Published : 24 Sep 2022 23:58 IST

మీ పిల్లల హోంవర్క్‌ మేం చేయిస్తాం!

పిల్లలు పాఠాలు నేర్చుకోవడంలో వెనుకబడితే ప్రత్యేక తరగతుల్లో చేర్పిస్తాం. ఒకవేళ అక్కడా అర్థం కావడం లేదంటే...ట్యూషన్లు పెట్టిస్తాం. మరి హోం వర్క్‌లూ, ప్రాజెక్టులూ, అసైన్‌మెంట్‌ల పరిస్థితో అని అడిగితే...‘అమ్మో అది మాత్రం మాకు పెద్ద సమస్యే’ అనే తల్లిదండ్రులే ఎక్కువ. ‘ఇక ఈ ఇబ్బంది మీకు అక్కర్లేదు, మేం అవన్నీ చేయిస్తాం’ అంటున్నారు హోంవర్క్‌ ట్యూటర్లు. ఒక్కో సబ్జెక్టుకీ ఒక్కో ట్యూటర్‌ ఉండటం తెలిసిందే...కానీ ఇలా హోంవర్క్‌లూ, ప్రాజెక్టు వర్కులూ చేయించే ట్యూటర్లు ఎవరూ అంటారా? చదివేయండి.

దీప్తి ఆఫీసు నుంచి వచ్చీ రాగానే... ఐదేళ్ల అహనా పరుగెత్తుకొచ్చి ‘అమ్మా రేపు ఫ్యామిలీ డే అట. మన ఇంట్లో ఉన్న వారందరి ఫొటోలనూ ఓ కాగితంపైన అతికించి తెమ్మన్నారమ్మా’ అని చెబుతుంటే ఆమెకు గుండె ఆగినంత పనయ్యింది. కారణం...‘అప్పటికప్పుడు అందరి ఫొటోలూ సేకరించి ప్రింట్లు వేయించాలంటే పెద్ద పనే’ పైగా అవన్నీ తనే చేయాలి. అందుకే కనీసం మంచినీళ్లైనా తాగకుండానే ఉసూరుమంటూ స్టూడియోకి పరుగెత్తింది.

* స్వేచ్ఛని టీచరు ఆరు రకాల హెర్బ్స్‌ని గుర్తించి వాటి ఆకులను కాగితంపైన అతికించి పేర్లు రాయమన్నారట. దాంతో వాళ్లింట్లో అందరూ అదే పనిలో ఉన్నారు.

* ఇక, శ్రేయాన్ష్‌ వాళ్లమ్మ స్రవంతిది మరో సమస్య. తను పెద్దగా చదువుకోలేదు. కొడుక్కి ఇచ్చే హోం వర్క్‌ని పూర్తి చేయించడానికి ముందు- తను అర్థం చేసుకోవడానికి కుస్తీలు పడుతోంది. చివరికి ఏదో మమ అనిపించి పూర్తి చేయిస్తోంది.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే... బడికెళ్లే పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. అయితే, ఈ ఇబ్బందికి ఇప్పుడు హోం ట్యూటర్స్‌ పరిష్కారం చూపిస్తున్నారు.

వెనకటి రోజుల్లో- పిల్లల చదువులకు సంబంధించి ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగా, తల్లిదండ్రుల పాత్ర తక్కువగా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. మార్కులకూ, ర్యాంకులకూ ప్రాధాన్యం పెరగడంతో- ఇప్పుడు అందరూ తమ పిల్లలకు కేజీ నుంచే ఐఐటీ చదువులకు పునాదులు వేయాలనుకుంటున్నారు. ఎంత కష్టమైనా సరే కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. అయితే, ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరో వైపు బడికెళ్లిన పిల్లలు అక్కడ ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కానీ... ఇళ్లకు మాత్రం ప్రాజెక్టులంటూ, వర్క్‌షీట్లంటూ బోలెడు హోం వర్క్‌ను వెంట తెస్తున్నారు. ఇక, స్కూళ్లేమో రోజుకో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.దాంతో పిల్లలు రైస్‌ డే, రోజ్‌ డే, మిల్క్‌డే, హ్యాండ్‌లూమ్‌ డే, గ్రాండ్‌పేరెంట్స్‌ డే... అంటూ ప్రత్యేక దినోత్సవాలెన్నో జరిపేసుకుంటున్నారు. టీచర్లేమో సంబరాలతో సరిపెట్టకుండా ఆయా అంశాల ప్రత్యేకతలూ తెలిపే వివిధ ప్రాజెక్టులను హోం వర్క్‌గా ఇచ్చేస్తున్నారు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ...

సాదాసీదా చదువులు చదివిన కొందరు పేరెంట్స్‌ ఈ అసైన్‌మెంట్లను ఏదోలా పూర్తి చేయించాలనుకున్నా.. సామర్థ్యం చాలక తంటాలు పడితే, ఉద్యోగస్థులైన తల్లిదండ్రులేమో ఇవన్నీ చేయించే తీరిక మాకెక్కడిదీ అని వాపోతున్నారు. పాఠాలైతే ఏదోలా చెప్పి చదివించొచ్చు. కానీ, రోజూ ఇలా చిన్నారులతో హోంవర్క్‌ చేయించడం మాత్రం కష్టమే. అందులోనూ కాస్త పెద్ద క్లాసు పిల్లలతో చేయించడం మరింత ఇబ్బంది. ఆ హోంవర్క్‌లూ, ప్రాజెక్టులూ సరిగా చేయకపోతేనేమో మార్కులతో పాటు అవార్డులూ, రివార్డులూ కోల్పోవాల్సి రావొచ్చు. అందుకే తల్లిదండ్రులకు ఈ విషయంలో అంత దిగులు... ఈ ఇబ్బందులను గుర్తించిన ట్యూటర్‌ సంస్థలు... హోం వర్క్‌ చేయించేందుకు కూడా ఇప్పుడు ట్యూటర్లను ఇంటికి పంపిస్తున్నాయి. ‘టీచరాన్‌’, ‘లెర్న్‌ పిక్‌’, ‘అర్బన్‌ప్రొ’, ‘సూపర్‌ ప్రొఫ్‌’, ‘హోం శిక్ష’ వంటి సంస్థలన్నీ ఈ తరహా సేవలు అందిస్తున్నవే. వీటిల్లో కొన్ని హోంవర్క్‌ చేయించడంతో పాటు... ప్రాజెక్టులనూ, వర్క్‌షీట్లనూ కూడా సృజనాత్మకంగా పూర్తిచేసేలా విద్యార్థులకు సాయం చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన చార్టులూ, కాగితాలూ, రంగులూ, ఇతరత్రా సామగ్రిని ఈ ట్యూటర్లు అందుబాటులో ఉంచుతారు. ఫలితంగా వాటికోసం అప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన పని కూడా లేదు. ఈ విధానం వల్ల విద్యార్థులు వివిధ అంశాలను సులువుగా, సృజనాత్మకంగా నేర్చుకోగలగడంతోపాటు తల్లిదండ్రులకు ఎంతో శ్రమ తప్పుతోంది. అందుకే ఈ ట్యూటర్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.


తొలి నెలలే కీలకం!

పిల్లల ఆరోగ్యంలో తొలి ఆరునెలలే ఎంతో కీలకం. ఆ సమయంలో వాతావరణ కాలుష్యానికి గురయితే వాళ్ల పొట్టలోని మైక్రోబయోమ్‌ మారిపోతుంది. దాంతో వాళ్లు రకరకాల ఇన్ఫెక్షన్లూ జీవక్రియకి సంబంధించిన సమస్యల బారినపడుతున్నట్లు చెబుతున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు. ఇందుకోసం వీళ్లు సదరన్‌ కాలిఫోర్నియాలో నివసించే వందమంది యువకుల్ని ఎంపికచేసి వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియాని పరిశీలించగా- దానికీ గాల్లోని కలుషితాలకీ సంబంధం ఉన్నట్లు గుర్తించారట. ఆ తరవాత వాళ్లు ఆ ప్రాంతానికే చెందిన కొందరు పసిపిల్లల్ని ఎంపికచేసి వాళ్ల మలమూత్రాల శాంపుల్స్‌ని పరీక్షించగా- కాలుష్యానికీ పొట్టలోని బ్యాక్టీరియాకీ సంబంధం ఉన్నట్లు తేలింది. అదెలా అంటే- గాల్లో కలుషిత వాయువులు తక్కువగా ఉన్న ప్రదేశంలో నివసించే పసివాళ్లలో కన్నా కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పిల్లల పొట్టలో 60 శాతం ఫాస్కోలార్కొటొబ్యాక్టీరియం తక్కువగా ఉందట. ఈ బ్యాక్టీరియా ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది... ఎందుకంటే ఇది పొట్టకి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది. దీన్నిబట్టి చిన్నప్పుడే పొట్టలోని మైక్రోబయోమ్‌ మారిపోవడం వల్ల పెద్దయ్యాక కూడా అదే ఉంటుందనీ ఆ కారణంగానే వాళ్లలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయనీ అంటున్నారు. కాబట్టి చిన్న వయసులో పిల్లల్ని కాలుష్యానికి ఎంత దూరంగా పెంచగలిగితే అంత మంచిది.


ఈ టాటూలతో నొప్పి ఉండదు!

ఏమాత్రం నొప్పి లేకుండా రక్తం చిందకుండా ఎవరికి వాళ్లే టాటూ వేసుకోవచ్చు అంటున్నారు జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు అత్యంత సన్నని సూదులతో ఉన్న స్కిన్‌ ప్యాచ్‌లను రూపొందించారు. ఈ ప్యాచ్‌ను చర్మంమీద పెట్టి నొక్కగానే ఆ మైక్రో నీడిల్స్‌ కరిగి అందులోని ఇంకు చర్మ కణాల్లోకి వెళ్లిపోతుంది. అయితే ఇవి కళాత్మక టాటూలకి ప్రత్యామ్నాయం అనలేం. కానీ అంకెలూ అక్షరాలూ లేదా చిన్న పాటి సంకేతాల్ని వేయించుకునేవాళ్లకి సరిపోతాయి. క్యాన్సర్‌ రేడియేషన్‌ చికిత్సల కారణంగా ఏర్పడిన మచ్చలు కనిపించకుండా ఉండేందుకూ కొందరు టాటూలను వేయించుకుంటారు. అలాగే పెంచుకునే కుక్కలకీ పిల్లులకీ స్టెరిలైజేషన్‌ చేయించారన్నదానికి సంకేతంగానూ ఈ రకమైన పచ్చబొట్టును వేయొచ్చు. అందుకే మందులూ వ్యాక్సీన్లు ఇచ్చేందుకు వాడే ఈ మైక్రో నీడిల్‌ టెక్నాలజీని టాటూలకీ వాడినట్లు చెబుతున్నారు నిపుణులు.


నీళ్ల దగ్గరకి వెళుతున్నారా?

తరచూ నదీప్రవాహాల్నీ సాగరతీరాల్నీ సెలయేళ్లనీ సందర్శించేవాళ్లు మానసిక సమస్యలకు దూరంగా ఉంటారట. ముఖ్యంగా నీళ్లకు సమీపంలో నివసించేవాళ్లలో ఒకలాంటి ప్రశాంతత కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం పచ్చగానో నీలంగానో ఉంటే ఆ ప్రదేశంలో జీవించేవాళ్లలో మానసిక అలజడీ ఒత్తిడీ తక్కువగా ఉంటున్నట్లు గతంలోనే గుర్తించారు లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు. అయితే నీలాకాశాన్ని చూస్తూ నీళ్లకు సమీపంలో జీవిస్తున్నవాళ్లలో మానసిక సమస్యలు మరింత తక్కువగా ఉంటున్నాయట. ఇందుకోసం వీళ్లు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లని ఎంపికచేసి కొంతకాలం నీళ్లకు సమీపంలో నివసించేలా చేసినప్పుడు వాళ్లలో మెరుగైన ఫలితాలు వచ్చాయట. అంతేకాదు, మిగిలినవాళ్లతో పోలిస్తే నదీ తీరాల్లోనూ సముద్ర తీరాల్లోనూ జీవిస్తూ ఆయా ప్రాంతాల్లో తరచూ పర్యటించే వాళ్లు ఎక్కువ ఆనందంగా ఉంటున్నారట. వారానికి కనీసం రెండుగంటలపాటు నీళ్ల దగ్గర గడిపినా మంచిదేననీ కాబట్టి తరచూ తీరప్రాంతాల్నీ సెలయేళ్లనీ జలపాతాల్నీ చూసిరావడం మేలని సూచిస్తున్నారు.


ఆకలేస్తే కోపమొస్తుంది!

‘నాకు కోపం వస్తోంది...’ అని ఎవరైనా అంటే వాళ్లనోసారి నిశితంగా చూడండి... ‘ఆపై ఆకలిగా ఉందా’ అని అడగండి... అప్పుడు మీకు వాళ్ల కోపానికి కారణమేంటో కచ్చితంగా తెలిసిపోతుంది అంటున్నారు లండన్‌లోని ఆంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీ, ఆస్ట్రియాలోని కార్ల్‌ ల్యాండ్‌స్టీనర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు. ఆకలితో వచ్చే ఈ కోపాన్నే హ్యాంగ్రీ అనీ పిలుస్తున్నారు. ఆకలేయడం వల్ల కోపం, చిరాకులు బాగా పెరిగిపోతాయనీ, వంద మందిలో సుమారు 40 మందికి కోపం రావడానికి కారణం ఆకలేననీ వాళ్ల అధ్యయనంలో తేలిందట. భోజన వేళల మధ్య విరామం ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గిపోతాయి. దాంతో ఒత్తిడిని పెంచే కార్టిసాల్, కోపాన్ని కలిగించే అడ్రినలిన్‌ హార్మోన్ల శాతం పెరుగుతుంది. అందుకే ఆకలి కోపానికి కారణమవుతుంది. ఇలా వచ్చిన హ్యాంగ్రీ భావోద్వేగాలనీ ప్రవర్తననీ కూడా ప్రభావితం చేస్తుంది అని వివరిస్తున్నారు. ఆ సమయంలో మెదడు చురుకుతనం తగ్గడంతోపాటు స్వీయ నియంత్రణ కూడా ఉండదట. కాబట్టి అలాంటి సమయంలో పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకుంటే ఆ ఆకలీ తద్వారా కోపమూ రెండూ వెంటనే తగ్గుతాయి అని చెప్పుకొస్తున్నారు సదరు పరిశోధకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని