Updated : 24 Feb 2022 16:26 IST

సమతా స్ఫూర్తి... రామానుజ మూర్తి!

విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి... వ్యక్తికన్నా సమాజశ్రేయస్సే ముఖ్యమని చాటిన మానవతావాది... భగవదారాధనకు కులమతాలు ప్రాతిపదిక కాదన్న సమతామూర్తి... రామానుజాచార్యులు. వెయ్యేళ్లక్రితం ఈ భూమి మీద నడిచిన ఆ మహానుభావుడి విశ్వమానవ తత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏర్పాటుచేసిందే సమతా విగ్రహం. కరుణ కురిపించే విశాల నేత్రాలతో, సాంత్వన చేకూర్చే చిరుదరహాసంతో కన్పించే ఈ మూర్తి హైదరాబాద్‌కి సమీపంలో అత్యంత వైభవంగా రూపుదిద్దుకున్న స్ఫూర్తికేంద్రంలో 108 దివ్యదేశాల(వైష్ణవ క్షేత్రాలు) నడుమ కొలువుదీరింది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం త్వరలో భక్తుల సందర్శనకు ద్వారాలు తెరుస్తున్న నేపథ్యంలో... రామానుజాచార్యుల జీవితవిశేషాల సమాహారం మీకోసం.

శ్రీరంగం నుంచి ఇద్దరు శిష్యులను వెంటపెట్టుకుని హరినామస్మరణ చేస్తూ నూట యాభై మైళ్లు కాలినడకన తిరుగోష్ఠియూర్‌ చేరుకున్నాడు ఒక యువకుడు. తాము వెతుకుతున్న గురువు గోష్ఠీపూర్ణులవారు ఉండే ఊరు అదేనని తెలియగానే నేలమీద పడి దండాలు పెడుతూ ఆయన నివాసానికి వెళ్లాడు.

‘ఆచార్యా, నా పేరు రామానుజులు... కాంచీపూర్ణులవారి ఆదేశంతో మీ చరణాలనే శరణు కోరుతూ వచ్చాను. శిష్యుడిగా స్వీకరించి జ్ఞానభిక్ష పెట్టండి’ అని వేడుకున్నాడు.

ఆ యువకుడిని నిశితంగా పరిశీలించిన ఆచార్యులవారు ‘రామానుజా... తిరుమంత్రఉపదేశం పొందడానికి అర్హత రావాలంటే నెలరోజులపాటు ఉపవాసం చేస్తూ సంసారం పట్ల రక్తిని పూర్తిగా వదులుకోవాలి. అది సాధించి తిరిగిరా’ అని చెప్పారు.

‘అలాగే స్వామీ’ అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు ఆ ముగ్గురూ. ఆచార్యుల వారు కాదనలేదు. మళ్లీ రమ్మన్నారు అంతేకదా... అని మనసుకు సర్దిచెప్పుకుంటూ వాగులూ వంకలూ అడవులూ పర్వతాలూ దాటుతూ ఉత్సాహంగా ఊరు చేరారు.

గురువు చెప్పినట్లే నెల రోజుల ఉపవాసదీక్ష చేశారు. మళ్లీ ప్రయాణమై తిరుగోష్ఠియూర్‌ చేరుకున్నారు.

‘మరో నెల ఉపవాసం చేసి అహంకార మమకారాలను వదులుకోవటానికి ప్రయత్నించి తిరిగిరా’ చెప్పారు గురువు.

... అలా రెండుసార్లూ మూడుసార్లూ కాదు, ఏకంగా పద్దెనిమిది సార్లు.

రామానుజులు కాలినడకన అంతదూరమూ వెళ్తూనే ఉన్నాడు... ఆచార్యుల వారు మరో కొత్త నియమం చెబుతూనే ఉన్నారు.

ఒకరిది జ్ఞానదీక్ష... దాన్ని సాధించడానికే ఆ అంతులేని సహనం. మరొకరిది శిష్యుడి అర్హతలకు సానపట్టి నిజమైన వైష్ణవుడిగా తీర్చిదిద్దాలన్న తపన. అందుకే ఆ కాఠిన్యం.

నిజానికి రామానుజుడు గురువు పెట్టిన ఒక్కో పరీక్షలోనూ విజయం సాధిస్తూనే ఉన్నాడు. పదిహేడోసారీ గురువు తిప్పి పంపేసరికి రామానుజునిలో నిరాశ ఆవరించింది. ఈ జన్మలో తనకి అష్టాక్షరీ మంత్రార్థం లభించదేమోనని పరితపించాడు.

ఎట్టకేలకు గురువు అనుగ్రహించారు, ఒంటరిగా రమ్మని కబురు పంపారు.

రామానుజుడు ఎప్పటిలాగే తన ప్రియశిష్యులిద్దరినీ తీసుకెళ్లాడు.

‘ఒక్కరినే రమ్మన్నాను కదా’ అన్నారు ఆచార్యులు.

‘మీ ఆజ్ఞను ఉల్లంఘించలేను. నేను సన్యాసిని, త్రిదండ పవిత్రములు లేకుండా రాలేను. వీరిద్దరినీ నేను వాటిలాగే భావిస్తాను. నేనూ వారూ వేరు కాదనే మా భావన. మమ్మల్ని అనుగ్రహించండి ఆచార్యా’ చెప్పాడు రామానుజుడు.

మంత్రోపదేశానికి సిద్ధం కమ్మని ఆదేశిస్తూనే గురువు మరొక్క మాట చెప్పారు. ‘ఎన్నో పరీక్షలకు నిలిచి నీవు ఈ మంత్రాన్ని పొందుతున్నావు. అనర్హులకూ, అయోగ్యులకూ ఈ రహస్యమంత్రార్థాన్ని ఎప్పటికీ వెల్లడించకూడదు’ అన్నారు. రహస్యం కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు రామానుజులు. చెవిలో ఆయన చెప్పిన తిరుమంత్రాన్నీ, మంత్రార్థాలనూ శ్రద్ధగా విన్నాడు. గురువు చెప్పిన బోధనలన్నీ ఆకళింపు చేసుకున్నాడు.

శ్రీరంగం నుంచి 18సార్లు వచ్చిన రామానుజుడిని గురువు కరుణించారనీ, అష్టాక్షరీ చరమశ్లోక పరమార్థాలను(ఓం నమో నారాయణాయ- అన్నది అష్టాక్షరీ మంత్రం. చరమశ్లోకమంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన చివరిశ్లోకం. దాన్నీ మంత్రంగా తీసుకున్నారు పండితులు. ఈ రెండిటికీ ఉన్న నిగూఢమైన అర్థాన్ని గురువు ముఖతా నేర్చుకోవాలంటారు) ఉపదేశించారనీ ఊరంతా తెలిసిపోయింది. ఇన్నాళ్లూ పట్టువదలకుండా రామానుజుడు రావడాన్ని వారు ఆసక్తిగా గమనిస్తున్నారు. దాంతో వారంతా ఇప్పుడు ఆనందంగా రామానుజుడిని చుట్టుముట్టారు. వారిలో కొందరు ముందుకు వచ్చి ‘మీవంటి గొప్ప భక్తులకే ఇంత కష్టమైతే ఇక మాలాంటి సామాన్యులకూ సంసారులకూ తిరుమంత్రాన్ని ఎవరు ఉపదేశిస్తారు స్వామీ’ అని అడిగారు.

ఆ మాటలు రామానుజుణ్ణి ఆలోచనలో పడేశాయి. పరమాత్ముడిని చేరుకునే మార్గాన్ని రహస్యంగా ఉంచడమెందుకు... జ్ఞానం కొందరికే పరిమితం కావాలా... ఇంత గొప్ప విజ్ఞానాన్ని నా ఒక్కడికోసం వినియోగిస్తే అది స్వార్థం కాదా... తిరుమంత్రం భగవంతుడిదైతే, ఆయన అందరివాడయితే, తిరుమంత్రమూ అందరిదీ కాకూడదా... ఇలా ఆలోచిస్తూ అక్కడి సౌమ్యనారాయణుని కోవెలకు వెళ్లాడు. తాను ఇంతగా కష్టపడి నేర్చుకున్న ఈ మంత్రార్థ సంపదని అందరికీ పంచాలని నిర్ణయించుకున్నాడు. శిష్యులు ఊరివారందరినీ పిలుచుకొచ్చారు. ఇంతలో రామానుజుడు ఆలయ శిఖరానికి చేరుకున్నాడు.

‘అందరూ రండి... వినండి... ఈ మంత్రం మనందరిదీ. నేను నేర్చుకున్నది మీకూ చెబుతాను. దాన్ని జపించండి. అంతరార్థాలు తెలుసుకుని తరించండి...’ అంటూ...

‘ఓం నమో నారాయణాయ’ అన్న అష్టాక్షరీ మంత్రాన్ని అందరిచేతా పలికించాడు. ఆచార్యుల వద్ద తాను నేర్చుకున్న విశేషాలను వివరిస్తూ సుదీర్ఘంగా ఉపన్యసించాడు.

అప్పటివరకూ కొందరికే పరిమితమైన రహస్యం అలా బహిరంగమైంది. కుల, మత, వర్గ, వర్ణ భేదాలేమీ లేకుండా ఊరు ఊరంతా తిరుమంత్రం, చరమశ్లోకాల విశేషాలను వీనులవిందుగా ఆలకించింది.

తనకిచ్చిన మాట తప్పిన రామానుజుని పట్ల ఆచార్యులు ఆగ్రహోదగ్రులయ్యారు. పిలిచి ప్రశ్నించారు.

‘అందరినీ కరుణించి మోక్షమార్గానికి మళ్లించే తిరుమంత్రాన్ని నా మనసు లోపల దాచుకోకుండా లోకానికి అంకితం చేయాలనుకున్నాను. వాగ్దాన భంగం చేసినందుకు నేనొక్కడినీ నరకానికి వెళ్తాను కానీ ఇంతమంది భక్తులు ముక్తిమార్గంలో పరమాత్ముడిని చేరుకోగలిగితే అంతకన్నా కావలసిందేముంది’ అంటూ రామానుజులు చెప్పిన జవాబు ఆయన్ని నిరుత్తరుణ్ణి చేసింది. ఉదాత్తమైన ఆ భావం ఆయన్ని పులకింపజేసింది. వాత్సల్యంతో శిష్యుడిని అక్కున చేర్చుకుని ‘నీ భక్తి మార్గాన్ని ప్రపంచమంతా చాటు. అది రామానుజమార్గమై వర్థిల్లుతుంది’ అని ఆశీర్వదించారు.  

ఎవరీ రామానుజులు..!

తమిళనేలపై శ్రీపెరంబుదూరు పట్టణంలో ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి దంపతులకు లేక లేక కలిగిన సంతానం రామానుజుడు. అక్షరాభ్యాసం నాడు ‘ఓం నమః’ అన్న మాటకి అర్థం చెప్పేదాకా అక్షరం దిద్దని రామానుజుడు ఏదైనా ఒక్కసారి చెబితే చాలు ఇట్టే నేర్చుకునేవాడు. పండితుడైన తండ్రి దగ్గరే తొలి విద్యలు అభ్యసించాడు. పదహారో ఏట అతడికి తంజమ్మతో వివాహమైంది. కుమారుడికి సరైన గురువును వెతుకుదామనుకుంటుండగానే తండ్రి కన్నుమూశాడు. దాంతో శోకంలో కూరుకుపోయిన కుమారుడిని తల్లి ఓదార్చింది. అనిత్యమైన దేహాన్ని విడిచి పరమపదం చేరిన తండ్రి గురించి బాధపడకూడదని చెప్పడంతో అతడిలో ఆలోచన మొదలైంది. శాస్త్ర విద్యలను ఔపోసన పట్టాలన్న ఆసక్తి పెరిగింది. సంసార పోషణ బాధ్యత తనదేనన్న ధ్యాసే లేని భర్తని ‘పరమాత్ముడిని చేరుకోడానికి ఎన్నో మార్గాలు ఉండగా ఎందుకింత కఠినమైన వేదాంత విద్యాభ్యాసానికి సిద్ధమవుతున్నార’ని అడిగింది తంజమ్మ. సమాజంలో వేదాలను వ్యతిరేకించే దుర్మతాలు పెరుగుతున్నాయనీ, వాటికి సరైన సమాధానం చెప్పాలంటే తానెంతో నేర్చుకోవాలనీ, సన్మతమేమిటో చెప్పాల్సిన బాధ్యత తనమీద ఉందనీ భార్యకి నచ్చజెప్పాడు. అలా శాస్త్రం చెప్పగల గురువుని వెతుకుతూ కంచికి చేరుకుని యాదవప్రకాశుని దగ్గర శిష్యుడిగా చేరాడు. మొదటినుంచీ ఏకసంథాగ్రాహి అయిన రామానుజుడు త్వరత్వరగా విద్యలు నేర్వడమే కాక శాస్త్ర చర్చలో గురువుతో విభేదించి సరైన అర్థం చెప్పి మెప్పించేవాడు. శిష్యుడి ప్రతిభ గురువులో ఈర్ష్యను పెంచింది. అది ఇంతింతై... అన్నట్లుగా పెరిగి ఆయన మనసంతా ఆక్రమించడంతో రామానుజుడిని అడ్డు తొలగించుకోవడానికి కొందరు శిష్యులతో కలిసి కుట్ర పన్నారు. అదృష్టవశాత్తూ దాని గురించి ముందే తెలియడంతో మనసు వికలమైన రామానుజుడు గురువుకు చెప్పకుండా అక్కడినుంచి తిరిగివచ్చి జరిగిందంతా తల్లికి విన్నవించాడు. ఆమె సూచనతో కంచి ఆలయంలో ఆచార్యులైన కాంచీపూర్ణుడిని ఆశ్రయించాడు. ఆయన దగ్గరే తత్వజ్ఞానోపదేశం పొందుతూ సందేహాలు తీర్చుకుంటున్నాడు.

భవిష్యదాచార్యులు

అప్పటికే విశిష్టాద్వైతాన్ని సాధన చేస్తున్న వారిలో ప్రముఖులైన యామునాచార్యులకు రామానుజుడి ప్రతిభ గురించి తెలిసింది. భవిష్యత్తులో రామానుజుడనే ఓ ఆచార్యుడు పుడతాడని- యామునాచార్యులకు తాతగారైన నాథమునులు ఆయనకు చెప్పడమే కాక ఆ ఆచార్యులు ఎలా ఉంటాడో చెప్పే ఒక విగ్రహాన్ని కూడా అందజేశారు. ఆ మూర్తి ఎప్పుడు జీవం పోసుకుని కన్పిస్తుందా అని వేచివున్న యామునా చార్యులు వయసు మీద పడుతున్నకొద్దీ త్వరగా రామానుజుని కలుసుకోవాలనుకున్నారు. యాదవప్రకాశుల దగ్గర రామానుజుని లీలలన్నీ వింటుంటే అతడే భవిష్యదాచార్యులన్న నమ్మకం కలిగింది. అందుకే అతడిని శ్రీరంగం రప్పించమని కబురుపంపారు. కానీ రామానుజుడు చేరుకునే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. దాంతో రామానుజుడు తాను వైష్ణవ ధర్మానికి కట్టుబడి ఉంటాననీ అజ్ఞాన మోహాల్లో పడి కొట్టుకుపోయే ప్రజలకు పంచసంస్కారములు చేయించి వేదపారాయణ చేసే ధర్మనిరతులుగా మారుస్తాననీ బ్రహ్మసూత్రాలను అందరికీ అర్థమయ్యేలా శ్రీభాష్యాన్ని రచిస్తాననీ వ్యాస, పరాశరులు చెప్పిన తత్వ త్రయవైభవాన్ని లోకానికి వెల్లడిస్తాననీ... యామునాచార్యుల పార్థివ దేహం దగ్గర ప్రతిజ్ఞ చేశాడు.

అనంతరం ముప్పై రెండో ఏట సన్యాసాశ్రమం స్వీకరించిన రామానుజుడు గోష్ఠీపూర్ణుల వద్ద తిరుమంత్రసారాన్ని నేర్చుకుని అందరికీ పంచడమే కాదు, పలువురు గురువుల వద్ద ఉపదేశాలు పొంది తన జ్ఞానతృష్ణను తీర్చు కున్నారు. రామానుజమునిగా, రామానుజాచార్యగా పీఠాధిపతి అయ్యారు. దాశరథి, కూరేశులను ప్రధాన శిష్యులుగా చేసుకున్నారు. ఆచార్యులకిచ్చిన మాట ప్రకారం రచనావ్యాసంగమూ వైష్ణవధర్మ ప్రచారమూ మొదలుపెట్టారు. శ్రీరంగంలో తన మఠాన్ని నిర్వహించే బాధ్యత కొందరు శిష్యులకు అప్పగించి కాశ్మీరానికి ప్రయాణమయ్యారు రామానుజులు. అక్కడ బాదరాయణ రుషి రచించిన ‘బోధాయన వృత్తి’ అనే గ్రంథాన్ని చదివి దాని ఆధారంగానే శ్రీభాష్యాన్ని రచించారు. దారిలో పలుచోట్ల పండితులతో చర్చలు జరిపారు. ఎక్కడ ఏ చర్చ జరిగినా రామానుజులవారిదే పై చేయి. పాండిత్యంతో పాటు మూఢత్వమూ ఉండడమే వారి పరాజయానికి కారణమని భావించిన రామానుజులు తన బోధనలతో వారిని సత్యం వైపు మళ్లించేవారు.

విశిష్టాద్వైతం

దక్షిణభారతాన ప్రతిపాదితమైన మూడు ముఖ్యమైన సిద్ధాంతాల్లో విశిష్టాద్వైతం ఒకటి. ద్వైతం, అద్వైతం మిగిలిన రెండూ. విశిష్టాద్వైతాన్నే వైష్ణవమనీ అంటారు. ఇది అంతకుముందునుంచే ఉన్నప్పటికీ రామానుజుని వల్లనే బహుళఖ్యాతి పొందింది. ఆదిశంకరుడు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతంలో కొన్ని మార్పులు చేసి విశిష్టాద్వైతానికి ఒక రూపం తెచ్చారు రామానుజులు. ఈ సిద్ధాంతం ప్రకారం- దేవుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. లక్ష్మీదేవి నారాయణుడిలో భాగం. ఆ దేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మనుంచి ఆత్మ జనిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. ఆ మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. మనసా వాచా కర్మణా ఆ భగవంతుని శరణాగతి పొందాలి.

రామానుజులు తన జీవితమంతా ఈ సిద్ధాంత ప్రచారానికే వినియోగించారు. పలు ఆలయాల్లో మూర్తులను విష్ణుసంబంధమైనవిగా నిరూపించారు. ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమవిధానాలనూ పరిపాలనా పద్ధతులనూ ఏర్పరిచారు. ఆలయ పాలన, పూజా విధానాలు, ఉత్సవ సేవలు వంటివన్నీ ఆయనే రూపొందించారు. ఆలయ నిర్వహణలో అవినీతిరహితంగా వ్యవహరించాలన్నందుకు అర్చకులు ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు. హత్యాయత్నాలూ చేశారు. ఆలయాల్లో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని సజీవ చైతన్యమూర్తిగా భావించేవారు రామానుజులు. అందుకే భగవంతుడి ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా- మారుతున్న ఋతువులకు తగినట్లుగా తాజా పదార్థాలతో నైవేద్యాలను తయారుచేసి ఆరగింపు చేయాలనేవారు. అది అర్చకవర్గాల్లో విమర్శకు కారణమైంది. ‘స్వామి తింటాడా ఏమన్నా’ అన్నారు. ‘తిననప్పుడు పెట్టడం ఎందుకు, పెడుతున్నప్పుడు సక్రమంగా పెట్టాల’ని రామానుజుని జవాబు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించినందుకు స్వామివారి తీర్థంలోనే విషం కలిపి రామానుజులపై హత్యాయత్నం చేశారు. అది తెలిసీ స్వామిని తలచుకుని తాగిన  విషం ఆయనని ఏమీ చేయలేకపోయింది. మరోసారి ఆయనకు వేసే భిక్షలో విషం కలిపారు. భర్త బలవంతంతో విషం కలిపిన భిక్షను రామానుజుని పాత్రలో వేసిన ఇల్లాలు కన్నీళ్లతో ఆయనకు నమస్కరించింది. భిక్ష వేసిన గృహిణి నమస్కరిస్తే సన్యాసి ఆ పూట ఉపవాసం ఉండాలన్నది నియమం. అది తెలిసీ ఆమె ఎందుకలా చేసిందోనని ఆలోచిస్తూ ఉపవాసం ఉండడానికే నిర్ణయించుకున్న రామానుజులు అన్నాన్ని పక్కన పెట్టేయగా అది తిన్న కాకి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనలతో కలత చెందిన ఆయన పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేసి నీరసించిపోయారు. గురువు గోష్ఠీపూర్ణుల వారు కలుగచేసుకుని రామానుజునికి భోజనం వండిపెట్టే బాధ్యతను ఒక శిష్యుడికి అప్పజెప్పారు.

తిరుమల

ఆసేతు హిమాచలమూ పర్యటిస్తూ దివ్యదేశాలను సందర్శిస్తూ నారాయణ సేవ చేస్తూ వైష్ణవ సిద్ధాంత ప్రచారకునిగా సాగుతున్న రామానుజుని యాత్రలో తిరుమల సందర్శన ఒక ప్రధాన ఘట్టం. తిరుమలా ధీశుడైన శ్రీ వేంకటేశ్వరుడు శివుడు కాడనీ మహావిష్ణువేననీ నిర్ధారించింది రామానుజులే. కేవలం వాదప్రతివాదాల ద్వారా ఆయన దాన్ని శ్రీహరివాసమని నిరూపించారు. నాటి ఆయన కృషి ఫలితమే నేటి తిరుమల వైభవం. శ్రీవైష్ణవ ఆలయాన్ని శైవులు ఆక్రమిస్తే దాన్ని తిరిగి వైష్ణవ క్షేత్రంగా తీర్చిదిద్దారు. అక్కడ వైఖానసులు ఆలయ నిర్వహణలో విఫలం కాగా రాజు యాదవుడు వారికి శిక్ష విధించాడనీ దాంతో వారు ఆలయం వదిలి వెళ్లిపోయారనీ అదను చూసి ఆలయాన్ని వశం చేసుకున్న కొందరు శైవపండితులు రాజుకి అది శివాలయమని చెప్పడంతో ఆయన ఏ ఆలయమో తేల్చమంటూ చర్చావేదిక ఏర్పాటుచేశాడనీ రామానుజులకు తెలిసింది. వెంటనే బయల్దేరి వెళ్లి వివిధ పురాణాలనుంచి ఉదాహరణలతో అది వైష్ణవాలయమని నిర్ధారించారు రామానుజులు. వామన పురాణంలో ఇది విష్ణుక్షేత్రమని ఉందనీ, వరాహ పురాణంలో వేంకటాచలం- వరాహ వాసుదేవ దివ్యధామమని పేర్కొన్నారనీ చెబుతూ, పద్మపురాణంలో గరుడపురాణంలో బ్రహ్మాండ పురాణంలో ఆ క్షేత్ర ప్రస్తావనలను ఆయన సోదాహరణంగా వివరిస్తూ శైవపండితుల వాదనలను తిప్పికొట్టారు. చివరికి శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరగా, రాత్రివేళ విగ్రహం ఎదుట వైష్ణవ ఆయుధాలూ శైవ ఆయుధాలూ ఉంచి తెల్లవారేసరికి ఏ ఆయుధాలను స్వామి ధరిస్తారో చూద్దామన్నారట రామానుజులు. అలాగే పెట్టి ఉదయమే చూస్తే ధ్రువబేరానికి శంఖచక్రాలు ఆయుధాలుగా కనిపించాయట. అప్పటినుంచీ తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవ రాజు అంగీకరించారు. తిరుమలలో స్వామివారి అర్చనా, కైంకర్య విధానాలను ఒక పద్ధతిలోకి తెచ్చి, పలు కీలకమైన వ్యవస్థలను ఏర్పాటుచేసిన రామానుజులే తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్నీ నిర్మింపజేశారు.

సమతామూర్తి

రామానుజుల కృషి ఫలితంగానే దేశంలో భక్తి ఉద్యమం ఊపందుకుంది. ఊరూరా ఆలయాలు వెలశాయి. రాజులు మాత్రమే కాక సాధారణ పౌరులు కూడా దేవాలయాల నిర్మాణానికి ముందుకొచ్చారు. విశిష్టాద్వైత సిద్ధాంతాల ఆచరణలో రామానుజులు కులభేదాలు పాటించలేదు. కాంచీపూర్ణులు తాను వైశ్యుడినని చెప్పినా ‘నాకు మీ జ్ఞానం ముఖ్యం, కులం కాద’ని చెప్పి శిష్యరికం చేసిన సమున్నత వ్యక్తిత్వం ఆయనది. కావేరిలో స్నానానంతరం శూద్రుడైన ధనుర్దాసు భుజం మీద చేయి వేసి ఆలయానికి వెళ్లేవారు. శూద్రుడైన పట్టినిపెరుమాళ్‌ గుడిసెకు వెళ్లి అతను పాడే పాశురాలను వినేవారు. పుట్టుకతో వచ్చిన కులంకన్నా జ్ఞానంతో వచ్చిన కులం శ్రేష్ఠమైనదనీ; కులం, ధనం, విద్య లాంటివి మనుషుల్లో అహంకారం కలిగిస్తాయనీ, బుద్ధిమంతులమీద అవి ఎలాంటి ప్రభావం చూపవనీ చెప్పేవారు. దళితులకు తిరుక్కులత్తార్‌(శ్రీకులానికి చెందినవారు) అని పేరు పెట్టి వారినీ తన శిష్యులుగా చేసుకున్నారు. అన్నికులాలవారూ ఉపయోగించుకునేలా తొండనూరులో ఒకటే జలాశయాన్ని నిర్మింపజేశారు. అన్ని కులాల వారికీ భగవంతుడి సేవాభాగ్యం కల్పిస్తూ దళితులకు దర్శనంతో పాటు ఆలయంలో కొన్ని సేవల బాధ్యతలు కూడా అప్పగించి సమానత్వ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు.

ఆ సమానత్వ సిద్ధాంత సృష్టికర్త గురించి అందరూ తెలుసుకుని స్ఫూర్తిపొందాలనే... ఈ సమతామూర్తి విగ్రహ సంస్థాపనం..!


నా ఆరేళ్ల కల...

‘ప్రపంచం గర్వించే సామాజిక శాస్త్రవేత్త రామానుజాచార్య. గొప్ప మానవతావాది. వెయ్యేళ్లక్రితమే మానవులంతా సమానమని చాటిన మహా మనిషి. ఆయన మన దేశానికి కానుకలుగా అందించిన అపురూప మానవతా సిద్ధాంతాల స్ఫూర్తితో ఆయన సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ స్ఫూర్తికేంద్రాన్ని అందుబాటులోకి తేవాలనుకున్నాం. నా ఆరేళ్ల కల ఇది. ఇప్పటికి సాకారమైంది. భగవంతుడు కొందరివాడు కాదు, అందరివాడూ అన్న విప్లవాత్మక సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన రామానుజాచార్య ఒకే సమయంలో మూడు విజయాలను సాధించారు. పండితులను, పామరులను, పాలకులను తన విలక్షణ శైలితో ఒప్పించగలిగారు. ఎన్ని ఇబ్బందులెదురైనా భగవంతుడి ఔన్నత్యాన్ని గురించి చెప్పే తన విజయయాత్రను ఆపలేదు. ఇదే రామానుజాచార్య విలక్షణత. భయంతోనో, కోరికలతోనో భగవంతుడిని ఆరాధించడం సమర్థనీయం కాదనీ... ప్రేమగా, ఇష్టంగా ఆరాధించాలనీ చెబుతుంది రామానుజాచార్య సిద్ధాంతం. వెయ్యేళ్లక్రితం ఆయన రూపొందించిన ఆగమ క్రతువులే ఇప్పటికీ ప్రామాణికంగా ఆచరిస్తున్నాం. ఆయన బోధనల్లోని సారాంశాన్నీ సనాతన ధర్మ ప్రాశస్త్యాన్నీ అందరికీ తెలియజేసేందుకే ఈ బృహత్‌ ప్రయత్నం తలపెట్టాం. పుణ్యం పురుషార్థం అంటారుకదా... అందుకే ఇక్కడికి వచ్చిన వారికి ఆ రెండూ దక్కాలని 108 ప్రముఖ ఆలయాల ప్రతిరూపాలనూ ఇక్కడ ఏర్పాటు చేశాం.’

- త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామి


రామానుజాచార్య రచనలు

రామానుజులు రాసిన పలు రచనల్లో ‘నవరత్నాలు’ ప్రధానమైనవి. అవేంటంటే... వేదార్థ సంగ్రహం, శ్రీభాష్యం, గీతాభాష్యం, వేదార్థ దీప, వేదాంత సారం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, శ్రీవైకుంఠ గద్యం, నిత్యగ్రంథ. భారతీయ సనాతన ధర్మ విద్యలో భాగమైన ‘ప్రస్థానత్రయం’- ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలకు విశిష్టాద్వైతకోణంలో భాష్యం చెప్పి భాష్యకారుడయ్యారు రామానుజులు.


ఆళ్వార్లు... దివ్యదేశాలు...

వైష్ణవ మతంలో 12 మంది మహాభక్తులను ఆళ్వార్లు అంటారు. రామానుజునికన్నా ముందే విశిష్టాద్వైతాన్ని అనుసరించి భగవంతుడి పట్ల ప్రేమపూర్వకమైన భక్తిలో మునిగితేలుతూ దివ్యప్రబంధాలను రాసిన వీరు వాటిని పాశురాలపేరుతో స్వరబద్ధంగా గానం చేసేవారు. అందుకే వాగ్గేయకారులుగా పేరొందారు. వారు పాశురాలను గానం చేస్తూ సందర్శించిన 106 నారాయణ క్షేత్రాలే ‘దివ్యదేశాలు’గా పేరొందాయి. వీటికి తోడు పరమపదంలో ఉన్న రెండు ధామాలను కలిపి 108 దివ్యదేశాలుగా వ్యవహరిస్తారు. భూమి మీద ఉన్న 106 క్షేత్రాలను దర్శించి ఆళ్వారులు ఆరాధించిన నారాయణ మూర్తులను సేవించినవారికి మిగిలిన రెండు పరంధామాలను చేరడం సులువనీ అదే ముక్తిమార్గమనీ చెప్పారు రామానుజులు. అందుకే వైష్ణవ క్షేత్రాలలో ఆళ్వారుల విగ్రహాలనూ రామానుజుని విగ్రహాన్నీ ఏర్పాటుచేయడం ఆనవాయితీ. రామానుజుని సమతా విగ్రహం చుట్టూ ఈ 108 దివ్యదేశాల ప్రతిరూపాలనూ నిర్మించారు.


సమతా స్ఫూర్తికేంద్రం విశేషాలివి..!

శ్రీమద్రామానుజాచార్య సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్మాణాన్ని 2014లో ప్రారంభించారు. 45 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యేళ్లైనా చెక్కుచెదరని రీతిలో రూపుదిద్దుకున్న విగ్రహమిది. మరిన్ని విశేషాలు...

ఎక్కడ: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలో శ్రీరామనగరం.

ఎత్తు: పీఠంతో సహా మొత్తం ఎత్తు 216 అడుగులు కాగా అందులో రామానుజుని విగ్రహం ఎత్తు 108 అడుగులు. పద్మపీఠం 27, భద్రవేదిక 54, త్రిదండం 135 అడుగుల ఎత్తు ఉన్నాయి. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు. కూర్చుని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహం ఇది.

ఎన్నెన్ని: భద్రవేదికలో ఏర్పాటుచేసిన పద్మాలు 54, పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగులు 36, శంఖచక్రాలు చెరి 18.

ఎంత: మొత్తం 1800 టన్నుల పంచలోహాలతో చైనాలో తయారుచేసిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా ఇక్కడికి తెచ్చారు. చైనా నిపుణులే వచ్చి ఆ భాగాలను కూర్చి విగ్రహంగా మలచారు.

ఏమేమి: విగ్రహానికి ఎదురుగా అష్టదళ పద్మాకృతిలో మ్యూజిక్‌ ఫౌంటెన్‌ ఉంది.

8 సింహాలూ 8 ఏనుగులూ 8 హంసల వరుసలతో పైన కలువ విరిసినట్లుగా మధ్యలో ఫౌంటెన్‌ని తీర్చిదిద్దారు. చుట్టూ రంగురంగుల లైట్ల మధ్య పద్మాల రేకలు విచ్చుకుంటూ నీరు పడు తుండగా, నేపథ్యంలో కీర్తనలు వినిపిస్తూ సందర్శకులను పూర్తిగా ఆధ్యాత్మికలోకంలోకి తీసుకెళ్తుంది అక్కడి దృశ్యం. విగ్రహానికి కింద మూడంతస్తులుగా ఉన్న భవనంలో విశాలమైన ధ్యానమందిరమూ, రామానుజుని చరిత్రనీ తత్వాన్నీ తెలిపే చిత్రాలూ ఉంటాయి. రామానుజునికి నిత్యపూజలు చేసేందుకు బంగారు విగ్రహంతో దేవాలయం కూడా ఇక్కడ ఉంది. 120 ఏళ్లు జీవించిన ఆయనకు నివాళిగా 120 కిలోల బంగారంతో చేసిన ఈ ఐదడుగుల మూడంగుళాల విగ్రహాన్ని మూడడుగుల పీఠంపై అమర్చారు. మరో అంతస్తులో వేదిక్‌ డిజిటల్‌ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం ఉంటాయి. రాజస్థాన్‌నుంచి తెప్పించిన గులాబీ రంగు గ్రానైట్‌తో తయారు చేసిన పలు కళాకృతులు ఆవరణలో కనువిందుచేస్తాయి.

ఖర్చు: వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో ఇంకా... పండితుల సభలు నిర్వహించడానికి ఆడిటోరియం, ప్రదర్శనలకోసం ఓమ్నిమ్యాక్స్‌ థియేటర్‌ ఉంటాయి. వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ఈ క్షేత్రాన్ని సందర్శించుకునే భక్తులు సెల్ఫ్‌ గైడెడ్‌ టూల్‌ సాయంతో ప్రత్యేక ఇయర్‌ ఫోన్ల ద్వారా తమకి నచ్చిన భాషలో క్షేత్ర విశేషాలను తెలుసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని