ఈ భరత్‌మిత్రా.. రైతు మిత్రుడు

ఓ స్వామీజీని కలిసేందుకు భారత్‌ వచ్చిన ఓ విదేశీయుడు... రైతుల ఇబ్బందుల్ని అర్థంచేసుకుని తనకు జ్ఞానబోధ చేసిన దేశానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. తన పేరును భరత్‌ మిత్రాగా

Updated : 06 Mar 2022 00:55 IST

ఈ భరత్‌మిత్రా.. రైతు మిత్రుడు

ఓ స్వామీజీని కలిసేందుకు భారత్‌ వచ్చిన ఓ విదేశీయుడు... రైతుల ఇబ్బందుల్ని అర్థంచేసుకుని తనకు జ్ఞానబోధ చేసిన దేశానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. తన పేరును భరత్‌ మిత్రాగా మార్చుకుని ఇక్కడే స్థిరపడి ఓ సంస్థను ప్రారంభించాడు. ఇప్పుడు ఆ సంస్థ దేశవ్యాప్తంగా కొన్ని వందలమంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాలకు విస్తరించిన ఓ బ్రాండ్‌గా ఎదిగింది. అదే ‘ఆర్గానిక్‌ ఇండియా’.

సుమారు ఇరవైమూడు రకాల గ్రీన్‌ టీ రుచుల నుంచీ హెర్బల్‌నూనెలూ, వంటనూనెలూ, ఔషధాల దాకా ఎన్నో రకాల ఉత్పత్తుల్ని అందించే ఆర్గానిక్‌ ఇండియాతో ఇప్పుడు దాదాపు 2500 మంది రైతులు పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు పదివేల మందికి ఉపాధి కల్పిస్తూ జర్మనీ, ఫ్రాన్స్‌, ఆఫ్రికా, అమెరికా వంటి నలభై దేశాలకు తమ ఉత్పత్తుల్ని విస్తరించిందీ సంస్థ. ఇకపైనా ఎన్నో ప్రణాళికలతో అడుగులు వేస్తున్న ఆర్గానిక్‌ ఇండియాను పాతికేళ్లక్రితం ఎనిమిది మంది రైతులతో ప్రారంభించాడు భరత్‌మిత్రా. ఇజ్రాయెల్‌లో పుట్టిపెరిగిన భరత్‌ అసలు పేరు యోవ్‌ లెవ్‌. భారత్‌లో ఉండే పాపాజీ అనే ఆధ్యాత్మిక గురువును చూసేందుకు ఇక్కడకు వచ్చిన అతను ఆ తరవాత తన పేరును భరత్‌ మిత్రాగా మార్చుకున్నాడు.  గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు రైతులు వ్యవసాయం చేసే తీరూ, వాళ్ల సమస్యలూ అర్థమయ్యాయి. వాళ్లకు తనవంతుగా ఏదయినా సాయం చేయాలనుకున్న అతను బాగా ఆలోచించి చివరకు ఆర్గానిక్‌ ఉత్పత్తుల తయారీని ప్రారంభించాలనే ఉద్దేశంతో ‘ఆర్గానిక్‌ ఇండియా’ సంస్థను లఖ్‌నవూలోని ఆజంగఢ్‌లో ప్రారంభించాడు. రైతుల చేత ఆర్గానిక్‌ వ్యవసాయం చేయించి ఆ పంటను తాను కొనుగోలు చేయాలనుకున్న భరత్‌ కొందరు రైతుల దగ్గరకు వెళ్లి తులసిని పండించమని అడిగాడు. కానీ రైతులు అందుకు అంగీకరించకపోగా ‘సేంద్రియ పద్ధతిలో గోధుమ లేదా వరి లాంటివి పండించొచ్చు. ఆ పంటను మీరు కొనకపోయినా మేము తింటాం. కానీ తులసిని పండించాక మీరు కొనకపోతే దాన్ని మేం ఏం చేసుకుంటాం’ అని అడిగారట. కేవలం ఎనిమిది మంది రైతులే ముందుకు వచ్చి ఐదారు ఎకరాల్లో తులసిని పండించేందుకు సిద్ధమయ్యారట. మంచి దిగుబడితోపాటు ధర కూడా రావడంతో క్రమంగా తులసితోపాటూ లావెండర్‌, చామంతి, బ్రాహ్మీ, మల్లె వంటివే కాకుండా.. ఎన్నో రకాల ఔషధాల మొక్కల్ని పెంచేందుకు వందల సంఖ్యలో రైతులు ముందుకొచ్చారని వివరిస్తాడు భరత్‌. అలా రైతుల నుంచి సేకరించిన ముడిసరకు సారం ఏ మాత్రం తగ్గకుండా ప్రత్యేక ప్రాసెసింగ్‌ పద్ధతుల ద్వారా ఉత్పత్తులు తయారుచేయడమే ఈ సంస్థ ప్రత్యేకత.

ఉచితంగా ప్రచారం

రైతులు పండించిన తులసితో హెర్బల్‌ గ్రీన్‌టీని తయారుచేశాక భరత్‌కు దాన్ని మార్కెటింగ్‌ చేయడం పెద్ద సవాలుగా మారిందట. అక్కడక్కడా చిన్నస్థాయిలో ఔట్‌లెట్లను పెట్టి కనిపించిన వారికి వేడినీటిలో గ్రీన్‌టీ బ్యాగును ముంచి రుచి చూడమని ఇచ్చేవాడట. అలా భారత్‌లోనే కాదు అమెరికాలోనూ తులసి టీకి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. భారత్‌లోని కిరాణా దుకాణాలూ, సూపర్‌మార్కెట్లకూ గ్రీన్‌టీని విక్రయిస్తూనే తమ సంస్థ పేరుమీద ఆన్‌లైన్‌ స్టోర్‌నీ, దేశవ్యాప్తంగా వంద అవుట్‌లెట్లనూ ఏర్పాటు చేసి తమ సంస్థ టర్నోవరు 350 కోట్ల రూపాయలకు విస్తరించాడు. మరి సంస్థ వల్ల రైతులు ఎలా లాభపడతారని అంటే... ‘ఒకప్పుడు రసాయన ఎరువులు వాడకపోతే పెద్దగా దిగుబడి ఉండదని చెప్పిన రైతులే ఇప్పుడు మాతో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొస్తున్నారు. మేం వాళ్ల నుంచి  పంట కొనుక్కోవడమే కాదు సేంద్రియ వ్యవసాయ విధానంలోనే ఎక్కువ దిగుబడి వచ్చే మార్గాలను వివరిస్తాం. ఎప్పటికప్పుడు వాతావరణానికి తగినట్లుగా ఎలాంటి పంటలు వేయాలనే అంశంపైనా అవగాహన కల్పిస్తూ ప్రయోగాలు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. విత్తనాల సేకరణ, సహజ ఎరువుల తయారీ, నీటి సంరక్షణ... ఇలా ఎన్నో అంశాలను నేర్పించగలిగాం. అసలు పొలాలే లేనివారికి - ముఖ్యంగా మహిళలకు - ఆ పంటల్ని సేకరించడంలో ఉపాధి కల్పిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మేం ఆర్గానిక్‌ ఇండియాను ఓ సంస్థగా కాకుండా పెద్ద కుటుంబంగా చూస్తున్నాం. అందుకే మాతోపాటూ రైతులూ ఉన్నతంగా ఎదిగేలా చేస్తాం. ఎన్నో రైతు కుటుంబాలు మాతో పాతికేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి.

ఈ ప్రయాణం ఇకపైనా ఇలాగే కొనసాగుతుందనే నమ్మకం నాకు ఉంది...’ అని వివరిస్తాడు భరత్‌.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

కళ్ల అందాన్ని రెట్టింపు చేసే కాటుకను క్రీ.పూర్వం 3100 నుంచే ఈజిప్టు వాసులు ఉపయోగించేవారట. సూర్యకిరణాల నుంచి కళ్లకు రక్షణగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడు తుందనేది వారి నమ్మకం. ఈ కాటుకను ‘గలేనా ఐ పెయింట్‌’అని పిలిచేవారు. దీన్ని కళ్లతో పాటు నుదురు, ముక్కు వంటి ఇతర శరీరభాగాలపైనా రాసుకునేవారు.


ఇది ప్రపంచంలోనే పొట్టి ఆవు!

ఆ ఆవులు... చూడ్డానికి దూడల్లానే ఉంటాయి. ఇంత చిన్నవి పాలు ఏమిస్తాయిలే అనుకుంటాం. కానీ రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల పాలను ఇస్తాయి. అయితే కొన్నేళ్ల క్రితం అవి దాదాపు అంతరించిపోయాయనే అనుకున్నారు. కానీ వాటిని పునరుద్ధరించడమే కాదు, కొందరు పెంపుడు జంతువుల్లానూ పెంచుకుంటున్నారు. అత్యంత చిన్నదిగా గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లోకీ ఎక్కిన ఆ ఆవు జాతి పేరే ‘వేచూర్‌’!

ఏ ప్రాంతానికి చెందిన వాళ్లయినా కనీసం ఐదు అడుగుల ఎత్తు ఉంటారు. అదే ఏ రెండు మూడు అడుగులో ఉంటే వాళ్లను మరుగుజ్జు అంటాం. మనుషుల్లో జన్యులోపం వల్ల అలా జరుగుతుంది. కానీ పశువుల్లో- అదీ ఆవుల్లో కొన్ని జాతులు సహజంగానే పొట్టిగా ఉంటాయి. పొట్టి జాతులు చాలానే ఉన్నప్పటికీ కేరళలోని వేచూర్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పుంగనూరు ఆవులు ప్రపంచంలోకెల్లా చిన్నవిగా పేరొందడమే కాదు, వీటిని పెంచేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారట. ఎందుకంటే ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లుగా తక్కువ ఆహారం తీసుకుని ఎక్కువ మొత్తంలో అదీ కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు ఇస్తాయి మరి.

కేరళలోని కొట్టాయం జిల్లా వేచూరులో పుట్టిన ఈ ఆవు సాధారణ ఎత్తు 87 సెం.మీ.- అంటే, సుమారు రెండు అడుగుల పది అంగుళాలు, పొడవు 124 సెం.మీ.(నాలుగు అడుగుల ఒక అంగుళం). 1960 వరకూ కేరళలో వీటి సంతతి బాగానే ఉండేది. ఆపై సంకరీకరణతో ఈ జాతి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. దాంతో త్రిసూర్‌లోని కేరళ వెటర్నరీ అండ్‌ ఏనిమల్‌ సైన్స్‌ యూనివర్శిటీకి చెందిన డా.సోసమ్మ ఇయపె అనే ప్రొఫెసర్‌, ఈ జాతిని సంరక్షించేందుకు 1989లో నడుం కట్టి, 30 ఏళ్లుగా కృషిచేస్తూ వచ్చారు. విద్యార్థులతో కలిసి ఊరూరా తిరిగారు. మొదట్లో ఈ ఆవుల ఆచూకీ కోసం కొట్టాయం, అళప్పుజ జిల్లాల్ని పూర్తిగా గాలించినా ఒక్కటీ కనిపించలేదట. ఎట్టకేలకు మనోహరన్‌ అనే రైతు దగ్గర ఒకే ఒక్క ఆవు దొరికింది. దాన్ని ఆయన అమ్మడానికి నిరాకరించడంతో ఎలాగో నచ్చజెప్పి తీసుకున్నారట. అలా ఆ ఏడాదిలో 24 ఆవులను వెతికి పట్టుకుని వాటిని మన్నుత్తి అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో ఉంచి సంతతిని పెంచారు. అయితే గిట్టని వాళ్లెవరో విషం పెట్టడంతో చాలా ఆవులు మరణించడంతో మరింత జాగ్రత్తగా సంరక్షించాల్సి వచ్చేదట. 1998లో వేచూర్‌ కన్సర్వేషన్‌ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి రైతుల సాయంతో వీటి సంఖ్యను పెంచారట. ప్రస్తుతం జెర్మ్‌ప్లాజమ్‌- అంటే, వేచూర్‌ గిత్తల వీర్యాన్ని రైతులకీ అందిస్తున్నారట. ఆ విధంగా పదుల సంఖ్యలో ఉన్నవాటిని ఐదువేల వరకూ పెంచగలిగారు. అందుకే ఈ ఏడాది సోసమ్మను పద్మశ్రీ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. ఈ ఆవులు రోజుకి 3 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తాయి. కొవ్వు శాతం 4.7 నుంచి 5.8 వరకూ ఉంటుంది. అయితే కొవ్వు రేణువులు చిన్నగా ఉండటంతో తేలికగా జీర్ణమవుతాయట. పాలల్లోని ఎ2 అనే కేసిన్‌ రకం ప్రొటీన్‌ ఉండటంతో ఇది మధుమేహం, హృద్రోగాల్ని నిరోధించడంతోపాటు మందమతినీ పెరగనివ్వదట. అధికంగా ఉండే ఆర్జినైన్‌ అనే పదార్థం మూర్ఛరోగులకు మేలు చేస్తుందట. రోగనిరోధకశక్తిని పెంచే ల్యాక్టోఫెర్రిన్‌ అనే ప్రొటీనూ ఈ పాలల్లో ఎక్కువే. అందుకే ఆయుర్వేదం ఈ పాలు ఎంతో మంచివనీ వీటికి సూక్ష్మజీవుల్ని నిరోధించే శక్తి ఉందనీ అంటోంది.


 

పుంగనూరు ఆవు!

చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామంలో పుట్టిన ఈ పొట్టి ఆవులు ఎండుగడ్డి తినీ జీవించగలవు. ఈ పాలల్లో ఔషధ గుణాలు ఉంటాయనేది ఒకెత్తయితే, మూపురంతో ఉన్న ఈ ఆవు ఎంతో పవిత్రమైనదనీ అందుకే ఈ పాల నుంచి తీసిన నెయ్యితోనే తిరుమలలోని శ్రీవారిని అభిషేకిస్తారనీ అంటారు. ఆ కారణంతోనే ఒకప్పుడు కేవలం వంద రూపాయలకే వచ్చే ఆవు, నేడు లక్ష నుంచి ఇరవై లక్షల వరకూ పలుకుతోంది. చూడ్డానికి దూడలా ఉన్నా ఈ ఆవు రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల పాలు ఇస్తుందట. పైగా సాధారణ ఆవు పాలల్లో 3.5 వెన్న శాతం ఉంటే, వీటిల్లో మాత్రం 8 శాతం ఉంటుంది. సంకరీకరణ కారణంగా ఈ జాతి అంతరించిపోయే దశకు చేరుకోవడంతో ఏపీ ప్రభుత్వం వీటిని పునరుద్ధరించేందుకు మిషన్‌ పుంగనూరుకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పలమనేరు పశు సంరక్షణ కేంద్రంలో వీటిని ప్రత్యేకంగా పెంచుతోంది. ఇవే కాదు, కాసర్‌గడ్‌ డ్వార్ఫ్‌, మల్నాడు గిద్ద.. వంటి మరికొన్ని జాతులూ ఉన్నాయి. ముద్దుగా ఉండే రూపం వల్ల ఈ పొట్టి ఆవుల్ని ఇటీవల కొందరు పెంపుడు జంతువుల్లా పెంచుకునేందుకూ ఇష్టపడుతున్నారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..