ఇవి... చెక్క కలరా ఉండలు!

ఒకలాంటి ఘాటైన వాసనతో ఉండే కలరా ఉండలు ఉరఫ్‌ నాఫ్తలీన్‌ బాల్స్‌ని గదుల్లోనూ వాష్‌రూమ్‌ మూలల్లోనూ అలాగే అల్మారాల్లోనూ ఓ పక్కగా వేస్తుంటారని తెలిసిందే. అయితే ఆ వాసన పీల్చడం అంత మంచిదీ కాదు, పైగా అందరికీ సరిపడదు.

Published : 08 May 2022 01:14 IST

ఇవి... చెక్క కలరా ఉండలు!

ఒకలాంటి ఘాటైన వాసనతో ఉండే కలరా ఉండలు ఉరఫ్‌ నాఫ్తలీన్‌ బాల్స్‌ని గదుల్లోనూ వాష్‌రూమ్‌ మూలల్లోనూ అలాగే అల్మారాల్లోనూ ఓ పక్కగా వేస్తుంటారని తెలిసిందే. అయితే ఆ వాసన పీల్చడం అంత మంచిదీ కాదు, పైగా అందరికీ సరిపడదు. చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కూడా. అందుకే ఇప్పుడు సహజ పదార్థాలతో తయారైన మాత్‌ బాల్స్‌ విభిన్న రూపాల్లో వస్తున్నాయి. అవేంటో చూద్దామా..!

అల్మారాల్లో బీరువాల్లో పుస్తకాలూ లేదా దుస్తులు సర్దుకుంటాం. ఎంత గాలిచొరనివ్వనివైనా టినియా, లెపిస్మా... వంటి కీటకాలు దూరి దుస్తుల్నీ పుస్తకాల్నీ పాడు చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా క్లాత్‌మాత్స్‌ పట్టు, నూలు, ఉన్ని, లెదర్‌ వంటి సహజ ఉత్పత్తుల్ని తింటాయి. అందుకే మాత్‌ రిపెల్లంట్స్‌ వాడుతుంటాం. అదీగాక ఎప్పుడోగానీ వాడని ఖరీదైన దుస్తులైతే అసలు మడతలు కూడా విప్పం. దాంతో ఆ కీటకాలు చేరి, కొట్టేసినా తెలియదు. అందుకే మాత్‌బాల్స్‌తోపాటు, దుస్తులు మంచి వాసన వస్తాయన్న కారణంతో ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వాడి చేసిన పాట్‌పూరీల్నీ వాటి దగ్గర పెడుతుంటాం. వాటి నుంచి వెలువడే ఘాటైన వాసనలకి ఆయా కీటకాలు అల్మారాల్లోకి చేరకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు కీటకాల్ని అడ్డుకునేందుకు సెడార్‌(దేవదారు), కర్పూరం చెట్ల చెక్కతో చేసినవి రకరకాల రూపాల్లో వస్తున్నాయి. చిన్నపాటి రంధ్రంతో బంతుల్లా ఉన్న వీటిని హ్యాంగర్లకి పై భాగంలో తగిలించుకోవచ్చు, అల్మారాల్లో ఓ పక్కగానూ, దుస్తులమీదా వేసుకోవచ్చు. వీటిల్లోనే కాస్త పెద్ద సైజు చెక్కలూ ఉంటున్నాయి. ఇవయితే వార్డ్‌రోబ్‌లోని రాడ్‌కు తగిలించేందుకు అనువుగా ఉంటున్నాయి. ఈ చెక్క వాసనకి ఆయా కీటకాలు లోపలకు చేరకుండా ఉండటంతోపాటు దుస్తులు మంచి వాసన వస్తుంటాయి.

ఎలా పనిచేస్తాయంటే...
సెడార్‌ వుడ్‌ని మాత్‌ రిపెల్లంట్‌గా ప్రాచీన గ్రీకుల కాలం నుంచీ వాడుతున్నారు. అప్పట్లో అచ్చంగా ఈ చెక్కతోనే అల్మారాల్లాంటివి చేయించుకోవడంతోపాటు ఆ చెక్క నుంచి తీసిన గాఢ తైలాల్నీ కీటకాలు చేరకుండా వాడేవారట. అయితే కొంతకాలానికి చెక్కలోని నూనెలు ఆవిరైపోవడంతో క్రమేణా దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ఈ చెక్కతోనే బాల్స్‌లాంటివి చేసి బీరువాల్లో వేస్తున్నారు. ఘాటు తగ్గగానే వాటికే తైలాన్ని స్ప్రే చేయడం లేదా కొత్తవి వేయడం చేస్తున్నారు.
సెడార్‌ చెక్కలో సెస్క్విటెర్పీన్‌ అనే హైడ్రోకార్బన్లు ఉంటాయనీ ఇవి కర్పూరం వాసనని కలిగి ఉండటంతో కీటకాలను అడ్డుకుంటాయనీ శాస్త్ర పరిశీలనల్లోనూ స్పష్టమైందట. అయితే దేవదారు అరుదైనది కావడంతో దాన్ని పోలిన ఈస్ట్రన్‌ రెడ్‌ సెడార్‌ అనే చెట్టు కాండంతోనూ మాత్‌బాల్స్‌ చేస్తున్నారు. ఈ చెట్టు కూడా అదే గుణాల్ని కలిగి ఉంటుంది. కర్పూరం చెట్టు చెక్కతో చేసిన బాల్స్‌ కూడా వస్తున్నాయి. అలాగే ఆ చెట్టు చెక్కనీ ఆకుల్నీ మరిగించి ఆవిరిని ఒడిసిపట్టడం ద్వారా చేసే కర్పూరంతోనూ మాత్‌బాల్స్‌ చేస్తున్నారు. అయితే పూజల్లో వెలిగించే కర్పూర బిళ్లల తయారీలో పెట్రోలియం ఉత్పత్తుల్నీ ఎక్కువగా వాడుతున్నారు. అందుకే కొన్ని కంపెనీలు సహజ తైలంతో చేసిన క్యాంఫర్‌తోనే మాత్‌బాల్స్‌ను తయారుచేస్తున్నాయి.
ఎందుకంటే నాఫ్తలీన్‌ బాల్స్‌లో పారాడైక్లోరోబెంజీన్‌ లేదా నాఫ్తలీన్‌ అనే రసాయనం ఉంటుంది. దీన్ని ఎక్కువగా పీల్చడం మనుషులకీ, పెంపుడు జంతువుల ఆరోగ్యానికీ మంచిది కాదు. ఇది క్యాన్సర్‌ కారకం కూడా. దీనివల్ల రక్తహీనతతోపాటు రకరకాల నాడీ సమస్యలూ తలెత్తుతాయట. ఆ కారణంతోనే రసాయనాలతో నిండిన కలరా ఉండలకి బదులుగా చెక్క, కర్పూరంతో చేసినవిగానీ నిమ్మ, నారింజ వంటి సహజ నూనెలతో చేసినవిగానీ వాడుకోవడం మేలు అంటున్నారు పరిశోధకులు.


కర్పూరం, నాఫ్తలీన్‌ బాల్స్‌... ఏవయినాగానీ సాచెట్లు లేదా ప్లాస్టిక్‌ కేసుల్లో వేయడం వల్ల త్వరగా ఆవిరైపోకుండా వాటి నుంచి వాయువులు కొంచెకొంచెంగా  బయటకు వస్తూ కీటకాల్ని దూరంగా ఉంచుతాయి. అదేసమయంలో పిల్లలుగానీ పెంపుడు జంతువులుగానీ గభాల్న నోట్లో పెట్టుకోకుండా చూడవచ్చు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..