Updated : 26 Jun 2022 07:19 IST

ఒత్తిడిని ఓడించేద్దాం..!

ఉప్పు లేకపోతే వంట అవదు. అదే కాస్త ఎక్కువైతే- ఆ పదార్థం పారెయ్యడానికి తప్ప మరెందుకూ పనికి రాదు. స్ట్రెస్‌ కూడా అంతే. ఒక స్థాయి వరకూ బాగా ఉపయోగపడుతుంది. అవసరం కూడా. అదే ఎక్కువయిందంటే... ఎన్నెన్నో సమస్యలకు కారణమవుతుంది. మొత్తంగా ఆరోగ్యాన్ని అల్లకల్లోలం చేసి వదిలిపెడుతుంది. సైలెంట్‌ కిల్లర్‌ డిసీజ్‌లా మారుతున్న స్ట్రెస్‌మీద ఒక కన్నేసి ఉంచడం చాలా అవసరం.
ప్రేమ విఫలమైందని ప్రాణం తీసుకుంటుంది ఓ యువతి...భర్త వేధించాడని బిడ్డలతోసహా తనువు చాలిస్తుంది ఓ ఇల్లాలు...వ్యాపారంలో నష్టం వచ్చిందని జీవితానికి ముగింపు పలుకుతాడు ఓ వ్యాపారవేత్త...పరీక్షల్లో ఫెయిలైనందుకు బతకడమే దండగ అనుకుంటాడో విద్యార్థి...ఉద్యోగం రాలేదని ఉరి పోసుకుంటాడో నిరుద్యోగి...క్షణికావేశంలో తీసుకునే ఈ నిర్ణయాలకు ఎనభై శాతం దాకా కారణం మానసిక ఒత్తిడేనంటోంది హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌వారి అధ్యయనం. ఒత్తిడి కలిగించే సంఘటనలకు స్థాయీ భేదాలు లేవు. పొద్దున్నే పాలు రాకపోయినా, పనిమనిషి ఆలస్యంగా వచ్చినా, పిల్లలు త్వరగా నిద్రలేవకపోయినా సమయానికి పనులు కావేమోనని ఇల్లాలి మనసు ఒత్తిడికి గురవుతుంది. ఆఫీసుకు బయల్దేరినప్పుడు దారిలో బండి చెడిపోయినా, ఏ కారణం చేతో ట్రాఫిక్‌ స్తంభించినా, వర్షం వల్ల ఆగిపోవాల్సి వచ్చినా... టైమ్‌కి చేరుకోలేనేమోనని ఉద్యోగి ఆందోళనకు గురవుతాడు. నిత్యజీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. దానికి మన మనసూ శరీరమూ స్పందించే విధానమే ఒత్తిడికి కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారు. కొందరు కోపంతో పక్కనున్నవారి మీద గట్టిగా అరిచేస్తారు, మరికొందరు పిల్లల మీద చేయి చేసుకుంటారు. కొందరు కూల్‌గా మరో విషయం మీదికి మనసు మళ్లించుకుంటారు. కొన్ని నిమిషాలు ఓపిక పడితే ఎవరికైనా పరిస్థితి సర్దుకుంటుంది. కోపం వచ్చినప్పుడు పది లెక్కపెట్టమని పెద్దలు చెప్పింది అందుకే. కోపం, ఆవేశం, ఆందోళన, ఆవేదన...మనసులో పుట్టే ఈ భావోద్వేగాలన్నీ శరీరం మీద ప్రభావం చూపుతాయి. ఒత్తిడికి కారణమవుతాయి.  

అసలేమిటీ ఒత్తిడి?
ఒత్తిడి అని ఒక్కమాటలో చెప్పినా దీని వెనకాల పెద్ద కథే ఉంది. నిజానికి దైనందిన వ్యవహారాల్లో ఒత్తిడి అనేది సర్వసాధారణం. చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగానో, మనుషులవల్లో చోటు చేసుకునే సంఘటనలు వ్యక్తుల మీద భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన మార్పు కలగజేసినప్పుడు దానికి వారి శరీరం స్పందించే తీరు ‘ఒత్తిడి’గా బయటపడుతుంది. ఓ ప్రమాదం జరిగినప్పుడు లేదా ఓ సమస్య ముంచుకొచ్చినప్పుడు శరీరంలో ఏం జరుగుతుందంటే- మెదడులోని హైపోథాలమస్‌ స్పందించి నాడీ వ్యవస్థ ద్వారా అడ్రినల్‌ గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది. దాంతో అడ్రినలిన్‌, కార్టిసోల్‌ హార్మోన్లు విడుదలవుతాయి. వాటివల్ల గుండెవేగం, శ్వాసవేగం, రక్తపోటు పెరుగుతాయి, కండరాలు బిగుసుకుంటాయి. ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి, లేదా దానినుంచి తప్పించుకుని పారిపోవడానికి శరీరంలో ఉన్న సహజమైన ఏర్పాటు ఇది. ప్రమాదం తొలగిన తర్వాత హార్మోన్ల ఉద్ధృతి తగ్గి సాధారణ స్థితి నెలకొంటుంది. ఎప్పుడో ఒకసారి కొద్ది స్థాయిలో ఎదురయ్యే ఇలాంటి ఒత్తిడి ప్రతిస్పందనలను శరీరం బాగానే తట్టుకుంటుంది. తట్టుకోలేని స్థాయిలో ప్రతిస్పందనలు తరచుగా కలుగుతూనే ఉన్నప్పుడు సమస్య వస్తుంది. అప్పటికప్పుడు ఏదో కొంప మునిగేంత సంఘటనే జరగాలని లేదు, చిన్నప్పుడు జరిగిన ఓ చేదు సంఘటన తరచూ గుర్తొస్తున్నా, ఆందోళన కలిగించే చిన్న చిన్న సంఘటనలే తరచూ జరుగుతున్నా... ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి కలిగించే సంఘటనలన్నీ మెదడులో జ్ఞాపకంగా స్థిరపడి తరచూ హార్మోన్లు విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయట. దాంతో వారిలో శరీరానికీ మనసుకీ నిరంతర పోరాటం జరుగుతుంది. మౌలికంగా చూస్తే ఒత్తిడి రెండు రకాలు. స్వల్పకాలికం(ఎక్యూట్‌ స్ట్రెస్‌), దీర్ఘకాలికం(క్రానిక్‌ స్ట్రెస్‌).

ఉదాహరణకు... పొద్దున్నే పిల్లల్ని లేపి తయారుచేసి టిఫిన్‌ బాక్సులు సర్ది సమయానికి బడికి పంపించడం- తల్లికి యుద్ధం చేసినంత పనవుతుంది. సాయంత్రం స్కూలు వదిలి చాలాసేపైనా పిల్లలు ఇంటికి రాకపోతే ఏమయ్యిందో అన్న ఆందోళనతో గుండెదడ వస్తుంది. ఒకే నెలలో పిల్లల ఫీజులూ కట్టి యూనిఫామ్‌లూ పుస్తకాలూ కొనాల్సి వచ్చి తండ్రికి జేబు ఖాళీ అయితే ఇప్పుడేదన్నా అత్యవసరం వస్తే ఎలా అన్న భయం కలుగుతుంది. పిల్లలు కూడా పరీక్షల సమయంలో మంచి మార్కులు వస్తాయోలేదోనని ఆందోళన చెందుతారు. ఈ ఉద్వేగాలన్నీ ఒత్తిడి కలిగించేవే. ఆ ఒత్తిడి వల్ల చాలామంది జాగ్రత్తపడతారు. తల్లి సమయానికి పనులయ్యేటట్లు ప్లాన్‌ చేసుకుంటే, తండ్రి నెలనెలా పొదుపు చేసి ఒక్కసారే భారం కాకుండా చూసుకుంటాడు. పిల్లలు ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకుంటూ పరీక్షల ఒత్తిడిని అధిగమిస్తారు. ఈ తరహా స్వల్పకాలిక ఒత్తిడి- అప్రమత్తంగా ఉండేందుకూ, లక్ష్యాలను చేరుకునేందుకూ తోడ్పడుతుంది. 
మరి సమస్య దేనితో?
సమస్యల్లా క్రానిక్‌ స్ట్రెస్‌తోనే. అంటే దీర్ఘకాలం పేరుకుపోయే ఒత్తిడి అన్నమాట. ఆర్థిక విషయాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, సహోద్యోగులతో, బంధువులతో సంబంధాలు, ఉద్యోగవ్యాపారాల్లో సమస్యలు, చాలాకాలంగా వేధిస్తున్న అనారోగ్యం... లాంటివన్నీ క్రానిక్‌ స్ట్రెస్‌కి కారణమవుతాయి. ఇలాంటి సమస్యలు చాలాకాలం పాటు ఉండి రోజురోజుకీ జటిలంగా మారతాయి కాబట్టి లోలోపల ఒత్తిడి పెరిగిపోతుంది.
ఏ తరహా ఒత్తిడి అయినా- అందుకు దారితీసే కారణాలపైనా, ప్రభావంపైనా అవగాహన పెంచుకుంటే దాన్ని అదుపులో ఉంచుకోవడం సులభం. క్లుప్తంగా చెప్పాలంటే... ప్రతికూల పరిస్థితులనూ సమస్యలనూ మనం ఎలా స్వీకరిస్తున్నామన్న దానిమీద ఒత్తిడి తీవ్రత ఆధారపడి ఉంటుంది. కొంతమంది చిన్న విషయానికే ఒత్తిడికి లోనైతే మరికొందరు మిన్ను విరిగి మీద పడ్డా చలించరు. ఈ స్పందించే తీరే ఒత్తిడి సమస్యకు మూలం. పెద్దలే కాదు, పిల్లలూ ఒత్తిడికి లోనవుతారు. చదువులో పోటీ, ఇంట్లో ఆర్థిక సమస్యలూ, తల్లిదండ్రుల మధ్య వివాదాలూ, కుటుంబసభ్యుల అనారోగ్యమూ... పిల్లల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో చోటుచేసుకునే మార్పులు కూడా పిల్లల్లో ఒత్తిడికి కారణమవుతాయి.

లక్షణాలు కన్పిస్తాయా?
కాస్త జాగ్రత్తగా గమనించుకుంటే ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపే లక్షణాలు చాలానే కన్పిస్తాయి. ముఖ్యంగా...
భౌతికంగా: తలనొప్పి, నిస్సత్తువ, నిద్రలేమి, అరచేతుల్లో చెమటలు, తల తిరగడం, వాంతులూ విరేచనాలూ, అజీర్తి, అధిక రక్తపోటు, తరచూ జలుబులూ ఇన్ఫెక్షన్లూ రావడం, స్త్రీలకు నెలసరిలో మార్పులు... కన్పిస్తాయి. ఒత్తిడి తీవ్రమైతే గుండెజబ్బులకూ దారితీస్తుంది.
విషయగ్రహణపరంగా: ఏకాగ్రత కొరవడుతుంది, నిర్ణయాలు తీసుకోలేరు. పనులు సకాలంలో పూర్తి చేయలేరు. తమ సామర్థ్యం మీద నమ్మకం కోల్పోతారు. భావోద్వేగపరంగా: స్తబ్దుగా ఉంటారు, దేనిమీదా ఆసక్తి ఉండదు. ప్రతి చిన్న విషయానికీ చిరాకుపడడం, భయపడడం, ఆందోళన చెందడం... చేస్తుంటారు. తీవ్ర భావోద్వేగాలకు గురవుతుంటారు.
ప్రవర్తనపరంగా:  నలుగురితో కలవడానికి ఇష్టపడరు. నోరారా నవ్వలేరు. తమ గురించి తాము పట్టించుకోరు, భాగస్వామిపట్ల కూడా నిరాసక్తంగా ఉంటారు. కాఫీ, టీలు అతిగా తాగడం, మద్యపానం, పొగతాగడం లాంటి వ్యసనాలకు అలవాటుపడడం... ఎక్కువవుతుంది. ఫలితంగా శరీరంలోని అన్ని అవయవాల మీదా దాని ప్రభావం పడుతుంది. మొత్తంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఒత్తిడి మానసిక సమస్య కదా?
మానసిక సమస్య కాబట్టే చాలామంది దాన్ని సమస్యగా చూడడం లేదు. కొందరేమో ఒత్తిడిని ఊతపదంగా వాడుతూ చిన్న చిన్న విషయాలకే సాకుగా చూపుతోంటే మరికొందరేమో తీవ్ర ఒత్తిడికి లోనవుతూ కూడా అది ఉన్నట్లు గుర్తించలేకపోతున్నారని అంటారు మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ రమణ చెరుకూరి. ఒత్తిడితో బాధపడే వారికే కాదు, వారి చుట్టూ ఉండేవారికి కూడా సమస్య గురించి అవగాహన అవసరం అంటారాయన. ఎవరైనా ఒత్తిడికి లోనవుతున్నామని చెబితే తేలిగ్గా కొట్టి పడేయకుండా సానుభూతితో విని అర్థం చేసుకోవాలి, సమస్యని సమస్యగా అంగీకరించాలి. అలా కాకుండా కొందరు ‘నీ పద్ధతి మార్చుకో, సానుకూలంగా ఆలోచించు, సీరియస్‌గా తీసుకోవద్దు’ లాంటి సలహాలిస్తారు. దాంతో ఒత్తిడితో బాధపడేవారు తనదే తప్పేమో అనుకుని మరింతగా ఆందోళనకు గురవుతారు. తనలోనే ఏదో లోపముందేమో, అందుకే ప్రతిదీ సమస్యగా కన్పిస్తోందేమోననుకుంటారు. ఇంకెవరితోనూ చర్చించరు.
అలాంటప్పుడు ఏం చేయాలి?
ఒత్తిడికి కారణం ఏమిటో గుర్తించాలి. ఆర్థిక సమస్య కారణమైతే దానికి పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. భాగస్వామితో కలిసి కూర్చుని సరైన ప్రణాళిక వేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడం, ఖర్చులు తగ్గించుకోవడం; ఆఫీసులో పని ఎక్కువగా ఉంటే- ఇతరుల సాయం తీసుకోవడం, పనిని అంచెలంచెలుగా ప్లాన్‌ చేసుకుని సమయం ప్రకారం పూర్తి చేయడాన్ని అలవాటు చేసుకోవడం... ఇలా సమస్యని బట్టి పరిష్కారాలు ఆలోచించాలి. కొంతమంది చిన్న చిన్న విషయాలకూ, తమ పరిధిలో లేని అంశాలకూ కూడా అతిగా స్పందిస్తారు. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఎంత కోపం తెచ్చుకున్నా మనం చేయగలిగిందేమీ ఉండదు. కానీ ఆ కోపం తాలూకు ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అలాంటి ప్రభావం తరచూ ఏదో ఒక కారణంగా శరీరంమీద పడుతూ ఉంటే అది తట్టుకోలేని స్థాయికి చేరుతుంది. అందుకే ఒత్తిడి వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలుగుతున్నట్లయితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతిసారీ కౌన్సెలింగ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు, సన్నిహితులతో చర్చించినా ఫలితం ఉంటుందంటున్నారు డాక్టర్‌ రమణ. దానివల్ల సమస్యను మరో కోణంలో చూడడం సాధ్యమవుతుంది. పంచుకోవడానికి ఎవరూ లేరనుకున్నప్పుడు, ఆ సమస్య మరొకరికి చెప్పుకునేది కాదనుకున్నప్పుడు కనీసం డైరీలో రాసి పెట్టుకున్నా చాలు- మనసుకి రిలీఫ్‌గా ఉంటుంది. ఒకటికి రెండుసార్లు అది చదువుకుంటే ఆలోచనలోనూ స్పష్టత వస్తుంది. దాంతో పాటే రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ కూడా సాధన చేయాలంటారాయన.  

అవేంటీ..?
ఒత్తిడిని తగ్గించుకోవడం మనచేతిలో పనే.బీ సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. మన పరిధిలో లేనివాటి గురించి అనవసరంగా ఆందోళన చెందడం మానాలి.
* యోగా, ధ్యానం లాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. స్ట్రెస్‌ హార్మోన్‌ స్థాయినీ, రక్తపోటునీ తగ్గిస్తాయివి. శ్వాస వ్యాయామాలతో పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ప్రశాంతత చేకూరుతుంది.
* కంటినిండా నిద్రపోవడం వల్ల శరీరమూ మనసూ రిలాక్సవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.  
* ఇష్టమైన వ్యాపకం కల్పించుకోవాలి. సంగీతం వినడం, బొమ్మలు వేయడం, పుస్తకాలు చదవడం లాంటివి చేయడం వల్ల ఆందోళన కలిగించే విషయం మీదినుంచి మనసు మళ్లి రిలాక్స్‌ అవుతుంది. పెంపుడు జంతువులు కూడా ఇందుకు తోడ్పడతాయి.
* స్నేహితులతో, కుటుంబసభ్యులతో రోజూ కాసేపైనా సరదాగా గడపడం చాలా అవసరం. ఉద్యోగవ్యాపారాల్లో ఎదుర్కొనే ఒత్తిళ్ల నుంచి బయటపడేసే తేలిక మార్గం అదే. దీనివల్ల అనుబంధాలూ బలపడతాయి. వేధిస్తున్న సమస్య గురించి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశమూ ఉంటుంది.  
రోజూ వ్యాయామం చేయడం ఒత్తిడికి మంచి మందు. నిద్ర బాగాపడుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
* కెఫీన్‌ ఆందోళనను పెరిగేలా చేస్తుంది కాబట్టి కాఫీ, టీలు పూర్తిగా మానేయాలి.
* కూరగాయలూ పండ్లూ చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం తీసుకోవాలి.
* ఇంటి బాధ్యతలను ఆఫీసుకీ, ఆఫీసు పనిని ఇంటికీ తీసుకెళ్లకూడదు. ఎక్కడి పని అక్కడే పూర్తి చేసుకోవాలి.
* దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తట్టుకోవడానికి చాలామంది వ్యసనాలను అలవాటుచేసుకుంటారు. దాంతో అటు ఒత్తిడీ ఇటు వ్యసనాలూ రెండిటి దుష్ప్రభావాలనూ ఎదుర్కొనాల్సి వస్తుంది.

వీటివల్ల కూడా కాకపోతే..?
ఒత్తిడికి కారణమవుతున్న చాలా సమస్యలకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో లేనివాటిని వదిలేయడమే ఉత్తమం. అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ సర్వే ప్రకారం ప్రధానంగా ఐదు అంశాలు దీర్ఘకాల ఒత్తిడికి కారణమవుతున్నాయి. అవి- డబ్బు, ఉద్యోగం(వ్యాపారం), కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, అనుబంధాలు. ఇవన్నీ కూడా ఆయా వ్యక్తుల స్పందనమీదే ఆధారపడి ఉంటాయి. ఉద్యోగం పోవడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం లాంటివి జరిగితే వాటి ప్రభావం పలు కోణాల్లో జీవితం మీద పడుతుంది కాబట్టి తీవ్రమైన ఒత్తిడి సహజం. అటువంటప్పుడు నిపుణులను సంప్రదించడానికి సందేహించకూడదు. ఆరోగ్యం బాగోకపోతే డాక్టరు దగ్గరికి వెళ్లినట్లే మనసు బాగోకపోతే మానసిక నిపుణుల దగ్గరికి వెళ్లడం అవసరం. కౌన్సెలింగ్‌ చాలా వరకూ సమస్యను తగ్గిస్తుంది.
ఒత్తిడిని మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద శత్రువు అంటున్నారు మానసిక నిపుణులు. అది బాధితులనే కాదు వారి చుట్టూ ఉన్న వారందరినీ ఇబ్బంది పెడుతుంది. సమాజానికీ నష్టం కలిగిస్తుంది. ఇంగ్లండ్‌కి చెందిన ఓ సంస్థ అధ్యయనం ప్రకారం మనదేశంలో కార్పొరేట్‌ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో 42 శాతం ఒత్తిడీ కుంగుబాటు సమస్యల్ని ఎదుర్కొంటున్నారట. అందుకే దీన్ని ‘సైలెంట్‌ కిల్లర్‌ డిసీజ్‌’ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.


