Updated : 18 Apr 2022 12:43 IST

ఉల్లి... అందానికీ ఆరోగ్యానికీ...

‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అంటారు. సౌందర్య నిపుణులు సైతం ఇది నిజమే అంటున్నారు. అవునండీ... ఉల్లి కేవలం ఆరోగ్యాన్నే కాదు, అందాన్నీ సంరక్షిస్తుందట. దాంతో కూరగాయగా వాడుకునే ఉల్లిపాయతో బ్యూటీ ఉత్పత్తుల్నీ రూపొందిస్తున్నారు. అదలా ఉంచితే, ఉల్లిపాయ... వేసవితాపాన్నీ దాహాన్నీ తగ్గించి శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన కూలర్‌! అందుకే ఇది నేరుగా వాడుకునేలా తాజాగానూ పొడి, ఫ్లేక్స్‌ రూపంలోనూ కూడా దొరుకుతోంది..!

ఎండలు మండుతున్నా వ్యవసాయ పనులకో ఇతర పనులకోసమో బయట తిరగక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు ఓ ఉల్లిపాయని వెంటతీసుకెళ్లమనీ వడదెబ్బ తగలదనీ చెబుతారు పెద్దలు. ఉల్లిపాయని వాసన చూసినా మేలేనట. కొందరయితే పాదాలకి ఉల్లిరసం రాసుకుని మరీ వెళ్లేవారట. ఇక, వేసవి రాగానే మజ్జిగన్నంలో ఉల్లిపాయ నంజుకుని తినడం, ఉల్లిపాయలతో పచ్చిపులుసు చేసుకోవడం చేస్తుంటారు. ఒంటిని చల్లబరిచే గుణం ఉల్లిపాయకి ఉండటమే ఇందుకు కారణం. ఉల్లిపాయలోని క్వస్టిన్‌ అనే పదార్థం, వేడివల్ల వచ్చే బొబ్బలూ దద్దుర్లకి కారణమైన హిస్టమైన్‌ అనే పదార్థానికి విరుగుడుగా పనిచేస్తుంది. అందుకే వేసవిలో పచ్చి ఉల్లిపాయని తినడం మేలనీ దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ అంటారు.

అంతేనా... 1918-20 నాటి స్పానిష్‌ ఫ్లూ సమయంలో- ఓ ఇల్లాలు ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసి ఓ గిన్నెలో వేసి అన్ని గదుల్లోనూ ఉంచిందట. దాంతో గాల్లోని వైరస్‌నీ బ్యాక్టీరియానీ ఉల్లిపాయ గ్రహించి నాశనం చేయడంతో వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారనేది ఓ పిట్ట కథ. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. కానీ ఉల్లి బ్యాక్టీరియాల్నీ వైరస్‌ల్నీ ఆకర్షిస్తుందనీ, అందులోని ఘాటుకి అవి చనిపోతాయనీ, అందుకే రోగులచెంత ఉల్లిపాయ ఉంచితే త్వరగా కోలుకుంటారనీ చెబుతారు.

ఎందుకీ ఉల్లిపాయ?
ఉల్లి చేసే మేలుని గుర్తించిన ఈజిప్షియన్లు వాటిని దేవతల్లా పూజించేవారట. అప్పట్లో కలరా, ప్లేగు నివారణకి ఉల్లిపాయ వాడిన ఆధారాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మంచిదనో, ఘాటైన దాని రుచో... కారణం ఏదయితేనేం... ఉల్లి ఘాటు లేని కూర మనవాళ్లకీ సహించదు. సాంబారు, రసం, పులుసుల్లోనూ; ఉప్మా, పకోడీ, బిర్యానీ... ఇలా ఎందులోనయినా ఉల్లి ఉంటేనే అదుర్స్‌. ఇంకా చాలా వంటల్లో ఉల్లిపాయలు నేరుగా కనిపించవు. తెర వెనుక పాత్రధారుల్లా రుచి ద్వారా తమ ఉనికిని చాటుతుంటాయి. అయితే ఉల్లిపాయలో తామస, రజో గుణాల్ని పెంచే లక్షణాలు ఉంటాయనీ శృంగారప్రేరితమనీ ఆయుర్వేదం చెబుతుంది. అందుకే కొన్ని వర్గాలకి చెందినవాళ్లూ సన్యసించిన వాళ్లూ దీన్ని వాడరు.

