క్యాబేజీతో కోఫ్తా, పకోడీ!

ఎక్కువమంది ఇష్టపడని కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. మరి దాన్ని కూడా నోరూరించేలా చేయాలంటే... ఇలాంటి రుచుల్లో వండుకుని ట్రై చేస్తే సరి.

Published : 05 Nov 2022 23:26 IST

క్యాబేజీతో కోఫ్తా, పకోడీ!

ఎక్కువమంది ఇష్టపడని కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. మరి దాన్ని కూడా నోరూరించేలా చేయాలంటే... ఇలాంటి రుచుల్లో వండుకుని ట్రై చేస్తే సరి.


క్యాబేజీ మసాలా రైస్‌

కావలసినవి: క్యాబేజీ తరుగు: ఒకటిన్నర కప్పు, క్యాప్సికం: ఒకటి, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, కరివేపాకు రెబ్బలు: మూడు, పల్లీలు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిపాయ: ఒకటి, క్యారెట్‌ తరుగు: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, పసుపు: పావుచెంచా, కారం: చెంచా గరంమసాలా: అరచెంచా, పొడిపొడిగా వండిన అన్నం: రెండు కప్పులు, కొబ్బరి తురుము: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్‌ - క్యాబేజీ తరుగు వేయాలి. అన్నింటినీ వేయించుకుని పసుపు, తగినంత ఉప్పు, గరంమసాలా, కారం వేసి బాగా కలపాలి. క్యాబేజీ తరుగు బాగా వేగిందనుకున్నాక అన్నం, కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దింపేయాలి.


క్యాబేజీ ఆవ కూర

కావలసినవి: క్యాబేజీ: అరకేజీ, చింతపండు గుజ్జు: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, ఎండుమిర్చి: రెండు, జీలకర్ర: చెంచా, సెనగపప్పు: చెంచా, కరివేపాకు రెబ్బలు: మూడు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి: మూడు, ఆవపొడి: చెంచా.

తయారీ విధానం: క్యాబేజీని సన్నగా తరిగి, కడిగి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, ఎండుమిర్చి వేయించి.. పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. ఆ వెంటనే క్యాబేజీ తరుగు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. క్యాబేజీ బాగా మగ్గాక చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ కూరలోని నీరంతా పోయి... పొడిగా అయ్యాక ఆవపిండి వేసి కలిపి దింపేయాలి.


పకోడీ

కావలసినవి: క్యాబేజీ తరుగు: ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, సెనగపిండి: ముప్పావుకప్పు, బియ్యప్పిండి: అరకప్పు, మొక్కజొన్నపిండి: చెంచా, కారం: ఒకటిన్నర చెంచా, పసుపు: చెంచా, వంటసోడా: చిటికెడు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర: కట్ట, కరివేపాకు తరుగు: రెండు చెంచాలు, సోంపు: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: క్యాబేజీ తరుగులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. ఇందులో చాలా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని అయిదు నిమిషాలు నాననిచ్చి ఆ తరువాత కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసుకుంటూ ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరిపోతుంది.


కోఫ్తా కర్రీ

కావలసినవి: క్యాబేజీ తరుగు: ఒకటిన్నర కప్పు, సెనగపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: చెంచా, ఆమ్‌చూర్‌పొడి: అరచెంచా, ఇంగువ: పావుచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, టొమాటోలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, లవంగాలు: రెండు, యాలకులు: రెండు మిరియాలు: అరచెంచా, దాల్చినచెక్క: ఒకముక్క, జీడిపప్పు: నాలుగు, దనియాలపొడి: చెంచా, పసుపు: పావుచెంచా, జీలకర్ర: చెంచా, చిక్కటి పెరుగు: టేబుల్‌స్పూను, పాలు: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: ఓ గిన్నెలో కడిగిన క్యాబేజీ తరుగు, అరచెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. పది నిమిషాలయ్యాక క్యాబేజీ తరుగును గట్టిగా పిండి ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సెనగపిండి, పావుచెంచా ఉప్పు, అరచెంచా కారం, గరంమసాలా, ఆమ్‌చూర్‌పొడి, ఇంగువ వేసి అన్నింటినీ కలపాలి. అవసరం అనుకుంటే చాలా కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని  చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో టొమాటో ముక్కలు, ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు వేసుకుని మెత్తని పేస్టులా చేసి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. అది వేడెక్కాక జీలకర్ర వేసి వేయించి, చేసిపెట్టుకున్న మసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు మిగిలిన కారం, దనియాలపొడి, పసుపు, మరికొంచెం ఉప్పు వేసి కాసిని నీళ్లు పోయాలి. దింపేందుకు అయిదు నిమిషాల ముందు కోఫ్తా ఉండలు, పెరుగు, పాలు పోసి బాగా కలపాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..