ఊరు... పల్లె‘టూరు’!
చూడాలే కానీ పల్లెల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలూ! వినాలేగానీ ప్రతి పల్లెదీ ఆసక్తికరమైన కథే..! తెలుగు రాష్ట్రాల్లోని అలాంటి వింతల్నీ, విడ్డూరాల్నీ, ఆసక్తికరమైన కథల్నీ చెబుతున్నాయి ఈ యూట్యూబ్ ఛానెళ్లు. అందుకోసం వందల మైళ్లు ప్రయాణిస్తున్నారు, వాగులు దాటుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు వీటి నిర్వాహకులు.
ఊరు... పల్లె‘టూరు’!
చూడాలే కానీ పల్లెల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలూ! వినాలేగానీ ప్రతి పల్లెదీ ఆసక్తికరమైన కథే..! తెలుగు రాష్ట్రాల్లోని అలాంటి వింతల్నీ, విడ్డూరాల్నీ, ఆసక్తికరమైన కథల్నీ చెబుతున్నాయి ఈ యూట్యూబ్ ఛానెళ్లు. అందుకోసం వందల మైళ్లు ప్రయాణిస్తున్నారు, వాగులు దాటుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు వీటి నిర్వాహకులు.
వింతలూ విశేషాలతో...
ఇప్పుడంటే వలసలు ఎక్కువై... పల్లెలు కళ తప్పుతున్నాయి కానీ, ఒకప్పుడు ఎంత సందడి ఉండేదక్కడ. కొండకోనలతో వారి జీవనం ముడిపడి ఉండేదనడానికి ఇప్పటికీ ఎన్నో సజీవ సాక్ష్యాలున్నాయి. శతాబ్దాల కిందట నిర్మించిన కోటలూ, ఆలయాలూ... తవ్వించిన బావులూ కనిపిస్తాయి. అలాంటి చారిత్రక కట్టడాల్నీ, అంశాల్నీ వెలుగులోకి తెస్తోంది ‘విలేజ్ విహారి’ ఛానెల్. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడకు చెందిన మిత్రులు షాహిద్, నరేంద్ర ఈ ఛానెల్‌ని నిర్వహిస్తున్నారు. దీనిద్వారా మారుమూల పల్లెలూ, అక్కడ వ్యక్తుల కథల్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన గడ్డ అయిన తమ ఊరి ప్రత్యేకలతో అరడజను వీడియోలతో మొదట ఆకట్టుకున్నారు. అప్పుడే మరిన్ని పల్లె కథల్ని చెప్పాలనుకున్నారు. అందుకోసం తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర కూడా వెళ్తున్నారు. వీళ్లు చేసిన కొన్ని వీడియోలకు 40, 50 లక్షల వీక్షణలూ వచ్చాయి. ప్రస్తుతం 10 లక్షల సబ్‌స్క్రైబర్లకు దగ్గరగా ఉంది వీరి ఛానెల్. ఆంధ్రప్రదేశ్‌లోని మైలచర్ల ప్రాంతంలోని కొండపైన ఉన్న రాతి బావి, కర్నూలు జిల్లాలోని వాల్మీకి గృహ, వైఎస్‌ఆర్ జిల్లాలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు... తమిళనాడులోని పర్వతమలైలో కొండమీద వందల అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం, ఇలా వీళ్లు చేసిన అనేక వీడియోలకు అనూహ్య స్పందన వచ్చింది.
గిరిజన జీవనం...
మూడేళ్ల కిందట హైదరాబాద్ నుంచి సొంతూరు శ్రీకాకుళం జిల్లా పలాసకు తిరిగొచ్చేశారు టీవీ జర్నలిస్టు సురేశ్. తీరికవేళల్లో పల్లె ప్రజల జీవనశైలిని చూపే వీడియోల్ని తీసి ఫేస్‌బుక్‌లో పెడుతుండేవారు. వాటికి మంచి స్పందన రావడంతో స్నేహితుల సలహా మేరకు ‘విలేజ్ వ్యాన్’ ఛానెల్ పెట్టారు. ఒకప్పుడు 70 గడపలుండే తమ పొరుగూరు విషంపల్లిలో ప్రస్తుతం మూడు కుటుంబాలే ఉన్నాయి. ఊళ్లో ఉండేది ఎనిమిది మంది. వారి జీవనశైలిని మొదటి వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఆంధ్ర-ఒడిశా, తెలంగాణ- ఆంధ్ర- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో ఉండే గిరిజనుల జీనవశైలిని చూపించే వీడియోల్ని ప్రధానంగా తీస్తున్నారు. మైదాన గ్రామాల్లో జీవనశైలి బాగా మారిపోయింది. గిరిజన గ్రామాల్లో మాత్రం ఇంకా పాత పద్ధతులూ, సంప్రదాయాలూ ఉండటంతో వాటిని చూపిస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాలపైనా, గిరిజన సంతలపైనా తీసిన వీడియోలకు లక్షల్లో వీక్షణలు వచ్చాయి. ముఖ్యంగా వారి ఆర్థిక, సామాజిక పరిస్థితిని చూపుతారు. కొన్నిసార్లు ఆ పల్లెల్లో దొరికే ఉత్పత్తుల గురించి చెబుతూ రైతుల నంబర్లూ చెబుతారు. విలేజ్ వ్యాన్ స్ఫూర్తితో చాలామంది గిరిజన, గ్రామీణ యువకులు యూట్యూబర్లుగా మారడం విశేషం. పచ్చని పైర్లనీ, ప్రశాంతమైన పల్లె జీవనాన్నీ ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. వాళ్లు తమ ఫోన్లోనుంచే ఇలా గ్రామ సందర్శన చేస్తున్నారు. ఈ ఛానెల్‌కు దాదాపు 1.5లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ప్రగతిని చూపిస్తూ...
ఊళ్ల నుంచి పట్టణాలూ, నగరాలకు వలసలు వెళ్లిన వాళ్లున్నట్టే... ఎన్ని సవాళ్లు ఎదురైనా పుట్టిన ఊళ్లోనే జీవనం సాగించే వాళ్లూ ఉన్నారు. అలా సొంతూరులో సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని జీవనం సాగిస్తున్నవారి గురించి చూపే ఛానెల్ రూరల్ మీడియా. పల్లె ప్రజలు ఏం సాగు చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు... అక్కడ విద్య, వైద్యం, ఉపాధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి... తదితర అంశాల్ని ఈ ఛానెల్ చూపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఆధునిక బాట పడుతున్న ఆదర్శ రైతులూ, గ్రామాల వివరాల్ని అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పల్లె కథల్ని ఈ ఛానెల్‌ద్వారా చూపిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టు శ్యాంమోహన్ బృందం. ఏదైనా గ్రామంలో అభివృద్ధి ఉంటే మిగతా గ్రామాలు దాన్నుంచి స్ఫూర్తి పొందేలా, ఇబ్బందులు ఉంటే అవి ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా కృషి చేస్తున్నారు. పట్టణాలూ, నగరాల్ని వదిలి తిరిగి పల్లెలకు వచ్చి, అక్కడ మార్పు తెస్తున్న వారి గురించీ కథనాలు చెబుతారు. సాగు సమస్యల్ని రైతులు ఎలా పరిష్కరిస్తున్నారో, గ్రామీణ ఉత్పత్తుల్ని ఎలా మార్కెట్ చేయగలుగుతున్నారో, ప్రభుత్వ పథకాలతో గ్రామీణులు ఎలా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ ఛానెల్ చూడాల్సిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Social Look: శ్రద్ధాదాస్ ‘లేజర్ ఫోకస్’.. బెంగళూరులో నభా.. రకుల్ ‘ఫెస్టివ్ మూడ్’!
-
Congress: కాంగ్రెస్ తొలి జాబితాపై స్పష్టత.. 70 స్థానాలకు అభ్యర్థుల ఖరారు?
-
Chandrababu arrest: చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం
-
Kumari Srimathi: అబ్దుల్ కలాం.. రజనీకాంత్.. ఇటికెలపూడి శ్రీమతి..