ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌ కేరాఫ్‌ నెల్లూరు!

నీరో చక్రవర్తి గురించి వినే ఉంటారు. రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తూ ఉండిపోయాడన్న అప్రతిష్ఠని మూటగట్టుకున్న ఆ చక్రవర్తే... ప్రపంచానికి ఐస్‌క్రీమ్‌ని పరిచయం చేశాడనీ అంటారు.

Updated : 23 Jun 2024 00:37 IST

నీరో చక్రవర్తి గురించి వినే ఉంటారు. రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తూ ఉండిపోయాడన్న అప్రతిష్ఠని మూటగట్టుకున్న ఆ చక్రవర్తే... ప్రపంచానికి ఐస్‌క్రీమ్‌ని పరిచయం చేశాడనీ అంటారు. నాటి నుంచీ ఐస్‌క్రీమ్‌ కాలానికి తగ్గట్టు రకరకాల మార్పులకి లోనవుతూ వస్తోంది. మరి ఇది ప్రపంచమంతా సేంద్రియ జపం  చేస్తున్న కాలం కదా! అందుకు తగ్గట్టే ‘ఐస్‌బర్గ్‌ ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌’ బ్రాండ్‌ని సృష్టించాడు... సుహాస్‌ బొమ్మిశెట్టి. నెల్లూరులో మొదలుపెట్టి ఆలిండియా స్థాయిలో హవా కొనసాగిస్తున్నాడు!

పండ్లూ కాయగూరలే కాదు... బిస్కెట్లూ కేకులు కూడా ఇప్పుడు ఆర్గానిక్‌ అవతారం ఎత్తేస్తున్నాయి. ‘అన్నీ సేంద్రియ మవుతున్నప్పుడు అలాంటి ఐస్‌క్రీములు ఎందుకు ఉండవు?’ అన్న ప్రశ్నతో నెట్‌లో వెతికారనుకోండి... మనకు ‘ఐస్‌బర్గ్‌ ఐస్‌క్రీమ్‌’ అన్న బ్రాండ్‌ పేరే ముందుగా కనిపిస్తుంది! తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని మరే ప్రధాన నగరంలో ఉండి వాకబు చేసినా సరే... ఈ బ్రాండ్‌నే చూపించి ‘నిమిషాల్లో తెచ్చిస్తాం’ అంటాయి స్విగ్గీ, జొమాటోలు! దేశం నలుమూలలా అంతగా విస్తరించిందీ బ్రాండ్‌. అంతెందుకు, శ్రీవారు కొలువైన తిరుమలలో ఐస్‌క్రీమ్‌ ఔట్‌లెట్‌ను పెట్టిన ఏకైక బ్రాండ్‌ కూడా ఇదే. పాల నుంచి ప్యాకింగ్‌ దాకా అన్నింటా సేంద్రియానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే తమ సంస్థకి కొండపైన అనుమతి వచ్చిందంటాడు ‘ఐస్‌బర్గ్‌ ఐస్‌క్రీమ్‌’ వ్యవస్థాపకుడు సుహాస్‌. ఇంటాబయటా ఇంతటి హవా కొనసాగిస్తున్న ఈ బ్రాండ్‌ ఎలా పుట్టిందో చూద్దామా...

సుహాస్‌ బొమ్మిశెట్టిది నెల్లూరులోని బాలాజీ నగర్‌. ఫార్మసీలో పీహెచ్‌డీ చేశాడు. తన స్వస్థలమైన నెల్లూరులోనే ఓ పరిశ్రమ స్థాపించాలనుకున్నాడు. 2012లోనే అందుకు రెండున్నర కోట్ల రూపాయలు అవసరమయ్యాయట. అంత పెట్టుబడి పెట్టలేని సుహాస్‌ ఇంకేదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. నెల్లూరులో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండటం గమనించాడు. మహా నగరాల్లో లీటరు రూ.50 దాకా పలికే రోజుల్లో ఆ పట్టణంలో రూ.25కే పాలు దొరికేవి. అంత చవగ్గా దొరుకుతున్న ఆ పాలతో ఐస్‌క్రీమ్‌ వ్యాపారం చేయొచ్చన్న ఆలోచన వచ్చింది సుహాస్‌కి. అలా మూడు లక్షల పెట్టుబడితో 2013లో ‘ఐస్‌బర్గ్‌’ సంస్థని స్థాపించాడు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకపోవడంతో- తొలిరోజు షాప్‌లో పెట్టిన 45 లీటర్‌ల ఐస్‌క్రీమ్‌ మధ్యాహ్నానికంతా అమ్ముడుపోయింది. ఆ జోరు అలా కొనసాగి మూడునెలల్లోనే పెట్టుబడి తిరిగొచ్చేసిందట. 2018 నాటికల్లా హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరుల్లోనూ ఔట్‌లెట్‌లు పెట్టగలిగాడు. అప్పుడప్పుడే ‘సేంద్రియం’ అన్నపదం వ్యవసాయరంగాన్ని దాటి జనబాహుళ్యంలోకి వస్తోంది. దాంతో ఐస్‌క్రీమ్‌లనీ ఆర్గానిక్‌గా ఎందుకు తయారు చేయకూడదన్న ఆలోచన వచ్చింది సుహాస్‌కి. మిగతా ఉత్పత్తుల విషయం ఎలా ఉన్నా- ఐస్‌క్రీమ్‌లో విరివిగా ఉపయోగించాల్సిన చక్కెర, ప్రిజర్వేటివ్స్‌ వంటివాటికి సేంద్రియ ప్రత్యామ్నాయాలు తీసుకురావడం అంత సులభం కాదు. అందుకు సంబంధించిన పరిశోధనాభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)కి పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి. అయినా తాడోపేడో తేల్చుకుందామనుకున్నాడు సుహాస్‌. అప్పటిదాకా ఐస్‌క్రీమ్‌ బిజినెస్‌లో తనకొచ్చిన 80 లక్షల రూపాయల ఆదాయం మొత్తాన్నీ పణంగా పెట్టి పరిశోధనకి దిగాడు...

పేటెంట్‌ సాధించాడు...

ముందుగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా పటికబెల్లాన్ని ఉపయోగించడంపైన ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. మిగతా ఐస్‌క్రీముల్లా పండ్ల నూనెల్ని వాడకుండా... పండ్ల రసాల్ని వాడగలిగాడు. ఇక, ప్రిజర్వేటివ్స్‌ కోసం- ఉత్తరాదిన ఆహార పదార్థాల్లో వాడే గోంద్‌ని ఉపయోగించే ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించాడు. ఆ పద్ధతికి పేటెంట్‌ కూడా సాధించాడు. అక్కడితో ఆగలేదు... ప్లాస్టిక్‌ అన్నది వాడకుండా పూర్తిగా కాగితాల తోనే కప్పులూ, క్యూబ్‌లని తయారుచేసేశాడు. ఈ సరికొత్త ఐస్‌క్రీమ్‌ ఉత్పత్తులతో 2018లో సంస్థ పేరుని ‘ఐస్‌బర్గ్‌ ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్స్‌’ అని మార్చాడు. మార్కెటింగ్‌కి పైసా ఖర్చు పెట్టకుంటేనేం, ఈ ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌ ఆనోటా ఈనోటా పడి మంచి పేరుతెచ్చుకుంది. సుహాస్‌, అతని బృందం పడ్డ కష్టం ఫలించి పెట్టుబడులు చేతికొచ్చేశాయి. దేశవ్యాప్తంగా 125 కేంద్రాలకి ఈ సంస్థ విస్తరించింది. వాటికి ‘డార్క్‌ స్టోర్స్‌’నీ జతచేసి స్విగ్గీ, జొమాటాల ద్వారా వినియోగదారులకి సరఫరా చేయసాగాడు సుహాస్‌. ఈ విజయంతోనే ఆగలేదు...

రకరకాల ఫ్లేవర్‌లలో...

వెనిలా, బటర్‌ స్కాచ్‌, చాక్లెట్‌ వంటి సంప్రదాయ ఫ్లేవర్‌లలోనే కాకుండా- పనస, మామిడి, కొబ్బరి నీళ్ళు, డ్రాగన్‌ ఫ్రూట్‌, జామ, బొగ్గు వంటి విభిన్న రుచుల్లో ఐస్‌క్రీముల్ని అందిస్తున్నాడు. ఒంటె, మేక పాలతోనూ వీటిని తయారుచేస్తూ ఏటా రూ.12 కోట్ల టర్నోవర్‌ నమోదుచేస్తున్నాడు.
‘ఐస్‌బర్గ్‌ ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్స్‌’ అమ్మే ప్రతి ఐస్‌క్రీమ్‌ కవర్‌ మీదా క్యూఆర్‌ కోడ్‌ ఒకటి ఉంటుంది. దాన్ని స్కాన్‌ చేస్తే అందులో వాడిన సేంద్రియ ఉత్పత్తుల వివరాలూ, తమ సేంద్రియ ప్రాసెస్‌కి ప్రభుత్వం అనుమతిస్తూ అందించిన సర్టిఫికెట్‌ల వివరాలూ ఉంటాయి. కాబట్టి, ఇది అసలైన సేంద్రియమా బూటకమా అన్న అనుమానాలు లేకుండా... ఐస్‌క్రీమ్‌ని చప్పరించేయొచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..