Published : 01 Oct 2022 23:40 IST

చిన్నారుల కోసం త్రీడీ చాపలు!

ఆ చాపపైన ఎత్తయిన భవంతులూ, చిట్టిపొట్టి ఇళ్లూ కట్టేసి ఓ ఊరినే తయారుచేయొచ్చు...

రాకాసిబల్లుల్ని ఉంచేసి జురాసిక్‌ కాలాన్ని కళ్లముందుకు తీసుకురావొచ్చు...

బోలెడన్ని దారుల్లో కార్లూ, జీపులూ తిప్పేస్తూ మహానగరాన్నే చూపొచ్చు...

ఇదిగో చిన్నారుల కోసం వచ్చిన ఈ ‘త్రీడీ ప్లేమ్యాట్స్‌’తో... ఏమైనా చేయొచ్చు!

సాధారణంగా పిల్లలు బొమ్మల్ని ముందరేసుకుని ఆడుకోవడానికి వీలుగా గదిలో నేలపైన చాపలాంటిది వేస్తుంటారు. మంచం దగ్గర్నుంచి కుర్చీలూ, దుప్పట్లూ, లైట్లూ, దిండ్ల వరకూ ప్రతిదీ పిల్లలు మెచ్చేలా రంగురంగుల్లో, వారికిష్టమైన బొమ్మలతో ఉంటే... కింద వేసుకునే ప్లేమ్యాట్‌ మాత్రం మామూలుగా ఎందుకుండాలి. అందుకే మరి, కార్టూన్‌ పాత్రల బొమ్మలతో ఎన్నో వెరైటీల్లో ఆడుకునే మ్యాట్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. చూడ్డానికి ఆకట్టుకునేలా ఉండే ఆ ప్లేమ్యాట్లే- ఇప్పుడు ఆట బొమ్మల్లా మారిపోయి పిల్లల్ని మరింత అలరించడానికి వచ్చేశాయన్నమాట. సరికొత్తగా త్రీడీ రూపంలో ‘డైనోసార్‌ టాయ్స్‌, యానిమల్‌ టాయ్స్‌ విత్‌ ప్లేమ్యాట్‌, త్రీడీ ప్లే రగ్స్‌’ పేర్లతో ఆన్‌లైన్లో ఎన్నెన్నో రకాలుగా దొరుకుతున్నాయి.

మామూలు ప్లేమ్యాట్స్‌లా కాకుండా వీటిల్లో ఒక్కోటీ ఒక్కో థీమ్‌తో భలేగా ఉంటుంది. ఉదాహరణకు ‘యానిమల్‌ జూ టాయ్స్‌ ప్లేమ్యాట్‌’ను తీసుకున్నామంటే ఇందులో కుక్క, పిల్లి, కోడి, బాతు... ఇలా రకరకాల జంతువుల బొమ్మలూ, కంచె, చిన్న ఇల్లు లాంటివి వస్తాయి. మ్యాట్‌ మీద ఉన్న థీమ్‌ ఆధారంగా ఆ బొమ్మల్ని అక్కడక్కడా సర్దుకుంటూ హాయిగా ఆడుకోవచ్చు. అదే ‘ట్రాఫిక్‌ త్రీడీ ప్లేమ్యాట్‌’ అయితే దాంట్లో రోడ్లూ, ట్రాఫిక్‌ సిగ్నళ్లూ, ఇళ్లూ... ఇలా ప్రతిదీ త్రీడీ రూపంలో ఉంటుంది. ఇంకా బీచ్‌హౌస్‌, మినీసిటీ, పార్క్‌... లాంటి ఎన్నో అంశాలతో ఈ చిల్డ్రన్‌ ప్లే రగ్గులు అందుబాటులో ఉన్నాయి. చాలా వాటిల్లో మ్యాట్‌ థీమ్‌తో పాటూ దానికి సంబంధించిన బొమ్మలూ జతగా వస్తాయి. కావాలంటే విడిగా మ్యాట్‌ను మాత్రమే తీసుకుని మనకు నచ్చిన బొమ్మల్ని సొంతంగా సెట్‌ చేసుకోవచ్చు.

ఏంటీ లాభం...

ఆటబొమ్మ ఏదైనా సరే పిల్లల్ని భాగస్వాములను చేసేలా ఉంటేనే అది వారికి ఎక్కువగా నచ్చుతుంది. ఈ ప్లే మ్యాట్‌ సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది. బుల్లి బుల్లి బొమ్మలతో తమ ఊహాశక్తికి పదునుపెడుతూ కథల్లోని సన్నివేశాల్నో, కల్పిత ప్రదేశాల్నో ఈ మ్యాట్‌ మీద సృష్టించేయొచ్చు. రోడ్లూ, పార్కింగ్‌ లాంటి వాటిని మినియేచర్‌ రూపంలో చూస్తూ వాటి వివరాలూ తెలుసుకోవచ్చు. ఏదో ఒకటి కాకుండా పిల్లల మనసును మెప్పించే ఆట బొమ్మను ఇవ్వాలనుకునేవారికి ఈ త్రీడీ ప్లే మ్యాట్‌ చక్కని ఛాయిస్‌ అవుతుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని