Updated : 31 Jul 2022 09:39 IST

ప్రకృతి అందాలకు మరో పేరు... దాండేలి!

‘ప్రకృతిలో విహరించాలి... అదే సమయంలో సాహసభరితంగా పర్యటించాలి... అనుకునేవాళ్లు తప్పక చూడదగ్గ ప్రదేశమే కర్ణాటకలోని దాండేలి... ఓ పక్క పచ్చని కొండల్నీ జలపాత అందాల్నీ ఆస్వాదిస్తూ మరోపక్క దట్టమైన అడవిలో వన్యప్రాణుల మధ్య సంచరిస్తూ లోతైన నదీజలాల్లో కేరింతలు కొడుతూ ఆహ్లాదంగా సాగింది... మా పర్యటన’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన పైడిమర్రి గిరిజ.

సాహసభరిత పర్యటనలంటే ఇష్టపడే మా మిత్రబృందం ఈసారి కర్ణాటకలోని దాండేలి ప్రదేశాన్ని ఎంపికచేసుకుని, హుబ్లీ రైలెక్కాం. అక్కడికి 70 కి.మీ. దూరంలో ఉంది దాండేలి. అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌కీ దక్షిణ భారతావనిలో వాటర్‌ ర్యాఫ్టింగ్‌ డెస్టినేషన్‌గానూ పేరొందిన అందమైన ప్రదేశం ఇది. ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకతా ఉంది... ఇది ఓ పారిశ్రామిక పట్టణం కూడా. డెబ్భై ఏళ్ల క్రితం దట్టమైన అడవి మధ్యలో ఉన్న కాళీనది ఒడ్డున కాగితం, సాఫ్ట్‌వుడ్, ఇనుప ఉత్పత్తుల పరిశ్రమలు స్థాపించడానికి ఉత్తర భారతీయులు వచ్చారట. ఆ తరవాత దక్షిణ భారత రాష్ట్రాలకు చెందినవాళ్లూ అక్కడికి చేరారు. చుట్టూ ఉన్న ప్రకృతి సంపదతోనూ సాహసభరితమైన నీటి క్రీడలతోనూ నాటి పారిశ్రామిక పట్టణం ప్రముఖ పర్యటక స్థలంగానూ ప్రాచుర్యం చెందింది.

ముందే మాట్లాడుకున్న ట్యాక్సీలో మేం దాండేలీకి చేరుకున్నాం. అక్కడ ప్రభుత్వ రిసార్టులతోపాటు ప్రైవేటువీ చాలానే ఉన్నాయి. అక్కడికి వెళ్లడం ఆలస్యం... చెట్లమీద పక్షుల్ని చూసుకుంటూ అడవి బాట పట్టాం. పక్షి ప్రేమికులకి దాండేలి మంచి ఆటవిడుపు. ప్రపంచంలోని తొమ్మిది జాతుల హార్న్‌బిల్‌ పక్షుల్లో నాలుగు రకాలు ఇక్కడే ఉన్నాయి. జంగిల్‌ బాబ్లర్లు, క్రెస్ట్‌డ్‌ సర్పెంట్‌ ఈగల్, బుల్‌బుల్, ఆకుపచ్చని పావురాలు, రాబిన్లు... ఇలా మూడు వందల జాతులకి పైగా పక్షులు ఉన్నాయట. కనబడ్డ పక్షి ఏదై ఉంటుందో చూసుకుంటూ మెల్లగా అక్కడ ఉన్న ట్రాంపోలిన్‌లోకి దూరి కిందకీమీదకీ ఎగురుతూ కాసేపు చిన్నపిల్లలం అయ్యాం. 

కాళీ నదిలో...

తరవాత రిసార్టు వాళ్లు ఏర్పాటుచేసిన వాహనంలో బయల్దేరి కాళీ నదికి చేరుకున్నాం. బోటింగ్‌ దగ్గర అప్పటికే పెద్ద క్యూ ఉండటంతో మౌళంగి ఎకో పార్కుకి వెళ్లాం. సహజంగా ఏర్పడిన రాళ్లూ కొండలూ వెదురు వనాలతోనూ నదీ ప్రవాహంతోనూ నిండిన ఆ పార్కులో విహరిస్తుంటే ఓ పట్టాన వెనక్కి రావాలనిపించదు. ఈలోగా టోకెన్‌ దొరికిందని మిత్రులు ఫోన్‌ చేసి పిలవడంతో ర్యాఫ్టింగ్‌ బోటు దగ్గరకు రాక తప్పలేదు. ఆరుగురిని అందులో కూర్చోబెట్టి పెడలింగ్‌ ఎలా చేయాలో గైడ్‌ చెప్పాడు. చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతిని చూస్తూ నదిలో గంటసేపు హాయిగా విహరించాం. మా దృష్టి అంతా కయాకింగ్‌మీదే. ఓ చిన్న ఫైబర్‌ పడవలో ఒకరు లేదా ఇద్దరు సొంతంగా పెడలింగ్‌ చేసుకుంటూ వెళ్లడమే కయాకింగ్‌. వయసుని లెక్కచేయకుండా ఎలాగైతేనేం... మేం దాన్ని కూడా విజయవంతంగా చేసి, ఉత్సాహంతో ఒడ్డుకు చేరుకున్నాం. అప్పటికే చీకటి పడటంతో రూమ్‌కి వచ్చి, రాత్రికి క్యాంప్‌ఫైర్‌ చుట్టూ చేరి అందరితో కలిసి ఆడి పాడాం.  

మర్నాడు బోటు సఫారీకి బయల్దేరాం. సుమారు నలభై మందితో లాంచీ లాంటి బోటు బయల్దేరింది కానీ ఈ సఫారీలో పెద్దగా జంతువులు కనిపించలేదు. అడవిదున్నలు మాత్రం గుంపులుగా ఉన్నాయి. ఆ తరవాత సాహసభరిత ర్యాఫ్టింగ్‌కి వెళ్లాం. ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాఫ్టింగ్‌ కేంద్రం మాత్రమే అందుబాటులో ఉంది. అదీ రోజుకి రెండుమూడు ట్రిప్పులే ఉంటాయి. ఎలాంటి ప్రమాదం జరిగినా మనదే బాధ్యత అన్న హామీపత్రం ఇవ్వాలి. అది అడిగినప్పుడు భయంగా అనిపించింది. మామూలుగా అయితే 12-55 ఏళ్లలోపు వాళ్లనే ర్యాఫ్టింగ్‌కి అనుమతిస్తారు. కానీ 60కి దగ్గరగా ఉన్నా ఫిట్‌నెస్‌ కారణంగా మాకు ప్రత్యేక అనుమతి లభించింది. బీపీ, గుండెజబ్బు, ఆస్తమా ఎవరికైనా ఉన్నాయేమోనని అడిగి తెలుసుకుని, అందరికీ సూచనలు ఇచ్చారు. కెప్టెన్‌తోబాటు మా బృందం ఆరుగురం బోటులోకి ఎక్కాం. కొంత దూరం వెళ్లాక నీళ్లలోకి దూకుతారా అని కెప్టెన్‌ అడగ్గానే నేను ముందుగా ధైర్యంగా దూకేశాను. మొత్తానికి అందరం నీళ్లలోకి దూకి నీళ్లమీద తేలసాగాం. ఆ తరవాత పెడల్‌ ఎలా పట్టుకోవాలి... బోటుకి దగ్గరగా ఎలా చేరాలి... బోటుకున్న తాడుని పట్టుకుని రెండు కాళ్లూ ముడుచుకుని కెప్టెన్‌ చేతి సాయంతో ఒక్కసారి బలంగా బోటులోకి ఎలా జంప్‌ చేయాలి... వంటి విషయాల్ని అర్థమయ్యేలా చెప్పారు. ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకుంటేనే ఒకవేళ ఎవరైనా నీళ్లలో పడ్డా తిరిగి బోటులోకి చేరగలరన్నమాట. ఆ తరవాత పెద్ద ప్రవాహంలో బోటు జారిపోయి పల్టీలు కొట్టినప్పుడు పడిపోకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పారు. 

జాగ్రత్తగా కెప్టెన్‌ మాటల్ని వింటూ బృందం మొత్తం ఒకే దిశగా పెడలింగ్‌ చేయాలి అని చెప్పారు. ఈ ప్రయాణంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయం. ఆ మాటల్నే గుర్తుతెచ్చుకుంటూ కాస్త దూరం వెళ్లామో లేదో ఎదురుగా పెద్ద ప్రవాహం జల రాకాసిలా పైపైకి విరుచుకుపడుతోంది. అది చూసి ముందు కంగారుపడ్డా మమ్మల్ని మేం సంబాళించుకుని కెప్టెన్‌ ఆదేశాల్ని తు.చ. తప్పక పాటిస్తూ తొలి ప్రవాహాన్ని విజయవంతంగా దాటేశాం. 75 అడుగుల లోతున్న ఆ నదిలో సుమారు 13కి.మీ.దూరం మేర తొమ్మిది ప్రవాహాల్ని దాటుకుంటూ ర్యాఫ్టింగ్‌ చేయగలిగాం. వీటిలో మూడు ప్రవాహాలు ప్రమాదకరమైనవి. అందులోనూ ఒకటి సుళ్లు తిరిగే ప్రవాహం. కెప్టెన్‌ హెచ్చరికతో మేం దాని నుంచి బయటపడి వెనక్కి తిరిగి చూసేంతలో పక్కబోటులోంచి ఓ వ్యక్తి ప్రవాహంలోకి జారిపోతూ కనిపించాడు. అయితే ఆ బోటు కెప్టెన్‌ అతన్ని పైకి లాగి రక్షించాడు. ఈ ర్యాఫ్టింగ్‌లో కెప్టెన్‌ నైపుణ్యమే కీలకం. రాళ్లమీదకీ చెట్లకొమ్మలమీదకీ బోటుని ఎక్కించి పల్టీలు కొట్టిస్తూ విజయవంతంగా ర్యాఫ్టింగ్‌ చేయించాడు మా కెప్టెన్‌. ఆ కాసేపూ ఎంతో ఉత్కంఠ, భయం... అంతలోనే చెప్పలేని ఉత్సాహం, ఆనందం... అలా మొత్తమ్మీద అలలమీద ఊయలలూగుతూ సాహసం చేశాం. 

పక్షి జాతులెన్నో..!

తరవాతి మజిలీ జంగిల్‌ సఫారీ... పులులు, చిరుతలు, అడవిదున్నలు... వంటి వాటికి ఈ ప్రాంతం సహజ నివాసం. వాటిని దగ్గరగా చూడాలనుకునే వాళ్లకోసమే ఈ సఫారీ. అందులో భాగంగా దట్టమైన అడవిలోకి వెళ్లినప్పుడు ఎన్నో జంతువులు ఎదురుపడ్డాయి. పులులు పక్కనుంచే వెళ్లిపోతుంటాయి. అది చూసినప్పుడు ఒక్కసారిగా అవి దూకితేనో అనిపిస్తుంది. కానీ ఇదంతా మాకు అలవాటే అన్నట్లుగా ఎవరినీ పట్టించుకోకుండా వాటి మానాన అవి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. 

నున్నగా జారిపోయే సహ్యాద్రి కొండలమీదకి తాడుతో ఎగబాకుతూ ర్యాపెల్లింగ్, దట్టమైన అడవిలో ట్రెక్కింగ్‌ చేయాలనుకునేవాళ్లకీ ఇది ఎంతో అనువైన ప్రదేశం అని చెప్పాలి. కాళీ నది బారునా ఉన్న దాండేలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నడుస్తూ జంగిలేశ్వర్‌ ఆలయాన్నీ సందర్శించవచ్చు. ముఖ్యంగా ట్రెక్కింగ్‌ ప్రియుల్ని ఇక్కడి శిరోలీ శిఖరం రారమ్మని పిలుస్తుంటుంది. ఆ శిఖరంమీద నుంచి చూస్తే సహ్యాద్రి పర్వతాల అందాల్నీ వాటి మధ్యలోంచి ఉరికే జలపాతాల సౌందర్యాన్నీ ఆసాంతం ఆస్వాదించవచ్చని మా గైడ్‌ చెప్పాడు. కానీ అందుకు ముందుగానే అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. పైగా మాకు అంత సమయం లేకపోవడంతో ఆ సాహసం చేయలేదు.

నదిలోని నీళ్లతో మసాజ్‌!

దాండేలికే ప్రత్యేకమైన వెదురు తెప్పల్లో కూర్చుని నదీవిహారం చేస్తూ రకరకాల వృక్షజాతుల్నీ కొన్ని రకాల పక్షుల్నీ చూసి ఆనందించాం. ఈ తెప్పల్లాంటి పడవల్లో కూర్చోబెట్టుకునే జాకుజి బాత్‌లకీ తీసుకెళతారు. అంటే- సహజమైన నీటి మర్దన అన్నమాట. పడవల్లో నది మధ్యలోకి తీసుకెళ్లి నీరు వేగంగా పడేచోట రాళ్లమీద కూర్చోబెడతారు. నులివెచ్చని సూర్యకిరణాలూ చుట్టూ ఉన్న చెట్లూ చల్లని నీటి మీదుగా వీచే చల్లని గాలులూ కలగలిసి గిలిగింతలు పెడుతుండగా పక్షుల కువకువల్ని వింటూ అడవిపూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ కాళీ నది కెరటాలు వీపుని తాకుతున్నప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఆ నీటి ఒరవడి ఒక రకమైన మర్దనలా ఉంటుంది. దీన్ని రివర్‌ జాకుజి అంటారు. 

జోర్బింగ్‌ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. పారదర్శక బెలూన్‌లా ఉన్న ఓ బుడగలో కూర్చుని దొర్లుకుంటూ నీటి ఒడ్డుకు చేరుకోవడం అన్నమాట. 

దాండేలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోనే సున్నపురాతితో ఏర్పడిన కవాలా గుహలు ఉన్నాయి. దాదాపు 375 మెట్లెక్కితేనే అక్కడికి చేరుకోగలం. గుహల్లోపల సహజంగా ఏర్పడిన ఓ శివలింగం ఉంటుంది. ఈ గుహలు ఎంతో పురాతనమైనవనీ అగ్నిపర్వతం నుంచి ఏర్పడి ఉంటాయనీ చెబుతున్నారు. ఆ తరవాత దాండేలీకి సుమారు 20 కి.మీ. దూరంలో ఇక్కడికి సమీపంలోనే ఉన్న సింథేరీ రాక్స్‌ అందాల్ని చూసి తీరాల్సిందే. గ్రానైట్‌తో ఏర్పడ్డ ఈ రాళ్లలో ఎటు చూసినా పావురాళ్లే.  ఆసియాలో బ్లాక్‌ పాంథర్‌ల సహజ ఆవాసం కూడా దాండేలికి సమీపంలోనే ఉంది. అదే అంశి నేషనల్‌ పార్కు. దీన్నే కాళి టైగర్‌ రిజర్వ్‌గానూ పిలుస్తారు. పచ్చదనం చుట్టుకున్నట్లుగా ఉన్న ఈ పార్కు వన్యప్రాణి ప్రేమికుల్నే కాదు, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లనీ ఆకర్షిస్తుంటుంది. కానీ అక్కడికి వెళ్లే సమయం లేక తిరుగుప్రయాణమవ్వక తప్పలేదు. 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని