Published : 03 Jul 2022 01:10 IST

పప్పు... మసాలా రుచిలో!

ఒకప్పుడు పప్పును కేవలం అన్నంతోనే తినేవాళ్లం. కానీ ఇప్పుడు రోటీ, పరోటా.. వంటివాటికీ ఇది మంచి కాంబినేషన్‌గా మారింది. దానికి తగినట్లుగానే పప్పు కూడా ఎప్పటిలా కాకుండా వైవిధ్యమైన రుచుల్లోనూ నోరూరిస్తోంది.


గుమ్మడికాయ పప్పు

కావలసినవి: కందిపప్పు: ముప్పావుకప్పు, తీపి గుమ్మడి ముక్కలు: ఒకటిన్నర కప్పు, టొమాటోలు: రెండు, నెయ్యి: టేబుల్‌స్పూను, కరివేపాకురెబ్బలు: రెండు, జీలకర్ర: అరచెంచా, అల్లం తరుగు: చెంచా, పచ్చిమిర్చి: ఒకటి, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, గరంమసాలా: అరచెంచా, కసూరీమేథీ: చెంచా, బెల్లంతరుగు: చెంచా, కొత్తిమీర: కట్ట, నిమ్మరసం: రెండు చెంచాలు.

తయారీ విధానం: ముందుగా కందిపప్పును కుక్కర్‌లో వేసి సరిపడా నీళ్లు పోసి, మూత పెట్టి మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి జీలకర్ర వేయించి అల్లం తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, గుమ్మడి ముక్కలు వేసి వేయించి పావుకప్పు నీళ్లు పోయాలి. నిమిషమయ్యాక తగినంత ఉప్పు, పసుపు, కారం, గరంమసాలా వేయాలి. గుమ్మడి ముక్కలు మెత్తగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న పప్పు, కసూరీమేథీ, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, బెల్లం తరుగు వేసి బాగా కలిపి పప్పు దగ్గరగా ఉడుకుతున్నప్పుడు దింపేయాలి.  


పార్సీ దాల్‌

కావలసినవి: కందిపప్పు: కప్పు, ఉప్పు: తగినంత, పసుపు: అరచెంచా, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: చెంచా, ఆవాలు: చెంచా.
మసాలాకోసం: కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లిరెబ్బలు: ఆరు, ఎండుమిర్చి: రెండు, జీలకర్ర: చెంచా, దనియాలు: టేబుల్‌స్పూను, దాల్చినచెక్క: చిన్నముక్క, లవంగాలు: రెండు, మిరియాలు: అరచెంచా, గసగసాలు: చెంచా.  

తయారీ విధానం: మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. స్టౌమీద కుక్కర్‌ని పెట్టి చెంచా నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు, టొమాటో ముక్కలు వేయించుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గుతున్నప్పుడు ముందుగా చేసిపెట్టుకున్న మసాలా, పసుపు, తగినంత ఉప్పు, కందిపప్పు వేసి, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టాలి. నాలుగు కూతలు వచ్చాక దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర వేయించి పప్పులో వేయాలి. తరువాత కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలిపితే సరి.  


పెసలతో...

కావలసినవి: పెసలు: కప్పు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, టొమాటో పేస్టు: రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపాలు: ఒకటిన్నర కప్పు, మిరియాలపొడి: అరచెంచా, గరంమసాలా: చెంచా, పసుపు: అరచెంచా, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, కారం: చెంచా.  

తయారీ విధానం: పెసల్ని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత పెసలు, వెల్లుల్లి, జీలకర్ర కుక్కర్‌లో వేసి, సరిపడా నీళ్లు పోసి రెండుకూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ- టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించాలి. తరువాత ఇందులో టొమాటో పేస్టు, పసుపు, గరంమసాలా, మిరియాలపొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. టొమాటో ముక్కలు మెత్తగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న పెసల్ని వేసుకుని పావుకప్పు నీళ్లు పోయాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు కొబ్బరిపాలు, కొత్తిమీర తరుగు వేసి స్టౌని సిమ్‌లో పెట్టి... పప్పు బాగా ఉడికాక దింపేయాలి.


చిట్కా
కూర కారంగా ఉందా...

బిర్యానీ, పులావ్‌లకు మసాలాకూరలు ఉంటేనే బాగుంటుంది. మరి ఆ కూరలు మంచి రుచిలో రావాలంటే చేసేముందు ఈ చిట్కాలను పాటిస్తే సరి.

* ఏ కూర చేస్తున్నా నూనెతో పాటు కొద్దిగా నెయ్యి కూడా వాడితే గ్రేవీ మంచి రుచిలో ఉంటుంది.

* కూరలకు వేసే మసాలాను ఎప్పుడూ సిమ్‌లోనే వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా చక్కెర వేస్తే మసాలా మాడువాసన రాదు.  

* మసాలా కూరల్లో అల్లంవెల్లుల్లి ముద్ద తప్పనిసరి కాబట్టి... అల్లం అరవైశాతం, వెల్లుల్లి నలభైశాతం వాడాలి. ఈ పేస్టును తాజాగా తయారుచేసి వేసుకుంటే మరీ మంచిది.  

* కూరల్లో మసాలా ఘాటు ఎక్కువైనట్లుగా అనిపిస్తే... అందులో కొద్దిగా క్రీమ్‌/పెరుగు కలిపితే సరి.

* మసాలా కూరల్లో వేసేందుకు క్రీమ్‌ అందుబాటులో లేకపోతే... పాలు, మొక్కజొన్నపిండి కలిపి చేసిన పేస్టును వేయొచ్చు.

* దాల్చినచెక్క, లవంగాలు, యాలకుల్లాంటి వాటిని కూడా దోరగా వేయించి ఆ తరువాత పొడికొట్టి వేసుకుంటే.. కూరకు మంచి వాసన వస్తుంది. ఇలా చేస్తే వాటిల్లోని నూనెలు విడుదలై కూర బాగుంటుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని