హహ్హహ్హ

టీచర్‌: ఒక అమ్మాయి గంటలో యాభై చపాతీలు చేయగలదు. మరి ముగ్గురు అమ్మాయిలు కలిసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు?

Published : 06 Feb 2022 00:29 IST

హహ్హహ్హ


ఇక సమయం ఉండదుగా...

టీచర్‌: ఒక అమ్మాయి గంటలో యాభై చపాతీలు చేయగలదు. మరి ముగ్గురు అమ్మాయిలు కలిసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు?

విద్యార్థి: ఏమీ చేయరు...

టీచర్‌: సరిగ్గా ఆలోచించి చెప్పు...

విద్యార్థి: అంతే టీచర్‌. ముగ్గురు అమ్మాయిలు ఒక్క దగ్గర ఉంటే కబుర్లు చెప్పుకోడానికే సమయం సరిపోదు, ఇక చపాతీలు ఎలా చేస్తారు!


జాగ్రత్తసుమా...

ర్తలందరికీ నోటీసు... మీ భార్యను మళ్లీ ప్రేమతో చూసుకోండి.. హోటళ్లూ, రెస్టరంట్లూ ఎప్పుడైనా మూసివేయవచ్చు!

భార్యలకూ ఓ నోటీసు... మీ భర్తను ప్రేమతో చూసుకోండి. పని మనిషి ఎప్పుడైనా పనికి రావడం మానేయవచ్చు! కరోనా విజృంభిస్తోంది.


ఆ భయం లేదులే!

వెంగళప్ప: నా చెక్కుబుక్కు పోయింది...
రాజు: దొరికినవాళ్లు నీ సంతకం పెడితే ఎలా మరి...
వెంగళప్ప: ఆ భయమే లేదు. నేను అన్ని చెక్కులపైనా ముందే సంతకం పెట్టేశాగా!


మీ సంగతి తెలుసు...

లక్ష్మి: (కొడుకుతో కోపంగా) ఇంకోసారి ఇలా చేశావంటే 64 పళ్లూ రాలతాయి...
సుబ్బారావు: అదేంటి... వాడికుంది 32 పళ్లేగా?
లక్ష్మి: మీరిలా మధ్యలో దూరతారని తెలిసే ఇద్దరివీ కలిపి చెప్పా..!


అదే చెప్పా...

తండ్రి: మూడింట్లో గ్యారంటీ, మూడింట్లో డౌట్‌ అని చెప్పి అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యావేంట్రా...

కొడుకు: అదే చెప్పాగా నాన్నా! మూడింట్లో కచ్చితంగా ఫెయిల్‌ అవుతా ఇంకో మూడు సబ్జెక్టుల్లో కొంచెం డౌటూ అని!


ఇదీ తెలుగేగా...

రామారావు: తెలుగులో మాట్లాడమంటారు.. తెలుగులో మాట్లాడితే తెల్లమొహమేస్తారు..

వెంకట్రావ్‌: ఏమైంది??

రామారావు: ఇందాక ఓ షాపులోకి వెళ్లి బంతిపువ్వు (మ్యారీగోల్డ్‌) బిస్కెట్లు, దాగుడు మూతల (హైడ్‌ఖీసీక్‌) బిస్కెట్లు, చెరోసగం (ఫిఫ్టీఫిఫ్టీ) బిస్కెట్లు ఉన్నాయా అని అడిగా.. షాపువాడికి అర్థంకాక పిచ్చిచూపులు చూసి లేవని చెప్పాడు.


మలుపు

‘‘ఏంటమ్మా ఇది? నీ కథలో దాదాపు ప్రతి పేరాలోనూ స్కూటర్‌ మలుపు తిరిగింది... అతను మలుపు తిరిగాడు... లాంటి వాక్యాలు కనిపిస్తున్నాయి?’’ రచయిత్రి కుసుమతో అన్నాడు ఎడిటర్‌.

‘‘అదేంటి సార్‌... కథలో ఎక్కువ మలుపులు వుండాలి అని మీరే కదా అన్నారు?’’ కళ్లు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా అంది కుసుమ.


నువ్వు చేసినట్టే...

భార్య: పక్కింటావిడ నా చీర పట్టుకెళ్లి రెండు వారాలు దాటినా తిరిగివ్వడం లేదంటే నాకేదో అనుమానంగా ఉందండీ...

భర్త: ఆరునెలల క్రితం నువ్వు ఆమె దగ్గర అరువుగా తెచ్చుకుని ఉంచేసుకున్న చీరకు బదులు అనుకుంటుందేమో మరి!


అందుకేనా..!

ప్రియురాలు: రేపు మా ఇంట్లో ఎవరూ ఉండరు. పొద్దున్నే వచ్చెయ్‌!

ప్రియుడు: పోయిన వారం కూడా ఇలాగే పిలిచి ఇంట్లో అంట్లన్నీ తోమించావ్‌... ఈసారి ఇల్లు కడిగిస్తావేమో... నేను రాను!


వాసన రాకపోతేనూ...

సుమిత్ర: (పక్కింటి సుజాతతో) ఏమిటీ ఇవాళ వంట చేయలేదు?

సుజాత: ఇవాళ పార్టీకి వెళ్తున్నాం. అయినా నేను వంట చేయలేదని నీకెలా తెలిసింది?

సుమిత్ర: ఇవాళ ఇంకా మాడువాసన రాకపోతేనూ...




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..