చిన్నారుల కోసం.. బేబీ సన్‌గ్లాసెస్‌..!

ఎండలకి చర్మంలానే కళ్లూ భగభగ మండుతుంటాయి. అందుకే ఎండలోకి వెళ్లినప్పుడు చలువకళ్లజోడు పెట్టుకుంటాం. అయితే సన్‌గ్లాసెస్‌ పెద్దవాళ్లకే గానీ పిల్లలకు ఎందుకులే అనుకుంటాం...

Updated : 10 Apr 2022 06:13 IST

చిన్నారుల కోసం.. బేబీ సన్‌గ్లాసెస్‌..!

ఎండలకి చర్మంలానే కళ్లూ భగభగ మండుతుంటాయి. అందుకే ఎండలోకి వెళ్లినప్పుడు చలువకళ్లజోడు పెట్టుకుంటాం. అయితే సన్‌గ్లాసెస్‌ పెద్దవాళ్లకే గానీ పిల్లలకు ఎందుకులే అనుకుంటాం... కానీ వాళ్లకే అవి అత్యవసరం. అందుకే బ్రాండెడ్‌ కంపెనీలన్నీ బేబీ గ్లాసెస్‌ను రకరకాల మోడళ్లలో తీసుకొస్తున్నాయి.

చిన్నారులకు సన్‌గ్లాసెస్‌ అవసరమా అని అడిగితే అవుననే చెప్పాలి. పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లలు ఎండలో ఎక్కువగా ఆడుతుంటారు. దాంతో యూవీకాంతికి గురవుతారు. ఫలితం... దీర్ఘకాలంలో క్యాటరాక్ట్‌లూ క్యాన్సర్లూ కంటినరాల బలహీనత వంటివి చోటుచేసుకునే ప్రమాదం ఉంది. యాభైశాతం పిల్లలు 18 ఏళ్లు నిండేసరికే- ఒక మనిషి జీవితం మొత్తంలో గురయ్యే యూవీకాంతిలో సగానికి గురవుతున్నట్లు ఓ అంచనా. అదీగాక పిల్లలకు కంటిలోని కటకం పెద్దవాళ్లలో మాదిరిగా యూవీకాంతిని అడ్డుకోలేదు. దాంతో ఆ కిరణాలు నేరుగా కళ్లలోకి చొచ్చుకునిపోయి హాని కలిగిస్తాయి. ఈ విషయం పట్ల అవగాహన లేక తల్లిదండ్రులు పిల్లలకు కళ్లజోడు అంటే- అదేదో సరదా కోసం అనుకుని బొమ్మలవి కొంటే సరి అనుకుంటారు. కానీ పెద్దవాళ్లకన్నా పిల్లలకే నాణ్యమైన సన్‌గ్లాసెస్‌ అవసరం అంటున్నారు నిపుణులు. పైగా సన్‌గ్లాసెస్‌ వైరస్‌ల నుంచీ రక్షణ కల్పిస్తాయి. అందుకే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వాళ్లకోసం జొజొమమన్‌, రేబాన్‌ జూనియర్‌, డిస్నీ ఏరియల్‌, ఓక్లే, బేబియేటర్స్‌, గెస్‌... వంటి ఎన్నో కంపెనీలు ప్రత్యేకంగా సన్‌గ్లాసెస్‌ను డిజైన్‌ చేస్తున్నాయి. పెద్దవాళ్ల గ్లాసెస్‌లో మాదిరిగానే రౌండ్‌, ర్యాప్‌ఎరౌండ్‌, స్క్వేర్‌, క్యాట్‌ ఐ... ఇలా ఎన్నో ఆకారాల్లో వస్తున్నాయి. ఆరు నెలల నుంచి ఆరేళ్లు వరకూ ఆరేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకూ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకూ... ఇలా వయసుల వారీగా అనేక మోడల్స్‌ దొరుకుతున్నాయి. కొన్ని కంపెనీలు కార్టూన్‌ క్యారెక్టర్లతో ఫన్నీగా ఉండేలా చేస్తుంటే, మరికొన్ని మడిచినప్పుడు చిన్న బొమ్మలా ఉండేవీ రూపొందిస్తున్నాయి.

కొనేముందు...

అతినీలలోహితకాంతిలోని రకాలైన యూవీఏ, యూవీబీ యూవీసీ... కిరణాలతోపాటు శక్తిమంతమైన దృశ్యకాంతి కూడా కంటిలోకి చొచ్చుకుపోయి రెటీనాని దెబ్బతీస్తుంది. కాబట్టి వీటన్నిటి నుంచి పూర్తి రక్షణ కల్పించే బేబీ సన్‌గ్లాసెస్‌నే తీసుకోవాలి. గోధుమ, తామ్ర వర్ణంలోని సన్‌గ్లాసెస్‌ అయితే ఆయా కాంతుల్ని ఎక్కువగా అడ్డుకుంటాయి. అలాగే ప్లాస్టిక్‌, ఆక్రిలిక్‌తో పోలిస్తే పాలీకార్బొనేటెడ్‌ లెన్స్‌ అయితే యూవీకాంతి నుంచి నూటికి నూరుశాతం రక్షిస్తాయి. పైగా ఇవి ప్లాస్టిక్‌కన్నా తేలిక. కాబట్టి ఆడుకునేటప్పుడు సౌకర్యంగానూ ఉంటాయి. ఫ్రేమ్‌ పిల్లల ముఖానికి సరిపడానే ఉండాలి. అప్పుడే అది ముఖానికి పట్టి ఉండి దుమ్మూధూళీ కళ్లలోకి వెళ్లకుండా ఉంటుంది. హెడ్‌బ్యాండ్‌తో కలిపి వచ్చే గ్లాసెస్‌ అయితే ముఖానికి ఫిట్‌గా ఉంటాయి. ఎండలేనప్పుడు సన్‌గ్లాసెస్‌ అవసరం ఉండదు అనుకుంటారు కానీ మబ్బులు యూవీకిరణాలను అడ్డుకోలేవు. కాబట్టి పిల్లలు ఏ సమయంలో బయటకు వెళుతున్నారు అనేదే ముఖ్యం. ఉదయం పది నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో బయట తిరిగేటప్పుడు సన్‌గ్లాసెస్‌ తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు. సో, పిల్లలకోసం సన్‌గ్లాసెస్‌ అనగానే చౌకవైనా పరవాలేదు అనుకోవద్దు... ఎండలో తిరిగేటప్పడు నాణ్యమైనవే వాడాలి. తల్లితండ్రులూ జాగ్రత్తమరి!


డాన్సూ, డ్రాయింగూ అన్నీ ఉచితమే!

డాన్సూ, యోగా, పెయింటింగ్‌... ఇలా ఎన్నో రకాల విద్యల్ని నేర్చుకోవచ్చు... మంచి మంచి కథలు వినడమే కాదు, చెప్పడం ఎలాగో తెలుసుకోవచ్చు...సరదాగా పజిల్సూ చేయొచ్చు... ఫన్నీ క్విజ్‌ పోటీల్లోనూ పాల్గొనొచ్చు... అదీ ఇంటి నుంచే... పైగా ఉచితంగానే! ‘ఎల్లోక్లాస్‌’ అనే ఆన్‌లైన్‌ ఆప్‌ ద్వారా ఇదంతా సాధ్యం!

‘ఈ వేసవి సెలవుల్లో బాబుకు వాడికిష్టమైన డ్రాయింగ్‌ నేర్పించాలి. డాన్స్‌ క్లాసెస్‌కీ పంపాలి. కానీ వాటిని నేర్పించే ఇన్‌స్టిట్యూట్స్‌ దగ్గర్లో లేవు. ఈ ఎండల్లో అంత దూరం ఎలా పంపాలో మరి’... ‘పరీక్షలు కాగానే పాప అమ్మమ్మవాళ్ల ఊరికి వెళ్తానంటోంది. నాకేమో తన హ్యాండ్‌రైటింగ్‌ బాగవ్వడానికి కాలిగ్రఫీ తరగతులకు పంపితే బాగుండనిపిస్తుంది. ఎలాగో ఏంటో’...

ఇలా, రాబోయే సెలవుల్ని పిల్లలకు ఉపయోగపడేలా ప్రణాళిక వేయడానికి అమ్మానాన్నలు ముందు నుంచే ఆలోచిస్తుంటారు. ‘ఎల్లోక్లాస్‌’ ఆప్‌ ద్వారా ఇప్పుడు ఆ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఇంటి నుంచే మీ పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా నలభైకి పైగా ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ నైపుణ్యాలను ఉచితంగా నేర్చేసుకోవచ్చు. కరోనా తర్వాత ఆన్‌లైన్‌ క్లాసులు పెడుతూ బోలెడన్ని వెబ్‌సైట్లూ, ఆప్‌లూ వచ్చేశాయి. అయితే చాలావరకూ డబ్బు కట్టించుకుని నేర్పించేవే ఉన్నాయి. ఒకవేళ ఉచితంగా తరగతులు చెప్పేవి ఉన్నా అందులో ఒకటో, రెండో సబ్జెక్టులే ఉంటాయి. అదే ఈ ఎల్లోక్లాస్‌ ఆప్‌లో అయితే నలభైకి పైగా నైపుణ్యాలకి సంబంధించిన వెయ్యి క్లాసుల్లో ఉచితంగా పాల్గొనొచ్చు. అవి కూడా అనుభవం ఉన్న టీచర్లతో చెప్పిస్తారు. ఇంతకీ ఈ ఆప్‌ సంగతులేంటంటే... హరియాణాకు చెందిన అన్షుల్‌ గుప్తా ఓ ఐటీ కంపెనీ నడుపుతుండేవాడు. పిల్లలు యూట్యూబ్‌, టీవీల్లో మునిగిపోయి సమయం వృథా చేసుకోవడం గమనించాడు. అలాంటివాళ్లకి ఉపయోగపడేలా తన టెక్‌ నైపుణ్యంతో ఏదైనా చేయాలనుకున్నాడు. అలా 2019లో కొన్ని ఆన్‌లైన్‌ క్లాసులు రూపొందించాడు. వాటికి మంచి ఆదరణ రావడంతో మిత్రుడు అర్పిత్‌ మిట్టల్‌తో కలిసి ‘ఎల్లో క్లాస్‌’ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసి అందులో ఈ వీడియోల్ని పెట్టారు. కరోనా తర్వాత డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోవడంతో నిపుణులతో లైవ్‌క్లాసెస్‌ ఉచితంగా ఇప్పించడం ప్రారంభించారు. దాన్నే ఇప్పుడు ఆప్‌గానూ తీసుకొచ్చారన్నమాట. ఇప్పటి వరకూ దీన్ని పదిలక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఎలా ఉంటుందంటే...

మీరు కరోనా టైంలో బడిలో టీచర్‌ చెప్పిన ఆన్‌లైన్‌ క్లాసులు వినే ఉంటారుగా. ఈ క్లాసెస్‌ కూడా అలాగే ఉంటాయి. టీచర్లు చెబుతూ పోవడం కాకుండా మన సందేహాల్నీ తీరుస్తారు. లైవ్‌లో ఎంచక్కా మనం వాళ్లతో ఇంటరాక్ట్‌ అవుతూ అర్థంకాని విషయాల్ని అడిగి మరీ తెలుసుకోవచ్చు. క్లాసు ఎలా ఉందో... మనకు నచ్చిన విషయాలేంటో కూడా వాళ్లతో చెప్పొచ్చు. ప్రతి తరగతీ గంటపాటు సాగుతుంది. మామూలు ఆప్‌లానే దీన్నీ సులువుగా ఇన్‌స్టాల్‌ చేసుకుని పేరూ, ఫోన్‌నెంబరూ, వయసూ లాంటి వివరాల్ని అందిస్తే చాలు. అక్కడ యోగా, ధ్యానం మొదలు పెయింటింగ్‌, మ్యూజిక్‌, ఫ్లేమ్‌లెస్‌ కుకింగ్‌, డాన్స్‌, స్టోరీ టెల్లింగ్‌, కాలిగ్రఫీÆ, క్రాఫ్ట్స్‌, ఒరిగామీ దాకా బోలెడన్ని ఆర్ట్స్‌ నేర్పిస్తారు. వీటితోపాటూ జనరల్‌ నాలెడ్జ్‌, ఫన్‌ విత్‌ మ్యాథ్స్‌ అండ్‌ ఇంగ్లిష్‌, పజిల్స్‌ లాంటి విషయాలెన్నో కూడా ఉంటాయి. ఆసక్తిని బట్టి కావాల్సిన క్లాసెస్‌ని ఎంచుకోవడంతోపాటూ మన వీలును బట్టి లైవ్‌ తరగతుల సమయాన్నీ సెలక్ట్‌ చేసుకోవచ్చు. పిల్లల వయసును బట్టి వేరు వేరు స్థాయుల్లో ఈ తరగతులుంటాయి. వీటన్నింటినీ మనం నేరుగా వినడమే కాదండోయ్‌.. ఇతరులతోనూ షేర్‌ చేసుకోవచ్చు. అంతేకాదు, మనం గీసిన బొమ్మనో, వేసిన స్టెప్పుల వీడియోనో ఈ ఆప్‌లో అప్‌లోడ్‌ చేసుకుని మనలా నేర్చుకుంటున్న విద్యార్థుల లైకులూ, సూచనలూ పొందొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..