రంగూరుచీ!
ఊదా కలిసిన గులాబీ వర్ణాన్ని ఉల్లిపాయ రంగు అంటాం కానీ ఇది తెలుపూ, ఎరుపూ, పసుపూ అని మూడు రంగుల్లో పండుతుంది. వీటిల్లో మళ్లీ పాట్నా రెడ్‌, బళ్లారి రెడ్‌, నాసిక్‌ రెడ్‌, పోర్చుగల్‌ వైట్‌ ... అంటూ బోలెడు షేడ్స్‌. తెలుపూ పసుపు రంగులతో పోలిస్తే ఎరుపు రంగు ఉల్లిలో కెట్రెచోల్‌, ప్రొటొకెటెచిక్‌ ఆమ్లాలు ఉండటంతో అవి ఘాటుగా ఉంటాయి. పైగా ఉల్లి ఘాటూ రుచీ అవి పెరిగే వాతావరణం, నేల మీదా ఆధారపడి ఉంటాయి. తెలుపూ పసుపూ రంగుల్లో ఉండే విడాలియా, స్వీట్‌ స్పానిష్‌, బెర్ముడా, హనీ స్వీట్‌, వాలావాలా... రకాలు ఏమాత్రం ఘాటు లేకుండా తియ్యగా ఉంటాయి. స్టఫింగ్‌ లేదా బేకింగ్‌ల్లోనూ వీటిని వాడతారు. హవాయిలో పండే మాయి రకంలో అసలు సల్ఫరే ఉండదు కాబట్టి మరీ తియ్యగా ఉంటాయట. చిన్నగా గుండ్రంగా పెరల్‌ అనియన్‌ అని మరో రకం ఉంది. తియ్యగా ఉండటంతో వీటిని సూపుల్లోనూ సాంబారుల్లోనూ  వాడతారు. పొడవాటి కాడతో ముదురు ఎరుపుతో చిన్నగా ఉండే డయక్‌ రకం ఔషధంగానే వాడుక ఎక్కువ. సన్నగా పొడవుగా ఉండే కాల్కోట్‌ అనియన్‌, సాసర్‌ ఆకారంలో ఉండే సిపొలిని, గుండ్రని ఇటాలియన్‌ రెడ్‌... ఇలా ఇంకా చాలానే ఉన్నాయి.

ఉల్లికాడలు వేరయా!
ఉల్లిపాయల్లానే పాయ ముదరకుండానే పీకే ఉల్లికాడల్నీ వంటల్లోనూ సలాడ్లలోనూ వాడతారు. ఘాటు తక్కువగా ఉండాలనుకునేవాళ్లకి ఇవి మంచి ప్రత్యామ్నాయం. వీటిల్లో పీచు బాగా ఉండటంతో ఆకలి తగ్గి, బరువు పెరగరట. కాడల్లోని క్యామెఫెరాల్‌ అనే ఫ్లేవనాయిడ్‌ రక్తప్రసరణని పెంచుతుంది. గర్భిణులు తొలి మూడు నెలల్లో వీటిని తింటే ఫోలిక్‌ఆమ్లం పుష్కలంగా ఉండి శిశువుకి వెన్నెముక సమస్యలూ బుద్ధిమాంద్యం రాకుండా ఉంటాయి.

ఆరోగ్య సంరక్షిణి!
ఉల్లిపాయలో 89శాతం నీరు, 9శాతం పిండిపదార్థాలు, ఒక శాతం ప్రొటీన్‌ ఉంటుంది. పొటాషియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, కాల్షియం, ఐరన్‌... వంటి ఖనిజాలూ; ఫొలేట్‌, విటమిన్‌-సి, ఎ, బి6లతోపాటు పీచూ పుష్కలంగా ఉంటాయి. వేడి చేసినప్పుడు వీటిల్లో కొన్ని గుణాలు నశిస్తాయి. కాబట్టి పచ్చివి తింటే మంచిది అంటారు. తెలుపు వాటితో పోలిస్తే పసుపు రంగువీ, వీటితో పోలిస్తే ఎరుపు రంగు ఉల్లిపాయల్లో ఆంథోసైనిన్ల శాతం ఎక్కువ. అందుకే అవి ఎంత వాడితే అంత మంచిది. కళ్లు, కీళ్లు, గుండె, పొట్ట... ఇలా అన్ని అవయవాల్నీ సంరక్షిస్తుంది ఉల్లిపాయ. ఉల్లిలోని డై- ట్రై సల్ఫైడ్‌లూ, వినైల్‌ డైథీన్‌లూ కొవ్వుని కరిగించడంతోపాటు బ్యాక్టీరియానీ వైరస్‌లనీ నివారిస్తాయి. క్వస్టిన్‌ కణజాల సంరక్షణకీ విటమిన్‌-ఇ ఉత్పత్తికీ జ్ఞాపకశక్తికీ తోడ్పడడంతోపాటు రొమ్ము, ఊపిరితిత్తుల వ్యాధులతోనూ పోరాడుతుంది.

ఎండు ఉల్లిపాయని రోజూ గ్రా. చొప్పున తీసుకుంటే ఎముకల్లో ఖనిజ సాంద్రత పెరుగుతుంది. గొంతునొప్పి ఉంటే ఉల్లిపాయలో బెల్లం కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు నాలుగు టీస్పూన్ల ఉల్లిరసంలో చిటికెడు ఇంగువ, నల్లఉప్పు కలిపి రోజుకి రెండుమూడుసార్లు మూడునెలలపాటు తాగితే నులిపురుగుల బాధ ఉండదనీ చెబుతారు గృహవైద్య నిపుణులు. తెల్ల ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే మూత్రంలో మంట తగ్గడంతోపాటు మూత్రపిండాలూ ఆరోగ్యంగా ఉంటాయి. కలరా వ్యాధితో బాధపడే రోగికి ఉల్లిరసాన్ని తరచూ పట్టిస్తే మంచిదట. పచ్చి ఉల్లిపాయని తింటే నెలసరి సమస్యలూ తగ్గుతాయి.

సౌందర్య లేపనం!
ఉల్లిపాయకి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించే గుణం ఉంది. ఇందులోని క్వస్టిన్‌, సల్ఫర్‌తో కూడిన ఫైటోకెమికల్స్‌  చర్మంలో కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా వయసు మీదపడకుండా రక్షిస్తాయి. ఉల్లిలోని యాంటీఆక్సిడెంట్లు హానికర యూవీ కిరణాల్నీ అడ్డుకుంటాయి. దీని రసాన్ని రోజూ పెదాలమీద రాస్తే మృతకణాలు పోయి అవి మృదువుగా మారతాయి. ఉల్లిరసంలో కాస్త నిమ్మరసం కలిపి దూదితో మెడకీ ముఖానికీ పట్టించి ఆరాక చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మచ్చలు నివారించే మంచి ఆయింట్‌మెంట్‌ కూడా.

ఇక, జుట్టు ఊడిపోయేవాళ్లకి ఉల్లిపాయే బుల్లి పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఉల్లిపాయలోని సల్ఫర్‌ జుట్టు పెరుగుదలకి కారణమైన క్యాటలాజ్‌ అనే ఎంజైమ్‌ ఉత్పత్తిని పెంచడంతోపాటు రక్త ప్రసరణ పెరిగేలా చేయడం ద్వారా శిరోజాల్ని సంరక్షిస్తుంది. ఉల్లిలోని ఇతర పదార్థాలు బ్యాక్టీరియా, ఫంగస్‌లను నిర్మూలించడం ద్వారా చుండ్రు నివారణకీ తోడ్పడతాయి. అందుకే కాస్త ఉల్లిరసాన్ని కొబ్బరి, ఆలివ్‌, బాదం... వంటి నూనెల్లో కలిపి రాస్తే ఫలితం ఉంటుందట. ఉల్లి రసం రాయడం వల్ల జుట్టు ఊడటం తగ్గి మళ్లీ వచ్చినట్లు ఓ పరిశోధన చెబుతోంది. అందుకే కాబోలు... మారికో, బజాజ్‌, మామా ఎర్త్‌, కేశ్‌ కింగ్‌, ఇమామీ, ప్లమ్‌ గుడ్‌నెస్‌, వేదిక్స్‌, వావ్‌ స్కిన్‌ సైన్స్‌.... వంటి అనేక బ్రాండెడ్‌ సంస్థలు ఉల్లి తలనూనెల్నీ షాంపూల్నీ తీసుకొస్తున్నాయి. మన దేశంలో తలనూనెల మార్కెట్‌ ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలు ఉంటే, మరో ఎనిమిదేళ్లకి ఎనిమిది వందలకోట్లు ఉల్లి నూనెవే ఉండొచ్చు అనేది ఓ అంచనా. చూశారా మరి... అదీ ఉల్లిపాయ తడాఖా!


బనానా షలాట్స్‌

గుండ్రంగా ఉండే ఉల్లి రకాల్ని అనియన్‌(ఉల్లిపాయ) అంటే, సన్నగా పొడవుగా చిన్నగా ఉండే వాటిని షలాట్స్‌(చిన్న ఉల్లి) అంటారు. వీటిని మనదగ్గర ఎక్కువగా సాంబారుల్లో వాడతారు. వీటిల్లోనే అరటికాయల్లా మరింత పొడవుగా ఉండేవీ ఉన్నాయి. అవే బనానా షలాట్స్‌. 18 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ రకం, ఉల్లీ వెల్లుల్లీ కలగలిసిన తీపిరుచితో మంచి వాసనతో ఉంటాయట. సూప్‌లూ కూరలూ సాస్‌లూ... ఇలా అన్నింటిలోనూ వీటిని వాడుకోవచ్చు.


ఎంత పెద్ద ఉల్లిపాయో?!

ఓ మాదిరి పెద్దసైజులో ఉంటేనే అమ్మో అనుకుంటాం.. అయితే కిలోలకొద్దీ బరువుండే ఉల్లిపాయల్ని పండిస్తుంటారు కొందరు. కెల్సా స్వీట్‌ జెయింట్‌ రకం సుమారు ఏడు కిలోల వరకూ ఊరితే, ఎయిల్సా క్రెయిగ్‌- రెండున్నర కిలోలు; ఎక్స్‌ప్రెషన్‌, వాలావాలా... రకాలు  రెండు కిలోల వరకూ ఊరతాయట.


కన్నీళ్లు ఎందుకు?

ఉల్లిపాయల్ని కోసినప్పుడు వాటిల్లోని ఎంజైమ్స్‌ సల్ఫర్‌తో చర్యపొందడంతో ప్రొపనెథియల్‌-ఎస్‌-ఆక్సైడ్‌ అనే వాయువు విడుదలై, కంటి నరాలను చేరి గుచ్చినట్లుగా చేయడంతో కళ్లు మండుతాయి. ఆ మంటని తగ్గించేందుకే వాటిని కోసేటప్పుడు కన్నీటి గ్రంథులు స్పందించి నీటిని స్రవిస్తాయి. దీన్నే లాక్రిమేటరీ ఫ్యాక్టర్‌ అంటారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని