ఇడ్లీలతో ఇలా కూడా!
తరచూ ఇడ్లీలే తినాలంటే పిల్లలకే కాదు పెద్దవాళ్లకీ విసుగే. అలాగని వేసిన ఇడ్లీలను పారేయలేం కాబట్టి... వాటిని ఇలా స్నాక్స్ రూపంలో చేసి వడ్డిస్తే సరి. కాస్త మార్పుగానైనా ఉంటుంది.
తరచూ ఇడ్లీలే తినాలంటే పిల్లలకే కాదు పెద్దవాళ్లకీ విసుగే. అలాగని వేసిన ఇడ్లీలను పారేయలేం కాబట్టి... వాటిని ఇలా స్నాక్స్ రూపంలో చేసి వడ్డిస్తే సరి. కాస్త మార్పుగానైనా ఉంటుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్
కావలసినవి: ఇడ్లీలు: అయిదారు, నూనె: వేయించేందుకు సరిపడా, ఎండుమిర్చి: పది, సెనగపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: రెండు చెంచాలు, మిరియాలు: చెంచా, బియ్యం: చెంచా, పుట్నాలపప్పు: రెండు చెంచాలు, పల్లీలు: పావుకప్పు, ఎండుకొబ్బరిపొడి: రెండు చెంచాలు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: ముందుగా స్టవ్‌మీద కడాయి పెట్టి ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, బియ్యం వేసి వేయించుకోవాలి. నిమిషమయ్యాక పుట్నాలపప్పు, పల్లీలు, ఎండుకొబ్బరిపొడి, కరివేపాకు కూడా వేసి వేయించుకుని స్టవ్ కట్టేయాలి. ఈ దినుసుల్ని మిక్సీలో తీసుకుని సరిపడా ఉప్పు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలను సన్నగా, పొడుగ్గా ముక్కల్లా కోయాలి. ఈ ముక్కల్ని కాగుతున్న నూనెలో అయిదారు చొప్పున వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటిపైన ముందుగా చేసి పెట్టుకున్న పొడిని చల్లి ఓసారి కలిపితే ఇడ్లీ ఫ్రెంచ్‌ఫ్రైస్ రెడీ.
మసాలా తవా ఇడ్లీ
కావలసినవి: ఇడ్లీలు: ఎనిమిది, వెన్న: టేబుల్‌స్పూను, వెల్లుల్లి తరుగు: చెంచా, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, టొమాటో ముక్కలు: అరకప్పు, పసుపు: పావుచెంచా, కారం: అరచెంచా, పావ్‌భాజీ మసాలా: చెంచా, చాట్‌మసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: చెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: ఇడ్లీలను ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వెన్న వేయాలి. అది కరిగాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయముక్కలు, టొమాటోముక్కలు వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు, పావ్‌భాజీ మసాలా, చాట్‌మసాలా, రెండు చెంచాల నీళ్లు వేసి కలపాలి. ఇందులో ఇడ్లీముక్కలు వేసి వాటికి మసాలా పట్టేలా కలిపి దింపేముందు నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేయాలి.
చాట్
కావలసినవి: ఇడ్లీలు: ఆరు, నూనె: వేయించేందుకు సరిపడా, గిలకొట్టిన పెరుగు: కప్పు, ఉప్పు: తగినంత, జీలకర్రపొడి: అరచెంచా, చాట్ మసాలా: అరచెంచా, కారం: అరచెంచా, సన్నకారప్పూస: పావుకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, దానిమ్మగింజలు: పావుకప్పు. గ్రీన్‌చట్నీకోసం: పుదీనా: కట్ట, కొత్తిమీర: కట్ట, నిమ్మరసం: రెండు చెంచాలు, అల్లం తరుగు: చెంచా, ఉప్పు: తగినంత. స్వీట్‌చట్నీకోసం: గింజల్లేని ఖర్జూరాలు: పావుకప్పు, చింతపండు రసం: రెండు చెంచాలు, బెల్లం తరుగు: పావుకప్పు, జీలకర్ర: చెంచా, ఉప్పు: తగినంత, కారం: అరచెంచా.
తయారీ విధానం: ముందుగా గ్రీన్‌చట్నీకోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్వీట్‌చట్నీకోసం పెట్టుకున్న పదార్థాలను పాన్‌లో తీసుకుని స్టవ్ మీద పెట్టి అరకప్పు నీళ్లు పోయాలి. అన్నీ ఉడికాక తగినంత ఉప్పు, కారం వేసి కలిపి గుజ్జులా చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇడ్లీలను ముక్కల్లా కోసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఈ ముక్కలపైన గిలకొట్టి పావు చెంచా ఉప్పు కలిపిన పెరుగు, తరవాత గ్రీన్‌చట్నీ, స్వీట్‌చట్నీని రెండు చెంచాల చొప్పున వేయాలి. వీటిపైన జీలకర్రపొడి, చాట్‌మసాలా, కారం, కొత్తిమీర తరుగు, దానిమ్మగింజలు వేసి.. చివరగా కారప్పూస చల్లాలి.
చిల్లీ ఇడ్లీ
కావలసినవి: ఇడ్లీలు: అయిదు, మొక్కజొన్నపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, వినెగర్: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, అల్లం తరుగు: చెంచా, వెల్లుల్లి తరుగు: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, సోయాసాస్: టేబుల్‌స్పూను, టొమాటో కెచప్: రెండు టేబుల్‌స్పూన్లు, చిల్లీసాస్: టేబుల్‌స్పూను, ఉల్లికాడల తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: ఒక్కో ఇడ్లీని నాలుగు ముక్కల్లా కోయాలి. ఓ గిన్నెలో రెండున్నర టేబుల్‌స్పూన్ల మొక్కజొన్నపిండి, బియ్యప్పిండి, పావుచెంచా ఉప్పు తీసుకుని నీళ్లు చల్లుకుంటూ చిక్కగా, బజ్జీల పిండిలా చేసుకోవాలి. ఈ పిండిలో ఇడ్లీ ముక్కల్ని ముంచి కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. స్టవ్‌మీద మళ్లీ కడాయిని పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు చాలా కొద్దిగా ఉప్పు, సోయాసాస్, టొమాటో కెచప్, చిల్లీసాస్, వినెగర్ కలిపి... వేయించుకున్న ఇడ్లీ ముక్కలు వేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. చివరగా మిగిలిన మొక్కజొన్నపిండిలో రెండుమూడు చెంచాల నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని కూడా వేసి... రెండు నిమిషాలయ్యాక దింపేసి ఉల్లికాడల తరుగును అలంకరిస్తే చాలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. ఇదే శుక్రవారం..!
-
Crime News
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య
-
General News
Odisha Train Accident: రాజమహేంద్రవరం రావాల్సిన 21 మంది ప్రయాణికులు సురక్షితం
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 40కిపైగా రైళ్లు రద్దు..