ఫోర్బ్స్‌ మెచ్చిన యువ ఆవిష్కర్తలు!

మనది యువదేశం. అదీ ఇదీ అని కాకుండా అన్నిరంగాల్లోనూ యువశక్తి కనిపిస్తోంది. అద్భుత ప్రతిభతో అగ్రతాంబులాన్నీ అందుకుంటోంది. ఉద్యోగాలూ, స్టార్టప్‌ల్లోనే కాదు- నేటి యువత ఆవిష్కరణల్లోనూ అద్భుతాలు చేస్తోంది. 

Updated : 19 Feb 2023 13:42 IST

ఫోర్బ్స్‌ మెచ్చిన యువ ఆవిష్కర్తలు!

మనది యువదేశం. అదీ ఇదీ అని కాకుండా అన్నిరంగాల్లోనూ యువశక్తి కనిపిస్తోంది. అద్భుత ప్రతిభతో అగ్రతాంబులాన్నీ అందుకుంటోంది. ఉద్యోగాలూ, స్టార్టప్‌ల్లోనే కాదు- నేటి యువత ఆవిష్కరణల్లోనూ అద్భుతాలు చేస్తోంది. అందుకు మచ్చుతునకలు వీళ్లు. సామాజిక స్పృహతో ఎన్నో సమస్యలకి తమ ఆవిష్కరణలతో పరిష్కారం చూపుతున్నారు. ఇటీవల ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ జాబితాలోనూ స్థానం దక్కించుకున్నారు!


క్యాన్సర్‌పై పోరాటంలో... తెలుగబ్బాయి!

అంబేడ్కర్‌- కోనసీమ జిల్లా అన్నాయిపేటకు చెందిన కాకిలేటి శివతేజ... ఐఐటీ గువాహటి నుంచి ఈసీఈ మేజర్‌, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీ ఏకకాలంలో పూర్తిచేశాడు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వృద్ధుల్లో వచ్చే కంటి సమస్య ‘ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులర్‌ డీజనరేషన్‌’ను మెషీన్‌ లెర్నింగ్‌ ఉపయోగించి గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేసిన బృందంలో ఉన్నాడు. ‘ఆరోగ్య సంరక్షణ కోసం ఆవిష్కరణలు చేస్తే అవి తక్షణం సమాజం మీద ప్రభావం చూపిస్తాయి’ అంటాడు శివతేజ. ఐఐటీ తర్వాత బెంగళూరులో ‘జిరాక్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఇండియా’లో సైంటిస్ట్‌గా చేరి రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరికరం అభివృద్ధి ప్రాజెక్టులో చేరాడు. అప్పటివరకూ రొమ్ములో గడ్డల్ని స్వీయపరీక్ష, ఎక్స్‌రే సాయంతో మమోగ్రఫీ ద్వారా నిర్ధరించేవారు. ఈ మార్గాల్లో కచ్చితత్వం లేకపోవడమే కాదు, రేడియేషన్‌వల్ల ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలుగుతుంది. వీటికి ప్రత్యామ్నాయాల్ని అన్వేషించేది వీరి పరిశోధక బృందం. అప్పటికే ‘జిరాక్స్‌’లో డా.గీతా మంజునాథ్‌ థర్మల్‌ ఇమేజ్‌లతో రొమ్ము క్యాన్సర్లను గుర్తించడంపైన పనిచేస్తున్నారు. తర్వాత 2017లో మంజునాథ్‌, శివతేజలతోపాటు మరో ఇద్దరు కలిసి ‘నిరామయి’ అనే సంస్థను ప్రారంభించారు. శివతేజ దీన్లో ప్రిన్సిపల్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌, డైరక్టర్‌. కీలకమైన మెషీన్‌ లెర్నింగ్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. అతడి నేతృత్వంలోనే రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించే ‘థెర్మాలిటిక్స్‌’ పరికరాన్ని అభివృద్ధి చేసిందీ సంస్థ. దీనిద్వారా తక్కువ ఖర్చుతోనే, కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి. రేడియేషన్‌ లేకుండా, శరీరాలను తాకకుండానే దీంతో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష చేయొచ్చు. ప్రస్తుతం ఈ పరికరాన్ని భారత్‌లో 150 హాస్పిటల్స్‌, డయాగ్నస్టిక్‌ కేంద్రాలతోపాటు విదేశాల్లోనూ ఉపయోగిస్తున్నారు. శివతేజ పేరున 23 పేటెంట్లు ఉన్నాయి. నిరామయిలో పరిశోధనలు చేస్తూనే నెదర్లాండ్స్‌, మాస్ట్రిక్‌ యూనివర్సిటీ నుంచి క్లినికల్‌ డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు.


రెడీమేడ్‌ గూడు...

రదలూ, భూకంపాల్లాంటి ప్రకృతి విపత్తులూ... అంతర్గత కలహాల కారణంగా ఏటా కోట్ల మంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటప్పుడు పిల్లాపాపలతో తల దాచుకోవడానికి భద్రమైన ఏర్పాటేదీ ఉండదు వారికి. ఈ పరిస్థితిని చిన్నప్పుడు స్వయంగా అనుభవించాడు కౌశల్‌ శెట్టి. తర్వాత అతడి కుటుంబం ముంబయి వెళ్లింది. ఐఐటీలో చదివి, మాస్టర్‌కార్డ్‌ ఇండియా విభాగానికి సీనియర్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ అయ్యాడు కౌశల్‌. అయినా కర్ణాటకలోని సువర్ణ నదీ తీరానున్న తమ గ్రామంలో వరదలప్పుడు అందరూ ఇళ్లు వదిలి గుడారాల్లో తలదాచుకోవడాన్ని మర్చిపోలేకపోయాడు. ఈ సమస్య చాలాచోట్ల ఉండటాన్ని గమనించాడు. అందుకే ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మిత్రులతో కలిసి ‘నోస్టాస్‌ హోమ్‌’ అనే సంస్థను ప్రారంభించాడు. దీనిద్వారా నిర్వాసితులకు స్వల్ప వ్యవధిలో సులభంగా ఏర్పాటుచేసే ఇళ్లను డిజైన్‌ చేశాడు. స్టీల్‌ స్తంభాలూ, రేకులతో ఉన్న ఆ ఇంటిని కొన్ని గంటల్లోనే బిగించవచ్చు. ఆరుగురు వ్యక్తులు అందులో తలదాచుకునే వీలుంటుంది. వర్షాల్నీ, చలినీ, ఎండనీ తట్టుకునేలా వీటిని రూపొందించిందీ సంస్థ. వీటితో నిరాశ్రయులకు భద్రతనీ, ఆత్మగౌరవాన్నీ అందించవచ్చంటాడు కౌశల్‌. నోస్టాస్‌ హోమ్‌ ఇళ్లతో కర్ణాటకలో తన సొంతూరు మాడి దగ్గర ఓ ఊరినే నిర్మించాడు కౌశల్‌. అసోం, నాగాలాండ్‌లతోపాటు ఆఫ్రికాలోనూ వరద బాధితుల్ని ఈ ఇళ్లు ఆదుకున్నాయి.


రైతుకు ‘టెక్‌’ నేస్తం!

న్నదాతకు సాంకేతిక దన్ను అందిస్తోంది ‘నీర్‌ ఎక్స్‌’. రైతు తన పొలంలోని వాతావరణ పరిస్థితులు, భూసారం గురించి ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకునే సదుపాయాన్ని తెచ్చిందీ సంస్థ. అహ్మదాబాద్‌లోని క్రేడిల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం నుంచి హర్ష్‌ అగర్వాల్‌, నికితా తివారీ దీన్ని ప్రారంభించారు. వీరు అభివృద్ధి చేసిన ‘శూల్‌’ పరికరాన్ని భూమిలోకి కొన్ని అంగుళాలు పోనిచ్చి అక్కడి వాతావరణ పరిస్థితులను ఆప్‌ ద్వారా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. శూల్‌కు అమర్చిన సెన్సర్ల సాయంతో ఇది నేలలోని తేమ శాతాన్నీ, ఖనిజ లవణాల మోతాదుల్నీ తెలుపుతుంది. దీనివల్ల రైతులు చీడపీడల్ని అరికడుతూ, సరైన మోతాదులో నీరు, ఎరువులు అందించి ఉత్పాదకతను పెంచుకోవచ్చు. ఆప్‌ సాయంతో పంటల ఆకుల్ని బట్టి వాటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే సదుపాయాన్నీ కల్పిస్తున్నారు. 2.5 ఎకరాలకు ఒక ‘శూల్‌’ పనిచేస్తుంది. దీని విలువ రూ.12 వేలు. అద్దెకూ తీసుకోవచ్చు. గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో రైతులతోపాటు కొన్ని ప్రభుత్వ, స్వచ్ఛంద, పరిశోధక సంస్థలూ వీరి సేవల్ని వినియోగించుకుంటున్నాయి. ఇస్రో, ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ పరికరాన్ని పరీక్షించి 97 శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నట్టు తేల్చాయని చెబుతున్నారు వ్యవస్థాపకులు.


ప్రాణాలు నిలిపే డిజైనర్‌!

చిన్నప్పుడు కుదురుగా ఓ చోట కూర్చునేవాడు కాదట యూఆర్‌ సిద్ధార్థ్‌. ఏ విషయంపైనా నిమిషంకన్నా ఎక్కువ ఏకాగ్రత కుదిరేది కాదట. ‘వీడితో ఎలా వేగాలబ్బా!’ అని తలపట్టుకున్న అతని తల్లిదండ్రులకి చిత్రలేఖనం ఓ మంచి పరిష్కారంగా కనిపించింది. అందులో శిక్షణ మొదలయ్యాక... గంటలు గంటలు బొమ్మలు గీయడంలో లీనమయ్యేవాడట. మామూలు విద్యార్థులకన్నా ఎక్కువ ఏకాగ్రతనీ సొంతం చేసుకున్నాడు. మూడో తరగతప్పుడు స్కూల్లో ‘బెస్ట్‌ ఆర్ట్‌ స్టూడెంట్‌ అవార్డు’నీ అందుకున్నాడు. ఎదిగేకొద్దీ చిత్రలేఖనంపైన అతనికున్న ఆసక్తి ‘ప్రోడక్ట్‌ డిజైనింగ్‌’ వైపు మళ్ళింది. ఇంటర్‌ అయ్యాక హరియాణా, కురుక్షేత్రలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ)లో చేరాడు. అక్కడున్నప్పుడే రైతు ఆత్మహత్యల్ని ప్రత్యక్షంగా చూశాడు. సాధారణంగా పురుగుమందు తాగిన రైతులకి ఆసుపత్రుల్లో జీర్ణాశయ ప్రక్షాళన(గ్యాస్ట్రిక్‌ ఇరిగేషన్‌) చికిత్స చేస్తుంటారు. ఆ చికిత్సకి కనీసం 45 నిమిషాలు పడుతుంది. ఈలోపు విషం రక్తంలో కలిస్తే ప్రాణాలు పోతాయి. సరైన రోడ్లూ రవాణా వ్యవస్థలేకపోవడంవల్ల రైతుల్ని పల్లెల నుంచి సుదూరంలోని పట్టణాలకి తీసుకునివెళ్లేలోపే వాళ్ళు చనిపోతుంటారు. ఈ రెండు సమస్యలకి పరిష్కారంగా ‘సర్వైవ్‌’ పేరుతో ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టాడు సిద్ధార్థ్‌. ముప్పావుగంటపట్టే జీర్ణాశయ ప్రక్షాళన చికిత్సని ఈ పరికరంతో రెండునిమిషాల్లో పూర్తిచేయొచ్చు. ప్రాణాపాయ సమయంలో పెద్దాసుపత్రులదాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా- గ్రామాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లోనే సులభంగా వాడేలా దీన్ని డిజైన్‌ చేశాడు. ఈ పరికరం ప్రపంచ ప్రసిద్ధ డిజైనింగ్‌ అవార్డు ‘ఐఎఫ్‌’ని అందుకుంది. దీని తర్వాత, గుండె ఆపరేషన్‌లప్పుడు ఉపయోగించే హార్ట్‌ అండ్‌ లంగ్‌ మెషీన్‌కి బదులుగా ‘ఎనేబుల్‌’ అనే పరికరాన్నీ, అంధులు సరైన మోతాదులో మందుల్ని పుచ్చుకునేందుకు సాయపడే ‘హోప్‌’ అనే చిన్న మూతనీ ఆవిష్కరించాడు. వీటన్నింటికీ కలిపి 85 అంతర్జాతీయ డిజైనర్‌ అవార్డుల్ని సాధించాడు 24 ఏళ్ళ సిద్ధార్థ్‌. ప్రస్తుతం ఫిలిప్స్‌ హెల్త్‌కేర్‌ సంస్థలో ‘ఎక్స్‌పీరియన్స్‌ డిజైనర్‌’గా ఉన్నాడు!


సీసాల్ని ఇసుకగా మార్చేస్తాడు!

సారి ఫోర్బ్స్‌ జాబితాలో అందరికన్నా చిన్నవాడు 21 ఏళ్ళ ఉదిత్‌ సింఘాల్‌. ఐదేళ్ళకిందట వాళ్ళింట్లో వృథా గాజు సీసాలు చాలా ఉండేవట. వాటిని అమ్ముదామనుకుంటే- ఒకప్పుడు సీసాకి పదిరూపాయల వంతున ఇస్తున్న వ్యాపారులే... ‘ప్లాస్టిక్‌బాటిళ్ళే తీసుకుంటాం ఇవి వద్దు’ అనేశారట. ఎందుకలా అని ఆరాతీస్తే- గాజు సీసాలని నిల్వచేయడానికి ఎక్కువ స్థలం కావాల్సి ఉండటం వల్ల వాటినెవ్వరూ కొనడంలేదని తెలిసింది. ఇందువల్ల ఈ బాటిళ్ళన్నీ డంపింగ్‌ యార్డులో పేరుకుపోయి పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయని గ్రహించాడు ఉదిత్‌! ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ భూమిలో కరిగిపోవడానికి 300 ఏళ్ళు పడితే... గాజు సీసాకి వెయ్యేళ్ళు పడుతుందట! ఇందుకోసమే బడిలోని సహ విద్యార్థులతో కలిసి ‘నో గ్లాస్‌ ఇన్‌ ల్యాండ్‌ఫిల్స్‌’ ఉద్యమాన్ని నడిపాడు ఉదిత్‌. ఇది న్యూదిల్లీలోని న్యూజిలాండ్‌ హైకమిషనర్‌ దృష్టికి వెళ్ళి రూ.లక్ష గ్రాంటు ఇచ్చారు. అంతేకాదు, గాజు సీసాలని ఇసుకగా మార్చే ఓ సరికొత్త యంత్రాన్ని న్యూజిలాండ్‌ నుంచి తెప్పిస్తామనీ చెప్పారట. ‘అలాంటి యంత్రాన్ని మనమే ఇక్కడ తయారుచేసుకుంటేపోలా!’ అనుకున్నాడు ఉదిత్‌. ఏడాది తిరక్కుండానే అలాంటి యంత్రాన్ని ఆవిష్కరించడమేకాదు... ‘గ్లాస్‌2శాండ్‌’ అనే సంస్థనీ స్థాపించాడు. తన యంత్రాలతో గత రెండేళ్ళలో 65 వేల గాజుసీసాలని... 40 టన్నుల ఇసుకగా మార్చాడు. అదీ సాదాసీదా ఇసుకకాదు... సిలికాన్‌ శాతం ఎక్కువగా ఉన్న ఫస్ట్‌గ్రేడ్‌ ఇసుక! వాటిని బడా నిర్మాణ సంస్థలకి విక్రయిస్తున్నాడు. ఇదంతా చేస్తూనే యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో ‘మేనేజ్‌మెంట్‌ సైన్స్‌’లో బీఎస్సీ చదువుతున్నాడు!


సౌర విద్యుత్తులో నయా శకం!

సౌర విద్యుత్తులో కొత్త యుగానికి నాంది పలుకుతున్నాడు 29 ఏళ్ళ అక్షయ్‌ మకర్‌. దిల్లీకి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అక్షయ్‌... ట్యూషన్‌లు చెబుతూనే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. చుట్టుపక్కలవాళ్ళందరూ ఏదైనా ఉద్యోగం చేయమని చెబుతుంటే- పరిశ్రమ స్థాపిస్తానని పట్టుబట్టి మరీ ‘క్లైమెంటెంజా సోలార్‌’ సంస్థని ప్రారంభించాడు. మరి పెట్టుబడి...? అప్పటిదాకా ట్యూషన్‌లు చెబుతూ దాచుకున్న డబ్బునీ, అమ్మ తన నగలమ్మి అందించిన మొత్తాన్నీ కలిపి సొంత ప్రయోగాలు మొదలుపెట్టాడు. 2018లో అలా సాదాసీదాగా మొదలైన క్లైమెంటెంజా సంస్థ ఇప్పుడు... అక్షరాలా మూడువందల కోట్ల రూపాయల రెవెన్యూ సాధిస్తోంది! సాధారణంగా సోలార్‌ పవర్‌ అనగానే పెద్దపెద్ద సౌరఫలకాలే గుర్తొస్తాయి మనందరికీ. కానీ, అక్షయ్‌ ఇదే సౌర శక్తిని థర్మల్‌ పవర్‌గా మారుస్తాడు. ఇక్కడ పలకలకి బదులు... అద్దాలుంటాయి. ఆ అద్దాలు సూర్యుని ఉష్ణాన్ని మరింతగా పెంచి... ‘రిసీవర్‌’కి పంపిస్తాయి. ఆ రిసీవర్‌లో నీళ్ళుంటాయి. ఆ నీళ్ళు ఈ ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కి... ఆవిరిని విడుదలచేస్తే... ఆ ఆవిరి టర్బైన్స్‌ని తిప్పడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నమాట. సాధారణ సౌర విద్యుత్తు తయారీకన్నా దీనికి 95 శాతం తక్కువ స్థలం, 40 శాతం తక్కువ ఖర్చు అవుతుంది. అందువల్లే, క్లైమెంటెంజా సంస్థతో నెస్లే, పెప్సీ, ర్యాలీస్‌ వంటి బహుళజాతి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాదాపు 23 మెగావాట్ల మేర ఈ సరికొత్త సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటున్నాయి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..