‘కృతజ్ఞతలు’ చెబుతున్నారా?

భార్య ఎంత సేవ చేసినా, ఎన్ని రకాలు వండి పెట్టినా భర్త నోట్లో నుంచి ‘థాంక్యూ’ అన్న పదం పొరబాటున కూడా రాదు.

Published : 27 Nov 2022 01:06 IST

‘కృతజ్ఞతలు’ చెబుతున్నారా?

భార్య ఎంత సేవ చేసినా, ఎన్ని రకాలు వండి పెట్టినా భర్త నోట్లో నుంచి ‘థాంక్యూ’ అన్న పదం పొరబాటున కూడా రాదు. అలాగే భార్యల్ని సంతోషపెట్టేందుకు భర్తలు ఎన్ని రకాల బహుమతులు తీసుకొచ్చినా చాలామంది భార్యలు థాంక్స్‌ అన్న మాటైనా అనకపోగా ‘అది బాగోలేదు ఇది బాగోలేదు’ అంటూ సవాలక్ష వంకలు పెడుతుంటారు. అదే బయటివాళ్లు చిన్న మాట సాయం చేసినా... ‘మెనీ మెనీ థాంక్స్‌’ అంటూ వాళ్లని తెగ పొగిడేస్తుంటారు. సొంతవాళ్లకి కూడా థాంక్స్‌ చెప్పాలా అన్న భావనే ఇందుకు కారణం కావచ్చు. కానీ ఎంత భార్యాభర్తలైనా ఒకరికొకరు ‘కృతజ్ఞతలు’ లేదా ఆయా సందర్భాన్ని బట్టి ‘క్షమాపణలు’ చెప్పుకోవడం వల్ల వాళ్ల మధ్య అనుబంధం మరింత పదిలంగా అల్లుకుంటుంది అంటున్నారు ఇలినాయ్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. పైగా ఇద్దరిమధ్యా ఈ రకమైన బంధం ఉండటం వల్ల ఎప్పుడైనా వాదోపవాదనలు జరిగినా అవి మనసుని మరీ బాధించకుండా ఉంటాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా ఒకరినొకరు నిందించుకోకుండా చక్కటి అవగాహనతో కలిసి బతికేందుకు కారణమవుతాయి అంటున్నారు. ఈ విషయమై వీళ్లు సుమారు మూడు వందల జంటల్ని ఎంపికచేసి, రెండేళ్లపాటు గమనించారట. ఏ విషయాన్నైనా ఇద్దరూ సామరస్యంగా చర్చించుకుంటూ అవసరమైనప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవించే జంటలు- కాపురంలో ఎదురయ్యే ఒడుదొడుకుల్ని తట్టుకోవడమే కాదు, తమ బంధం పట్ల ఎక్కువ సంతృప్తిగా ఉన్నట్లు గుర్తించారు. మంచి విషయమే కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..