 

   *             *           *

ఒక కంపెనీలో ఉద్యోగులకు సైకాలజిస్టు స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ శిక్షణ ఇస్తున్నారు. ఆయన ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ‘ఈ గ్లాసు ఎంత బరువుంటుంది’ అని అడిగారు. అక్కడున్నవాళ్లంతా రకరకాలుగా చెప్పారు.
‘గ్లాసు కచ్చితంగా ఎన్ని గ్రాముల బరువుందన్నది సమస్య కాదు. దీన్ని ఎంతసేపు మోయగలమన్నది సమస్య. చిన్న గ్లాసే, పది నిమిషాలు పట్టుకుంటే ఏమీ అనిపించదు. కానీ ఒక గంటసేపు పట్టుకుంటే చెయ్యి నొప్పి పెట్టడం మొదలవుతుంది. ఒక రోజు మొత్తం పట్టుకుంటే చెయ్యి తిమ్మిరెక్కి మొద్దుబారిపోతుంది. గ్లాసు బరువులో మార్పు లేకపోయినా ఎంత ఎక్కువ సమయం పట్టుకుంటే అంత ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. స్ట్రెస్‌ కూడా అంతే. ఒక్క క్షణం దాని గురించి ఆలోచిస్తే ఏమీ అనిపించదు. కాస్త ఎక్కువసేపు ఆలోచిస్తే బాధ మొదలవుతుంది. రోజంతా ఆలోచిస్తే- బుర్ర పనిచేయడమే మానేస్తుంది. ఇంకే పనీ చేయలేరు. అందుకే, ఒత్తిళ్లను ఎక్కడికక్కడ వదిలించుకోవాలి. రోజుల తరబడి మోయకూడదు. జీవితమన్నాక ఒడుదొడుకులు సహజం. ఈ క్షణంలో అనుభవిస్తున్న బాధా వేదనా ఏవీ శాశ్వతం కావు. పరిస్థితి మారుతుంది. ఒక్క విషయంలో ఓటమి ఎదురైతే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. మరో విషయంలో తప్పకుండా విజయం సాధించవచ్చు... చేయాల్సిందల్లా ధైర్యంగా ముందుకెళ్లడమే..! ’ వివరించి చెప్పారాయన.


ఒత్తిడి ప్రభావం ఏ భాగం మీద... ఎలా?

దీర్ఘకాల ఒత్తిడి శరీరంలోని అన్ని అవయవాల మీదా ప్రభావం చూపుతుంది.
చర్మం: మొటిమలు, దురద, దద్దుర్లు, ఎలర్జీలు రావచ్చు. సోరియాసిస్‌కి కూడా దారితీయవచ్చు.
జీర్ణ వ్యవస్థ: కడుపునొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం లాంటివి కన్పిస్తాయి. కడుపులో అల్సర్లు ఏర్పడతాయి.
క్లోమగ్రంథి: ఒత్తిడి వల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దాంతో క్రమంగా మధుమేహం, ఊబకాయం, రక్తనాళాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.
రోగనిరోధక వ్యవస్థ: వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. జబ్బుల నుంచి కోలుకోవడమూ కష్టమవుతుంది. ఒంట్లో ఇన్‌ఫ్లమేషన్‌(వాపు ప్రక్రియ) వేగవంతమవడం మూలంగా దీర్ఘకాల సమస్యలూ ముంచుకొస్తాయి.
మెదడు: తలనొప్పి, పార్శ్వనొప్పి, తీవ్రమైన కోపం, నిస్సత్తువ, ఆందోళన లాంటివి కుంగుబాటుకీ దారితీస్తాయి.
గుండె: రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం వల్ల పక్షవాతం, గుండెపోటు ముప్పు పొంచివుంటుంది.  
కాలేయం: ఇది కూడా గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేయడంతో షుగర్‌ వ్యాధి ముంచుకొచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పేగులు: పేగులకు పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. జీవక్రియల వేగం మందగిస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తి తగ్గుతుంది. పేగుల్లో పూత, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతాయి.
పునరుత్పత్తి వ్యవస్థ: ఒత్తిడి వల్ల శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. టెస్టోస్టెరాన్‌, ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల ఉత్పత్తి పడిపోయి సంతాన సామర్థ్యం తగ్గిపోతుంది.
కీళ్లు, కండరాలు: నొప్పులు, వాపులతో పాటు భుజాలు, వెన్నుపూసలు బిగుసుకుపోతాయి. ఎముక సాంద్రత కూడా తగ్గుతుంది.


 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని