పుస్తకం చూపించి ‘రోజూ 500 పేజీలు చదవడం..’ అని చెప్పారు బఫెట్‌. ఆయనే కాదు, ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ... అందరూ చదువరులే. టెక్నాలజీకీ, తమ వ్యాపారాలకీ సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతారట. చదువు నైపుణ్యాలను పెంచుతుంది, సరికొత్త ఆలోచనలను ఇస్తుంది. అందుకే కొవిడ్‌ లాక్‌డౌన్ల సమయంలో ఎక్కువ సమయం పుస్తకాలు చదువుతూ గడిపానని చెబుతారు ముకేశ్‌.

గొప్ప కలలు
మెలకువగా ఉండి కలలు కను... ఆ కలల్ని నెరవేర్చుకోడానికి ఒంటి మీద స్పృహలేనంతగా పనిచేయి... అనేవారు ప్రముఖ సంఘసేవకులు బాబా ఆమ్టే.

విజేతలందరిదీ అదే దారి. గౌతమ్‌ అదానీ స్కూల్లో ఉండగా ఒకసారి కాండ్లా రేవును చూశారట. దేశ అభివృద్ధికి రేవుల ప్రాధాన్యం ఎంత ఉందో ఉపాధ్యాయులు చెప్పగా విన్న ఆయన ఎప్పటికైనా అలాంటిదో అంతకన్నా పెద్దదో ఒక రేవును నిర్మించాలని కలలు కన్నారు. హైస్కూల్‌ చదువు కూడా పూర్తిచేయకుండానే బడి మానేసి బయటకువచ్చిన అదానీ రకరకాల వ్యాపారాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు దేశంలోని పదికి పైగా ఓడరేవుల నిర్వహణ అదానీ సంస్థ ఆధ్వర్యంలోనే ఉంది. పెద్ద పెద్ద కలలు కనడం విజేతల ప్రయాణానికి మొదటి మెట్టు అవుతోంది. ఆ కలల గురించి వారు నిస్సంకోచంగా ఇతరులకు చెబుతారు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందిట... అని సమాజం నవ్వినా పట్టించుకోరు. తమ కలల్ని నిజం చేసుకోవడంలో బిజీగా ఉంటారు కాబట్టే వారు విజేతలు అవుతారంటున్నారు పరిశోధకులు.

లక్ష్యం స్పష్టం
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని సామెత. విజేతల లక్ష్యాలూ అంత ఉన్నతంగానూ స్పష్టంగానూ ఉంటాయి. ఆ లక్ష్యం దిశగా ప్రయాణానికి అవకాశాల్ని వాళ్లే సృష్టించుకుంటారు. ఐదేళ్లలో ఎవరెస్ట్‌ ఎక్కాలని లక్ష్యం పెట్టుకుంటే- నాలుగున్నరేళ్లు ఖాళీగా కూర్చోరు. ఆ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీసుకుంటారు. ముందు  ట్రెకింగ్‌ ఓనమాలు నేర్చుకోవాలి, అందుకు తగినట్లుగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, పర్వతారోహణలో శిక్షణ పొందాలి... ఇలా విడదీసుకుని ఏరోజు చేయాల్సింది ఆరోజు చేయడం మొదలెడతారు కాబట్టే లక్ష్యసాధనలో విజయులవుతున్నారు. అంతేకాదు, గొప్పవాళ్లు ప్రాముఖ్యం లేని పనులకోసం సమయాన్ని వృథా చేయరు. పెట్టుబడికి తగిన ప్రతిఫలం(ఆర్‌ఓఐ- రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) ఉన్న విలువైన పనుల్ని ఎంచుకుని చేస్తారు. వాయిదా అన్నమాట వారి నిఘంటువులో ఉండదు. గోటితో పోయేదానికి గొడ్డలి అవసరపడేదాకా ఆగకూడదన్నది విజేతలు రాసిపెట్టుకునే రూలు. అలాగే నిన్న జరిగిన నష్టాన్ని తలచుకుంటూ ఇవాళ్టిని వృథా చేయరు.  కొత్తదారిలో వెళ్లడానికి సందేహించరు.

ఇతరులతో పోల్చుకోరు, తమదైన పంథా ఏర్పర్చుకుంటారు. ఎంత స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉన్నా, విజేతలు ఒక పుస్తకం పెట్టుకుని చేతిరాతతో రోజువారీ చేయాల్సిన పనుల జాబితా రాసుకోవడాన్నే ఇష్టపడుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలా
రాసుకుంటే బాగా గుర్తుంటాయనీ చేసిన ఒక్కో పనీ టిక్‌ పెట్టుకుని, దాని ఫలితాన్ని పక్కన రాసుకున్నప్పుడు ఎంతో తృప్తిగా ఉంటుందనీ, చేయాల్సినవాటికి ప్రేరణ లభిస్తుందనీ చెబుతారట.

అనుబంధాలకు విలువ
విజేతలందరూ అనుబంధాలను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. తమ కింది ఉద్యోగస్తులకే కాదు, చుట్టూ ఉన్నవారికీ ప్రేరణనిస్తారు. ఒకసారి ఒక స్కూల్లో కార్యక్రమానికి వెళ్లారట రతన్‌ టాటా. పిల్లలు ఆయన్ని దగ్గరగా చూడాలని తోసుకుంటుంటే ప్రిన్సిపాల్‌ వారిని కోప్పడి టాటాని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారట. అప్పుడు రతన్‌ టాటా ‘నేను మళ్లీ వస్తాను’ అని పిల్లలకు సైగచేసి చెప్పారట. కార్యక్రమం అయిపోగానే పిల్లల్ని వెతుక్కుంటూ వారి మధ్యలోకి వెళ్లిపోయి అందరితోనూ కరచాలనం చేసి ‘వస్తానని చెప్పానుగా, వచ్చాను’ అన్నారట. అంత పెద్దాయన అలా మాట నిలబెట్టుకోవడం- పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే చక్కటి ఉదాహరణ- అంటారు నిపుణులు. అంతేకాదు, ముంబయి దాడుల సమయంలో బాధితులైన తమ ఉద్యోగులు 80 మంది ఇళ్లకూ స్వయంగా వెళ్లి ధైర్యం చెప్పారు రతన్‌ టాటా. కరోనా టైమ్‌లోనూ- పుణెలో ఒక మాజీ ఉద్యోగి అనారోగ్యంతో బాధపడుతోంటే వాళ్లింటికి వెళ్లి పరామర్శించారు.

విజేతలు ఎప్పుడూ అంతే- ఎంత ఎదిగినా ఒదిగి ఉండి ఎదుటివారి మనసు దోచుకోవడం ద్వారా తమ చుట్టూ శక్తిమంతమైన నెట్‌వర్క్‌ని అభివృద్ధి పరచుకుంటారు. ఉద్యోగులను పేరు పెట్టి పలకరించడమూ, వారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను గుర్తుంచుకుని అభినందించడమూ... చాలామంది సీఈఓలను ఉద్యోగులకు చేరువ చేస్తుందట. సంస్థతో అనుబంధాన్నీ విశ్వాసాన్నీ పెంచుతుందట.

ఎనిమిదిగంటల నిద్ర
బాగా చదువుకోవాలీ, పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలీ, గొప్ప వ్యాపారం చేయాలీ... లాంటి కలలు మీకున్నాయా? అయితే కంటినిండా నిద్రపోండి. అప్పుడే ఆ కలల్ని నిజం చేసుకోగలిగే శక్తి మీకు వస్తుంది... అంటున్నారు పరిశోధకులు. కంటినిండా నిద్ర పోగలగడం వరమే కాదు, విజయానికి సోపానం కూడానట. ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే తాను పనిచేయలేనంటాడు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌. ఏ సమయానికి పడుకున్నా ఎనిమిది గంటలు పూర్తయ్యాకే లేస్తానంటాడు ఫేస్‌బుక్‌
అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌. ఎనిమిది గంటల నిద్ర- జీవితంలోని అన్ని ముఖ్యమైన అంశాలనూ సరిచేస్తుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతుంది. మెదడు ఏకాగ్రతతో ఆలోచించి, స్థిరంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. గొప్ప వ్యక్తులంతా రాత్రింబగళ్లు కష్టపడతారనీ, చాలా తక్కువ సమయం నిద్రపోతారన్నది ఒక అపోహే. నిజానికి వారంతా పదీ, పదిన్నరకల్లా పడుకుంటారు, పొద్దున్నే లేస్తారు. నిద్రకు ముందు ఆరోజు చేసిన పనుల గురించి సమీక్షించుకుంటారు. చాలామంది మర్నాడు చేయాల్సిన పనుల జాబితాని కూడా సిద్ధంచేసుకున్నాకే ప్రశాంతంగా నిద్రపోతారట.

సక్సెస్‌ రొటీన్‌
రోజూ పొద్దున్నే నిద్ర లేవడం, అన్ని పనులూ సమయానికి చేయడం, రాత్రి త్వరగా నిద్రపోవడం... లాంటి రొటీన్‌ విసుగ్గా ఉంటుందనుకునేవాళ్లూ, తమ బిజీ షెడ్యూల్లో అలా అన్నీ టైమ్‌ ప్రకారం చేయడం కుదరదనేవాళ్లూ చాలామందే ఉంటారు. ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో చదివితేనో, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసి అనుభవం గడిస్తేనో గొప్ప వ్యాపారవేత్త కావచ్చనుకుంటారు మరికొందరు. నిజానికి అవేవీ విజయానికి కొలమానం కావు. ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకోవడానికి అలవాటు పడ్డవారు మాత్రమే ఏదైనా సాధించగలరట. దాన్నే ‘సక్సెస్‌ రొటీన్‌’ అంటున్నారు నిపుణులు. దానివల్ల సమయం పూర్తిగా వారి చేతుల్లో ఉంటుంది. తమకు తెలియకుండా ఒక్క క్షణాన్ని కూడా వృథాగా పోనివ్వరు. అందుకే వారి రోజువారీ టైమ్‌ టేబుల్‌ పక్కాగా ఉంటుంది. దాన్ని అంతే పక్కాగా అనుసరిస్తారు. పొద్దున్నే లేవగానే కాసేపు ధ్యానం, ఆ తర్వాత సూర్యనమస్కారాలూ చేయనిదే తన రోజు మొదలవదంటారు మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్ర. తనకోసం తాను కేటాయించుకున్న ఆ సమయంలోనే ఆరోజు చేయబోయే పనుల గురించి ప్రశాంతంగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానంటారు మహీంద్ర. నిజానికి మంచి అలవాట్లు చేసుకుని వాటిని ఆచరించడం చాలా కష్టమైన పని. అదే వీరి మొదటి విజయం- అంటున్నారు నిపుణులు.

సంపద నిర్వహణ
డబ్బు ఊరికే రాదని అందరికీ తెలిసినా దాన్ని సరిగ్గా నిర్వహించడంలో ఉన్న తేడానే కొందరిని సాధారణ వ్యక్తులుగా ఉంచితే కొందరిని గొప్పవాళ్లను చేస్తోందంటారు పరిశోధకులు. విజేతలెవరూ గాల్లో మేడలు కట్టరు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రూపాయీ దేనికి ఖర్చవుతోందో తెలుసుకుంటారు. వాళ్ల నెలవారీ, వార్షిక బడ్జెట్లు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. డబ్బుతో వస్తువులు కొని ఆస్తులు ఏర్పరచుకోవడం కన్నా పెట్టుబడిగా పెట్టి అనుభవాలను సంపాదించడానికి ప్రాధాన్యమిస్తారు. డబ్బును వస్తువులమీద కన్నా మానవ వనరుల మీద పెట్టుబడిగా పెడితే అటు సంస్థలకీ ఇటు సమాజానికీ కూడా ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని ఫార్చ్యూన్‌ 500 జాబితాలో చోటుపొందిన పలు కంపెనీల యజమానులు అనుభవంతో చెబుతున్నారు.

వ్యాయామం

ఏ రంగంలోనైనా విజేతలుగా నిలిచినవాళ్లను ఒకసారి చూడండి. అందరిలోనూ ప్రస్ఫుటంగా కన్పించే ఏకైక లక్షణం- ఫిట్‌నెస్‌. క్రీడాకారులూ సినిమాతారలకైతే తప్పదు కానీ వ్యాపారం, రాజకీయం... ఇలా ఎందులో రాణిస్తున్నవారిని చూసినా దాదాపు అందరూ ఫిట్‌గానే కన్పిస్తారు. వాళ్ల దృష్టిలో ఫిట్‌నెస్‌ అంటే కేవలం ఆకృతి కాదు, ఆరోగ్యకరమైన శరీరం. బాడీ ఫిట్‌గా ఉంటేనే మనసు ఫిట్‌గా ఉంటుందని నమ్ముతారు. అందుకే ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు. తప్పనిసరిగా ఏదో ఒక ఫిట్‌నెస్‌ రొటీన్‌ని అనుసరిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ డెబ్భైకి చేరువవుతున్నారు. ఇటీవల ఆయన జిమ్‌లో బరువులు ఎత్తే వ్యాయామం చేస్తున్న వీడియో వైరల్‌ అయింది. ప్రధాని మోదీ క్రమం తప్పకుండా యోగా చేస్తారు. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు యోగాతో పాటు రోజూ పది నిమిషాలు స్కిపింగ్‌ చేస్తానని చెబుతూ వీడియోనీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఎంపీ సుప్రియా సూలె అవకాశం దొరికినప్పుడల్లా సైక్లింగ్‌కి వెళ్తారు. ఒడిశా సీఎం 75 ఏళ్ల నవీన్‌ పట్నాయక్‌కీ సైక్లింగ్‌తో పాటు జిమ్‌లో డంబెల్స్‌ ఎత్తడం ఇష్టమైన వ్యాయామాలట. వ్యాయామం మెదడుని చురుగ్గా ఉంచుతుందనీ మంచి ఆలోచనలు వస్తాయనీ అందుకే విజేతలు తమ దినచర్యలో దానికి విలువ ఇస్తారనీ నిపుణుల అభిప్రాయం.

విశ్రాంతి
ఎప్పుడూ పని ఎవరికైనా విసుగే. రోజులో కాసేపు, వారంలో ఒక రోజు, ఏడాదిలో పది రోజులు... రోజువారీ పనులకు దూరంగా శారీరకంగా మానసికంగా రిలాక్స్‌ అవడానికి కేటాయించడం... విజేతల షెడ్యూల్‌లో తప్పనిసరి అంశం. ముకేశ్‌ అంబానీ ఆదివారాలను పూర్తిగా కుటుంబ సభ్యులకే అంకితం చేస్తారు. కుమార మంగళం బిర్లా ఐపీఎల్‌లో, సినిమా వేడుకల్లో... ఎక్కడ చూసినా కుటుంబ సభ్యులందరితో కలిసి కన్పిస్తారు. సాయంత్రం ఒక గంట స్నేహితులతో గడపడం, ఇంట్లో పిల్లలతో, పెంపుడు జంతువులతో ఆడుకోవడం- లాంటి పనులతో చాలామంది రోజువారీ అలసటను మరుస్తారట. అప్పుడప్పుడు పార్టీలూ, ఏడాదికోసారన్నా విహారయాత్రలకెళ్లడం- ఒత్తిళ్లనుంచి రిలాక్సయ్యేలా చేస్తాయన్నదే అందరి మాటా.

వైఫల్యం
విజేతలెవరూ వైఫల్యాలకు భయపడరు, దాన్ని మరింత సమర్థంగా మరింత జాగ్రత్తగా ముందడుగు వేయడానికి అవకాశంగా మార్చుకుంటారు. ఒక పొరపాటు... క్షమాపణలు చెప్పుకోవలసిరావడం... అప్రమత్తతను పెంచుతుందని భావిస్తారు. కాకపోతే ఆ నిర్ణయం తాలూకు పర్యవసానం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా త్వరగా స్పందిస్తారు. ఒకసారి ఒక ఐడియా ఏదైనా ఫెయిలైతే భయపడి మరోసారి ఐడియా ఇవ్వరేమోనని భావించిన టాటా గ్రూపు- ఉద్యోగుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ‘బెస్ట్‌ ఫెయిల్డ్‌ ఐడియా’ అవార్డు ఇస్తోంది. ‘ఫెయిల్యూర్‌ అనేది బంగారు గనిలాంటిది’ అంటారు రతన్‌ టాటా. తవ్వగా తవ్వగా బంగారం దొరుకుతుందన్నది ఆయన ఉద్దేశం. ‘ఎత్తుపల్లాలూ ఆటుపోట్లూ లేని రొటీన్‌ జీవితం విసుగ్గా ఉంటుంది. అందుకే ప్రయోగాలు చేయండి. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా పర్వాలేదు, సరిదిద్దుకుంటూ ముందుకువెళదాం...’ అని ఆయన వారిని ప్రోత్సహిస్తుంటారు.

ప్రోగ్రెస్‌ కార్డ్‌
స్వీయ ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడమూ విజయానికి అవసరమే. లక్ష్యం ఏదైనా ప్రతి రోజునీ దానికి దగ్గర చేసే మెట్టుగా పరిగణిస్తారు. అందుకే నిన్నటికన్నా నేడు, నేటికన్నా రేపు... మరింత మెరుగ్గా, మరింత ఉపయోగకరంగా, మరింత చెప్పుకోదగ్గ మార్పు సాధించేట్టుగా మలచుకుంటారు. నిస్సంకోచంగా తమ ప్రోగ్రెస్‌ రిపోర్టుని రాసుకుంటారు. రోజూ రాసుకునే ‘టు డు లిస్ట్‌’ అందుకు ఉపయోగపడుతుంది. పనితీరులో రోజుకు ఒక్క శాతం అయినా మెరుగవ్వాలన్నది వాళ్లు పెట్టుకునే నియమం. ఒక్కసారే పెద్ద మార్పుకు ఆశపడరు, చిన్న చిన్నగా వరస విజయాలను కలుపుకుంటూపోతేనే పెద్ద విజయం సొంతమవుతుందని నమ్ముతారు. ఎప్పుడూ ఖాళీగా ఉండరు, ఏదో ఒక కొత్త పని నేర్చుకుంటూనే ఉంటారు. సంతోషంగా, సానుకూల
ధోరణితో ముందుకు సాగుతారు.

సమయానికి ప్రాధాన్యం
సమయానికి విలువ ఇవ్వని వాళ్లు ఎప్పటికీ విజేతలు కాలేరట. తమ సమయానికే కాదు, తమ చుట్టూ ఉన్న వారందరి సమయాన్నీ విలువైనదిగా పరిగణించేవారే విజయం సాధిస్తారు. అన్ని విషయాల్లో అప్‌టుడేట్‌గా ఉంటారు అలా అని అనవసర చర్చలతో సమయాన్ని వృథా చేయరు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తుకి ప్రణాళికలు వేసుకోవడానికి వర్తమానాన్ని పూర్తిగా వినియోగించుకోవడం మీదే దృష్టిపెడతారు. అందుకు... హడావుడిగా పరుగులు పెట్టరు, పద్ధతిగా ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తారు. రాత్రయ్యేసరికి- అబ్బో చాలా పనిచేసేశానన్న నీరసం కాదు, మంచి పని పూర్తిచేశానన్న సంతృప్తి ముఖ్యం. ఉపయోగం లేని పనుల మీదికి ధ్యాస మళ్లనివ్వరు. మెయిల్‌ చూసుకోవడానికీ ఫోన్లు మాట్లాడడానికీ నిర్ణీతమైన సమయం పెట్టుకుంటారు. ఇలాంటి చిన్నచిన్న సర్దుబాట్లే ఎంతో ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.

****

విజయం ఎవరినీ వెతుక్కుంటూ రాదు, కష్టపడి దానికి దారి వేసుకోవాలి...
క్రమశిక్షణతో ముందుకెళ్లాలి...
అందుకు కావలసిన అర్హతలే... ఈ అలవాట్లు- అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. మరి ఆలస్యమెందుకూ..? ప్రయత్నిస్తే పోలా..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని