కుండలో పిజ్జా.. కుమ్మేస్తున్నారు!
‘ముదురు ఎరుపు రంగులో బేక్ అయిన ఆ తెల్లటి చీజ్... దానిమీద జల్లిన ఎండుమిర్చి పలుకులూ... ఒక్కో స్పూనూ తీసుకుని తింటుంటే లోపల ఎంతో రుచిగా తగిలే స్వీట్‌కార్న్, కూరగాయముక్కలూ... అబ్బబ్బ... ఆ ఘుమఘుమలూ, ఆ రుచీ ఏముందిలే...’ కొత్తగా పుట్టుకొచ్చిన కుండ పిజ్జాను కుమ్మేస్తూ చెప్పుకుంటున్న కబుర్లివి. అవును... మీరు చదివింది నిజమే. ఇది కుండలో పిజ్జానే. అచ్చంగా మనవాళ్ల సృష్టే.
పిజ్జా అనగానే వెంటనే చీజ్, కూరగాయ ముక్కలతో బేక్ చేసిన మందపాటి రొట్టెలాంటిదే గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ ఇటాలియన్ డిష్ రుచిలో- ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు చేసుకుంది. కానీ ఎన్నో ఏళ్లుగా ఆ రూపం మాత్రం మారలేదు. అయితే, ఇదంతా ఒకప్పటి మాట. పాకశాస్త్రం... అంటూ వంటక్కూడా ఓ శాస్త్రాన్ని రచించిన దేశంలోకి అడుగు పెట్టాక, వీళ్లకు మించి రుచిగా వండే వాళ్లు లేరనిపించుకున్న నలభీములు పుట్టిన దేశంలోకి వచ్చాక... ఇటాలియన్ డిష్ అయినా ఇండియన్ అభిరుచిలోకి మారిపోవాల్సిందే. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ కుండ పిజ్జా. గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న ‘ద కోన్ చాట్’ బేకరీ ‘కుల్హడ్ పిజ్జా’ పేరుతో సృష్టించిన ఇది కొద్ది రోజుల్లోనే ఆహార ప్రియుల మదిని దోచేసింది. ఆ వీడియోలు ఇంటర్నెట్లో కూడా తెగ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పిజ్జా కార్నర్లూ, చాట్ భాండార్లూ, బేకరీలూ ఈ కుండ పిజ్జాను తయారుచేయడం మొదలుపెట్టాయి. ఇంకేముందీ... ప్రస్తుతం ఇది హాట్ హాట్ ట్రెండ్.
బేస్ లేకపోతే మంచిదేగా!
కుండపిజ్జా తయారీ కోసం మట్టి కుండలో చీజ్, ఉడికించిన మొక్కజొన్న గింజలు, టొమాటో, పనీర్ ముక్కలూ, మయొనైజ్, టొమాటో కెచప్, ఆరెగానొ, చాట్ మసాలా, చీజ్ ముక్కలూ, ఎండుమిర్చి పలుకుల్నీ పొరలు పొరలుగా వేసి... ఆ కుండను ఓవెన్లో పెడతారు. అది నిమిషాల్లో ఉడికిపోయి, పైకి పొంగుతుంది. ఘుమఘుమలాడే పిజ్జా కుండను చేతుల్లోకి తీసుకుని ఎంచక్కా స్పూనుతో తినేయొచ్చు. ఇదే వీడియోను ‘ఆమ్చి ముంబై’ అనే యూట్యూబ్ ఛానెల్లో పెడితే కొద్దిరోజుల్లోనే 22లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు, ‘ఇందులో పిజ్జా బేస్ ఏది మ్యాన్...’ అంటూ వీక్షకులు రకరకాల సరదా ప్రశ్నలూ అడగడం మొదలుపెట్టారు. నిజమే ఈ కుండ పిజ్జాలో మైదాతో చేసే పిజ్జా బేస్ ఉండదు. కేవలం ఆ బేస్ మీద వాడే టాపింగ్స్ మాత్రమే ఉంటాయి. అయితే, మామూలుగా పిజ్జాలు ఎక్కువ తింటే ‘ఆరోగ్యానికి మంచిది కాదు. లావవుతారు’ అంటారు కదా. అది ప్రధానంగా బేస్ కోసం వాడే మైదా వల్లే. పైన టాపింగ్స్కోసం వాడే చీజ్, పనీర్, కూరగాయ ముక్కలన్నీ ఆరోగ్యానికి మంచివే. అందుకే, ‘పిజ్జా తినాలి... కానీ లావవ్వకూడదు...’ అనుకునే యువతకు ఈ కుండ పిజ్జాను చూస్తే మహదానందం వేసేస్తోందట. పైగా చిన్న కుండ ఒకటి తింటే ఒక్క పీస్ మాత్రమే తిన్నట్లు. మామూలు పిజ్జానైతే ఆర్డరిస్తే మొత్తం తినాలి. లేదంటే స్నేహితులు పక్కనుండాలి. దీంతో ఆ సమస్యే లేదు. అందుకే, ఇది అందరికీ హాట్ ఫేవరెట్ అయింది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్