ఫ్యాషన్‌ మేళా!

రాబోయే పండుగకైనా, వెళ్లబోయే పార్టీకైనా ప్రత్యేకంగా రెడీ అవ్వాలా... అయితే మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్తరకం ఫ్యాషన్లపైన ఓ లుక్కేయండి. లెహంగా... కోట్‌తో వచ్చింది, బ్లౌజు... లాంగ్‌ స్లీవ్స్‌ ఎంబ్రాయిడరీతో మెరిసిపోతోంది, డ్రెస్సు... చీరగా మారింది.

Published : 25 Feb 2023 23:26 IST

ఫ్యాషన్‌ మేళా!

రాబోయే పండుగకైనా, వెళ్లబోయే పార్టీకైనా ప్రత్యేకంగా రెడీ అవ్వాలా... అయితే మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్తరకం ఫ్యాషన్లపైన ఓ లుక్కేయండి. లెహంగా... కోట్‌తో వచ్చింది, బ్లౌజు... లాంగ్‌ స్లీవ్స్‌ ఎంబ్రాయిడరీతో మెరిసిపోతోంది, డ్రెస్సు... చీరగా మారింది.


కోట్‌ లెహంగా బాగుందా!

ఏ ఫ్యాషన్‌ అయినా సరే, కాలానికి తగ్గట్టు మారితేనే కదా... అది మార్కెట్లో నిలబడుతుంది. ప్రతి ఒక్కరికీ చేరువవుతుంది. అది తెలిసిన డిజైనర్లు కూడా ఎప్పటికప్పుడు ఎన్నెన్నో ట్రెండ్స్‌ తీసుకొస్తుంటారు. ఆ ఆలోచనల్లో భాగంగానే సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిల్ని ఎంతగానో మెప్పించిన లంగాఓణీకి... కాస్త నయా లుక్కు తెప్పిస్తూ ఇదివరకు క్రాప్‌ టాప్‌ను తెచ్చారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేస్తూ దాన్నే కోట్‌ లెహంగాలా రూపొందించేశారు. బ్లౌజూ, లెహంగా ఉంటూనే వాటి మీద... పై నుంచి కింద వరకూ పొడవైన కోట్‌ కూడా వస్తుంది. క్రేప్‌, జార్జెట్‌, నెట్‌, టస్సర్‌... ఇలా అన్ని రకాల వస్త్రాల్లో దొరుకుతున్న ఈ కోట్‌ లెహంగాలు- అదిరిపోయే రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. కావాలంటే రెడీమేడ్‌గానూ కొనుక్కోవచ్చు, లేదంటే ఎవరికివారు మెచ్చిన రంగుల కాంబినేషన్లతో సొంతంగానూ డిజైన్‌ చేయించుకోవచ్చు. ఇటు ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే అటు ఈతరం ఫ్యాషన్లూ ఫాలో అయిపోవాలనుకునేవారి మనసును కచ్చితంగా దోచేస్తాయివి.


డ్రెస్సు...చీరగా మారితే

‘చీర కడితే వచ్చే ఆ అందమే వేరులే’ అంటూ మురిసి పోతుంటారు చాలామంది అమ్మాయిలు. కానీ ఆకట్టుకునే ఆ చీర ముస్తాబు అంత సులువేం కాదుగా, దానికి నేర్పుతో పాటు కాస్త సమయమూ కావాల్సిందే. మరైతే దీనికి పరిష్కారమే లేదా అని అడిగితే... ‘కచ్చితంగా ఉంది’ అంటూ బదులిస్తున్నారు నేటి ఫ్యాషన్‌ డిజైనర్లు. ‘చిటికెలో చీరకట్టు తెచ్చే రెడీమేడ్‌ చీరలే కాదు, ఇప్పుడు డ్రెస్సులాంటి చీరలూ మీకోసం...’ అంటూ కొత్త డిజైన్లు తీసుకొచ్చారు. ఇన్‌స్టా శారీ పేరుతో వచ్చిన ఈ శారీడ్రెస్సు... లాంగ్‌ ఫ్రాక్‌లానే ఉంటుంది... కానీ దానికి అదనంగా పైటకొంగూ, కుచ్చిళ్లూ కుట్టేసి ఉంటాయి. ఆ రెండింటినీ అందంగా కలిపి ఉంచుతూ బెల్టూ వస్తుంది. లాంగ్‌ఫ్రాక్‌లోనే చీర అందాల్ని కలుపుతూ తయారు చేసిన ఈ  ఫ్యూజన్‌ డ్రెస్సు ఇప్పుడు మార్కెట్లో హల్‌చల్‌ చేస్తోంది.


ఎంబ్రాయిడరీ చేతులదే హవా!

బ్లౌజుల్లో ఎన్ని రకాల డిజైన్లు వచ్చినా ఆడవాళ్లకు అస్సలు సంతృప్తి ఉండదు. వేడుకకో చీర కొన్నట్టే... దానికి మ్యాచింగ్‌గా వేసుకునే జాకెట్టూ కొత్తగానే ఉండాలనుకుంటారు. అందుకే బ్లౌజు మీద చేసే ఎంబ్రాయిడరీ వర్కు దగ్గర్నుంచి దానికి కుట్టే స్లీవ్స్‌ వరకూ మార్పులు చేసుకుంటుంటారు. ఒకప్పుడు కుందన్లూ, అద్దాలూ జాకెట్లపైన చేరితే... ఆ తర్వాత కాసుల బిళ్లలూ, నగల నగిషీలూ మెరిసిపోయాయి. వీటితోపాటే బుగ్గల చేతులూ, రఫుల్‌ స్లీవ్సూ లాంటివెన్నో హడావుడి చేశాయి. కొత్తగా ఎంబ్రాయిడరీ వర్క్‌ చేసిన లాంగ్‌ స్లీవ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. చేయి పొడవునా ఎంబ్రాయిడరీ ఉండి మధ్యలో మాత్రం సింపుల్‌ వర్కుతో వస్తున్న ఈ జాకెట్లు... ప్రతి ఒక్కరినీ మెప్పిస్తున్నాయి. పట్టు చీరలతో పాటు నెట్‌, జార్జెట్‌లాంటి ఫ్యాన్సీ శారీలపైకీ ఇవి చక్కగా నప్పుతున్నాయి.  సాదా చీర మీదకు ఇష్టమైన ఎంబ్రాయిడరీ చేయించుకున్న ఈ పొడవైన హ్యాండ్స్‌ బ్లౌజు వేశారంటే... హుందాతనం వచ్చి తీరుతుందంతే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు