ట్రెండీ రుచులు!

పండు కోస్తే లోపల కుల్ఫీ ఉంటే... జిలేబీ నల్లగా కనిపిస్తే... అప్పడాలూ వడియాల్లో నాన్‌వెజ్‌ రుచులూ ఉంటే... ఆశ్చర్యమే కదూ! మరెందుకాలస్యం? నోరూరిస్తున్న ఈ ట్రెండీ ఫుడ్స్‌ మీద ఓ

Published : 17 Apr 2022 00:36 IST

ట్రెండీ రుచులు!

పండు కోస్తే లోపల కుల్ఫీ ఉంటే... జిలేబీ నల్లగా కనిపిస్తే... అప్పడాలూ వడియాల్లో నాన్‌వెజ్‌ రుచులూ ఉంటే... ఆశ్చర్యమే కదూ! మరెందుకాలస్యం? నోరూరిస్తున్న ఈ ట్రెండీ ఫుడ్స్‌ మీద ఓ లుక్కేస్తేపోలా!

పండులో కుల్ఫీ...

కుల్ఫీ అనగానే ఠక్కున మనకు పుల్లఐస్‌లాంటిదే గుర్తొస్తుంది. కానీ అచ్చంగా యాపిల్‌, బత్తాయి, మామిడి, డ్రాగన్‌ఫ్రూట్‌, పైనాపిల్‌, దానిమ్మ పండ్లలా ఉండే కుల్ఫీలూ ఉన్నాయి తెలుసా. కట్‌ చేసి చూస్తే తప్ప అది పండో, కుల్ఫీనో తెలియనంత సహజంగా ఉండే ఈ ఫ్రూట్‌ కుల్ఫీలు ఈమధ్య తెగ వైరల్‌ అయ్యాయి. నిజానికి ఈ ఫ్రూట్‌ కుల్ఫీల ట్రెండ్‌ పుట్టింది దిల్లీలోని ‘కురెమల్‌ మోహన్‌ లాల్‌’ ఐస్‌క్రీం షాపులో. కుల్ఫీకి మరింత రుచిని తీసుకురావాలనే ఉద్దేశంతో సహజమైన పండ్లకి కుల్ఫీని జోడించి వీటిని తయారుచేస్తున్నారు. ముందుగా పండ్లపైన చిన్న ముక్క కత్తిరించి లోపలి గుజ్జును మాత్రమే ఉంచి దాంట్లోనే కుల్ఫీ మిశ్రమాన్ని నింపుతారు. ఆ తర్వాత కత్తిరించిన ముక్కను దానిపైనే పెట్టేసి కొన్ని గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచుతారు. అంతే! తియ్యని పండ్ల రుచీ, కమ్మని కుల్ఫీ రుచీ కలిసిపోతూ ఫ్రూట్‌ కుల్ఫీ రెడీ అయిపోతుంది. మామిడి పండు కుల్ఫీ అయితే అందులో ఆ పండురంగులోనే కనిపించే పసుపు పచ్చ కుల్ఫీ మిశ్రమాన్నీ, అదే దానిమ్మలో ఎరుపు రంగు కుల్ఫీనీ... ఇలా పండులోని గుజ్జు రంగు ఫ్లేవర్‌ కుల్ఫీల్నే నింపుతుంటారు. అందుకే ఈ ఫ్రూట్‌కుల్ఫీ బయట నుంచే కాదూ, లోపల కూడా చిన్న చిన్న మార్పులతో ఆ పండు రూపంతోనే కనిపిస్తుంటుంది. స్థానికంగా ఆహార ప్రియుల్ని నోరూరిస్తున్న ఈ కుల్ఫీ సంగతి ఈమధ్య సోషల్‌ మీడియాలోకి చేరడంతో ‘అరె పండ్ల కుల్ఫీ చూడ్డానికైతే ఎంతో బాగుంది. మరి తింటే ఎలా ఉంటుందో’ అంటూ ఫుడ్‌లవర్స్‌ ఇంట్లోనే ఈ కొత్త ఫుడ్‌ను ట్రై చేసేస్తున్నారు. ఈసారెప్పుడైనా మీరూ దీన్ని ప్రయత్నించి చూసి ఇంటికొచ్చిన అతిథుల్ని ఆశ్చర్యపరచండి.


చేప అప్పడాలు... చికెన్‌ వడియాలు!

పప్పుచారులో నంజుకోవడానికి బియ్యం దగ్గర్నుంచీ సగ్గుబియ్యం వరకూ రకరకాల పదార్థాలతో బోలెడన్ని వెరైటీల్లో వడియాలూ, అప్పడాలూ చేసుకుంటుంటాం. ‘అరె ఎప్పుడూ ఇవేనా... వీటిల్లోనూ కాస్త కొత్తరుచి ఉంటే బాగుంటుంది’ అనుకునే మాంసాహారుల కోసం ఇప్పుడు నాన్‌వెజ్‌ అప్పడాలూ, వడియాలూ దొరుకుతున్నాయి. ఇదివరకు పచ్చళ్లలోకి వచ్చేసిన నాన్‌వెజ్‌ ఇప్పుడు వడియాల్లోకీ చేరిపోయిందన్నమాట. ‘చికెన్‌ క్రాకర్స్‌, ఫిష్‌ పాపడ్స్‌’ అంటూ మార్కెట్లో చాలా రకాల్లో ఈ మాంసాహార అప్పడాలు వచ్చేస్తున్నాయి. ఇవే కాదు... రొయ్యలూ, పీతలూ ఇష్టంగా తినేవారు ప్రాన్‌, క్రాబ్‌ క్రాకర్సూ కొనుక్కోవచ్చు. మామూలు అప్పడాల్లానే వీటినీ నూనెలో వేయించుకుని తినేయొచ్చు. కావాలంటే యూట్యూబ్‌లో చూసి మీరూ ఈ వేసవిలో ఇంట్లోనే
నాన్‌వెజ్‌ వడియాల్ని పెట్టుకోవచ్చు.


నల్ల జిలేబీ!

నలుపు రంగులో కనిపిస్తున్న ఈ జిలేబీల్ని చూసి ‘మాడిపోవడం వల్ల ఇలా ఉన్నాయేమో’ అనుకుంటున్నారా! కాదండీ బాబూ... వీటి రూపే ఇంత. ‘బ్లాక్‌ జిలేబీ’ పేరుతో పిలిచే ఈ జిలేబీ వంటకం ఈమధ్య నెట్టింట్లో తెగ వైరల్‌ అయింది. దిల్లీలోని స్ట్రీట్‌ఫుడ్‌లో కనిపించిన ఈ జిలేబీ ఫొటోలు సోషల్‌మీడియాలోకి రావడంతో ఫుడ్‌ లవర్స్‌ దృష్టి వాటిమీదకు మళ్లింది. మామూలుగా మైదా పిండితో తయారుచేసే బంగారు, నారింజ రంగు జిలేబీలే మనకు బాగా తెలుసు. కానీ ఈ నలుపు రంగు జిలేబీల్ని కోవా, బంగాళాదుంపలతో తయారుచేసి చక్కెర లేదంటే బెల్లం పాకంలో వేస్తారు. అందుకే ఇవి చూడ్డానికి ఇలా నలుపు రంగులో మాడిపోయినట్టు కనిపిస్తాయి. కానీ రుచిలో మాత్రం మామూలు జిలేబీల కన్నా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టే ఇది, కొత్తకొత్త రుచుల్ని ఆస్వాదించాలనుకునేవారికి హాట్‌ ఫేవరేట్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..