Updated : 14 Aug 2022 10:54 IST

అమృతోత్సవాలకి... మూడురంగులతో ముచ్చటగా...

వినాయకచవితి, దీపావళి; బక్రీద్‌, రంజాన్‌, క్రిస్‌మస్‌; గురుపూర్ణిమ... ఇలా మనదేశంలో ఎన్నో పండుగలు... మరెన్నో వేడుకలు... అయితే ఇవన్నీ ఆయా మతాలకి మాత్రమే ప్రత్యేకం. కానీ... జాతి మొత్తం ఆనందోత్సాహాలతో కలసిమెలసి చేసుకునే పండుగే... స్వాతంత్య్ర దినోత్సవం. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా- ఇంటింటా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడంతోపాటు, ఆ జెండాలోని మువ్వన్నెల్ని దుస్తులూ యాక్సెసరీలూ ఇంటీరియర్‌లోనూ అలంకరించుకుంటూ తమలోని దేశభక్తినీ జాతి సమైక్యతనీ చాటుతున్నారు నేటితరం భారతీయులు.

ఇరవై ముప్ఫై సంవత్సరాల క్రితం...

ఆగస్టు పదిహేను వస్తోందంటే... పిల్లలందరికీ ఓ పెద్ద పండుగే. ఆ రోజు చిన్న చిన్న జెండాలు షర్టు లేదా ఫ్రాక్‌ జేబుకి తగిలించుకుని స్కూల్లో జెండా వందనం చేసి, పాటలు పాడుకుని, టీచర్లు పంచిన చాక్లెట్లు తిని ఆనందంగా ఇంటికి చేరుకునేవారు.

నేటి డిజిటల్‌ యుగంలోనూ... స్వాతంత్య్ర దినోత్సవం ఓ పెద్ద వేడుకే. అయితే అప్పట్లోలా అది కేవలం స్కూలుకో ప్రభుత్వాఫీసుల్లో జెండా వందనానికో పరిమితం కావడం లేదు.

‘విజయీ విశ్వ తిరంగా ప్యారా, ఝండా ఊంచా రహే హమారా’ అంటూ సగర్వంగా జెండాను ఎగరేయడంతోపాటు అందులోని త్రివర్ణాల్ని వినూత్న డిజైన్లలో ధరిస్తూ జాతీయపండుగని తమదైన శైలిలో సంబరంగా జరుపుకుంటున్నారు.

ఆ రంగులే ఎందుకూ?

ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కినా అంగారకుడిమీద అడుగుపెట్టినా ఆర్కిటిక్‌లో విహరించినా... ఇలా మనిషి ఎక్కడికి వెళ్లినా ముందుగా ఎగరవేసేది జాతీయ పతాకాన్నే. ఎందుకంటే అది అతని స్వేచ్ఛనీ, అస్థిత్వాన్నీ, జాతి ఔన్నత్యాన్నీ, దేశ ప్రతిష్ఠనీ చాటే స్వాభిమాన గీతిక... అందుకే మనదైన ఆ మువ్వన్నెలనే ఫ్యాషన్‌ కలర్స్‌గా మార్చుకుంటోంది నేటి తరం.

అంతేకాదు, ఆ రంగుల్లో ఓ అందం ఉంది. ఆకర్షణ ఉంది. అంతకుమించి ఓ జాతి ఐకమత్యమూ దాగి ఉంది. మొత్తంగా భారతీయుల ఆశల్నీ ఆశయాల్నీ ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలవి. జాతీయ పతాకంలో పైన ఉండే కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగనిరతినీ ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే, మధ్యలోని తెలుపు స్వచ్ఛతకీ శాంతికీ సంకేతంగా నిలుస్తుంది. కిందిభాగంలోని ఆకుపచ్చ రంగు పాడిపంటల్నీ సంపదనీ సూచిస్తూ నేలతో మనకున్న అనుబంధాన్ని చాటుతుంది. ఇక, మధ్యలో ఉన్న అశోకుడి ధర్మచక్రంలోని నీలిరంగు నిజాయతీకీ ధర్మానికీ ప్రతీకగా నిలుస్తుంది. అంతటి గొప్పతనాన్ని నింపుకున్న ఆ రంగుల కలబోత జాతీయ పతాకంగా ఆవిర్భవించడానికి కనీసం నాలుగు దశాబ్దాలకు పైనే పట్టింది. ఎందుకంటే- జాతీయోద్యమం బలోపేతం కావడానికి ఎన్నో పతాకాలు రూపుదిద్దుకున్నాయి. ఆ క్రమంలో గాంధీజీ సూచనల మేరకు పింగళి వెంకయ్య రూపొందించిన ఎరుపూ తెలుపూ ఆకుపచ్చ రంగులున్న పతాకం జాతీయ కాంగ్రెస్‌ జెండాగా ఎగిరింది. అయితే ఆ రంగులు మత విశ్వాసాల్ని ప్రతిబింబిస్తున్నాయన్న వాదనలు తలెత్తడంతో ఫ్లాగ్‌ కమిటీ సూచనల మేరకు మతాల్ని విస్మరిస్తూ- నేటి మువ్వన్నెల జాతీయ పతాకం రూపుదిద్దుకుంది. అంటే- జెండాలోని ఈ రంగుల వెనక ఒక జాతి చేసిన పోరాటం దాగుంది. అందుకే ఆ జెండా రంగులు అంటే మాకెంతో ఇష్టంతో కూడిన గౌరవం అంటున్నారు ఈతరం ఫ్యాషనిస్టులు.

అయితే జాతీయ జెండాని దుస్తుల రూపంలో ధరించకూడదు. కావాలని నేలమీద వేయకూడదు, వాహనాలమీద కప్పకూడదు... ఇలా చాలానే నిబంధనలు ఉన్నాయి. అందుకే పతాక గౌరవానికి ఎలాంటి విఘాతం కలిగించకుండా ఆ జెండా రంగుల్నే ఫ్యాషన్‌ డిజైన్లుగా మార్చుకుంటున్నారు. తమ డ్రెస్సుల్లో యాక్సెసరీల్లో నగల్లో వస్తువుల్లో అంతటా ఆ మువ్వన్నెల్ని నింపుకుని తమదైన పంథాలో దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. దాంతో అనేక కంపెనీలు తాము ఉత్పత్తి చేసే వస్తువులకు ఆ రంగుల్ని జోడిస్తూ మేము సైతం అంటున్నాయి.


 

అంతటా మువ్వన్నెల సోయగాలే!

ఈ జెండాలోని రంగుల విన్యాసం ప్రజల్లోకి రావడానికి కలర్‌ టీవీనే కారణం అని చెప్పాలి. ముఖ్యంగా 1983 నాటి ప్రపంచ కప్‌ విజయంతో అభిమానులంతా జెండా రంగుల్ని ధరించి క్రికెటర్లకు నీరాజనం పట్టారు. ఆ తరవాత 1988 నాటి స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా- మనమంతా ఒక్కటే అన్న భావన పెంచేందుకు- లోక్‌ సేవా సంచార్‌ పరిషత్‌ చిత్రీకరించిన ‘మిలే సుర్‌ మేరా తుమ్హారా...’ అన్న పాటకోసం పిల్లలంతా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో జెండా రూపంలోకి మారడం... ఆనాటి దూరదర్శన్‌ ప్రేక్షకులకి ఈనాటికీ జ్ఞాపకమే. తరవాత సచిన్‌ తెందూల్కర్‌ జెండా ఎంబ్లమ్‌ ఉన్న హెల్మెట్‌ ధరించడంతో- జాతీయ పతాకంలోని మువ్వన్నెలు క్రికెట్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలోకీ అడుగుపెట్టాయి. దాంతో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో జెండా ముద్రలూ రంగులూ ఉన్న దుస్తుల్నీ యాక్సెసరీల్నీ ధరించడం యువతరానికి ఓ ఫ్యాషన్‌గా మారింది.

అప్పటివరకూ జాతీయ పర్వదినాలకు తెల్లని ఖాదీ లేదా చేనేత దుస్తుల్ని మాత్రమే ధరించేవారు. ఇప్పుడు వాటిల్లోనే మూడు రంగుల్నీ జోడిస్తున్నారు. కొందరు డిజైనర్లు అమృతోత్సవాలకోసం ఆ రంగుల్ని స్ప్రే చేస్తూ ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారు. అంతేకాదు, అచ్చంగా ఆ మూడు రంగుల్లో ఉన్నవి మార్కెట్లో దొరకకపోతే ఎవరికి వాళ్లు తామే స్వయంగా డిజైన్‌ చేసుకుని మరీ వేసుకుంటున్నారు. అమ్మాయిలైతే ఎక్కువగా చున్నీల్నీ చీరల్నీ ఆ మూడు రంగుల్లో డై చేయించుకుంటున్నారు. అబ్బాయిలు టీషర్టులమీద ఆ రంగుల్ని పెయింటు చేసుకోవడమూ లేదంటే ప్రింట్‌ చేయించుకోవడం చేస్తున్నారు. చేనేతలతోపాటు టై అండ్‌ డై... వంటి ప్రింట్లలో కూడా ఈ మువ్వన్నెలే రాజ్యమేలుతున్నాయి. పిల్లల దుస్తుల్లోనూ మువ్వన్నెలే మురిపిస్తున్నాయి. పూసలూ దారాలతో అల్లిన ఫంకీ జ్యుయెలరీకి కూడా ఈ మూడు రంగుల్ని అద్దేస్తున్నారు. ఫ్రెడరిక్‌ కాన్‌స్టెంట్‌... లాంటి బ్రాండెడ్‌ కంపెనీలు సైతం త్రివర్ణ స్ట్రాప్‌లతో వాచీలను తీసుకొచ్చాయి. కొందరైతే ఆ రంగుల్ని ఒంటిమీదా వేయించుకుంటున్నారు. పైగా అమృతోత్సవ సంవత్సర సందర్భంగా- ఇంటింటా జెండా ఎగరేయాలన్న ప్రధాని సూచన మేరకు దాని రూపకల్పనకు సంబంధించి నియమావళిని సైతం ఒకింత సడలించారు. దాంతో మరింత స్వేచ్ఛగా జెండా బొమ్మల్ని ఇంట్లో వాడుకునే వస్తువులమీదా ముద్రించేస్తున్నారు. దేశభక్తి పాళ్లు మరికాస్త ఎక్కువగా ఉన్నవాళ్లు  ఇంట్లోని గోడలమీద జెండా రంగుల కళాఖండాల్ని అలంకరిస్తున్నారు. సోఫాల్లోని కుషన్లూ జాతీయస్ఫూర్తిని మేల్కొలిపేలా ఉంటున్నాయి.

అంతేనా... స్వీట్ల షాపులూ రెస్టరెంట్లలో తినే ఆహార పదార్థాలు సైతం ఆ రంగుల్లోనే నోరూరిస్తున్నాయి. ఊతప్పం, ఇడ్లీ, దోశ, రవ్వ కేసరి, పిజ్జా, మాక్‌టెయిల్‌, బిర్యానీ, బర్ఫీ... ఇలా అదీఇదీ అని లేకుండా అన్నిరకాల వంటల్నీ ఆయా రంగుల్లో వండేస్తున్నారు. మొత్తమ్మీద ఈ అమృతోత్సవ వేళ... ఆన్‌లైన్‌లో చూసినా... ఆఫ్‌లైన్‌కి వెళ్లినా... మువ్వన్నెల సోయగాల ముచ్చట్లే..!

​​​​​


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని