‘కుండ’ గాలి వీస్తోంది!

మండుటెండల్లో మట్టి కుండ అనగానే చల్లని నీళ్లే గుర్తొస్తాయి... కానీ ఇప్పుడు అదే పాత్ర కూలర్‌లా ఉక్కబోతను తగ్గించి చల్లని గాలినీ అందిస్తోంది... ఆహార పదార్థాల్ని తాజాగా ఉంచుతూ ఫ్రిజ్‌లానూ మారిపోయింది... ఇంకా ప్రత్యేకమైన వంట పాత్రల్లా, కుండీల్లా వచ్చి రకరకాలుగా ఉపయోగపడుతోంది!

Published : 02 Apr 2023 00:24 IST

‘కుండ’ గాలి వీస్తోంది!

మండుటెండల్లో మట్టి కుండ అనగానే చల్లని నీళ్లే గుర్తొస్తాయి... కానీ ఇప్పుడు అదే పాత్ర కూలర్‌లా ఉక్కబోతను తగ్గించి చల్లని గాలినీ అందిస్తోంది... ఆహార పదార్థాల్ని తాజాగా ఉంచుతూ ఫ్రిజ్‌లానూ మారిపోయింది... ఇంకా ప్రత్యేకమైన వంట పాత్రల్లా, కుండీల్లా వచ్చి రకరకాలుగా ఉపయోగపడుతోంది!

ట్టి కుండల్లోని నీళ్లు తాగితే చాలా మంచిది. కుండల తయారీకి వాడే మట్టిలో ఉండే ఆల్కలీన్‌ లక్షణాలు నీటిలోని పీహెచ్‌ స్థాయుల్ని సమతుల్యం చేస్తాయి. దీంతో జీవక్రియ మెరుగుపడి పొట్టకు ఏ ఇబ్బందీ ఉండదు. అంతేనా... మట్టి ద్వారా కొన్ని ఖనిజాలూ, లవణాలూ అందుతాయి. ఇలా చెబుతూపోతే మట్టికుండ వల్ల వచ్చే లాభాలు చాలానే ఉండొచ్చు. అంతేకాదు, మట్టిపాత్ర పర్యావరణానికి ఎలాంటి హానీ చేయకుండా చల్లని నీటిని అందిస్తుందన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టే మారుతున్న కాలానికి తగ్గట్టు ఇప్పుడు ఎన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులొచ్చినా మట్టి పాత్రలకు నవతరమూ ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అది తెలిసే... మట్టి- వంట పాత్రలూ, వాటర్‌బాటిళ్ల నుంచి కూలర్‌, ఫ్రిజ్‌ వరకూ ఇలా మరెన్నో రూపాల్లోనూ వచ్చేసింది. ఇంకా గాలిని శుభ్రం చేయడానికి ఎయిర్‌ ప్యూరిఫయర్‌ కుండీగానూ తయారైంది.  

కాస్త ఎండలు ఎక్కువైతే ఉక్కబోత భరించడం ఎంతో కష్టం. అందుకే వీలును బట్టి ఏసీలూ, కూలర్లూ వాడుతుంటారు. అయితే తక్కువ ఖర్చులోనే సేద తీర్చడానికి కుండ కూలరూ దొరుకుతోంది. చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుని చల్లని గాలిని ఇవ్వడమే దీని అసలు ప్రత్యేకత. ఇదీ మామూలు కుండలానే ఉంటుంది. కానీ దానికే గాలికోసం ఫ్యాన్‌ ఏర్పాటు చేసి ఉంటుంది. కూలర్‌లా పనిచేయడానికి వాటర్‌ పంపూ, కూలర్‌ గడ్డీ, విద్యుత్‌ తీగలూ, ప్లగ్‌లాంటివి అమర్చి ఉంటాయి. కూలర్‌లో నింపినట్టే కుండలో నీళ్లు పోసి, విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వగానే వాటర్‌ పంప్‌ నుంచి నీళ్లు గడ్డిపైన పడి ఫ్యాన్‌ తిరుగుతుంది. అంతే... చల్లని గాలి బయటకు వీస్తుంది. ఇక కూరగాయలూ, పండ్లూ లాంటివి తాజాగా ఉంచుకోవడానికీ మట్టితో చేసిన పాట్‌ ఇన్‌ పాట్‌ రిఫ్రిజరేటర్‌, మిట్టీకూల్‌ క్లే రిఫ్రిజరేటర్‌ లాంటివీ మార్కెట్లో ఉన్నాయి. అసలు విద్యుత్‌ అవసరమే లేకుండా పదార్థాల్ని తాజాగా ఉంచుతాయివి. కాల్చిన ఎర్ర మట్టితో తయారుచేసే వీటిల్లో మామూలు కుండ ఆకారంతోపాటు చిన్న ఫ్రిజ్‌లా ఉన్నవీ దొరుకుతాయి. కేవలం నీళ్లు పోయడానికి మాత్రమే వీటిల్లో ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. నీళ్లు ఇంకిపోయి నప్పుడల్లా మళ్లీ నింపితే చాలు...  మట్టి అందులోని పదార్థాల్ని చల్లగా ఉంచుతుంది. వండిన ఆహారం ఘుమఘుమలాడటమే కాదు, అది ఆరోగ్యంగానూ ఉండాలంటూ రకరకాల వంటపాత్రలు వాడుతుంటారు కదా. అలాంటివారికోసమే చికెన్‌ బ్రిక్స్‌ అనే పాత్ర వచ్చింది. దీంట్లో నూనెలాంటివి ఉపయో గించకుండానే కేవలం చికెన్‌, మసాలా దినుసులు వేసి మూత గట్టిగా పెట్టి పొయ్యిమీద ఉంచామంటే సరిపోతుంది. ఆ ఆవిరికి మట్టి వాసనా కలిసిపోయి నోరూరించే చికెన్‌ రెడీ అయిపోతుంది. ఇంకా ఈమధ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గోధుమ, బార్లీ, ఓట్‌ గ్రాస్‌ల జ్యూసులు తాగుతున్నారు, మొలకెత్తిన చిరుధాన్యాల్ని తింటున్నారు. అందుకోసం కుండీలూ, పాత్రలూ ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఆ గడ్డిజాతి మొక్కలు చక్కగా పెరగడానికీ, విత్తనాలు బాగా మొలకెత్తడానికీ సెల్ఫ్‌వాటరింగ్‌ టెర్రకోటా ప్లాంటర్లూ, స్ప్రౌట్‌ టవర్‌ పాత్రలూ వచ్చాయి. ఇంకా ఇవే కాదు... మట్టి కుండ ఇప్పుడు ఆటోమేటిక్‌ వాటర్‌ ఫిల్టర్‌, డిస్పెన్సర్‌లానూ మారిపోయింది. మరి ఆలస్యం ఎందుకు... మట్టి మజాని ఆస్వాదించేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు